గుహలో శివ లింగం, బసవేశ్వరుడి విగ్రహం
ఏడు ఊర్ల గవి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఏడు ఊర్ల జనాలు పట్టే విశాలమైన చీకటి గుహ అది. లోనికి వెళ్లడానికి చిన్న మార్గం. లోపల శివుడు,బసవేశ్వరుడి విగ్రహాలు. శివుడికి అభిషేకం చేస్తున్నట్లుగా గుహ పైభాగం నుంచి చుక్క చుక్క నీరు పడుతుండటం.. ఎవరో పరిచినట్లుగా బండరాయి ఉండటం. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే అంతుచిక్కని మరో గుహ.. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఆ గుహను సందర్శించాలంటే గడివేముల మండలం పైభోగుల గ్రామ సమీపంలోని కొండకు వెళ్లాల్సిందే.
కర్నూలు , గడివేముల:జిల్లాలో ప్రపంచ ఖ్యాతి పొందిన బెలుం గుహలతో పాటు బేతంచెర్ల సమీపంలోని ఎర్రజాల గుహలు, ప్యాపిలి ప్రాంతంలో వాల్మీకి గుహలు సహజ సిద్ధంగా ఏర్పడి పర్యాటకులను ఎంతోగాను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇలాంటి గుహలు జిల్లాలో చాలా ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో వెలుగులోకి రావడం లేదు. ఆ కోవకు చెందినదే ఏడు ఊర్ల గుహ. గడివేముల మండలం కె. బొల్లవరం – పైబోగుల గ్రామాల మధ్యలో ఉన్న కొండల్లో ఉన్న విశాలమైన గుహకు ఎంతో చరిత్ర ఉంది. ఈ గుహను ఇప్పటికీ ఎంతో మంది సందర్శించారు. ఇక్కడ పూర్వం జనం నివసించారు అని చెప్పేందుకు స్థానికుల్లో ఓ కథనం ప్రాచుర్యంలో ఉంది. ఈ కొండ ప్రాం తంలో గని రాజ్యం ఉండేది. ఆ కాలంలో దివిటీ దొంగలు పట్టపగలే దాడులు చేసి సంపన్నులు, పేదలు అందరినీ లూటీ చేసేవారు. వారి బారి నుంచి కాపాడుకునేందుకు సమీపంలోని ఏడు గ్రామాల ప్రజలు ఈ గుహలోకి చేరుకుని కొన్నాళ్ల పాటు ఇక్కడే తలదాచుకున్నారు. దీంతో ఈ గుహకు ఏడు ఊర్ల గవిగా పేరొందింది.
విభూదమ్మతో వెలుగులోకి..
గని గ్రామానికి చెందిన విభూదమ్మ అవ్వను ప్రజలు మహిమాన్వితురాలిగా కొలిచారు. ఈమె తరచూ ఏడు ఊర్ల గవికి వెళుతూ ఉండేది. ఆ గుహలోనే నెలల తరబడి ఏమీ తినకుండా ధ్యానం చేస్తూ గడిపేది. గ్రామస్తులను ఆహ్వానిస్తూ అక్కడ పూజలు నిర్వహించేది. ఈమె మృతి చెందిన తర్వాత గని గ్రామంలో సమాధి చేసి పూజలు చేస్తున్నారు. అలాగే గని గ్రామానికి చెందిన యోగీశ్వరులు కూడా ఇక్కడే ధ్యానం చేసేవారు. చుట్టు పక్కల కొండల్లో ఎక్కడ చూసిన చుక్క నీరు దొరకదు. అయితే గుహలోని శివుని విగ్రహంపై మాత్రం చుక్క చుక్క నీరు పడుతుండటం విశేషం. ఏడాది పొడవునా ఆ ధార అలానే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఏడు ఊర్ల గవితో పాటు లోపల మరొక గుహ ఉందని స్థానికులు చెబుతున్నారు. పెద్దదైన శివుని విగ్రహం, నీరు కాలువ రూపంలో పారుతుందని, ఈ నీరే పక్కనే ఉన్న ప్రసిద్ధ క్షేత్రం భోగేశ్వరస్వామి దేవాలయం కోనేరులోని నందినోటి నుంచి బయటకు వస్తుందని, ఈ కాలువలో జారవిడిచిన పిల్లనగోవి భోగేశ్వరంలో తేలిందని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ గుహ దారికి ఇరువైపులా అక్కడక్కడా దీపపు చెమ్మలు కనిపించాయని, అంటే ఈ దారి గుండా తీరం ఉంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఎలా వెళ్లాలి ?
కర్నూలు నుంచి 45 కిలో మీటర్ల దూరంలో మండల కేంద్రం గడివేముల పరిధిలోని కె.బొల్లవరం, పైభోగుల గ్రామాల సరిహద్దుల్లో కొండల మధ్య ఈ గుహ ఉంది. గడివేముల నుంచి కె.బొల్లవరానికి చేరుకుంటే అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే గుహల వద్దకు చేరుకోవచ్చు.
కార్తీకాల్లో పూజలు
గుహ లోపల శివుడు, నంది విగ్రహాలు ఉండటంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కార్తీకాలలో ఇక్కడ ఘనంగా పూజలు నిర్వహిస్తారు. ఇక్కడే వన భోజనాలు చేస్తారు. కనీస వసతులు, రహదారి లేకున్నా పదుల సంఖ్యలో కుటుంబాలు ఎడ్ల బండ్లపై వచ్చి పండుగ చేసుకుంటారు. అటు పర్యాటకానికి... ఇటు ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధే చెందే అవకాశాలు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
గుహ అద్భుతం
గుహ ఎంతో అద్భుతంగా ఉన్నా అధికారులు పట్టించు కోవడం లేదు. ఇక్కడికి రావడానికి సరైనదారి లేదు. ఏటా కార్తీకాలను ఘనంగా చేస్తాం. ఏడు ఊర్ల గవి తర్వాత ఉన్న ఇంకో గుహను చూడటానికి ప్రయత్నించాం కానీ సాధ్యపడ లేదు. లోపల చూసివచ్చినోడు మరుజన్మ ఎత్తినట్టేరా అని మా గ్రామ పెద్దలు అనేవారు. ప్రభుత్వం పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. గుహలో విద్యుద్దీపాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – చాకలి పుల్లయ్య, కె. బొల్లవరం గ్రామం
సందర్శన సాహసమే
ఏడు ఊర్ల గుహ మా పొలాలకు దగ్గర్లోనే ఉంది. గుహ దగ్గరికి వెళ్లడానికి దారి మా పొలాల గుండా మేమే ఏర్పరచుకున్నాం. ఒక సాధువుతో పాటు చిన్నప్పుడు మా సావాసాగాళ్లతో కలసి లోపలి గుహదారి వెంట పాక్కుంటూ చాలా దూరం వెళ్లాం. కేవలం ఒక మనిషి పాకడానికి మాత్రమే దారి ఉంటుంది. లోపల పెద్ద పెద్ద గుండ్రాళ్ల సందు నుంచి వెళుతూ ఉండాలి. ఎంత దూరం వెళ్లినా ఏం అంతుచిక్కగా వెనుదిరిగాం. గుహలో ఏం ఉందో మా పెద్దోల్ల మాటల్లో తప్ప మేం చూడలేకపోయాం. కానీ ఆ ఆశ మాత్రం అలాగే ఉంది. ఇప్పటికీ నీళ్లకోసం బయటి గుహలోకి వెళ్తూ ఉంటాం. –సత్యాలు, పైబోగుల గ్రామం
నీటి ధార విచిత్రం
మేం గొర్రెలు కాసేటపుడు నీటి కోసం గుహలోపలికి వెళ్లి వచ్చే వాళ్లం. ఈ కొండ ప్రాంతంలో ఎక్కడా చుక్కనీరు దొరకక పోయినా ఈ గుహలో స్వచ్ఛమైన నీరు దొరకడం విచిత్రం. మేము వయసులో ఉన్నప్పుడు లోపలి గుహలో ఏం ఉందో చూడాలని అందరం ప్రయత్నించినోళ్లమే. విభూదమ్మ అవ్వ అక్కడే ఒంటరిగా నెలల తరబడి ఉండేది. –వెంకటయ్య, కె.బొల్లవరం
అభివృద్ధికి కృషి చేస్తాం
ఏడు ఊర్ల గవి ప్రాంతం మా దృష్టిలో ఉంది. జిల్లాలో ఇటువంటివి ఇంకా అనేకం వెలుగులోకి తేవాలి. ఇందుకు పలు ప్రభుత్వ శాఖల సహకారం అవసరం. దీంతో కొంత జాప్యమయ్యే అవకాశం ఉంది. స్థానికుల సహాయ సహకారాలు ఉంటేనే మేము ఏదైనా చేయగలం. త్వరలో ఆ ప్రాంతాన్ని సందర్శించి గృహ అభివృద్ధికి గ్రామస్తులతో చర్చిస్తాం. – బి.వెంకటేశ్వర్లు, జిల్లా పర్యాటక అధికారి
Comments
Please login to add a commentAdd a comment