
కంప చెట్ల మధ్య ఉన్న ఆడ శిశువు మృతదేహం
అమ్మా..! నేను చేసిన నేరమేమిటి? నాన్న ఆడ పిల్ల వద్దన్నందుకు నెలలు నిండకముందే నేలపై విసిరేశావా? లేదా ‘తప్పు’ దారిలో నడిచి తల్లి అవుతున్నందుకు భయపడ్డావా? చేతులెట్లా వచ్చెనమ్మా నన్ను చెత్తకుప్ప పాలు చేసేందుకు? మీరు చేసిన పాపానికి నాకెందుకమ్మా శిక్షా?
సాక్షి, బేతంచెర్ల(కర్నూలు) : పట్టణంలోని సంజీవనగర్ కాలనీలో గురువారం మధ్యాహ్నం చెత్త కుప్పలో నెలలు నిండని ఆడ మృత శిశువును స్థానికులు కనుగొన్నారు. చెత్త కుప్పలో పడి ఉన్న శిశివును కుక్కలు ఎత్తుకొని వెళ్తుండటం గమనించి కాలనీ వాసులు అడ్డుకున్నారు. వెంటనే పంచాయతీ ఈఓ జితేంద్రకు సమాచారం ఇవ్వడంతో ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాలనీల్లో ఎవరైనా ప్రసవించారా అని అంగన్‌వాడీ కార్యకర్తలతో విచారించారు. పోలీసులు సైతం ఘటనా స్థలానికి చేరుకొని కాలనీవాసులతో చర్చించారు. కాగా మృత శిశువు బొడ్డు తాడు, ముఖంపై గాయాలు ఉన్నాయి. నెలలు నిండక ముందే ప్రసవించిందో లేక, అడ్డదారిలో తల్లి అవుతున్నందుకు భయపడిందో ఏమో ఇలా చెత్త కుప్ప పాలు చేసేందుకు చేతులెట్లా వచ్చె అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment