అంతుచిక్కని రహస్యాలలో...ఆనందాన్వేషణ | Anandanvesana elusive mysteries ... | Sakshi
Sakshi News home page

అంతుచిక్కని రహస్యాలలో...ఆనందాన్వేషణ

Published Thu, Apr 24 2014 11:13 PM | Last Updated on Fri, Nov 9 2018 6:22 PM

అంతుచిక్కని రహస్యాలలో...ఆనందాన్వేషణ - Sakshi

అంతుచిక్కని రహస్యాలలో...ఆనందాన్వేషణ

గుహలు... చారిత్రక కథనాలెన్నో వినిపిస్తాయి.
 గుహలు... ఆధ్యాత్మిక సౌరభాలతో మదిని తట్టి లేపుతాయి.
 గుహలు.. అంతుచిక్కని రహస్యాలను శోధించమంటాయి.
 గుహలు... ధ్యానమార్గానికి చేరువ చేస్తాయి.
 వేల అడుగుల ఎత్తులో కొన్ని... వేల మీటర్ల పొడవుతో ఇంకొన్ని...
 భూ అంతర్భాగంలో కొన్ని...
 దేవుళ్ల పోలికలతో కొన్ని... దేవతలకు ఆవాసాలుగా కొన్ని...
 మనిషి కట్టని నిర్మాణాలతో ప్రకృతి చెక్కిన అద్భుతాలతో అబ్బురపరిచే గుహల సౌందర్యాన్ని వీక్షిద్దాం రండి...

 
బెలుం గుహలు

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని కొలిమిగండ్ల మండల కేంద్రానికి 5 కి.మీ దూరంలో ఉన్నాయి బెలుం గుహలు. పది లక్షల సంవత్సరాల క్రితం ఇవి ఏర్పడ్డాయనీ, భరతఖండంలో మేఘాలయ గుహల తర్వాత ఇవే రెండవ అతిపెద్ద గుహలనీ చరిత్ర చెబుతోంది. పొడవైన సొరంగమార్గాలు, జాలువారే శిలాస్ఫటికాలు, రకరకాల శిలాకృతులు, అడుగడుగునా అబ్బురపరిచే అద్భుతాలు బెలుం గుహల ప్రత్యేకత. 1884లో రాబర్ట్ బ్రూస్ ఫూటే తన పర్యటన నివేదికలో ప్రస్తావించడం ద్వారా తొలిసారి ఈ గుహల ఉనికి ప్రపంచానికి తెలిసింది. తరువాత ఓ శతాబ్దం పాటు ఎవరి దృష్టీ పడని ఈ గుహల గురించి 1982-83ల్లో జర్మన్ బృందం విస్తృతంగా వివరాలు అందించింది.

ఈ గుహలు భూమికి 20 మీటర్ల అడుగున, భూగర్భంలో 10 కి.మీ మేర విస్తరించి ఉన్నాయి. పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ గుహలలో పర్యాటకుల కోసం 1.5 కి.మీ దూరం వరకు నడవటానికి అనుకూలంగా దారి నిర్మించింది. గుహ లోపల ఫౌంటెన్, కృత్రిమ కొలను, విద్యుద్దీపాలు, ఆక్సిజన్ బ్లోయర్లను ఏర్పాటు చేశారు. ఈ గుహల్లోకి వెళ్లే దారి బిలంలా ఉండటంతో వీటిని బిలం గుహలుగా, కాలక్రమంలో బెల్లం గుహలుగా, ఆ తర్వాత బెలుం గుహలుగా పేరు మారిందని చెబుతారు.

బెలుం గుహల్లో క్రీ.పూ 4,500 నాటి పాత్రలు బయటపడ్డాయి. దాన్ని బట్టి ఈ గుహలు ఎంత పురాతనమైనవో తెలుసుకోవచ్చు. గుహల పైకప్పు నుంచి కిందికి, కింది నుంచి పైకి మొలుచుకొని వచ్చినట్టు కనపడే ‘స్టాలగ్‌మైట్’ ల ఆకృతులను బట్టి స్థానికులు వీటికి కోటిలింగాలు, సింహద్వారం, పాతాళగంగ వంటి పేర్లతో పిలుస్తున్నారు. సహజసిద్ధంగా ఏర్పడిన ఇక్కడి శివలింగం పర్యాటకులలో భక్తిభావాన్ని పెంచుతోంది.
 
ఇలా వెళ్లాలి:  కర్నూలు, నంద్యాల మీదుగా/ అనంతపురం జిల్లా తాడిపత్రి మీదుగా/ వైఎస్‌ఆర్ కడపజిల్లా మీదుగా రోడ్డుమార్గం ద్వారా వెళ్లవచ్చు  తాడిపత్రిలో రైల్వేస్టేషన్ ఉంది  కర్నూలు నుంచి 110 కి.మీ., హైదరాబాద్ నుంచి 320 కి.మీ., నంద్యాల నుంచి 70 కి.మీ.

బొర్రా గుహలు
 
ఆంధ్రప్రదేశ్‌లో అరకులోయ అందించిన అద్భుతమైన ప్రకృతి వరం బొర్రా గుహలు. ఒరియా భాషలో ‘బొర్ర’ అంటే రంధ్రమని అర్థం. విశాఖపట్టణానికి 114 కి.మీ దూరంలో సహజంగా ఏర్పడిన ఈ గుహలు 10 లక్షల ఏళ్ల క్రితం నాటివని భావిస్తున్నారు. నీటిలోని హ్యూమిక్ యాసిడ్, సున్నపురాయిలోని కాల్షియమ్ బై కార్బొనేట్‌తో రసాయనచర్యకు గురైనప్పుడు ఇది ఖనిజాలను కరిగిస్తుంది. దాంతో రాయి క్రమంగా కరిగిపోతుంది. కొన్నేళ్లపాటు ఈ విధంగా కొండలపై నుంచి గోస్తనీ నది వైపు ప్రవహించే చిన్నచిన్న వాగుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. క్యాల్షియమ్ బై కార్బొనేట్, ఇతర ఖనిజాలు కలిగి ఉన్న పైకప్పు నుంచి కారే నీటి వల్లే నేలపై దిబ్బల వంటివి ఏర్పడ్డాయి. వీటినే స్టాలగ్‌మైట్స్ అంటారు. ఇవి కాలక్రమంలో వింత వింత ఆకృతులను సంతరించుకున్నాయి. ఈ గుహల్లో తవ్వకాలు జరిపినప్పుడు 50 వేల ఏళ్లక్రితం నాటి రాతి పనిముట్లు లభించాయి. స్థానిక గిరిజనులు బొర్రాగుహలను ‘బోడో దేవుడి’ నివాసంగా విశ్వసిస్తారు. వివిధ రూపాల్లో ఉన్న స్టాలగ్‌మైట్‌లను శివ-పార్వతి, తల్లి-బిడ్డ, ఋషి గడ్డం, మానవ మెదడు, మొసలి, పులి, ఆవు వంటి పేర్లతో పిలుస్తూ పూజిస్తూంటారు. గుహ లోపల కిలోమీటర్ వరకూ వెళ్లి గోస్తనీ నదిని చేరవచ్చు. అయితే నది వరకు వెళ్లడానికి అనుమతి లేదు. పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ గుహలను స్వాధీనం చేసుకొని, లోపల దీపాలంకరణ, బయట ఉద్యాన పెంపకం చేపట్టింది. యేటా మూడు లక్షల మంది పర్యాటకులు ఈ గుహలను సందర్శిస్తారని ఒక అంచనా!
 
ఇలా వెళ్లాలి: బొర్రా గుహలకు విశాఖపట్నం నుంచి బస్సు, రైలు సౌకర్యాలు ఉన్నాయి. ప్రత్యేక వాహనాల్లోనూ ఇక్కడికి చేరుకోవచ్చు.  

ఉండవల్లి గుహలు

విజయవాడ నుండి 6 కి.మీ దూరంలో నైరుతి దిశలో క్రీ .పూ 4, 5వ శతాబ్దంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయి ఉండవల్లి గుహలు. గుహ నాలుగు అంతస్థులలో (శయనిస్తున్న భంగిమలో అనంతశయన పద్మనాభస్వామి విగ్రహం) భారీ నల్ల గ్రానైట్ రాతితో చెక్కబడిన ఏకశిలా విగ్రహం ఉంది. ఈ గుహల లోపల నిర్మాణాలను చేపట్టిన బౌద్ధ సన్యాసులు వానాకాలంలో తమ విశ్రాంతి గదులుగా ఉపయోగించేవారు. ఈ కొండ నుండి కృష్ణానది అద్భుతంగా కనిపిస్తుంది.
 
ఇలా వెళ్లాలి: విజయవాడకు రైలులో కానీ, బస్సులో కానీ వెళితే, అక్కడ నుంచి ఉండవల్లి చాలా దగ్గర.

మేఘాలయ గుహలు
 
మేఘాలయ రాష్ట్రానికి పశ్చిమాన గారో పర్వత శ్రేణులు, తూర్పున ఖాసి, జైంతియా పర్వత శ్రేణులు ఉన్నాయి. ఈ పర్వతాలలో 19 గుహలు... వాటిలో సున్నపురాయి ఆకృతులు అనేకం ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పొడవైన, లోతైన గుహలు ఇవి. అతి పొడవైన గుహలు జైంతియా కొండలలో ఉన్నాయి. మౌస్‌మాయి, క్రెమ్ లింపుట్, క్రెమ్ కొత్సతతి, క్రెమ్ లాసింగ్, క్రెమ్ మావ్ లోహ్, క్రెమ్ స్వీప్, సైజు... అనే గుహలను పర్యాటకులు తేలికగా చూడవచ్చు.
 
ఇలా వెళ్లాలి: మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో విమానాశ్రయం, రైలు, బస్ స్టేషన్‌లు ఉన్నాయి. అక్కడి నుంచి ట్యాక్సీలు, బస్సుల ద్వారా చిరపుంజికి దగ్గరలో ఉండే ఈ గుహలకు చేరుకోవచ్చు.  
 
అమర్‌నాథ్ గుహ
 
జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో అమర్‌నాథ్ పర్వతంపై ఉంది అమరనాథ్ గుహ. ప్రపంచ ఆధ్యాత్మిక ప్రదేశంగా గుర్తింపు పొందింది అమర్‌నాథ్ గుహ. ఈ గుహలో సహజసిద్ధంగా ఏర్పడిన మంచులింగం పర్యాటకులను, భక్తులను ఆధ్యాత్మిక సాగరంలో ముంచెత్తుతుంది. ఈ మంచులింగం మే నుంచి ఆగస్టు వరకు వృద్ధి చెంది ఆ తరువాత కరుగుతుంది. ఈ గుహ 5000 ఏళ్ల నాటిదని తెలుస్తోంది. భారత సైన్యం, పారా మిలటరీ దళాలు ఈ ప్రదేశానికి గస్తీ కాస్తూ ఉంటాయి. అందువల్ల అమర్‌నాథ్ గుహను సందర్శించాలంటే ఉన్నతాధికారుల నుంచి ముందే అనుమతి తీసుకోవాలి. జమ్ముకాశ్మీర్‌లో చాలా గుహలు ఉన్నాయి. శ్వాసిక్ హిల్స్‌లో కిలోమీటర్ పరిధిలో ఉన్న సహజసిద్ధ్దమైన గుహలో శివలింగం ఉంది. జూలై, ఆగస్టు నెలలు సందర్శనకు అనువైన సమయం.
 
ఇలా వెళ్లాలి:
   జమ్ము -పహల్‌గాం- చందన్‌వాలి-పిస్సుటాప్-సేషాంగ్ - పంచ్‌పర్ణిల మీదుగా అమర్‌నాథ్ యాత్ర చేయవచ్చు. జమ్ము వరకు విమాన, రైలు మార్గాలు ఉన్నాయి. జమ్ముకాశ్మీర్‌కు రహదారి మార్గంలో బయల్దేరవచ్చు.

ఎలిఫెంటా... అజంతా... ఎల్లోరా గుహలు
 
మహారాష్ట్రలోని ఘరాపురిలో ఉన్నాయి ఎలిఫెంటా గుహలు. వీటికి పోర్చుగీసు వారు ఆ పేరు పెట్టారు. క్రీ.పూ 450, క్రీ.పూ. 750లో ఈ గుహలు ఏర్పడినట్టు చెబుతారు. బౌద్ధ సన్యాసులు ఈ గుహల లోపల నిర్మాణాలను చేపట్టారు. ఇక్కడ శివాలయానికి, విశ్వకర్మ గృహాలయానికి ప్రత్యేకత ఉంది. అజంతా-ఎల్లోరా గుహలు శిల్పకళకు పెట్టింది పేరు. ఇవి క్రీ.పూ.2వ శతాబ్దానికి చెందినవి.
 
ఇలా వెళ్లాలి: ముంబైలో విమానాశ్రయం, రైలు, బస్ స్టేషన్‌లు ఉన్నాయి. ఎలిఫెంటా గుహలకు ముంబై నుంచి వెళ్లాలి  అజంతా-ఎల్లోరా గుహలకు ఔరంగాబాద్ నుంచి ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది. ఔరంగాబాద్‌లో విమానాశ్రయం, రైల్వే స్టేషన్, బస్సు స్టేషన్‌లు ఉన్నాయి.
 
మరికొన్ని గుహలు:  కర్ణాటకలోని బాదామి గుహలు హంపికి దగ్గరలో ఉన్నాయి  ఒరిస్సాలోని భువనేశ్వర్ శివార్లలో ఉదయగిరి, ఖందగిరి గుహలు ఉన్నాయి. ఇవి క్రీ.శ.2వ శతాబ్దం నాటివి. భువనేశ్వర్ నుంచి బస్సులు, ట్యాక్సీల ద్వారా ఈ గుహల ప్రాంతానికి చేరుకోవచ్చు  ఛత్తీస్‌గడ్‌లోని జగదల్‌పూర్ నుండి సుమారు 40 కి.మీ దూరంలో కుతుమ్సర్ గుహలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement