Elephanta Caves: ఎలిఫెంట్‌ లేదు! కేవ్స్‌ ఉన్నాయి!! | Elephanta Caves: History, How to Reach, Timings, Ferry Service, Elephanta Island | Sakshi
Sakshi News home page

Elephanta Caves: ఎలిఫెంట్‌ లేదు! కేవ్స్‌ ఉన్నాయి!!

Jun 7 2021 1:10 PM | Updated on Jun 7 2021 1:10 PM

Elephanta Caves: History, How to Reach, Timings, Ferry Service, Elephanta Island - Sakshi

ఎలిఫెంటా కేవ్స్‌ దీవికి చేరాలంటే ముంబయిలోని గేట్‌ వే ఆఫ్‌ ఇండియా దగ్గర టికెట్‌ తీసుకోవాలి.

ఎలిఫెంటా కేవ్స్‌ దీవికి చేరాలంటే ముంబయిలోని గేట్‌ వే ఆఫ్‌ ఇండియా దగ్గర టికెట్‌ తీసుకోవాలి. ఫెర్రీలో ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ వెళ్తుంటే పది కిలోమీటర్లు చాలా త్వరగా వచ్చేసినట్లనిపిస్తుంది. ఫెర్రీ ప్రయాణంలో ఎలిఫెంటా కేవ్స్‌ను చేరేలోపు హార్బర్‌కు వచ్చిన పెద్ద పెద్ద షిప్పులను చూడవచ్చు. పోర్టులో బెర్త్‌ క్లియరెన్స్‌ కోసం ఎదురు చూస్తూ తీరానికి రెండు కిలోమీటర్ల వరకు పెద్ద షిప్పులు లంగరు వేసుకుని ఉంటాయి. వాటిలో క్రూ డెక్‌ మీదకు వచ్చి సముద్రాన్ని చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. మామూలుగా అయితే అంతపెద్ద ఇంటర్నేషనల్‌ కార్గోలను అంత దగ్గరగా చూడడం కుదరని పని.  

సోమవారం సెలవు
ఎలిఫెంటా కేవ్స్‌ పర్యటనకు సోమవారం సెలవు. ఫెర్రీలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే గుహల దగ్గరకు తీసుకెళ్తాయి. శీతాకాలం ఫెర్రీ పై అంతస్తులో ప్రయాణించడం బాగుంటుంది. అరబిక్‌ కడలి చిరు అలలతో నిశ్శబ్దంగా పలకరిస్తుంది. ఎలిఫెంటా కేవ్స్‌ ఉన్న దీవి ఎత్తు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయితే అది పర్యాటకుల తప్పు కాదు. అమావాస్య, పౌర్ణముల్లో సముద్రం ఆటుపోట్లను బట్టి నీటి ఉపరితలం పైకి ఉబికినప్పుడు ఐలాండ్‌ ఎత్తు తక్కువగా కనిపిస్తుంది. ఫెర్రీ దిగిన తర్వాత దాదాపు కిలోమీటరు దూరం నడవాలి. ఆ దారిలో టాయ్‌ట్రైన్‌ ఎప్పుడో ఒక ట్రిప్పు తిరుగుతుంది.


అంతదూరం నుంచి మనం వదిలి వచ్చిన తీరాన్ని చూడడం, సముద్రపు అలలు, మరోవైపు కొండలను చూస్తూ సాగే ఆ నడక కూడా ఆహ్లాదకరంగానే ఉంటుంది. ఆ దారిలో ఉండే టూరిస్టు మార్కెట్‌లో చిరు వ్యాపారులను, వారు చెప్పే ధరలను చూస్తే దేశంలో వర్తకవాణిజ్య మేధావులంతా ఇక్కడే ఉన్నారా అని నోరెళ్లబెట్టాల్సిందే. పర్యాటక ప్రదేశాల్లో ధరలు ఎక్కువగానే ఉంటాయి. ఐదు నుంచి పదిశాతం ధర ఎక్కువ ఉండడాన్ని ఆక్షేపించకూడదు. కానీ మన దగ్గర శిల్పారామంలో రెండు వందలకు అమ్మే హ్యాండ్‌బ్యాగ్‌కు అక్కడ పదిహేను వందలు చెప్పారు. 


గాయపడిన శిల్పాలు
ఇంతటి వైవిధ్యతను ఆస్వాదిస్తూ గుహల్లోకి అడుగుపెట్టిన తర్వాత అది మరో ప్రపంచం. తప్పిపోయేటన్ని గుహల్లేవు, మొత్తం ఏడు గుహలే. రెండు బౌద్ధగుహలు, ఐదు హిందూ గుహలు. గైడ్‌ లేకపోతే మనం ఏం చూస్తున్నామో అర్థం కాదు. ఏ శిల్పమూ దాని పూర్తి స్వరూపంతో లేదు. విధ్వంసానికి గురి కాని శిల్పం ఒక్కటీ కనిపించదు. ప్రతి శిల్పానికి ఏదో ఒక చోట గాయం, ఆ గాయాల వెనుక అధికార దాహమూ ఉన్నాయి. ఈ గుహలు క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నాటివి. అప్పుడు హీనయాన బౌద్ధులు ఈ కొండలను తొలిచి ఆవాసాలుగా మలుచుకున్నారు. బౌద్ధ శిల్పాలను కూడా చెక్కారు. బౌద్ధం సన్నగిల్లిన తర్వాత ఈ ప్రదేశం హిందువుల అధీనంలోకి వచ్చింది. 

సమానత్వం కోసం ఓ ప్రయత్నం
శైవం పతాకస్థాయిలో ఉన్న కాలంలో కాలచూరులు, రాష్ట్రకూటులు ఈ గుహల్లో శిల్పాలను చెక్కించారు. శివపురాణం ఆధారంగా చెక్కిన ఘట్టాలు ఎక్కువగా కనిపిస్తాయి. క్రీస్తుశకం ఆరవ శతాబ్దంలోనే సమాజంలో స్త్రీపురుష సమానత్వం కోసం ఒక ప్రయత్నం జరిగిందిక్కడ. అర్ధనారీశ్వరుడిని రూపొందించడంలో ఉద్దేశం... సమాజంలో స్త్రీ పురుష సమానత్వ భావనను పాదుకొల్పడమే. అయితే ఆ ఉద్దేశాన్ని రూపుమాపడానికి అత్యంత లౌక్యంగా అది పార్వతికి మాత్రమే దక్కిన వరంగా మలిచేయడమూ అనతికాలంలోనే జరిగిపోయింది.

 
ఏనుగు ఎక్కడ?
గుహలన్నీ తిరిగి చూడడం పూర్తయినా సరే ఎక్కడా ఏనుగు ఆనవాలు కనిపించదు. ఈ గుహలకు ఆ పేరు ఎందుకు వచ్చిందని అడిగినప్పుడు గైడ్‌ చాలా సిన్సియర్‌గా గుహల వెలుపలకు తీసుకువచ్చి ఒక ఖాళీ ప్రదేశాన్ని చూపించి, ‘ఇక్కడ ఒక పెద్ద ఏనుగు శిల్పం ఉండేది. ఆ శిల్పం కారణంగానే పోర్చుగీసు, బ్రిటిష్‌ పాలనకాలంలో ఈ గుహలకు ఎలిఫెంటా కేవ్స్‌ అనే పేరు వచ్చిందని చెబుతూ ఆ ఏనుగును చూడాలంటే ముంబయి నగరంలోని జిజియామాత ఉద్యానవనానికి వెళ్లా’ లని చెప్పాడు.

ఇక్కడ ఉండాల్సిన ఏనుగు అక్కడికి ఎందుకు వెళ్లిందటే... బ్రిటిషర్‌లు మన కోహినూర్‌ వజ్రాన్ని, నెమలి సింహాసనాన్ని తరలించుకుపోయినట్లే ఏనుగు శిల్పాన్ని కూడా పెకలించుకుపోవాలనుకున్నారు. ఆ ప్రయత్నంలో అది విరిగిపోయింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మనవాళ్లు ఏనుగుకు మరమ్మతులు చేసి జిజియా మాత ఉద్యానవనంలో నిలబెట్టారు. ఆ దృశ్యాన్ని ఊహించుకుంటూ బయటకు వచ్చేటప్పటికి ఫెర్రీలు నడిపేవాళ్లు ఎదురు చూస్తుంటారు. తిరుగు ప్రయాణానికి టైమ్‌ అయింది, ఫెర్రీ కదలడానికి సిద్ధంగా ఉంది ఇది వెళ్లిపోతే ఇక ఇప్పట్లో మరొకటి ఉండదని పిల్లల్ని భయపెట్టినట్లు చెప్పి  బయల్దేరదీస్తారు.
– వాకా మంజులారెడ్డి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement