యథార్థ సంఘటనల ఆధారంగా స్ఫూర్తి పొంది తెరకెక్కిన ఎన్నో చిత్రాలు వెండితెరపై భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్‌గా వచ్చిన 'మంజుమ్మల్ బాయ్స్' దీనిని నిరూపించింది. అయితే, అలాంటి సంఘటనే 2018లో థాయ్‌లాండ్‌లో జరిగింది. 12మంది ఫుట్‌బాల్ టీమ్ పిల్లలతో 'థామ్ లువాంగ్' గుహలోకి కోచ్ వెళ్తాడు. అక్కడ అనుకోకుండా జరిగిన ఘటనతో వారు ప్రమాదంలో చిక్కుకుంటారు. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన 'థర్టీన్ లైవ్స్' పేరుతో సినిమాగా వచ్చింది. రెస్క్యూ ఆపరేషన్ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు రోన్ హోవార్డ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. యథార్థ ఘటనను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్న ఈచిత్రం కథ తెలుసుకుందాం.
కథేంటంటే
థాయ్‌లాండ్‌లో ఎంతో ప్రసిద్ధి చెందిన 'థామ్ లువాంగ్' గుహలను చూసేందుకు 12 మంది ఫుట్‌బాల్ జూనియర్ టీమ్ సభ్యులతోపాటు కోచ్ కూడా వెళ్తాడు. వారు గుహ లోపలికి వెళ్లిన కొంత సమయం గడిచాక ఆ పర్వత ప్రాంతమంతా విపరీతమైన మేఘాలు కమ్ముకుని భారీ వర్షం కురుస్తుంది. దీంతో గుహ ప్రారంభం వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరటంతో పిల్లలందరూ తమ ప్రాణాలు కాపాడుకునేందుకు గుహ లోపలికి వెళ్లిపోతారు. తిరిగి బయటకొచ్చే దారి వారికి కనిపించదు. అలా వారందరూ అక్కడ చిక్కుకుపోతారు. భారీ వర్షం వల్ల గుహ లోపలికి వెళ్లే దారి నీటితో పూర్తిగా మూసుకుపోతుంది.
ఇదే సమయంలో చిన్నారులు ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు అందరూ ఆందోళన చెందుతుంటారు. బయటి ప్రంపంచంతో ఎలాంటి కనెక్టివిటీ లేని ఆ ప్రాంతంలో చిన్నారులు చిక్కుకుపోయారని అందరికీ ఎలా తెలిసింది..? సుమారు 18 రోజుల పాటు థాయ్‌లాండ్ ప్రభుత్వం ఛాలెంజింగ్‌గా చేసిన రెస్క్యూ ఆపరేషన్ ఫలించిందా..? పది కిలోమీటర్ల పొడవైన గుహ మొత్తం నిళ్లతో నిండిపోతే ఆ రెస్క్యూ టీమ్ ఎలా వెళ్లింది..? చిన్నారులందరూ అన్నిరోజుల పాటు సజీవంగా ఎలా ఉండగలిగారు..? అన్నది తెలియాలంటే 'థర్టీన్ లైవ్స్' సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే..
2018లో థాయ్ గుహల్లో చిన్నారులు చిక్కుకున్న సంఘటన ప్రపంచదేశాల అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చిన్నారులను కాపాడేందుకు దాదాపు పదిహేడు దేశాలకు చెందిన ఐదు వేల మంది రెస్క్యూ టీమ్ ఆ ఆపరేషన్ కోసం థాయ్‌లాండ్ చేరుకుంటారు. ఈ ఆపరేషన్‌లో బ్రిటీష్ రెస్క్యూ టీమ్ రిచర్డ్ స్టాంటాన్, జాన్ వొలేథాన్ ప్రాణాలకు తెగించి ఆ పిల్లలను కాపాడటానికి ఎలా ప్రయత్నాలు చేశారనేది చాలా సాహసంతో కూడుకొని ఉంటుంది. సుమారు 18 రోజుల తర్వాత ఆ చిన్నారులను బయటకు తీసుకొచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ చాలా ఉద్వేగంతో ఫీల్ అయ్యారు. ఆ సమయంలో పిల్లలు క్షేమంగా తిరిగిరావాలని ప్రతి ఒక్కరూ దేవుడిని ప్రార్థించారు. అవన్నీ ఫలించాయి. ఎంతో భావోద్వేగంతో కూడుకున్న ఈ ఘటనను తెరకెక్కించడంలో దర్శకుడు రాన్ హోవర్డ్ విజయం సాధించారు.
సినిమా ప్రారభంమే కథలోకి వెళ్లిపోతాడు దర్శకుడు. ఫుట్‌బాల్ ఆడుతున్న చిన్నారులు గుహ చూద్దామని అక్కడికి చేరుకోవడంతో స్టోరీ ప్రారంభమవుతుంది. ఆ వెంటనే భారీ వర్షం.. చిన్నారుల్లో భయం.. అలా ఒక్కో సీన్ ప్రేక్షకులకు చూపుతూ దర్శకుడు ఆసక్తి పెంచుతాడు. కొన్ని నిమిషాల్లోనే ఆ గుహ మొత్తం నీటితో నిండిపోతుంది. లోపల వారు ఉన్న విషయం ఎవరికీ తెలియదు. అయితే, వారిని ఎలా కనిపెడుతారనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సుమారు 9 రోజుల తర్వాత సీడైవింగ్‌లో నిష్ణాతులైన ఇద్దరు బ్రిటిష్ డైవర్లు (రిచర్డ్ స్టాంటాన్, జాన్ వొలేథాన్) ఎంతో శ్రమించి చిన్నారులను కనిపెట్టినప్పుడు వాళ్లు ఎంత సంతోష పడ్డారో సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కూడా అంతే స్థాయిలో భావోద్వేగానికి గురవుతాడు. మరోవైపు బయట జోరు వాన.. పిల్లలను రక్షించుకొందామనుకుంటే ఆ నీరు అంతా మళ్లీ గుహలోకే వెళ్తుంది. దీంతో ఆ నీటిని పంట పొలాల్లోకి మళ్లిస్తారు. అక్కడి రైతులు కూడా అందుకు సహకరిస్తారు. ఆ సీన్ అందరి కంట కన్నీరు తెప్పిస్తుంది. ఇలాంటి సీన్లు అన్నీ చాలా ఉద్విగ్నంగా ఉంటాయి.
పిల్లలు ఎక్కడున్నారో కనిపెట్టారు సరే.. సుమారు 10 కిలోమీటర్లు దూరం పాటు చాలా లోతుగా ఉన్న నీటిలో నుంచి వారిని ఎలా రక్షించాలి అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. ఇక అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఎదురుగా నీటి ప్రవాహం వస్తుంటే.. దానిని అదిగమించి చిన్నారులను బయటకు చేర్చాలి. అప్పటికే 18 రోజులు కావడంతో వారందరూ మరణించి ఉంటారని కనీసం తమ బిడ్డల శవాలు అయినా తీసుకొస్తే చాలు అని వారి తల్లిదండ్రులు గుహ బయటే కన్నీటితో ఎదురుచూస్తున్నారు. అలాంటి సీన్లు ప్రేక్షకుల చేత కన్నీరు తెప్పిస్తాయి. ఎంతో సాహసంతో కూడుకున్న ఈ కథ ఎలా ముగిసిందో తెలుసుకున్నాక ప్రతి ఒక్కరిలో ఉద్వేగం కట్టలు తెంచుకుంటుంది. అలాంటి మజానే ఈ 'థర్టీన్ లైవ్స్' తప్పకుండా ఇస్తుంది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.
ఎవరెలా చేశారంటే
సినిమా మొత్తం రెస్క్యూ ఆపరేషన్ నేపథ్యంలోనే సాగుతుంది. ఇందులో తెలిసిన నటుడు ఒక్కరూ లేరు. అయినా ప్రతి పాత్ర మనకు కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రం కోసం పనిచేసిన సాంకేతిక విభాగం ప్రధాన్ ఆకర్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా అండర్ వాటర్ సీన్స్ చాలా చక్కగా తీశారు. రియల్ ఇన్సిడెంట్ కళ్ల తెరపైన చూస్తున్నామనే ఫీలింగ్ కలిగేలా సినిమా సాగుతుంది. ఇందులో ఫైట్స్ వంటివి లేకున్నా చాలా సన్నివేశాల్లో విజిల్స్ వేసేలా ఉంటాయి. ఈ సినిమాకు ప్రధాన బలం దర్శకుడు రాన్ హోవర్డ్.. ఈ కథను ఉత్కంఠభరితంగా చెప్పడమే కాకుండా.. ఎంతో భావోద్వేగభరితంగా ప్రేక్షకులకు చూపించారు.
Comments
Please login to add a commentAdd a comment