మనం చూసే ప్రతి సినిమాలో నిజ జీవిత పాత్రలు మనలోనివారు కొంతమంది తెర మీద పోషించి మనల్ని మెప్పించడం సహజమే. కాని మనలోని భావావేశాలను జంతువులచే డిజిటల్ రూపంలో పలికించి మన మనస్సులను కదిలించడమంటే సామాన్యమైన విషయం కాదు. ఈ విషయంలో హాలీవుడ్‌ను నిజంగా అభినందించాలి. కానీ హాలీవుడ్ కన్నా మన టాలీవుడ్ 40 ఏళ్ళ క్రితమే అంటే డిజిటల్ సాంకేతికత మనకు పరిచయమవ్వని రోజుల్లోనే ఇటువంటి కోవలో మనకు ఓ సినిమా పరిచయం చేసింది. దాని పేరే మాకూ స్వాతంత్రం కావాలి.
ఇక్కడ టాలీవుడ్, హాలీవుడ్ చేసిందా అన్నది కాదు, మనుషులకు జంతువులతో కూడా భావావేశాలు పలికించవచ్చన్నదే విషయం. ముఫాసా సినిమా 2019వ సంవత్సరంలో 'ది లయన్ కింగ్' సినిమా సిరీస్‌లో వచ్చిన రెండవ భాగం. ముఫాసా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో ప్రతి భాషలో విడుదలైంది. ముఫాసా సినిమాకి అన్ని భాషల్లో పేరున్న గొప్ప నటీనటులు డబ్బింగ్ చెప్పడం మరో విశేషం. తెలుగులో ప్రముఖ నటులు మహేశ్‌బాబు, బ్రహ్మానందం, అలీ తదితరులు వాయిస్ ఇచ్చారు. కాబట్టి సినిమా చూస్తున్నంతసేపు మన నేటివిటీ ఎక్కడా తగ్గదు ఒక్క పేర్లలో తప్ప.
ఈ సినిమాకి దర్శకుడు బారీ జెర్కిన్స్. కథాపరంగా లయన్ కింగ్‌కు కొనసాగింపైన ఈ ముఫాసాలో సింబా - నాలా సింహాలకు కియారా అనే ఆడ సింహం పుడుతుంది. ఆ తర్వాత సింబ- నాలా జంట టిమన్, పంబ దగ్గర కియారాను వదిలేసి ఇంకో బిడ్డకు జన్మనివ్వడానికి సెరేన్ ఒయాసిస్‌కు బయలుదేరతాయి. అప్పుడు రఫీకి అనే కోతి కియారాకు తాను సింబ వయస్సులో ఉన్నపుడు జరిగిన ముఫాసా కథ గురించి చెప్తుంది.
ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్ సి యం రాజు ఈ కోతికి గాత్రదానం చేశారు. కథంతా ఈ రఫీకీయే చెప్తాడు. ముఫాసా అనే పిల్ల సింహం ఓ తుఫానులో చిక్కుకుని తన తల్లిదండ్రుల నుంచి విడిపోతుంది. అలా నీళ్లలో ముఫాసా కొట్టుకుపోతూ టాకా అనే మరో సింహం పిల్లను కలుస్తుంది. టాకా తల్లిదండ్రులు ఒబాసీ, ఇషా. వీళ్ళిద్దరూ వారి ప్రాంతంలో రాజు, రాణి. టాకాని యువరాజును చేయాలనుకుంటారు. ఇంతలో తెల్ల సింహాల గుంపు వీరి రాజ్యం మీద దాడి చేస్తుంది.
వాటి నుండి ముఫాసా, టాకా తప్పించుకుంటారు. ముఫాసా తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ మిలేలే అనే ప్రాంతానికి వెళ్లాలనుకుంటాడు. తరువాత సినిమా అంతా ముఫాసా తన తల్లిదండ్రులను చేరుకుంటాడా లేదా అన్నదే. పైన చెప్పుకున్నట్టు ఈ సినిమా స్క్రీన్ ప్లే పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. అలానే పెద్దల మనసును సైతం కదిలిస్తుంది. ఎక్కడా గ్రాఫిక్స్ అన్నదే తెలియకుండా నిజజీవితంలో జంతువుల కథను దగ్గరగా చూసినట్టుంది. వర్త్‌ఫుల్ మూవీ ఫర్ ఫ్యామిలీ.
- హరికృష్ణ ఇంటూరు
Comments
Please login to add a commentAdd a comment