సాక్షి, హైదరాబాద్: పురావస్తు శాఖ నిర్లక్ష్యం, గ్రామస్తుల అవగాహనా రాహిత్యంతో దేశంలోనే చారిత్రక ప్రదేశంగా పేరొందాల్సిన అడవి సోమనపల్లి గుహాలయాలు వాటి సహజత్వం కోల్పోయాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గ్రామస్తులే స్వచ్ఛందంగా అభివృద్ధికి పూనుకున్నారు. అవగాహనా లోపం తో వందల ఏళ్ల నాటి గుహలు అందంగా కనపడాలనే ఉద్దేశంతో సున్నం వేశారు. దాంతో వాటి సహజ అస్తిత్వం కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ఒకటిగా పేరొందాల్సిన ఆలయం ఉనికి ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లో విస్తరించిన అడవుల్లో ఉన్న ప్రాచీన సంపదపై సాక్షి ప్రత్యేక కథనం..
కొండను తొలిచి..అందంగా మలిచి..
మంథనికి 22 కిలోమీటర్ల దూరంలోని అడవి సోమన పల్లి గుట్టపై శిలను తొలిచి నిర్మించిన నాలుగు గుహాలయాలు ప్రాచీన భారతీయ వాస్తు శిల్పానికి చిహ్నాలుగా నిలిచాయి. తాడిచెర్ల వద్ద బస్సు దిగి, దట్టమైన అర ణ్యం గుండా నాలుగు కిలోమీటర్లు కాలినడకన ప్రయా ణించి ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు. కొండపై ఉన్న పెద్ద శిలను తొలచగా ఏర్పడిన ఈ నాలుగు గుహలు పడమటి ముఖాన్ని కలిగి మానేరు నదికి ఎదురుగా ఉన్నాయి.
ఇక్కడి నుంచి చూస్తే ప్రకృతి దృశ్యాలు రమణీయంగా కనిపిస్తాయి. స్థానికంగా నైనిగుళ్లు అని పిలువబడే ఈ శివాలయాల కొలతలు ఒక్కరీతిగా లేవు. నాణ్యమైన శిల కాకపోవడం, శతాబ్దాల తరబడి మానేరు నది నుంచి వీచే చల్లని గాలులకు తట్టుకోలేక ఈ గుహాలయాలు క్రమేణా శిథిలమవుతున్నాయి. విజయవాడకు సమీపంలోని మొగల్రాజపురంలో చెక్కబడిన విష్ణుకుండినుల కాలపు గుహాలయాల వలె ఇక్కడి గుహాలయాలు కూడా గర్భగృహం, దాని ముందు మంటపమున్నట్లు తొలచబడిఉన్నాయి.
ఆకర్షించే వర్ణ చిత్రాలు
ఈ మండపం గోడలు ఎలాంటి అలంకారాలు లేకుండా సాదాగా ఉన్నా, మంటపం పైకప్పు (సీలింగ్) సన్నని సున్నపు పొరతో చదును చేయబడి, దానిపై వర్ణచిత్రాలున్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ చిత్రాల పొరలు కాలక్రమేణా ఊడిపోయి ప్రస్తుతం నలుపు, ఎరుపు, నీలం, పసుపు పచ్చని రంగులలో కొన్ని అస్పష్టమైన గుర్తులు మిగిలాయి. అక్కడక్కడ మిగిలిన వర్ణచిత్రాలలో నర్తకి, యుద్ధ దృశ్యాలు, అశ్వ రథాలు విలుకాండ్రు, రాజభవనాలు చూపరుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఈ గుహలకు ముందున్న గోడపై పదవ, 11వ శతాబ్దపు తెలుగు లిపి లక్షణాలతో రెండు చిన్న శాసనాలున్నాయి.
మొదటి అసంపూర్ణ శాసనంపై ఎక్కుటేవిమున అనే వ్యక్తి శివలింగానికి రామేశ్వరుడని నామకరణం చేసి దేవుని ప్రతిష్టించాడని, కెంపెన అనే వ్యక్తి రాతిని తొలచినట్లు తెలపబడింది. రామేశ్వరుని ఆల య ధూపదీప నైవేద్యాలకు పెనుకంటి ముచ్చిరెడ్డి అనే వ్యక్తి భూదాన మిచ్చినట్లు రెండో శాసనం తెలుపుతుంది. ఈ గుహాలయాలు విజయవాడకు సమీపాన ఉండవల్లి కొండలపై ఉన్న గుహాలయాలను పోలిఉన్నాయి.
కానీ వీటిని ఉండవల్లిలోని 5 అంతస్తులు అనంతశయన గుడితో పోల్చలేమని, కళారీతులను బట్టి ఈ గుహలు క్రీ.శ ఏడో, 8వ శతాబ్దాలకు చెందినవని చారిత్రక పరిశోధకులు ఎన్.ఎస్ రామచంద్రమూర్తి అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి చారిత్రక కట్టడాలను రక్షించడానికి చర్యలు తీసుకోవాలని చరిత్ర పరిశోధకుడు అరవింద్ ఆర్య పేర్కొన్నారు. కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో కానీ, రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో కానీ ఈ ప్రదేశం వివరాలు లేవని చెప్పారు. ఇప్పటికైనా పురావస్తు శాఖ ఈ ప్రాంతాన్ని తన పరిధిలోకి తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు.
చెదిరిపోతున్న శాసనాలు
శివరాత్రి వేడుకల సందర్భంగా గ్రామస్తులు ఈ ఆలయ అభివృద్ధి కోసం పూనుకున్నారు. ఆలయానికి వెళ్ళేందుకు అనుగుణంగా నడక దారిని ఏర్పాటు చేసుకున్నారు. పురావస్తు శాఖ పట్టించుకోక పోవడం, చారిత్రక సంపదపై అవగాహన లేకపోవడంతో గుహలకు సున్నం వేశారు. దీనివల్ల గుహల పైభాగంలో ఉన్న రాతి చిత్రాలు పాడవ్వడమేకాక, దాని చారిత్రక ప్రాధాన్యం కోల్పోయింది.
ఇంత ప్రాచీన చరిత్ర, ప్రాధాన్యత కలిగిన ఈ గుహల వివరాలు అటు కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో కానీ, ఇటు రాష్ట్ర పురావస్తు శాఖలోకానీ లేకపోవడంతో అభివృద్ధి జరగడం లేదు. అభివృద్ధి మాట అటుంచి కనీసం ఇలాంటి ప్రాంతం ఒకటుంది అన్న విషయం చుట్టు పక్కల గ్రామాల ప్రజలకి సైతం తెలియకపోవడం శోచనీయం. రాష్ట్ర పురావస్తు శాఖ ఇప్పటికైనా స్పందించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, మరోసారి సున్నం, రంగులు వేయకుండా చర్యలు చేపట్టాలని పలువురు చరిత్ర పరిశోధకులు కోరుతున్నారు .
Comments
Please login to add a commentAdd a comment