సాక్షి, హైదరాబాద్: ఎద్దులు, ఉడుములు, పాములు, మనుషులు, మొక్కలు, పూలు, మధ్యమధ్యలో అంతుపట్టని ఆకృతులు... ఇలా ఆ గుహలోకి వెళితే అదో అందమైన కాన్వాస్. కళ్లకు కనిపించినవి, మదిలో మెదిలినవి ఆకృతులుగా ఎరుపు రంగులో పొందికగా ఆ రాతిపై చిత్రీకరించారు. అయితే ఇవన్నీ రూపుదిద్దుకున్నవి దాదాపు మూడున్నర వేల ఏళ్ల క్రితం.
తెలంగాణలో మరో రాతి చిత్రాల జాడ వెలుగుచూసింది. చాలా ప్రాంతాల్లో ఆదిమానవులు గీసిన రాతి చిత్రాలు అడపాదడపా వెలుగు చూస్తున్నా... వాటి సంఖ్య ఎక్కువగా ఉన్న తావుల సంఖ్య అరుదు. ఇప్పుడు ఒకే చోట ఎక్కువ సంఖ్యలో చిత్రాలున్న గుహ వెలుగు చూసింది. భద్రాద్రి–కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని నల్లముడి గ్రామ చేరువలోని అడవిలో ఒంటిగుండుగా పిలుచుకునే గుహలోపల ఇవి కనిపించాయి. దీన్ని స్థానికులు ఆరాధన ప్రాంతంగా వినియోగిస్తున్నారు. ‘పంచపాండవులు’గా పేర్కొనే ఐదు నిలువురాళ్లు, పెద్ద మీసాలతో ఓ తల రూపుతో ఉన్న రాయిని పూజిస్తున్నారు.
ఆ గుహలో పైభాగంలో రకరకాల ఆకృతుల్లో ఈ చిత్రాలున్నాయి. పాతరాతియుగం–మధ్యరాతియుగంలో ఇవి చిత్రించారని భావిస్తున్నారు. పాములు, ఉడుములు, మానవాకృతులు, పూల డిజైన్లు, సూర్యుడు, దీర్ఘచతురస్రాకారపు ఘనాలతో బొమ్మలు అక్కడ కనిపిస్తున్నాయి. గతంలో నీలాద్రి (రామచంద్రాపురం), రాచకొండ ప్రాంతాలలో వెలుగు చూసిన చిత్రాల తరహాలో ఇవి ఉండటం విశేషం.
ఈ చిత్రాలను తాజాగా ఖమ్మం, భద్రాచలంకు చెందిన ఔత్సాహిక పరిశోధకులు కొండవీటి గోపి, జగన్మోహనరావు, కట్టా శ్రీనివాస్, రాక్ ఆర్ట్ నిపుణులు బండి మురళీధర్‌రెడ్డి, తెలంగాణ జాగృతి చరిత్ర విభాగానికి చెందిన శ్రీరామోజు హరగోపాల్, రామన్ స్పెక్ట్రాస్పెషలిస్టు కట్టా జ్ఞానేశ్వర్, కనిగిరికి చెందిన కొండ్రేటి భాస్కర్‌లు రాక్‌ఆర్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యుల ఆధ్వర్యంలో పరిశీలించారు. ఆ చిత్రాల వయసు, వాటికి వాడిన ముడిపదార్థాలు, అంచులకు వినియోగించిన గీతలు పాతవా, తర్వాత చిత్రించినవా.. అన్న వివరాలను వారు ఆరా తీస్తున్నారు. ఇందుకు శాస్త్రీయ పరిశోధన జరుపుతున్నారు. ఇక్కడే ఆదిమానవులు వాడిన రాతి పనిముట్లు, కొన్ని వృక్ష శిలాజాలు కూడా లభించాయి.
క్రమంగా శిథిలమవుతూ...
ఎంతో విలువైన ఈ చిత్రాలు క్రమంగా దెబ్బతింటున్నాయి. స్థానికులు ఆరాధనలో భాగంగా గుహలో గండ దీపాలు వెలిగిస్తుండటంతో మసిపట్టి రంగు మారిపోతున్నాయి. మరికొందరు గుహ గోడలకు సున్నం పూస్తున్నారు. స్థానికులకు అవగాహన కలిగించటంతోపాటు వాటి సంరక్షణకు హెరిటేజ్ తెలంగాణ చర్యలు చేపట్టాలని పరిశోధన బృందం సభ్యులు కోరుతున్నారు.
రాతి గుహల్లో రంగుల కాన్వాస్
Published Thu, Jan 9 2020 2:25 AM | Last Updated on Thu, Jan 9 2020 2:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment