మానవులు గుహలనే ఆవాసాలుగా చేసుకుని జీవించే కాలంలో గుహల గోడలపై రకరకాల చిత్రాలు చిత్రించిన ఆనవాళ్లు ప్రపంచంలో అక్కడక్కడా ఉన్నాయి. ఇవి రాతియుగం నాటి హోమోసేపియన్ మానవులు చిత్రించినవి. అయితే, వారి కంటే పూర్వీకులైన నియాండర్తల్ మానవులు చిత్రించిన గుహాచిత్రాలు ఇటీవల ఫ్రాన్స్‌లో బయటపడ్డాయి. ఫ్రాన్స్‌లోని సెంటర్ వాల్ డి లోరీ ప్రాంతంలోనున్న లా రోష్ కోటార్డ్ గుహ గోడలపై చెక్కిన ఈ చిత్రాలు కనిపించాయి.
యూనివర్సిటీ ఆఫ్ టూర్స్‌కు చెందిన పరిశోధన బృందంలోని శాస్త్రవేత్తలు ఈ చిత్రాలను గుర్తించారు. పొడవాటి గీతలు, చుక్కలతో ఉబ్బెత్తుగా చెక్కిన ఈ చిత్రాలు దాదాపు 75 వేల ఏళ్ల కిందటివని పరిశోధకులు అంచనా వేశారు. ఈ గుహను వాడటం మానేసి 57 వేల ఏళ్లు కావచ్చని వారు చెబుతున్నారు.
ఇవి నియాండర్తల్ మానవులు చెక్కినవేనని, ఇదివరకు దొరికిన నియాండర్తల్ మానవుల చిత్రాల కంటే ఇవి పురాతనమైనవని చెబుతున్నారు. జింక ఎముకలపై నియాండర్తల్ మానవులు చెక్కిన చిత్రాలు ఇదివరకు జిబ్రాల్టర్‌లో బయటపడ్డాయి. అవి దాదాపు 51 వేల ఏళ్ల నాటివని శాస్త్రవేతలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment