భూమిపైనేకాదు.. సముద్రంలోనూ గుహలుంటాయనే విషయం మీకు తెలుసా? మెక్సికోలో బయటపడ్డ ఓ గుహ గురించి తెలుసుకుంటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. ఇది చదవండి!
మెక్సికో: మనదేశంలో ఎన్నో దేవతా విగ్రహాలు గుహల్లో కొలువయ్యాయి. అయితే వాటి పొడవు కొన్ని మీటర్లు మాత్రమే. అప్పుడప్పుడూ విహారయాత్రకు వెళ్లినప్పుడు ఇంకాస్త పొడవుగా ఉండే బొర్రా గుహల్లాంటివి చూసుంటాం. ఇక ప్రపంచంలో ఇప్పటిదాకా డోస్ ఓజోస్ గుహలే పెద్దవనుకున్నారు. వీటి పొడవు 83 కిలో మీటర్లు. ఈ మధ్య మెక్సికోలో తులుమ్ దగ్గర బయటపడ్డ గుహే పెద్దదనుకున్నారు. దీని పొడవు 268 కిలోమీటర్లు. అయితే ఇవన్నీ భూమిపై ఉన్న గుహలు మాత్రమే. కానీ సముద్రంలోనూ ఓ పే..ద్ద గుహ బయట పడింది. ఈ అద్భుతమైన గుహను మెక్సికో శాస్త్రవేత్తలే ప్రపంచానికి పరిచయం చేశారు.
అది ఎక్కడంటే మెక్సికో సముద్ర తీరంలో ఈ గుహను గుర్తించారు. సముద్రంలో నీళ్లలో ఉండే గుహల్లో ఇదే పొడవైనదట. దీని పొడవు ఏకంగా 347 కిలోమీటర్లుందని తెలిసిన తర్వాత శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు. సరదాగా డైవర్లు సముద్రంలో చక్కర్లు కొడుతుంటూ ఈ గుహ బయటపడింది. దాని పై భాగం అంతా ఎంతో చిత్రంగా అనిపించింది. రాయి కరిగి కిందికి కారుతోందా అన్నట్లుంది. వెళ్లే కొద్దీ లోపలికి దారి కనిపిస్తూనే ఉంది. దీంతో పరిశోధనలు చేయడానికి సంసిద్ధమై.. ముఖానికి ఆక్సిజన్ సిలిండర్లు, చేతికి లైట్లున్న గ్లౌజులు వేసుకొని పరిశోధన కొనసాగించారు. ఇదే పెద్ద గుహ అని నిర్ధారించుకున్న తర్వాత దానికి డోస్ ఓజోస్ కేవర్న్ సిస్టమ్ అని పేరూ పెట్టారు.
20 ఏళ్ల పరిశోధన...
యుకటన్ ద్వీపకల్పంలో మిస్టరీగా మారిన ఇలాంటి గుహలపై 20 ఏళ్లుగా రాబర్ట్ స్కిమిట్నర్ అనే శాస్త్రవేత్త పరిశోధనలు చేస్తూనే ఉన్నాడు. చివరకు గామ్ బృందం(పురాతత్వ పరిశోధన సంస్థ) సహకారంతో.. కొందరు స్కూబా డైవర్లను లోపలికి పంపి ఆయన ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. 10 నెలల నిరంతరాయ పరిశోధన తర్వాత వేల సంవత్సరాల నాటి శిలాజాలు లభించగా.. వాటిని చరిత్రకారులు పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment