గూడు సమాధుల గుట్టు వీడనుంది! | Archaeological Department is a huge exploration | Sakshi
Sakshi News home page

గూడు సమాధుల గుట్టు వీడనుంది!

Published Fri, Dec 1 2017 3:43 AM | Last Updated on Fri, Dec 1 2017 3:57 AM

Archaeological Department is a huge exploration  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒకటి కాదు రెండు కాదు వందల నిర్మాణాలు.. గుట్టలపై, దట్టమైన అడవిలో రాతి గుహల్లాంటి ఏర్పాట్లు.. చిన్న ద్వారం, తొంగి చూస్తే రాతి తొట్లు.. చుట్టూ భారీ రాతి గుండ్లతో కంచె.. కచ్చితమైన వృత్తా కారంలో ఏర్పాటు.. ప్రతి నిర్మాణం ముందు మానవాకృతిని సూచించే భారీ శిలలు.. వరం గల్, ఖమ్మం జిల్లాల్లో గోదావరి తీరం వెంట కనిపించే ఆది మానవుల సమాధుల ప్రత్యేక తలివి. ఇప్పటికీ ప్రపంచంలో మరెక్కడా ఈ తరహా సమాధి నిర్మాణాలను గుర్తించలేదు.

తెలంగాణ చరిత్రకే పరిమితమైన అరుదైన ఈ నిర్మాణాల గుట్టు వీడనుంది. గతంలో అమెరికాకు చెందిన శాన్‌డియాగో విశ్వవిద్యాల యం ప్రొఫెసర్‌ థామస్‌ ఇ లెవీ ఆధ్వర్యంలోని బృందం ఈ సమాధులను పరిశీలించి.. ఇవి ఈ ప్రాంతానికే ప్రత్యేకమైనవిగా తేల్చారు. వీటి నిగ్గు తేల్చేందుకు లైడార్‌ సర్వే చేస్తామనీ ప్రకటించారు. తాజాగా భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) ఈ సమాధుల నిగ్గు తేల్చేందుకు తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే ఏడాది ఖమ్మం జిల్లా పినపాక మండలం జానంపేట వద్ద తవ్వకాలు మొదలు కాబోతున్నాయి. తెలంగాణలో చాలాకాలం తర్వాత ఏఎస్‌ఐ చేపట్టే భారీ అన్వేషణ ఇదే.

రాతిని తొలిచిన తొలి కాలం అదేనా?
రాతిని తొలిచి ఆకృతిగా మలచటం క్రీస్తుపూర్వం 2 వేల ఏళ్ల క్రితం సింధూ నాగరి కతలో కనిపించిందని చరిత్ర చెబుతోంది. స్థాని కంగా క్రీస్తుపూర్వం 300 ఏళ్లనాడు మౌర్యుల కాలంలో ఆ తరహా శిల్పకళా వైభవం కనిపిం చింది. మరి ఈ రెండింటి మధ్య కాలంలో ఏం జరిగిందన్న దానికి స్పష్టమైన సమాచారం లేద ని నిపుణులు చెబుతారు.

కానీ వరంగల్, ఖమ్మం మధ్య గోదావరి తీరంలో విస్తరించిన అడవులు, గుట్టలపై విస్తారంగా ఉన్న ఆది మానవుల సమాధులను పరిశీలిస్తే.. రాళ్లను ఆకృతిలోకి మలిచిన దాఖలాలు కనిపిస్తాయి. ఇవీ క్రీస్తుపూర్వం 1000–600 ఏళ్ల మధ్యనాటి వని ప్రాథమిక అంచనా ఉంది. ఇదే నిజమైతే సింధూ నాగరికత అంతరించాక రాతిని తొలిచి ఆకృతులుగా చెక్కిన కాలం ఇక్కడ నుంచి మొదలైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎలా చెక్కారు?
ఇక్కడి గుట్టల్లో, దట్టమైన అడవుల్లో వేల సం ఖ్యలో ఆది మానవుల సమాధులు విస్తరించి ఉన్నాయి. నాలుగైదు అడుగుల విస్తీర్ణంలో ఉండే పెద్ద పెద్ద బండరాళ్లు నిలిపి ఉంటాయి. వాటి వెలుపలి భాగం అర్ధ చంద్రాకారంలో చెక్కి ఉంటుంది. అన్ని రాళ్ల ఆకృతిని కలిపితే సంపూర్ణ వృత్తాకారంగా కనిపిస్తుంది. ఈ రాళ్ల మధ్య పది పదిహేను అడుగుల వెడల్పున్న గూడు ఉంటుంది. దానికి చిన్న ద్వారంతో పాటు లోపల ఏడెనిమిది అడుగుల పొడవున్న రాతి తొట్టి ఉంటుంది. అందులో మానవ అవశే షాలను గుర్తించారు. ఇక సమాధి ముందు అది ఎవరి సమాధి అని తెలిపేలా స్త్రీ/పురుష ఆకృతి లో ఎత్తయిన రాతి శిల పాతి ఉంటుంది.

ఇనుము వాడిన దాఖలాలు
నిజాం హయాంలో 1940–41 సమయంలో నాటి పురావస్తు శాఖ ఉన్నతాధికారి ఖాసీ మహ్మద్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో ఈ ప్రాంతాల్లో తవ్వకాలు జరిగాయి. ఆ సమయంలో గుర్రాల ముక్కుకు బిగించే ఇనుప వస్తువులు, నాగలికి ఏర్పాటు చేసే పరికరాలను, కొన్ని మట్టిపాత్రలు, ఇతర ఆకృతులు, ఆయుధాలను గుర్తించారు.

ప్రస్తుతం కేంద్ర పురావస్తు శాఖ ఈ సమాధుల గుట్టు విప్పేందుకు పినపాక మండలం జానంపేట ప్రాంతాన్ని కేంద్ర పురావస్తు శాఖ తన అధీనంలోకి తీసుకుంది. కొన్ని వందల ఎకరాల ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా నిర్ధారించింది. ఆధునిక పద్ధతుల్లో, డీఎన్‌ఏ పరీక్షలను ఉపయోగించి ఆ సమాధులు ఏ కాలానికి చెందినవి, నాటి మనుషుల జీవన శైలి ఏమిటి, వారు స్థానికులేనా, వేరే ప్రాంతం నుంచి వలస వచ్చారా, ఇప్పుడు ఆ జాతి కొనసాగుతోందా, ఉంటే ఎక్కడ మనుగడలో ఉందన్న వివరాలను తేల్చనుంది. ఇది విదేశీ పరిశోధకులు, పర్యాటకులను బాగా ఆకట్టుకుంటుందని ఏఎస్‌ఐ భావిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement