సుందర గుహాలయాలు | special story to Undavalli Caves | Sakshi
Sakshi News home page

సుందర గుహాలయాలు

Nov 14 2017 11:20 PM | Updated on Nov 14 2017 11:20 PM

special story to  Undavalli Caves - Sakshi

ఉండవల్లి గుహలు గుంటూరు నుంచి 30 కి.మీ. విజయవాడ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇవి మొదట బౌద్ధానికి సంబంధించినవి. తర్వాత క్రమంగా గుహాలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ గుహలు బౌద్ధ, హైందవ శిల్పకళారీతుల సమ్మేళనం. ఈ నాలుగు అంతస్తుల గుహల సముదాయాన్ని మొదట బౌద్ధ భిక్షువుల నివాసం కోసం ఏర్పాటు చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మలినిర్మాణం 6–7 శతాబ్దాల కాలంలో జరిగింది. గుహాలయాల మొదటి అంతస్తు సంపూర్ణంగా లేదు. రెండవ అంతస్తు త్రికూటాలమయం. మూడవ అంతస్తు అనంత శయన విష్ణుమూర్తి, పన్నిద్దరాళ్వార్లు, ఆంజనేయ విగ్రహాలు ఉన్నాయి. నాలుగవ అంతస్తులో పూర్తి కాని త్రికూటాలయం ఉంది. వీటిలోని శిల్పకళారీతుల ఆధారంగా చాళుక్యరాజుల కాలం నాటివిగా తెలుస్తోంది.

శనిదోషాలను నివారించే విదురాశ్వత్థ వృక్షం
విదురుడు నాటిన రావిచెట్టు కాబట్టి దీనికి విదురాశ్వత్థ వృక్షం అని పేరు వచ్చింది. ఈ చెట్టు ఉన్న ప్రదేశం కాబట్టి ఆ ఊరికి విదురాశ్వత్థ అనే పేరు వచ్చింది. ఈ విశాలమైన వృక్షరాజాన్ని అత్యంత మహిమాన్వితమైనదిగా భావిస్తారు. కావేరి, ఆర్కావతి నదుల సంగమస్థానం ఇది. మహాశిల్పి జక్కన, టిప్పుసుల్తాన్‌లు ఈ క్షేత్రంలో పుట్టారని అంటారు. వృక్షం మూలభాగం బ్రహ్మరూపమని, మధ్యభాగం విష్ణురూపం అని, అగ్రభాగం శివరూపం అని భావిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షంగా పేరు పొందిన వృక్షం ఇది. విష్ణు అంశ గల చెట్టు ఇది.
శని దృష్టి సంబంధితమైనందు వల్ల శనివారం రోజు ఈ క్షేత్రాన్ని వేలాది మంది దర్శించుకుంటారు. శనివారం తప్ప ఇతర రోజుల్లో ఈ వృక్షాన్ని తాకరు. భూత ప్రేతపిశాచ రోగాలు, సంతానహీనత తొలగించే వృక్షం. శనిదోషాలతో బాధపడేవారు దీని దర్శనం చేసుకుంటే శాంతి సుఖాలు పొందుతారని విశ్వాసం. సోమేశ్వరం, గణేశుడు, లక్ష్మీనారాయణుడు, ఆంజనేయ స్వామి ఆలయాలతోపాటు వేలకొలదీ నాగ ప్రతిమలు దర్శనమిస్తాయి. బెంగళూరు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూపురం నుంచి కూడా ఈ క్షేత్రానికి బస్సులు ఉన్నాయి. కానీ వసతి సౌకర్యాలు ఉండవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement