Kodaikanal
-
16 మంది మాయం.. మంజుమ్మెల్ బాయ్స్ ‘గుణ గుహ’ గురించి తెలుసా?
మళయాలంలో చిన్న చిత్రంగా రిలీజ్ అయ్యి.. టోటల్ సౌత్‌నే ఊపేస్తోంది మంజుమ్మెల్ బాయ్స్. వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కింది ఈ సర్వైవల్ డ్రామా. అత్యంత ప్రమాదకరమైన గుహల్లో చిక్కుకున్న తన మిత్రుడ్ని రక్షించుకునేందుకు ఓ యువకుడు చేసిన సాహసమే ఈ చిత్రానికి స్ఫూర్తి. అయితే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.. గుణ గుహలు, ఆ గుహ చుట్టూ అల్లుకున్న మిస్టరీ నేపథ్యం. ఆ మిస్టరీ ఏంటి? ఆ గుహలోకి వెళ్లి అదృశ్యమైన 16 మంది ఏమైపోయారు?.. ఇంతకీ ఈ గుహలకు డెవిల్ కిచెన్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసుకుందాం. తమిళనాడు కొడైకెనాల్లో గుణ గుహలు ఉన్నాయి. 1821లో బీఎస్ వార్డ్ అనే బ్రిటిష్ అధికారి ఈ గుహల గురించి తొలిసారి వెలుగులోకి తెచ్చారు. ఆ గుహకు డెవిల్స్ కిచెన్ అని పేరు పెట్టాడాయన. లిఖితపూర్వక రికార్డులు కూడా లేకపోయేసరికి అసలు ఆయన వాటికి ఆ పేరు ఎందుకు పెట్టాడో అనేదానికి చాలా ఏండ్లు స్పష్టత లేకుండా పోయింది. ఈలోపు.. 1991లో కమల్ హాసన్ నటించిన గుణ చిత్రం విడుదలైంది. ఆ చిత్రం మేజర్ పోర్షన్ ఈ గుహల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేసుకుంది. గుణ చిత్రం సూపర్ హిట్ కావడంతో.. ఈ గుహలకు ‘గుణ గుహలు’ అనే పేరొచ్చింది. అప్పటి నుంచి పర్యాటకులు క్యూ కట్టడం ప్రారంభించారు. అయితే.. తర్వాతి కాలంలో ఆ గుహల పేరు చెబితేనే జనాలు వామ్మో అనుకోవడం ప్రారంభించారు. అందుకు కారణం.. ఆ గుహలోని అగాథం, ఆ అగాథాన్ని అన్వేషించేందుకు వెళ్లిన కొందరిని అది మింగేయడం. పైగా గుహ ఏకరీతిలో కాకుండా అసాధారణ రీతిలో ఉండడంతో.. అందులో పడిపోయినవాళ్ల మృతదేహాల్ని సైతం బయటకు తీయలేకపోయారు. దీంతో.. వార్డ్ అందుకే డెవిల్స్ కిచెన్ అని దానికి పేరు పెట్టి ఉండొచ్చనే అంచనాకు వచ్చారు. అలా.. గుణ గుహలకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన గుహల్లో ఒకటిగా పేరు వచ్చింది. పోలీసుల రికార్డుల ప్రకారం.. 2016 దాకా 16 మంది ఈ గుహలోకి వెళ్లిన వాళ్లు కనిపించకుండా పోయారు. అలా.. అదృశ్యమైన వాళ్లలో ఓ కేంద్రమంత్రి బంధువు కూడా ఉన్నారు. వీళ్లలో కొన్ని సూసైడ్ కేసులు కూడా ఉన్నాయి. అయితే.. ఓ వ్యక్తి మాత్రం సజీవంగా బయటకు రాగలిగాడు. అదే మంజుమ్మెల్ బాయ్స్ కథకు మూలమైంది. 2006లో కేరళ కొచ్చి మంజుమ్మెల్ ప్రాంతానికి చెందిన కొందరు స్నేహితులు ఈ గుహ సందర్శనకు వెళ్లారు. అందులో సుభాష్ అనే వ్యక్తి గుహ అగాథంలోకి పడిపోయాడు. దీంతో అతని మీద ఆశలు వదిలేసుకున్న సమయంలో.. సిజూ డేవిడ్ అనే అతని స్నేహితుడు ధైర్యం చేశాడు. పోలీసులు, అధికారులు హెచ్చరించి వారించినా వినకుండా స్థానికుల సాయంతో అతికష్టం మీద తన స్నేహితుడ్ని రక్షించుకున్నాడు. అలా ఆ వాస్తవ గాథ ఆధారంగా తెరకెక్కిన మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం.. ఇప్పుడు సౌత్ ఆడియెన్స్‌ను అలరిస్తోంది. 2000 సంవత్సరం చాలా ఏళ్లపాటు సందర్శకులను అనుమతించకుండా ఈ గుహను శాశ్వతంగా మూసేశారు. అయినా కూడా హెచ్చరికలను పట్టించుకోకుండా కొందరు ఆ గుహ పరిసరాలకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ప్రమాదంలో పడుతూ వచ్చారు. మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం సూపర్ హిట్ కావడంతో గుణ గుహలకు సందర్శకులను అనుమతించడం ప్రారంభించింది తమిళనాడు టూరిజం శాఖ. కానీ, గుహ ప్రధాన ద్వారం మాత్రం ఇంకా మూసే ఉంచారు. గుహకి ఉన్న భయాకన నేపథ్యంతో మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం షూటింగ్ చాలావరకు సెట్స్‌లోనే నిర్వహించారు. కొంత భాగం మాత్రం గుహల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. అలాగే కమల్ హాసన్ గుణ చిత్రం.. తాజా మెంజుమ్మెల్ బాయ్స్ సినిమాలే కాకుండా.. ఈ మధ్యలో మోహన్‌లాల్ నటించిన షిక్కర్(2010) చిత్రం కొంత భాగం డెవిల్స్ కిచెన్ గుహల పరిసరాల్లోనే షూటింగ్ చేసుకుంది. Video Credits: Pyramid Glitz Music -
నేతల ఆట విడుపు.. కొడైకెనాల్లో తిష్ట
సాక్షి, చెన్నై: తెల్ల పంచె, తెల్లచొక్క అంటూ రాజకీయ వ్యవహారాల్లో బిజీబిజీగా గడిపిన నేతలకు కాస్త విరామం లభించింది. కొడైకెనాల్లో పలువురు నేతలు ఆటవిడుపుగా తిష్ట వేశారు. కొందరు అయితే, కుటుంబాలతో కలిసి పర్యాటక కేంద్రాల్లో చక్కర్లు కొడుతున్నారు. వీరు తమ నాయకులేనా అని గుర్తు పట్టలేని రీతిలో వేషాల్ని మార్చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందుగా సిట్టింగ్ సీట్లు మళ్లీ దక్కేనా అన్న ఆందోళన అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు పడ్డ విషయం తెలిసిందే. చివరకు సీట్లు దక్కించుకున్న వాళ్లు, ఎన్నికల ప్రచారంలో రేయింబవళ్లు ఓటర్లను ఆకర్షించేందుకు కుస్తీలు పట్టారు. పార్టీల ముఖ్య నేతలు, మంత్రులు అంటూ నెలన్నర రోజులు తీవ్రంగానే శ్రమించారు. ఈనెల ఆరవ తేదీతో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీంతో ఫలితాల వెల్లడికి మే 2వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం విరామ సమయం నేతలకు దొరికింది. తమ కుటుంబాలతో గడిపేందుకు మరింతగా సమయం దొరికింది. సీఎం పళనిస్వామి అయితే, స్వగ్రామం ఎడపాడికి వెళ్లి కుటుంబం, బంధువులతో గడిపేందుకు ఎక్కువ సమయం కేటాయించడం జరుగుతోంది. డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం సొంతూరు బోడినాయకనూర్‌కు పరిమితమయ్యారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అయితే, కుటుంబంతో కలిసి కొడైకెనాల్ వెళ్లారు. వేషాల్ని మార్చేసి.. తమిళ నేతలు సాధారణంగా తెల్లపంచె, తెల్ల చొక్కాలతో దర్శనం ఇవ్వడం నిత్యం చూస్తూ వచ్చాం. అయితే, ఇప్పుడు విరామ సమయంలో తమ వేషాల్నే మార్చేశారు. భార్య దుర్గ, కుమారుడు ఉదయ నిధి, కోడలు, మనుమళ్లు, మనుమరాళ్లతో స్టాలిన్ కొడైకెనాల్లో రెండు రోజులుగా బస చేశారు. గోల్ఫ్ ఆడుతూ ఎక్కువ సమయం గడుపుతున్నారు. సాయంత్రం సతీమణితో కలిసి అలా పర్యాటక అందాల్ని తిలకించేందుకు కారులో చక్కర్లు కొట్టే పనిలో పడ్డారు. ట్రాక్, టీషర్టుతో కనిపించిన స్టాలిన్‌తో సెల్ఫీలకు పలువురు ఎగబడడం విశేషం. ఈ పరిస్థితుల్లో కొడైకెనాల్లో స్టాలినే కాదు, అన్నాడీఎంకే ముఖ్య నేతలు, మంత్రులు పలువురు సైతం కుటుంబాలతో కలిసి తిష్ట వేసి ఉండడం వెలుగు చూసింది. అయితే, వీళ్లేనా తమ నేతలు, తమ మంత్రులు అని గుర్తు పట్టలేని పరిస్థితుల్లో వేషాల్ని మార్చేశారు. థర్మాకోల్ మంత్రిగా ముద్ర పడ్డ సహకార మంత్రి సెల్లూరురాజు ఆదివారం ఉదయం కుటుంబంతో వాకింగ్ చేస్తూ కెమెరాకు చిక్కారు. ఆయన్ను తొలుత ఎవ్వరూ గుర్తు పట్టనప్పటికీ, చివరకు దగ్గరకు వెళ్లి పలకరించగా, ఆయనే సెల్లూరు రాజు అని తేలింది. దీంతో ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పలువురు యువకులు ఆసక్తి చూపించారు. తానే కాదు, మరెందరో నేతలు కొడైకెనాల్లో విశ్రాంతిలో ఉన్నట్టుగా సెల్లూరు సంకేతం ఇవ్వడం గమనార్హం. పంచెకట్టు, తెల్ల చొక్కాల్ని పక్కన పెట్టి, టీషర్టులు, జీన్స్‌లు, ట్రాక్‌లతో వేషాల్ని మార్చిన మనోల్ని గుర్తు పట్టడం కాస్త కష్టమే అన్నట్టుగా పరిస్థితి నెలకొని ఉండడం గమనార్హం. గతంలో ముఖ్య నేతలు ఎన్నికల అనంతరం విదేశాలకు చెక్కేసేవారు. తాజాగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో దిండుగల్ జిల్లా కొడైకెనాల్‌కు పరిమితమైనట్టుంది. చదవండి: రాత్రి కర్ఫ్యూ.. ఆదివారం ఫుల్ లాక్డౌన్ -
కొడైకెనాల్ విద్యార్థికి ప్రధాని మోదీ లేఖ
సాక్షి, చెన్నై : కొడైకెనాల్ లాయిడ్స్ రోడ్‌కి చెందిన ప్రసన్నన్ ఆ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల ఇత ను అటవీశాఖ తరఫున జరిపిన వ్యాసరచన పోటీ లో చెట్లు పెంచడం వల్ల కలిగే ఉపయోగాలు తదితరవాటిపై విపులంగా రాసి ఆకట్టుకున్నారు. చెట్టుకి మనిషి అవసరం లేదు, మనిషికే చెట్టు అవసరం అనే తత్వాన్ని తెలిపినట్టు తెలిసింది. (శశికళ చేతిలోకే అన్నాడీఎంకే!) ఒక్కొక్క విద్యార్థి పాఠశాలలో చేరేటప్పుడు, పాఠశాలలో చదువు ముగిసేటప్పుడు ఒక చెట్టుని నాటాలని, సెంట్రల్, రాష్ట్ర ప్రభుత్వం చట్టం వెల్లడించాలి అనే తత్వాన్ని వ్యాసంలో రాశాడు. ఈ తత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడపాడి పళనిస్వామి, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ప్రసన్నన్ లేఖ రాశాడు. ఈ స్థితిలో విద్యార్థి తత్వంను ప్రోత్సహించి పరిశీలన చేస్తానని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి బదులు లేక వచ్చిందని విద్యార్థి సంతోషం వ్యక్తం చేశారు. (యాప్‌ల దునియా.. మేడిన్ ఇండియా) -
కొడైక్కెనాల్ కొండపై.. మందేసి చిందేసి
సాక్షి ప్రతినిధి, చెన్నై: వారంతా పాతికేళ్లలోపు యువతీ యువకులు. ఉద్యోగాలే చేస్తున్నారో.. ఉన్నత విద్యలే అభ్యసిస్తున్నారో తెలియదు. ఆడామగా తేడా లేకుండా మద్యం మత్తులో ఊగిపోయారు. పరిసరాలను మరిచిపోయి చిందులు వేశారు. మాదకద్రవ్యాల మైకంలో మరో లోకంలో విహరించారు. పోలీసులు రంగప్రవేశం చేసి 270 మంది యువతీ, యువకులను అరెస్ట్ చేశారు. దిండుగల్లు జిల్లా కొడైక్కెనాల్లో ఇళవరసి అనే కొండ ఎంతో ప్రసిద్ధి చెందింది. పోలీసుల అదుపులో యువతీ, యువకులు దేశం నలుమూలల నుంచేగాక విదేశీ పర్యాటకులు సైతం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇదిలాఉండగా కొడైక్కెనాల్ కోండపై భాగంలో యువతీయవకులు అడపాదడపా మాదకద్రవ్యాలు, మద్యం పార్టీలు చేసుకుంటారు. కొన్ని నెలల క్రితం న్యాయస్థానం అనుమతితో పోలీసుల పర్యవేక్షణలో పూంపారై కొండపై కొందరు మద్యం పార్టీ చేసుకున్నారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి కొడైక్కెనాల్ పైభాగం కొండకు సమీపంలోని గుండుపట్టి గ్రామంలోని ఒక ప్రయివేటు తోటలో పెద్ద సంఖ్యలో యువత కోలాహలం సాగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పళని తైపూస మహోత్సవంలో భద్రతా విధుల కోసం దిండుగల్లు జిల్లాకు వెళ్లి ఉండిన శివగంగై జిల్లా మానామధురై డీఎస్పీ కార్తికేయన్ నేతృత్వంలో పోలీసుల బృందం గుండుపట్టి గ్రామానికి చేరుకుంది. ప్రయివేటు తోటలో యువతీయువకులు మద్యం, మాదకద్రవ్యాల మత్తులో ఊగిపోవడాన్ని చూసి నివ్వెరపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మొత్తం 270 మందిలో ఆరుగురు యువతులు కూడా ఉన్నారు. బ్రెజిల్ దేశానికి చెందిన ఒక యువకుడిని కూడా పోలీసులు గుర్తించారు. తోటలో పార్టీ చేసుకుంటున్నవారంతా 25 ఏళ్లలోపు యువతీయువకులే కావడం గమనార్హం. వాట్సాప్ ద్వారా సమీకరణ మత్తుకు బానిసైన వారిని ఒక చోట చేర్చేందుకు కొందరు వ్యక్తులు వాట్సాప్ గ్రూప్ తయారు చేశారు. దాని ద్వారా యువతను సమీకరించి మెగా మాదకద్రవ్యాల పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.ఆమేరకు ఆహ్వానించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పార్టీ చేసుకుంటున్న 270 మందిని పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లు, గంజాయి తదితర మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. మత్తులో జోగుతూ ఏం జరుగుతోందో కూడా తెలియని స్థితిలో ఉండడంతో యువత నుంచి మరింత సమాచారం రాబట్టడం కష్టంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ పార్టీని ఎవరు ఏర్పాటు చేశారు, ఈ ప్రాంతాన్నే ఎందుకు ఎంచుకున్నారు, యువతను సమీకరించేందుకు వినియోగించిన వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు ఎవరు..? అనే కోణంలో శుక్రవారం విచారణ ప్రారంభించారు. పార్టీ జరిపేందుకు అనుమతిచ్చిన తోట యజమానిని కూడా విచారిస్తున్నారు. 270 మంది యువతను సమీకరించి ఒక మారుమూల గ్రామానికి తీసుకొచ్చి ఇలాంటి మాదకద్రవ్యాల పార్టీ జరిగిన సంఘటన పరిసరాల్లోని ప్రజలనేగాక పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. -
‘సీఎం పళనిస్వామిని చంపేస్తా’
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని చంపేస్తామని వచ్చిన ఓ ఫోన్‌కాల్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. చెన్నై ఎగ్మూర్‌లోని కంట్రోల్ రూమ్‌కు శనివారం రాత్రి ఓ యువకుడు ఫోన్ చేశాడు. ‘నా పేరు గురుశంకర్. కొడైకెనాల్ బస్టాండ్ వద్ద సీఎం పళనిస్వామిని హతమారుస్తా. ఇదే నా సవాల్’ అని కాల్ కట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా పోలీస్‌వర్గాల్లో కలకలం చెలరేగింది. ఉన్నతాధికారులు సీఎం నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. విచారణ ప్రారంభించిన సైబర్ క్రైమ్ పోలీసులు తమకు ఫోన్‌చేసిన వ్యక్తిని దిండుగల్ జిల్లా విరాళి పట్టికి చెందిన గురుమూర్తిగా(25)గా గుర్తించారు. గురుశంకర్ తండ్రి రామమూర్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కొడైకెనాల్లో గాలింపు ముమ్మరం చేశారు. -
పర్యాటకులకు ప్రాణాంతకంగా కొడైకెనాల్
టీ.నగర్: కొడైకనాల్‌లో జలవనరులు కలుషితమైనట్లు ఐఐటీ పరిశోధనలో వెల్లడైంది. ఈ ప్రాంతంలో మూతబడిన థర్మామీటర్ పరిశ్రమ నుంచి విడుదలైన పాదరసం వ్యర్థాలు కొడైకెనాల్, పెరియకుళం జల వనరుల్లో కలిసినట్లు హైదరాబాద్‌కు చెందిన సంస్థ దిగ్భ్రాంతి కలిగించే నివేదిక విడుదల చేసింది. దీంతో సదరు కంపెనీలో అధికారులు తనిఖీలు జరిపారు. దిండుగల్ జిల్లా, కొడైకెనాల్లోని థర్మామీటర్ తయారీ కార్మాగారంలో ఉద్యోగులు అస్వస్థతకు గురికావడంతో 2001లో మూతబడింది. ఈ కర్మాగారంలోని పాదరసం వ్యర్థాలను సాంకేతిక పరిజ్ఞానంతో తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌చేస్తూ వస్తున్నారు. ఇలాఉండగా హైదరాబాద్‌కు చెందిన ఐఐటీ సంస్థ పరిశోధకులు ఆషిఫ్ క్యూరిసి, కొడైకెనాల్ కొండ ప్రాంతం, తేని జిల్లా పెరియకుళం జలవనరులను పరిశీలించారు. దీనిగురించి ఇటీవల ఒక నివేదిక దాఖలు చేశారు. అందులో కొడైకెనాల్ జలవనరుల్లో 31.10 నుంచి 41.90 మైక్రోగ్రాములు, పెరియకుళం జలవనరుల్లో 94 నుంచి 165 మైక్రోగ్రాముల వరకు పాదరసం కలిసినట్లు పేర్కొన్నారు. 30 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా పాదరసం కలిసినట్లయితే మానవుని మెదడు, మూత్రపిండాలు దెబ్బతింటాయని తెలిపారు. అంతేకాకుండా గర్భిణులకు ప్రాణాపాయం ఏర్పడుతుందన్నారు. పాదరసంతో కలుషితమన నీటితో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లోగల చెరువులు, నీటిగుంటల్లో ప్రజలు చేపలు పట్టరాదని హెచ్చరించారు. ఇలాఉండగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రీజినల్ అధికారి చార్లెస్, కొడైకెనాల్ ఆర్డీఓ మోహన్, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు మంగళవారం పాదరసం కర్మాగారంలో తనిఖీలు జరిపారు. దీనిపై ఆర్డీఓ మోహన్ విలేకరులతో మాట్లాడుతూ పాదరసం శుభ్రం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై తనిఖీలు జరిపామని అన్నారు. ఈ కర్మాగారంలో నెలకొన్న మిస్టరీని ఛేదించి ప్రజల్లో భయాందోళనలు తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సామాజిక హితులు కోరుతున్నారు. థర్మామీటర్ కర్మాగారం: కొడైకెనాల్లో 1984లో 25 ఎకరాల విస్తీర్ణంలో థర్మామీటర్ కర్మాగారం ప్రారంభమైంది. సుమారు 1,200 మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తూ వచ్చారు. ఈ కర్మాగారంలో అనేక మంది కార్మికులు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు అప్పట్లో ఫిర్యాదులందడంతో 2001లో కర్మాగారం మూతపడింది. -
స్నానం చేస్తున్న బాలికతో సెల్ఫీ: పలువురు అరెస్ట్
12 మంది అరెస్ట్ తిరువొత్తియూరు: కొడెకైనాల్లో జలపాతం వద్ద బాలికతో సెల్ఫీ తీసుకున్న 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుచ్చికి చెందిన ఓ కుటుంబం శుక్రవారం కొడెకైనాల్‌కు పర్యటనకు వచ్చారు. ఆ కుటుంబానికి చెందిన 12 ఏళ్ల బాలిక స్నానం చేస్తుండగా ఆ సమయంలో అక్కడికి వచ్చిన నాగర్‌కోవిల్‌కు చెందిన పర్యాటకులు బాలికతో తమ సెల్ఫోన్లో సెల్ఫీ తీసుకున్నారు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్న ఆ బాలిక తల్లిదండ్రులపై వారు దాడి చేసినట్లు సమాచారం. ఈ సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. దీనిపై సమాచారం అందుకున్న కొడెకైనాల్ పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. బాలికలో సెల్ఫీ తీసుకున్న 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. -
యునిలీవర్ పై యువతి 'ర్యాప్' పోరు
కొడైకెనాల్: డేవిడ్- గొలియాత్ల యుధ్ధం అందరికీ తెలిసిందే. భీకరమైన ఆకారం.. లక్షలాది సైన్యమున్న గొలియాత్‌ను... గొర్రెలు కాసే బాలుడు డేవిడ్.. అదికూడా విసరడంలో తనకు నైపుణ్యమున్న ఒడిశెతో నేలకూల్చుతాడు. 27 ఏళ్ల సోఫియా అష్రాఫ్ది కూడా అలాంటి పోరే. కాకుంటే శత్రువును అంతమొందించకుండా సంస్కరించే వ్యూహం. ఈ యుద్ధంలో ఆమె ఆయుధం.. ర్యాప్. ప్రఖ్యాత వేసవి విడిది కొడైకెనాల్ పట్టణం నడిబొడ్డులో కొలువైన యునిలీవర్ థర్మామీటర్ ఫ్యాక్టరీ నిత్యం వదులుతోన్న వ్యర్థాలతో పర్యావరణం కలుషితమై.. స్థానిక ప్రజలు రోగాలపాలవుతున్నారు. ఫ్యాక్టరీని తరలించాలని అక్కడి మహిళలు గతంలో చాలాసార్లు నిరసనలు చేపట్టారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే వారి నిరసనగానీ, దానికి సంబంధించిన వార్తగానీ కేవలం కొడైకెనాల్ టాబ్లాయిడ్లకే పరిమితమైంది. మరెలా? ప్రజల జీవితాలు.. ధర్మామీటర్లో ఉపయోగించే పాదరసంలో మునిగిపోవాల్సిందేనా? ప్రపంచంలోనే అతిపెద్ద ఎమ్మెన్సీల్లో ఒకటైన యునిలివర్‌కు తన తప్పును ఎత్తిచూపే మార్గమేలేదా? అనే ప్రశ్నలకు సరికొత్త పోరాటరీతిలో సమాధానమిచ్చింది సోఫియా. ' ఫెయిర్‌నెస్ కోసం ఫెయిర్ అండ్ లవ్లీ.. దంత ఆరోగ్యానికి పెప్సోడెంట్.. ఒంటి సంరక్షణకు లైఫ్ బాయ్.. అంటూ ప్రాడక్ట్ లకు ప్రచారం కల్పించుకునే మీరు (యునిలీవర్).. ఫ్యాక్టరీ వ్యర్థాలను నిలిపేయాలి. కొడైకెనాల్ ను శుభ్రం చేయాలి' అంటూ ర్యాప్ సాంగ్ పాడింది. యునిలీవర్ తక్షణమే ప్రజారోగ్య వ్యతిరేక కార్యక్రమాలకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేసింది. సోఫియా రూపొందించిన ర్యాప్ సాంగ్‌కు ఇంటర్నెట్లో విశేష స్పందన లభిస్తోంది. వరల్డ్ టాప్ ర్యాపర్లలో ఒకరైన నిక్కి మినాజ్ సైతం సోఫియా పాటకు ఫిదా అయిపోయి.. 'వావ్' అంటూ ట్వీట్ చేసింది. జులై 30న యూ ట్యూబ్‌లో అప్లోడ్ అయిన సోఫియా ర్యాప్ విడియోను ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. మీరూ వినండి.. కచ్చితంగా నచ్చుతుంది. చెన్నైకి చెందిన సోఫియా అష్రాప్.. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజాహిత కార్యక్రమాలకు ప్రచారం నిర్వహిస్తుంటారు. గతంలో భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితుల పక్షాన పోరాడారు. ఇప్పుడు కొడైకెనాల్ ధర్మామీటర్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ర్యాప్ వీడియోను రూపొందించారు. ఒకటి రెండు తమిళ సినిమాల్లోనూ సోఫియా తన గళాన్ని వినిపించారు. ఏఆర్ రహమాన్, సంతోష్ కుమార్ సంగీత దర్శకత్వంలోనూ పాడారు.