సాక్షి ప్రతినిధి, చెన్నై: వారంతా పాతికేళ్లలోపు యువతీ యువకులు. ఉద్యోగాలే చేస్తున్నారో.. ఉన్నత విద్యలే అభ్యసిస్తున్నారో తెలియదు. ఆడామగా తేడా లేకుండా మద్యం మత్తులో ఊగిపోయారు. పరిసరాలను మరిచిపోయి చిందులు వేశారు. మాదకద్రవ్యాల మైకంలో మరో లోకంలో విహరించారు. పోలీసులు రంగప్రవేశం చేసి 270 మంది యువతీ, యువకులను అరెస్ట్ చేశారు. దిండుగల్లు జిల్లా కొడైక్కెనాల్‌లో ఇళవరసి అనే కొండ ఎంతో ప్రసిద్ధి చెందింది.
పోలీసుల అదుపులో యువతీ, యువకులు
దేశం నలుమూలల నుంచేగాక విదేశీ పర్యాటకులు సైతం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇదిలాఉండగా కొడైక్కెనాల్ కోండపై భాగంలో యువతీయవకులు అడపాదడపా మాదకద్రవ్యాలు, మద్యం పార్టీలు చేసుకుంటారు. కొన్ని నెలల క్రితం న్యాయస్థానం అనుమతితో పోలీసుల పర్యవేక్షణలో పూంపారై కొండపై కొందరు మద్యం పార్టీ చేసుకున్నారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి కొడైక్కెనాల్ పైభాగం కొండకు సమీపంలోని గుండుపట్టి గ్రామంలోని ఒక ప్రయివేటు తోటలో పెద్ద సంఖ్యలో యువత కోలాహలం సాగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పళని తైపూస మహోత్సవంలో భద్రతా విధుల కోసం దిండుగల్లు జిల్లాకు వెళ్లి ఉండిన శివగంగై జిల్లా మానామధురై డీఎస్పీ కార్తికేయన్ నేతృత్వంలో పోలీసుల బృందం గుండుపట్టి గ్రామానికి చేరుకుంది. ప్రయివేటు తోటలో యువతీయువకులు మద్యం, మాదకద్రవ్యాల మత్తులో ఊగిపోవడాన్ని చూసి నివ్వెరపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మొత్తం 270 మందిలో ఆరుగురు యువతులు కూడా ఉన్నారు. బ్రెజిల్ దేశానికి చెందిన ఒక యువకుడిని కూడా పోలీసులు గుర్తించారు. తోటలో పార్టీ చేసుకుంటున్నవారంతా 25 ఏళ్లలోపు యువతీయువకులే కావడం గమనార్హం.
వాట్సాప్ ద్వారా సమీకరణ
మత్తుకు బానిసైన వారిని ఒక చోట చేర్చేందుకు కొందరు వ్యక్తులు వాట్సాప్ గ్రూప్ తయారు చేశారు. దాని ద్వారా యువతను సమీకరించి మెగా మాదకద్రవ్యాల పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.ఆమేరకు ఆహ్వానించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పార్టీ చేసుకుంటున్న 270 మందిని పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లు, గంజాయి తదితర మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. మత్తులో జోగుతూ ఏం జరుగుతోందో కూడా తెలియని స్థితిలో ఉండడంతో యువత నుంచి మరింత సమాచారం రాబట్టడం కష్టంగా ఉందని పోలీసులు తెలిపారు.
ఈ పార్టీని ఎవరు ఏర్పాటు చేశారు, ఈ ప్రాంతాన్నే ఎందుకు ఎంచుకున్నారు, యువతను సమీకరించేందుకు వినియోగించిన వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు ఎవరు..? అనే కోణంలో శుక్రవారం విచారణ ప్రారంభించారు. పార్టీ జరిపేందుకు అనుమతిచ్చిన తోట యజమానిని కూడా విచారిస్తున్నారు. 270 మంది యువతను సమీకరించి ఒక మారుమూల గ్రామానికి తీసుకొచ్చి ఇలాంటి మాదకద్రవ్యాల పార్టీ జరిగిన సంఘటన పరిసరాల్లోని ప్రజలనేగాక పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది.
Comments
Please login to add a commentAdd a comment