యునిలీవర్ పై యువతి 'ర్యాప్' పోరు
కొడైకెనాల్: డేవిడ్- గొలియాత్ల యుధ్ధం అందరికీ తెలిసిందే. భీకరమైన ఆకారం.. లక్షలాది సైన్యమున్న గొలియాత్ను... గొర్రెలు కాసే బాలుడు డేవిడ్.. అదికూడా విసరడంలో తనకు నైపుణ్యమున్న ఒడిశెతో నేలకూల్చుతాడు. 27 ఏళ్ల సోఫియా అష్రాఫ్ది కూడా అలాంటి పోరే. కాకుంటే శత్రువును అంతమొందించకుండా సంస్కరించే వ్యూహం. ఈ యుద్ధంలో ఆమె ఆయుధం.. ర్యాప్.
ప్రఖ్యాత వేసవి విడిది కొడైకెనాల్ పట్టణం నడిబొడ్డులో కొలువైన యునిలీవర్ థర్మామీటర్ ఫ్యాక్టరీ నిత్యం వదులుతోన్న వ్యర్థాలతో పర్యావరణం కలుషితమై.. స్థానిక ప్రజలు రోగాలపాలవుతున్నారు. ఫ్యాక్టరీని తరలించాలని అక్కడి మహిళలు గతంలో చాలాసార్లు నిరసనలు చేపట్టారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే వారి నిరసనగానీ, దానికి సంబంధించిన వార్తగానీ కేవలం కొడైకెనాల్ టాబ్లాయిడ్లకే పరిమితమైంది.
మరెలా? ప్రజల జీవితాలు.. ధర్మామీటర్లో ఉపయోగించే పాదరసంలో మునిగిపోవాల్సిందేనా? ప్రపంచంలోనే అతిపెద్ద ఎమ్మెన్సీల్లో ఒకటైన యునిలివర్కు తన తప్పును ఎత్తిచూపే మార్గమేలేదా? అనే ప్రశ్నలకు సరికొత్త పోరాటరీతిలో సమాధానమిచ్చింది సోఫియా.
' ఫెయిర్నెస్ కోసం ఫెయిర్ అండ్ లవ్లీ.. దంత ఆరోగ్యానికి పెప్సోడెంట్.. ఒంటి సంరక్షణకు లైఫ్ బాయ్.. అంటూ ప్రాడక్ట్ లకు ప్రచారం కల్పించుకునే మీరు (యునిలీవర్).. ఫ్యాక్టరీ వ్యర్థాలను నిలిపేయాలి. కొడైకెనాల్ ను శుభ్రం చేయాలి' అంటూ ర్యాప్ సాంగ్ పాడింది. యునిలీవర్ తక్షణమే ప్రజారోగ్య వ్యతిరేక కార్యక్రమాలకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేసింది.
సోఫియా రూపొందించిన ర్యాప్ సాంగ్కు ఇంటర్నెట్లో విశేష స్పందన లభిస్తోంది. వరల్డ్ టాప్ ర్యాపర్లలో ఒకరైన నిక్కి మినాజ్ సైతం సోఫియా పాటకు ఫిదా అయిపోయి.. 'వావ్' అంటూ ట్వీట్ చేసింది. జులై 30న యూ ట్యూబ్లో అప్లోడ్ అయిన సోఫియా ర్యాప్ విడియోను ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. మీరూ వినండి.. కచ్చితంగా నచ్చుతుంది.
చెన్నైకి చెందిన సోఫియా అష్రాప్.. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజాహిత కార్యక్రమాలకు ప్రచారం నిర్వహిస్తుంటారు. గతంలో భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితుల పక్షాన పోరాడారు. ఇప్పుడు కొడైకెనాల్ ధర్మామీటర్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ర్యాప్ వీడియోను రూపొందించారు. ఒకటి రెండు తమిళ సినిమాల్లోనూ సోఫియా తన గళాన్ని వినిపించారు. ఏఆర్ రహమాన్, సంతోష్ కుమార్ సంగీత దర్శకత్వంలోనూ పాడారు.