Unilever
-
Priya Nair: అమ్మ చూపిన దారిలో అపూర్వ విజయాలతో...
అమ్మ నుంచి చందమామ కథలే కాదు స్ఫూర్తిదాయక విజయాలు ఎన్నో విన్నది ప్రియా నాయర్. మేనేజ్మెంట్ ట్రైనీగా దిగ్గజ కంపెనీలోకి అడుగు పెట్టిన ప్రియా నాయర్ తన కృషితో ఉన్నతస్థాయికి ఎదిగింది, కార్పొరేట్ ప్రపంచంలో విశేషమైన పేరు తెచ్చుకుంది. తాజాగా... బ్రిటిష్ మల్టీనేషనల్ కంపెనీ యూనిలీవర్లోని టాప్ టీమ్ యూనిలీవర్ లీడర్షిప్ ఎగ్జిక్యూటివ్ (యుఎల్ఈ)లో ఒకరిగా, ప్రెసిడెంట్ ఆఫ్ ‘బ్యూటీ అండ్ వెల్బీయింగ్’గా ప్రియా నాయర్ నియామకం జరిగింది. ‘మీ రోల్ మోడల్ ఎవరు?’ అంటే మరో మాటకు తావు లేకుండా ప్రియా నాయర్ టక్కున చెప్పే మాట...‘మా అమ్మ’ డెబ్బై ఏడేళ్ల వయసులోనూ ముంబైలో వైద్యవృత్తిలో బిజీ బిజీగా ఉండేది. అట్టడుగు వర్గాల ప్రజలకు ఉచితవైద్యం అందించేది. ఇక కోవిడ్ సమయంలో ఆమె చేసిన వైద్యసేవలు అపారం. దురదృష్టవశాత్తు ఆమె కోవిడ్ బారిన పడింది. అదృష్టవశాత్తు అందులో నుంచి బయటపడింది. ‘పవర్ ఆఫ్ పర్పస్’ అంటే ఏమిటో తల్లి నుంచే నేర్చుకుంది ప్రియ. ‘మన ఉద్దేశం స్వచ్ఛమైనది అయితే అస్థిరత, అనిశ్చితిని అధిగమించే శక్తి దరి చేరుతుందని, ఆశావాదం మనతోనే ఉంటుందని అమ్మ నుంచి నేర్చుకున్నాను. కార్పొరేట్ జీవితంలో ఇది నాకు ఎంతగానో ఉపయోగపడింది’ అంటుంది ప్రియ. తల్లి నుంచి ఆమె నేర్చుకున్న మరో పాఠం... నిరంతరం నేర్చుకోవడం. ప్రియ తల్లి ఎప్పుడూ ఏదో ఒక సెమినార్‌కు హాజరవుతూ ఉండేది. పుస్తకాలు చదువుతూ ఉండేది. వైద్యరంగంలో వస్తున్న సాంకేతికత గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నోట్స్ రాసుకుంటూ ఉండేది. ‘క్షణం తీరిక లేని ఈ ఉరుకుల, పరుగుల కాలంలో నిరంతరం నేర్చుకోవడం అనేది కుదిరేది కాదు అనే అభిప్రాయాన్ని అమ్మ మార్చేసింది. వృత్తిరీత్యా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఎప్పుడూ ఏదో కొత్త విషయం నేర్చుకుంటూ ఉండేది’ అంటుంది ప్రియ. తల్లి నుంచి స్ఫూర్తి పొందిన ప్రియా నాయర్ హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ ప్రోగ్రామ్‌కు హాజరైంది. తనకు తిరిగి స్కూల్‌కు వెళ్లినట్లుగా అనిపించింది. ‘కార్పొరేట్ రంగంలో పాతిక సంవత్సరాల అనుభవం ఉన్న నాకు ఇది అవసరం లేదు’ అని అనుకోలేదు ప్రియా నాయర్. అక్కడ నేర్చుకున్న పాఠాలు ఆ తరువాత కాలంలో తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసినప్పుడు వినియోగదారుల ఆలోచనలపై దృష్టి పెట్టి మార్కెటింగ్ వ్యూహాలను ఎప్పటికప్పుడూ మారుస్తూ వచ్చింది. ఫలానా ప్రాడక్ట్‌కు మార్కెట్ లేదు... అనుకున్న చోట కూడా తన వ్యూహాలతో మార్కెట్‌ను సృష్టించేది. ప్రచారంలో కూడా ప్రత్యేకత కనిపించడానికి ప్రాధాన్యత ఇస్తుంది. అందులో సామాజిక సందేశం కూడా కనిపిస్తుంది. మనకు ఓటమి అంటే భయం, చిరాకు, కోపం. పిల్లల ఓటమిని తల్లిదండ్రులు తట్టుకోలేరు. పిల్లలకు విజయం అనేది అతి పెద్ద సవాలు. ‘నువ్వు ఓడిపోతే ప్రళయం ఏమీ రాదు. గెలుపులాగే ఓటమి అనేది సహజమైనది. ఓటమి నుంచి నేర్చుకునే పాఠాలు విలువైనవి’ అనే భావనతో సంస్థ తరఫున క్యాంపెయిన్‌ను నిర్వహించింది ప్రియ. కోవిడ్ సమయంలో హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్)లో పెద్ద విభాగమైన ‘బ్యూటీ అండ్ పర్సనల్ కేర్’ బాధ్యతల్లోకి వచ్చింది ప్రియ. కేవలం 30 రోజుల్లోనే తమ హైజీన్ బ్రాండ్‌లో కొత్తగా పదిహేను వేరియేషన్స్ తీసుకువచ్చింది. అందులో ఒకటైన హ్యాండ్ శానిటైజర్ మన దేశంలోని ‘లార్జెస్ట్ సెల్లింగ్ హ్యాండ్ శానిటైర్ బ్రాండ్’గా నిలిచింది. మేనేజ్మెంట్ ట్రైనీగా ‘హెచ్‌యుఎల్’లోకి అడుగుపెట్టిన ప్రియా నాయర్ అడుగడుగునా పాఠాలు నేర్చుకుంది. ఎన్నో హోదాల్లో పనిచేసింది. ప్రతి హోదాలో తనదైన ప్రత్యేకత నిలుపుకుంది. ‘ఏ పని అయినా సరే యాంత్రికంగా ఎప్పుడూ చేయవద్దు. మనసు పెట్టి చేయాలి’ అని తన చిన్నప్పుడు ఎప్పుడో ప్రియకు అమ్మ చెప్పింది. అందకే ప్రియా నాయర్ ఏ హోదాలో పని చేసినా మనసు పెట్టి చేసింది. చేసే పనికి ఎప్పటికప్పుడు సృజనాత్మకమైన ఆలోచనలు జోడించింది. ఫలితం వృథా పోలేదని ఆమె విజయప్రస్థానం నిరూపించింది. -
దేశీ మార్కెట్‌పై గ్లోబల్ దిగ్గజాల కన్ను
ముంబై: కన్జూమర్ ప్రొడక్టుల గ్లోబల్ దిగ్గజాలు దేశీ వినియోగ మార్కెట్‌పై సానుకూలంగా స్పందిస్తున్నాయి. ప్రధానంగా పెప్సీకో, కోకకోలా, మాండెలెజ్ యూనిలీవర్, లారియల్ దేశీయంగా పటిష్ట అమ్మకాలు సాధించాలని ప్రణాళికలు వేస్తున్నాయి. ఇందుకు దేశీ ఆర్థిక వృద్ధి పరిస్థితులు సహకరించనున్నట్లు పేర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ పరిస్థితులకుతోడు, స్థూల ఆర్థిక వాతావరణం అనిశ్చింతగా ఉన్నప్పటికీ ఇండియా గ్రోత్ స్టోరీ పలు అవకాశాలను కల్పించనున్నట్లు అంచనా వేస్తున్నాయి. గత కేలండర్ ఏడాది(2022)లో పటిష్ట అమ్మకాలు సాధించడంతో ఈ ఏడాది(2023)లోనూ మరింత మెరుగైన పనితీరును సాధించాలని ఆశిస్తున్నాయి. 2022 ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తూ కన్జూమర్ ప్రొడక్ట్ దిగ్గజాలు పలు అంచనాలను ప్రకటించాయి. మార్కెట్‌ను మించుతూ సౌందర్య కేంద్రంగా ఆవిర్భవించే బాటలో భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నట్లు కాస్మెటిక్ ప్రొడక్టుల దిగ్గజం లారియల్ పేర్కొంది. గతేడాది పటిష్ట అమ్మకాలు సాధించామని, మార్కెట్‌ను మించి రెండు రెట్లు వృద్ధిని అందుకున్నట్లు తెలియజేసింది. ఇండియా తమకు అత్యంత ప్రాధాన్యతగల మార్కెట్ అని పేర్కొంటూ భారీ లక్ష్యాలతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించింది. గణాంకాల ప్రకారం చూస్తే 2030కల్లా ఇండియా ప్రపంచ జనాభాలో 20 శాతం వాటా, నైపుణ్యంగల సిబ్బందిలో 30 శాతం వాటాను ఆక్రమించుకోనున్నట్లు అభిప్రాయపడింది. వెరసి కంపెనీ వృద్ధికి దేశీ మార్కెట్ కీలకంగా నిలవనున్నట్లు తెలియజేసింది. పానీయాలకు భళా 2022కు పానీయాల అమ్మకాల్లో ఇండియా మార్కెట్ అత్యుత్తమంగా నిలిచినట్లు కోకకోలా చైర్మన్, సీఈవో జేమ్స్ క్విన్సీ పేర్కొన్నారు. పానీయాల విభాగంలో ఇండియా మార్కెట్ అత్యంత భారీగా విస్తరించే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో పలు అవకాశాలకు తెరలేవనున్నట్లు తెలియజేశారు. బెవరేజెస్ వినియోగంలో దీర్ఘకాలిక మార్కెట్‌గా నిలవనున్నదని, ఇకపై మరింత వృద్ధికి వీలున్నదని అంచనా వేశారు. వినియోగ రంగంలో 2022లో దేశీయంగా విస్తారమైన వృద్ధి నమోదైనట్లు యూనిలీవర్ పేర్కొంది. పోటీతత్వం, విభిన్న బ్రాండ్లు, ధరల పోర్ట్‌ఫోలియో ద్వారా వినియోగదారులను ఆకట్టుకున్నట్లు వివరించింది. గ్రామీణ ప్రాంతాలకుమించి పట్టణాలలో విక్రయాలు ఊపందుకున్నట్లు కంపెనీ సీఈవో అలెన్ జోప్ వెల్లడించారు. ఇకపైన సైతం మార్కెట్‌ను మించిన వృద్ధిని అందుకోగలమని భావిస్తున్నట్లు తెలియజేశారు. రెండంకెల వృద్ధి 2022లో దేశీయంగా రెండంకెల వృద్ధిని అందుకున్నట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజం మాండెలెజ్ తెలియజేసింది. ప్రధానంగా చాకొలెట్లు, బిస్కట్లతోకూడిన పోర్ట్‌ఫోలియో జోరు చూపినట్లు పేర్కొంది. గతేడాది ఇండియా, బ్రెజిల్ మార్కెట్లలో అత్యధిక స్థాయిలో అమ్మకాలు సాధించినట్లు వెల్లడించింది. ఇక బెవరేజెస్ దిగ్గజం పెప్సీకో సైతం దేశీయ మార్కెట్లో గతేడాది అత్యంత పటిష్ట వృద్ధిని సాధించినట్లు తెలియజేసింది. పానీయాలతోపాటు.. స్నాక్స్ అమ్మకాల ద్వారా మార్కెట్ వాటాను పెంచుకున్నట్లు వెల్లడించింది. -
లీనా నాయర్: సమానంగా చూడండి చాలు
ఆమె మహిళ అనో .. సపోర్ట్ లేదనో.. పని మెల్లిగా నేర్చుకుంటుందో... మైనారిటీ వర్గమనో.. సానుభూతి చూపారంటే.. దానినే సవాల్‌గా తీసుకొని మరింత శక్తిమంతంగా ఎదగాలని తన జీవితాన్ని ఉదాహరణగా చూపుతుంది లీనా నాయర్. లీనా నాయర్ బ్రిటిష్ ఇండియన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌గా అంచెలంచెలుగా ఎదిగిన శక్తి. 30 సంవత్సరాల పాటు ఉద్యోగ నిర్వహణలో ఎన్నో క్రియాశీలక పదవులను చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యునిలీవర్ కంపెనీని జెండర్ బ్యాలెన్స్డ్ కంపెనీగా నిలబెట్టింది. వరల్డ్ వైడ్ లగ్జరీ బ్రాండ్ చానెల్ సీఈవోగా ఉన్న లీనా పుట్టి పెరిగింది మహారాష్ట్రలో. ఇప్పుడు వందకుపైగా దేశాల్లో లక్షలాది మంది ఉద్యోగుల బాధ్యతను సమర్థవంతంగా నడిపిస్తూ మహిళాశక్తిని ఈ తరానికి చాటుతోంది. ► జెండర్ బ్యాలెన్స్.. ఫ్రెంచ్ లగ్జరీ హౌజ్ కోకో చానెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఈ ఏడాది జనవరి నుంచి దిగ్విజయంగా విధులను నిర్వర్తిస్తోంది లీనా నాయర్. అంతకుముందు యూనిలీవర్‌కు నాయకత్వం వహించారు. వందకు పైగా దేశాలలో సుమారు లక్షా యాభై వేల మంది బాధ్యత ఆమె మీద ఉంది. 1990 మొదట్లో నాయర్ జంషెడ్‌పూర్‌లోని హిందూస్థాన్ యూనిలీవర్లో మేనేజ్మెంట్ ట్రైనీగా చేరినప్పుడు, ఆ కంపెనీ ఉద్యోగుల్లో కేవలం రెండు శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. ఆమె కిందటేడాది బయటకు వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్త కంపెనీ నిర్వహణలో లింగ సమతుల్యత ఉందని ప్రకటించింది. అంటే, నాయర్ తనదైన ముద్ర ఏ స్థాయిలో ఆ కంపెనీలో వేసిందనేది స్పష్టం అవుతుంది. ► లగ్జరీ మార్కెట్.. ఫ్యాషన్ దిగ్గజంగా కోకో చానెల్ కంపెనీకి 112 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. లగ్జరీ కన్జ్యూమర్ గూడ్స్ మార్కెటోకి దూసుకెళ్లేలా చేసిన మొదటి వ్యక్తి నాయర్ ఏమీ కాదు. అంతకుముందు అనుభవజ్ఞుడైన ఆంటోనియా బెల్లోని ఉన్నాడు. ఇప్పుడు అతను మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. అతనితో పాటు మరికొంత నిష్ణాతులైన వ్యక్తులు ఈ నిచ్చెన మీద ఇప్పటికే ఉన్నారు. అంటే, వారందరి మధ్య నాయర్‌కి ఆ పదవిని కట్టపెట్టారంటే ఆమె శక్తి సామాన్యమైనది కాదనేది స్పష్టం అవుతుంది. అంతేకాదు, ఆ పదవి ఆమెకు మరింత సవాల్‌తో కూడుకున్నదన్నమాటే. 53 ఏళ్ల వయసులో ఆమె ఈ ఘనత వహించిన కంపెనీని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి సర్వసిద్ధంగా ఉందన్నమాట. ఆమెకు ఇదేమీ కొత్తగాకాదు. ప్రపంచవ్యాప్త యునిలీవర్‌లో 30 సంవత్సరాలు పనిచేసిన మొదటి ఆసియా, మొదటి మహిళ, అతి పిన్న వయస్కురాలు.. అనే రికార్డు ఆమె ఖాతాలో ఉంది. ఆంగ్లో–డచ్ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీలో ఫ్యాక్టరీ ఫ్లోర్ లెవెల్ మేనేజర్‌గా అంతస్తులో పనిచేసిన మొదటి మహిళ, నైట్ షిఫ్ట్‌లో పనిచేసిన మొదటి మహిళగానూ నాయర్‌కు పేరుంది. ► ప్రతిరోజూ సవాల్.. ‘లీనా తను ఏ పని చేసినా దానికో గొప్ప విలువ ఇస్తుంది. ఏ పాత్ర పోషించినా అందుకు తగిన శక్తి సామర్థ్యాలను చూపడంలో దిట్ట. అందుకే ఆమెకు అంతటా అత్యంత గౌరవం. ఆమె తన కొత్త పాత్రలో రాణిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని కోకో చానెల్‌కు ఎంపికైన సందర్భంలో యునిలీవర్ మాజీ చైర్మన్ దాడి సేత్ ఆమె గురించి గొప్పగా చెప్పారు. కిందటేడాది డిసెంబర్లో నాయర్‌ను సీఇవోగా నియమించాలని చానెల్ తన నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు, ఇది పరిశ్రమకే వైవిధ్యమైన మైలురాయిగా అంతా ప్రశంసించారు. ‘నా కెరీర్ ప్రారంభ రోజుల్లో కాలేజీల్లోనూ, కంపెనీల్లోనూ ఒక మహిళగా నా స్థానం ఉండేది. ఉన్నతస్థాయిని సాధించడానికి ప్రతిరోజూ సవాల్‌గా ఉండేది. నామీద ఎవరికైనా సానుభూతి ఉంది అంటే నాకు నేనే అట్టడుగున ఉన్నట్టు అనిపించేది. దానిని నేను చాలా వ్యక్తిగతంగా తీసుకునేదాన్ని. అందుకే, నన్ను నేను ఉన్నతంగా మలుచుకోవడానికి ఇప్పటికీ ప్రతిరోజూ ప్రయత్నిస్తుంటాను’ అని సవినయంగా చెబుతారు నాయర్. బహుశా అందుకే ఆమె ఎదుగుదల ఈ రీతిలో సాధ్యమైందేమో! ► చిన్న పట్టణం నుంచి ... మహారాష్ట్రలోని చిన్న పట్టణమైన కొల్హాపూర్‌లో జన్మించిన నాయర్, ఎలక్ట్రానిక్స్, టెలి కమ్యూనికేషన్ లో ఇంజినీరింగ్ చేసింది. కాలేజీ పూర్తయిన రోజుల్లో ఒక రోజు కాలేజీ ప్రొఫెసర్ ఆమెను కూర్చోబెట్టి ‘నీవు ఇప్పటికి ఒక అందమైన ఇంజినీర్వే. కానీ, విధి నిర్వహణలో సత్తా చూపగల నైపుణ్యం కలిగి ఉన్నావని భావిస్తున్నాను’ అని చెప్పారట. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో వివరిస్తుంది నాయర్. ఆ తర్వాత పట్టుదలతో ఎంబీయేలో గోల్డ్‌మెడల్ సాధించింది. హిందూస్థాన్ యూనిలీవర్ ఎంపిక చేసుకున్న 15 వేల మంది మగవారిలో అతి కొద్దిమంది స్త్రీలలో ఒకరిగా నాయర్ ట్రైనీగా చేరింది. -
డవ్ షాంపూ వాడే వాళ్ళకి షాక్... రీకాల్ చేసిన కంపెనీ
-
అలర్ట్: పాపులర్ డవ్, ఇతర షాంపూల్లో కేన్సర్ కారక కెమికల్స్,రీకాల్
సాక్షి,ముంబై: ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ యూనీ లీవర్ తన వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. డవ్, ట్రెస్మే, నెక్సస్, సువేవ్, టిగీ లాంటి షాంపూల్లో కేన్సర్ కారక కెమికల్ ఉన్నట్టు గుర్తించిన కారణంగా వాటిని భారీ ఎత్తున రీకాల్ చేసింది. ఈ నేపథ్యంలో కలుషితమైన ఏరోసోల్ డ్రై షాంపూ ఉత్పత్తుల వినియోగాన్ని నిలిపి వేయాలని వినియోగదారులకు కంపెనీ సూచించింది. వీటిని వినియోగించడం ప్రమాదమంటూ హెచ్చరిక జారీ చేసింది. యూనిలీవర్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెబ్సైట్లో రీకాల్ వివరాలను అక్టోబర్ 18న ప్రకటించింది. రీకాల్ చేసిన వాటిల్లో అక్టోబరు 2021కి ముందు తయారు చేసిన డ్రై షాంపూ ఏరోసోల్ ఉత్పత్తులున్నాయని యునిలీవర్ తన నివేదికలో తెలిపింది. తమ అంతర్గత పరిశోధనలో ఏరోసోల్స్ ప్రొపెల్లెంట్ కేన్సర్ కారకం బెంజీన్కు మూలమని కనుగొన్నట్లు తెలిపింది. వీటి వాడకంతో బెంజీన్ స్థాయిలు పెరిగే అవకాశం ఉన్నందున అమెరికాలో పంపిణీ చేసిన ఉత్పత్తులు అన్నింటినీ రీకాల్ చేశామనీ, ఆయా ఉత్పత్తులను షెల్ఫ్‌ల నుండి తీసివేయమని రిటైలర్లను కోరింది. కాగా బెంజీన్ అధిక స్థాయిలోశరీరంలో చేరితే లుకేమియా, ప్రాణాంతక రక్త రుగ్మతలు, బోన్ మారో క్యాన్సర్ వంటి క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే స్ప్రై ఆన్ డ్రై షాంపూలలో ప్రమాదకరమైన కలుషితాలను గుర్తించడం ఇదే మొదటి సారి కాదు. తాజా పరిణామంతో వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులలో ఏరోసోల్‌ల భద్రత మరోసారి ప్రశ్నార్థకమైంది. గత ఏడాదిన్నర కాలంలో, జాన్సన్ అండ్ జాన్సన్స్ న్యూట్రోజెనా, ఎడ్జ్‌వెల్ పర్సనల్ కేర్ కంపెనీకి చెందిన బనానా బోట్ లాంటి ఉత్పత్తులను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నాయి.అలాగే ప్రోక్టర్ అండ్ గాంబుల్ స్ప్రే-ఆన్ యాంటీ పెర్స్పిరెంట్‌లు సీక్రెట్ అండ్ ఓల్డ్ స్పైస్, యూనిలివర్స్ సువేవ్ లాంటి ఉత్పత్తులలో బెజీన్ కనుగొనడం, రీకాల్ చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. -
ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన యూనిలీవర్ కంపెనీ..!
ప్రముఖ కన్దూమర్ గూడ్స్ కంపెనీ యూనిలివర్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. 1500 మంది మేనేజ్మెంట్ సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల చేపట్టిన టేకోవర్ బిడ్ విఫలమైన తర్వాత వాటాదారుల్లో నెలకొన్న ఆందోళనలను తగ్గించే క్రమంలో ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మాగ్నమ్ ఐస్ క్రీమ్, డోవ్ సబ్బు తయారీదారు ఔషధ కంపెనీలైన గ్లాక్సోస్మిత్ క్లైన్, ఫైజర్ యాజమాన్యంలోని వినియోగదారుల ఆరోగ్య సంరక్షణ యూనిట్ కోసం £50-బిలియన్ ($68 బిలియన్) విలువ బిడ్ దాఖలు చేసింది. ఇప్పుడు టేకోవర్ బిడ్ విఫలం కావడంతో ఈ ప్రకటన చేసింది ఈ యూనిలీవర్ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 1,49,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా కంపెనీ ప్రధానంగా బ్యూటీ, వెల్జీయింగ్, పర్సనల్ కేర్, హోం కేర్, న్యూట్రిషన్, ఐస్ క్రీమ్ అనే ఐదు విభిన్న విభాగాలపై దృష్టిసారించాలని యూనిలీవర్ యోచించింది. ఇటీవల టేకోవర్ విఫలమైన తర్వాత పెట్టుబడిదారుల నుంచి విమర్శలను ఎదుర్కొన్న చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలాన్ జోప్ ఇలా అన్నారు.. "వృద్ధి మా మొదటి ప్రాధాన్యతగా ఉంది. ఈ మార్పులు ఈ అన్వేషణకు మద్దతు ఇస్తాయి" అని పేర్కొన్నారు. ఈ రంగాలపై ప్రత్యేక ఫోకస్‌ను కేంద్రీకరించడం ద్వారా మెరుగైన డెలివరీ జవాబుదారీతనం పెంపొందేలా చర్యలు చేపడతామని అలన్ జోప్ అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి పోతోంది అంటూ ఆర్థిక వేత్తలు చెప్పడంతో ఎఫ్ఎంసీజీ కంపెనీలు ముఖ్యమైన వస్తువుల ధరల పెంచుకుంటూ పోయాయి. దీని ఎఫెక్ట్ మూడు నెలల వ్యవధిలోనే ఎఫ్‌ఎంసీజీలపై పడింది. ఆ ప్రభావం యూనిలీవర్ మీద కూడా పడింది. ఒక్కసారిగా ధరలు పెరిగిపోవడంతో ప్రజలు ఆయా వస్తువులను పొదుపుగా ఉపయోగిస్తున్నారు. నీల్సన్ సర్వే తాజా ఇదే విషయాన్ని పట్టి చూపుతోంది. 2021 అక్టోబరు నుంచి డిసెంబరు వరకు వెల్లడించిన వివరాల్లో ఎఫ్ఎంసీజీల అమ్మకాల వాల్యూమ్స్‌లో 1.8 శాతం క్షీణత నమోదు అయినట్టు వెల్లడించింది. (చదవండి: ఆన్లైన్లో వైరలవుతోన్న అనిల్ అంబానీ కుమారుడి ప్రి వెడ్డింగ్ ఫొటోస్..!) -
Leena Nair: ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌస్ ‘షునల్’ గ్లోబల్ సీఈవోగా భారత సంతతి మహిళ
ప్రపంచ మార్కెట్లో భారత ప్రతిభ ప్రభ వెలిగిపోతుంది. ట్విట్టర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ నియమితుడైన మరికొన్ని రోజుల్లో మరో అంతర్జాతీయ సంస్థకు సీఈవోగా పని చేసే అవకాశం ప్రవాస భారతీయులకు దక్కింది. లండన్‌లో నివసిస్తున్న ఎన్నారై లీనా నాయర్ ప్రఖ్యాత ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌజ్ షునల్‌కి గ్లోబల్ సీఈవోగా నియమితులయ్యారు. 2022 జనవరిలో ఆమె ఈ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. లీనా నాయర్ ప్రస్తుతం యూనిలీవర్ సంస్థలో చీఫ్ హుమన్ రిసోర్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన యూనిలీవర్ గ్రూపులో ఈ స్థాయికి చేరుకున్న మొదటి ఆసియన్ మహిళ ఆమే కావడం గమనార్హం. 1992లో యూనిలీవర్లో ఫ్యాక్టరీ ఫ్లోర్ ట్రైనీగా జాయిన్ అయిన లీనా నాయర్ అంచెలంచెలుగా ఎదుగుతూ సీహెచ్ఆర్ఓ స్థాయికి చేరుకున్నారు. ఇండియాలోని జంషెడ్‌పూర్‌లో లీనా నాయర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత యూనిలీవర్లో చేరి నిర్విరామంగా 30 ఏళ్ల పాటు ఆ సంస్థలోనే పని చేస్తూ ఉన్నత స్థానానికి చేరుకున్నారు. సీహెచ్‌ఆర్‌వోగా సుమారు 1.50ల మంది ఉద్యోగుల బాధ్యతలను ఆమె నిర్వర్తించారు. ఆమె ప్రతిభను గుర్తించిన ఫ్యాషన్ కంపెనీ షునల్ మరింత ఉన్నత బాధ్యతలను అప్పగించింది. లీనా నాయర్‌కి బ్రిటన్ పౌరసత్వం కూడా ఉంది. ఫ్యాషన్ ప్రపంచానికి కేరాఫ్ అడ్రస్ ఫ్రాన్స్. అక్కడ షునల్ సంస్థను 1910లో స్థాపించారు. మహిళలకు సంబంధించి రెడీ టూ వేర్, యాక్సెసరీస్ అమ్మే వ్యాపారంలోకి వచ్చిన షునల్ అనతి కాలంలోనే ఫ్యాషన్ ప్రపంచంలో కీలకంగా మారింది. 2019 లెక్కల ప్రకారం ఈ కంపెనీ రెవెన్యూ 11 బిలియన్ డాలర్లు ఉండగా నెట్ ఇన్‌కం 2.14 బిలియన్ డాలర్లుగా తేలింది. చదవండి: భారతీయ అమెరికన్‌కి వైట్ హౌజ్‌లో కీలక పదవి ! -
లిప్టన్ గ్లోబల్ టీ వ్యాపారాన్ని వేల కోట్లకు అమ్మేసిన యూనిలీవర్ పిఎల్సీ
ప్రముఖ బ్రిటిష్ కంపెనీ యూనిలీవర్ పిఎల్సీ తన గ్లోబల్ టీ వ్యాపారాన్ని సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ కు 4.5 బిలియన్ యూరోలకు(సుమారు రూ.37 వేల కోట్లు) విక్రయించడానికి అంగీకరించింది. రెండు సంవత్సరాలకు పైగా సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. లిప్టన్, పిజి టిప్స్, పుక్కా హెర్బ్స్, టిఏజెడ్ఒతో సహా వంటి 34 టీ బ్రాండ్లు ఎకాటెర్రా కింద ఉన్నాయి. ఈ కంపెనీ 2020లో 2 బిలియన్ యూరోల ఆదాయాన్ని ఉత్పత్తి చేసింది. అయితే, యూనిలీవర్ తన భారతదేశం, ఇండోనేషియా టీ కార్యకలాపాలను అలాగే పెప్సికో(పెప్) కింద ఉంచుకుంది. 2022 ద్వితీయార్ధంలో ముగిసే ఈ ప్రక్రియలో నగదు, రుణ రహిత ప్రాతిపదికన ఎకాటెర్రాను సీవీసీ క్యాపిటల్ ఫండ్ కు విక్రయించనున్నట్లు యూనిలీవర్ గురువారం మధ్యాహ్నం ఒక ప్రకటనలో తెలిపింది. బ్లాక్ టీ డిమాండ్ క్షీణించడం, వినియోగదారుల అభిరుచులు మారడంతో అనేక సంవత్సరాలుగా నష్టాలు వస్తున్న వ్యాపారం నుంచి యూనిలీవర్ కు ఉపశమనం లభిస్తుంది. ఈ వ్యాపారం వల్ల మొత్తం కంపెనీ మీద ప్రభావం పడుతుంది. పెరిగి పోతున్న ఖర్చుల నుంచి తప్పించుకోవడానికి కష్టపడుతోంది, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఇదే అతిపెద్ద ఆదాయ వనరు. (చదవండి: లక్ష పెట్టుబడితో 6 నెలల్లో రూ.60 లక్షలు సంపాదించిన మదుపరులు!) -
ఫేస్‌బుక్‌కు దిగ్గజ కంపెనీల దెబ్బ
వివాదాస్పద సందేశాలు, రాతల(హేట్ స్పీచ్)ను కట్టడి చేయడంలో తగిన విధంగా స్పందించడంలేదంటూ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌పై తాజాగా ఎఫ్ఎంసీజీ దిగ్గజం యూనిలీవర్, టెలికం దిగ్గజం వెరిజాన్ ధ్వజమెత్తాయి. ఇందుకు అనుగుణంగా ఫేస్బుక్లో ప్రకటనలను నిలిపివేసేందుకు నిర్ణయించాయి. ఇదే అంశంపై పానీయాల దిగ్గజం కోక కోలా సైతం నెల రోజులపాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో యాడ్స్ ఇవ్వడం నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. హోండా మోటార్ కంపెనీ(యూఎస్ యూనిట్), చాకొలెట్ల సంస్థ హెర్షీ కో సైతం ఇదే స్థాయిలో స్పందించనున్నట్లు పేర్కొన్నాయి. పలు ఇతర కంపెనీలు సైతం ఈ బాటలో నడిచే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. హేట్ స్పీచ్‌లను సమర్ధవంతంగా నియంత్రించడంలేదంటూ కొంతకాలంగా ఫేస్‌బుక్‌పై అమెరికాలో విమర్శలు అధికమైనట్లు పేర్కొన్నారు. షేరు పతనం యూనిలీవర్, వెరిజాన్ ప్రకటనలతో వారాంతాన ఫేస్బుక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఫలితంగా సోషల్ మీడియా దిగ్గజం షేరు 8.5 శాతం పడిపోయి రూ. 216 డాలర్ల వద్ద ముగిసింది. వెరసి కంపెనీ మార్కెట్ క్యాపిలైజేషన్(విలువ)లో 56 బిలియన్ డాలర్లమేర(సుమారు రూ. 4,20,000 కోట్లు) ఆవిరైంది. కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు 616 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రకటనలు, కంటెంట్ విధానాలలో ఇటీవల స్వల్ప మార్పులను చేపట్టినట్లు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ గత వారం తమ కంపెనీ ఉద్యోగులకు తెలియజేశారు. అయితే ఈ మార్పులు విమర్శకులను మెప్పించలేకపోయినట్లు పరిశ్రమవర్గాలు వ్యాఖ్యానించాయి. ఈ మార్పులు చెప్పుకోదగ్గవి కాదంటూ పౌరహక్కుల సంఘాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా.. కంపెనీపై ఇప్పటికే కొన్ని అంశాలపై యాంటీట్రస్ట్ దర్యాప్తులు జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాయి. 23 శాతం వాటా మొత్తం యూఎస్‌లోని డిజిటల్ ప్రకటనల మార్కెట్లో ఫేస్బుక్ సుమారు 23 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు ఈమార్కెటర్ నిపుణులు పేర్కొంటున్నారు. అన్ని ప్రాపర్టీస్ ద్వారా ఫేస్బుక్ 3 బిలియన్లమంది యూజర్లను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. 2019లో కంపెనీ డిజిటల్ ప్రకటనల ఆదాయం 27 శాతం పుంజుకుని దాదాపు 70 బిలియన్ డాలర్లకు చేరినట్లు తెలుస్తోంది. కాగా.. హేట్ స్పీచ్‌లను గుర్తించి, తొలగించేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌ను మరింత అభివృద్ధి చేసినట్లు కంపెనీ అధికారి కరోలిన్ ఎవర్సన్ వివరించారు.ఈ అంశాన్ని ప్రకటనల భాగస్వామ్య సంస్థలకు ఈమెయిల్ ద్వారా తెలియజేసినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలియజేశారు. -
53 వేల కోట్లు నష్టపోయిన జుకర్‌బర్గ్
వాషింగ్టన్: నకిలీ వార్తలు, విద్వేషపూరిత పోస్టుల కట్టడికి సరైన చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో పలు కంపెనీలు ఫేస్‌బుక్‌కు ఇస్తున్న యాడ్స్‌ను నిలిపేశాయి. దీంతో 53 వేల కోట్ల రూపాయల ఫేస్బుక్ సంపద ఒక్క రోజులోనే ఆవిరయ్యింది. (భారత్‌లో గూగుల్ పే బ్యాన్? ఎన్పీసీఐ క్లారిటీ) ఆ సంస్థ షేర్ విలువ శుక్రవారం దాదాపు 8.3 శాతం పతనమైంది. యూనిలీవర్ తో పాటు వెరిజోన్ కమ్యూనికేషన్స్, హెర్షీస్ తదితర సంస్థలు ఫేస్బుక్ ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇకపై ఆ సంస్థకు యాడ్స్ ఇవ్వబోమని ప్రకటించాయి. మరో అంతర్జాతీయ సంస్థ కొకాకోలా నెల రోజుల పాటు సోషల్ మీడియా సంస్థలకు ఇస్తున్న యాడ్స్‌ను నిలిపేస్తున్నట్లు పేర్కొంది. (యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ డౌన్‌గ్రేడ్) దీంతో ఫేక్ న్యూస్ పై సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ స్పందించారు. అన్ని రకాల ఓటింగ్ సంబంధిత పోస్టులకు కొత్త ఓటరు సమాచారం అనే లింకును జోడిస్తామని చెప్పారు. విద్వేషపూరిత వ్యాఖ్యల పరిధిని సైతం పెంచుతున్నట్లు వెల్లడించారు. ఇకపై రాజకీయ నాయకులు కూడా వీటి నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. -
కోల్గేట్, ప్యాంటీన్, నెస్లేలకు బ్యాడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురు, ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి సహ-వ్యవస్థాపకుడు రాందేవ్ విదేశీ ఎఫ్ఎంసీజీ కంపెనీలపై మరోసారి ధ్వజమెత్తారు. విదేశీ ఫాస్ట్ మూవింగ్ కన్జుమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) దిగ్గజ కంపెనీల కథ త్వరలోనే ముగియనుందంటూ జోస్యం చెప్పారు. యునీలీవర్, కోల్గేట్, పాంటీన్, నెస్లే వంటి అగ్రగామి సంస్థలపై బహిరంగంగానే టార్గెట్ చేసిన రాందేవ్ భారతదేశంలో పోటీ తీవ్రంగా సాగుతోంది. ఇక కంపెనీల ఆట కట్టేనని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఈ కంపెనీలు స్వర్గానికి పోవడం ఖాయమని పేర్కొన్నారు. దీనికోసం ఎంతో కాలం ఎదురు చూడాల్సిన అవసరం లేదని కేవలం కొద్ది సమయం మాత్రమే మిగిలివుందన్నారు. మనిషి 100 సంవత్సరాల్లో స్వర్గానికి చేరతాడు. ఈ కంపెనీలు కేవలం మరో రెండు రోజుల్లో సమసిపోనున్నాయని తెలిపారు. ఇప్పటికే తమ రాకతో ఈ కంపెనీలు శీర్షాసనం (తల్లకిందులు) వేశాయని, మరో రెండు రోజుల్లో ఇక మోక్షమేనంటూ తనదైన యోగా భాషలో చెప్పుకొచ్చారు. ‘‘ప్యాంటీన్ ప్యాంట్ తడిచిపోనుంది.. కోల్గేట్ గేటు మూతపడుతుంది.. నెస్లేలో పక్షులు ఎగిరిపోతాయి’’ అన్న 2016 నాటి రాందేవ్ వ్యాఖ్యలు గురించి అడిగినప్పుడు ఆయన ఇలా స్పందించారు. కాగా ఆయుర్వేద ఉత్తత్పులతో మార్కెట్లోకి దూసుకొచ్చిన 'పతంజలి' 2018 సంవత్సరానికి 20వేలకోట్ల రూపాయలసంస్థగా అవతరించనున్నామని ఇటీవల ప్రకటించింది. అంతేకాదు ఇప్పటివరకూ ఎఫ్ఎంసీజీ మార్కెట్‌ను ఏలిన ఐటీసీ, డాబర్, హిందూస్థాన్ యూనిలీవర్, కోల్గేట్ పామోలివ్, ప్రోక్టర్ అండ్ గాంబిల్ తదితర సంస్థలకు గట్టి సవాల్ విసిరింది. అంతేకాదు రెండంకెల వృద్ధిని నమోదు చేయడం కష్టంగా మారిన తరుణంలో పతంజలి ఏకంగా మూడంకెల వృద్ధిని సాధించడం విశేషం. -
క్రాఫ్ట్ భారీ ఆఫర్... యూనిలీవర్ నో!
• 143 బిలియన్ డాలర్లు ఇస్తా్తనన్న క్రాఫ్ట్ • ఈ విలువ మాకు తగింది కాదు: లీవర్ న్యూయార్క్: అమెరికాకు చెందిన ఫుడ్, బెవరేజెస్ దిగ్గజం క్రాఫ్ట్ హీంజ్ చేసిన విలీన ప్రతిపాదనను డచ్ దిగ్గజ సంస్థ యూనిలీవర్ తిరస్కరించింది. విలీనానికి సంబంధించి క్రాఫ్ట్ తమను తగిన విధంగా విధంగా విలువ కట్టలేదని పేర్కొంది. తమ గ్రూప్ విలువతో పోలిస్తే క్రాఫ్ట్ ప్రతిపాదించిన 143 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ చాలా తక్కువని, ఈ డీల్ వల్ల షేర్హోల్డర్లలకు ఆర్థికంగా గానీ లేదా ఇతరత్రా మరే రూపంలో గానీ లాభం ఏదీ ఉండదని యూనిలీవర్ పేర్కొంది. అందుకని దీనిపై తదుపరి చర్చలు జరిగే అవకాశాలేమీ లేవని స్పష్టం చేసింది. అయితే డీల్ వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీగా యూనిలీవర్ షేర్లు కొనుగోలు చేశారు. దీంతో లండన్ ఎక్సే్చంజ్‌లో సంస్థ షేర్లు దాదాపు 12 శాతం ఎగిశాయి. ఫుడ్ అండ్ బెవరేజ్ విభాగానికి సంబంధించి క్రాఫ్ట్ హీంజ్ ప్రపంచంలోనే అయిదో అతి పెద్ద సంస్థ కాగా, ఉత్తర అమెరికాలో మూడో స్థానంలో ఉంది. డిసెంబర్‌తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు 6.86 బిలియన్ డాలర్ల మేర నమోదయ్యాయి. క్రాఫ్ట్ మార్కెట్ వేల్యుయేషన్ సుమారు 106 బిలియన్ డాలర్లుగా ఉంది. మరోవైపు డచ్ కంపెనీ అయిన యూనిలీవర్ 2016లో సుమారు 56.1 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించింది. డవ్, లిప్టన్, నార్ తదితర ప్రముఖమైన బ్రాండ్స్ 400 పైగా ఈ కంపెనీకి ఉన్నాయి. లండన్ స్టాక్ మార్కెట్లో శుక్రవారం భారీగా పెరిగాక యూని లీవర్ మార్కెట్ విలువ దాదాపు 140 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో క్రాఫ్ట్ చేసిన ప్రతిపాదన దాదాపు దీని మార్కెట్ విలువకు సమానంగా ఉన్నట్లయింది. అందుకే యూనిలీవర్ ఈ డీల్‌ను తిరస్కరించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రయత్నాలు కొనసాగిస్తాం...: క్రాఫ్ట్ యూనిలీవర్ తమ ఆఫర్‌ను తిరస్కరించినప్పటికీ మరింత ఆమోదయోగ్యమైన ఒప్పంద ప్రతిపాదనపై కసరత్తు కొనసాగించనున్నట్లు క్రాఫ్ట్ పేర్కొంది. డీల్ వార్తలతో అమెరికా మార్కెట్లో క్రాఫ్ట్ షేరు ధర ఒక దశలో 7.5 శాతం ఎగిసి 93.81 డాలర్ల వద్ద, యూనిలీవర్ 9.5 శాతం పెరిగి 46.62 డాలర్ల స్థాయి వద్ద ట్రేడయ్యాయి. ఒకవేళ విలీనం సాకారమైతే గుత్తాధిపత్య ధోరణులతో కొనుగోలుదారుల ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం పడొచ్చని, భారీ స్థాయిలో ఉద్యోగాల కోత అవకాశాల కారణంగా రాజకీయంగా ప్రకంపనలు కూడా ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
ఎయిర్ ఫ్యూరిఫయర్ వ్యాపారంలోకి యూనిలీవర్!
లండన్: ఎఫ్ఎంసీజీ దిగ్గజ కంపెనీ యూనిలీవర్ తాజాగా ఎయిర్ ఫ్యూరిఫయర్ వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నది. ఇందులో భాగంగా యూనిలీవర్ స్వీడన్‌కు చెందిన ఎయిర్ ఫ్యూరిఫికేషన్ సర్వీసులను అందించే ‘బ్లూఎయిర్’ కంపెనీని కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది. బ్లూఎయిర్.. స్టాక్‌హోమ్ కేంద్రంగా తన కార్యకలాపాలను 1996లో ప్రారంభించింది. దీని టర్నోవర్ గతేడాది 106 మిలియన్ డాలర్లుగా ఉంది. -
యునిలీవర్ పై యువతి 'ర్యాప్' పోరు
కొడైకెనాల్: డేవిడ్- గొలియాత్ల యుధ్ధం అందరికీ తెలిసిందే. భీకరమైన ఆకారం.. లక్షలాది సైన్యమున్న గొలియాత్‌ను... గొర్రెలు కాసే బాలుడు డేవిడ్.. అదికూడా విసరడంలో తనకు నైపుణ్యమున్న ఒడిశెతో నేలకూల్చుతాడు. 27 ఏళ్ల సోఫియా అష్రాఫ్ది కూడా అలాంటి పోరే. కాకుంటే శత్రువును అంతమొందించకుండా సంస్కరించే వ్యూహం. ఈ యుద్ధంలో ఆమె ఆయుధం.. ర్యాప్. ప్రఖ్యాత వేసవి విడిది కొడైకెనాల్ పట్టణం నడిబొడ్డులో కొలువైన యునిలీవర్ థర్మామీటర్ ఫ్యాక్టరీ నిత్యం వదులుతోన్న వ్యర్థాలతో పర్యావరణం కలుషితమై.. స్థానిక ప్రజలు రోగాలపాలవుతున్నారు. ఫ్యాక్టరీని తరలించాలని అక్కడి మహిళలు గతంలో చాలాసార్లు నిరసనలు చేపట్టారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే వారి నిరసనగానీ, దానికి సంబంధించిన వార్తగానీ కేవలం కొడైకెనాల్ టాబ్లాయిడ్లకే పరిమితమైంది. మరెలా? ప్రజల జీవితాలు.. ధర్మామీటర్లో ఉపయోగించే పాదరసంలో మునిగిపోవాల్సిందేనా? ప్రపంచంలోనే అతిపెద్ద ఎమ్మెన్సీల్లో ఒకటైన యునిలివర్‌కు తన తప్పును ఎత్తిచూపే మార్గమేలేదా? అనే ప్రశ్నలకు సరికొత్త పోరాటరీతిలో సమాధానమిచ్చింది సోఫియా. ' ఫెయిర్‌నెస్ కోసం ఫెయిర్ అండ్ లవ్లీ.. దంత ఆరోగ్యానికి పెప్సోడెంట్.. ఒంటి సంరక్షణకు లైఫ్ బాయ్.. అంటూ ప్రాడక్ట్ లకు ప్రచారం కల్పించుకునే మీరు (యునిలీవర్).. ఫ్యాక్టరీ వ్యర్థాలను నిలిపేయాలి. కొడైకెనాల్ ను శుభ్రం చేయాలి' అంటూ ర్యాప్ సాంగ్ పాడింది. యునిలీవర్ తక్షణమే ప్రజారోగ్య వ్యతిరేక కార్యక్రమాలకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేసింది. సోఫియా రూపొందించిన ర్యాప్ సాంగ్‌కు ఇంటర్నెట్లో విశేష స్పందన లభిస్తోంది. వరల్డ్ టాప్ ర్యాపర్లలో ఒకరైన నిక్కి మినాజ్ సైతం సోఫియా పాటకు ఫిదా అయిపోయి.. 'వావ్' అంటూ ట్వీట్ చేసింది. జులై 30న యూ ట్యూబ్‌లో అప్లోడ్ అయిన సోఫియా ర్యాప్ విడియోను ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. మీరూ వినండి.. కచ్చితంగా నచ్చుతుంది. చెన్నైకి చెందిన సోఫియా అష్రాప్.. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజాహిత కార్యక్రమాలకు ప్రచారం నిర్వహిస్తుంటారు. గతంలో భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితుల పక్షాన పోరాడారు. ఇప్పుడు కొడైకెనాల్ ధర్మామీటర్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ర్యాప్ వీడియోను రూపొందించారు. ఒకటి రెండు తమిళ సినిమాల్లోనూ సోఫియా తన గళాన్ని వినిపించారు. ఏఆర్ రహమాన్, సంతోష్ కుమార్ సంగీత దర్శకత్వంలోనూ పాడారు. -
స్మార్ట్ఫోన్ల నుంచి నోకియా బ్రాండ్ మాయం
ముంబై: నోకియా స్మార్ట్ఫోన్ల శకం ముగిసింది. కనెక్టింగ్ పీపుల్ ట్యాగ్‌తో కొన్నేళ్లపాటు మొబైల్ ఫోన్ల ప్రపంచంలో రాజ్యమేలిన నోకియా బ్రాండ్ ఇక ఫీచర్ ఫోన్లకే పరిమితం కానున్నది. నోకి యా అంటే ఒక బ్రాండ్ కాదని, అదొక సంస్కృతి అని, నిజాయితీకి నిదర్శనమని ఇప్పటికీ ఎంతో మంది విశ్వసిస్తారు. నోకియా బ్రాండ్ స్మార్ట్ఫోన్ల నుంచి నిష్ర్కమణపై ప్రత్యేక కథనం.. ప్రపంచం వేగంగా స్మార్ట్ఫోన్ల వైపు పరుగులు పెడుతోంది. ఫీచర్ ఫోన్లను, అనేక ఫీచర్లతో కూడిన స్మార్ట్ఫోన్లను కూడా అందించి ఫోన్ అంటే నోకియాగా ప్రాచుర్యం పొందిన నోకియా బ్రాండ్ స్మార్ట్ఫోన్ల నుంచి నిష్ర్కమించనున్నది. నోకియా డివైస్ల వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ కంపెనీ 750 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా మైక్రోసాఫ్ట్ కంపెనీ నోకియా లూమియా రేంజ్ ఫోన్లను మైక్రోసాఫ్ట్ లూమియాగా రీ బ్రాండ్ చేయాలని నిర్ణయించింది, దీంతో నోకియా స్మార్ట్ఫోన్ల శకం ముగిసినట్లయింది. మన్నికలో అగ్రతాంబూలం పెట్టిన ప్రతి పైసాకు తగిన విలువ కావాలనుకునే భారతీయుల వినియోగదారుల మనసులను నోకియా గెల్చుకుంది. భారతీయులు విశ్వసించదగ్గ బ్రాండ్‌గా నోకియా నిలిచిందని, ఇలా నిలవడానికి తగిన సమయంలో తగిన చర్యలు తీసుకుందని నిపుణులంటారు. రిటైలర్లు, కంటెంట్ అందించేవారు, డీలర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇలా పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి పలు ప్రయత్నాలు చేసింది. నెలకొక కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. అన్ని రంగుల్లో ఉండే స్క్రీన్ ఫోన్‌ను మొదటగా నోకియానే తెచ్చింది. వివిధ ధరల్లో ఫోన్లను అందించి, అన్ని రకాల ఆదాయ వర్గాల వారికి తగిన ఫోన్లను అందించింది. ఇక మన్నిక విషయంలో నోకియాకు తిరుగులేదు. ఎన్నిసార్లు కిందపడినా నోకియా ఫోన్లు పనిచేస్తాయనేది వినియోగదారుల అభిప్రాయం. ఇక నోకియాను కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్ బ్రాండ్ కూడా భారతీయులకు పరిచితమైన బ్రాండే. గతంలో నోకియా ప్రయారిటీగా ఉన్న స్టోర్స్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ రిటైల్ స్టోర్స్‌గా మారాయి. అయితే లూమియా ఫోన్లను ఉపయోగించేవాళ్లు ఆ ఫోన్లను మైక్రోసాఫ్ట్ లూమియా ఫోన్లుగా కాక నోకియా లూమియా ఫోన్లగానే వ్యవహరిస్తారని అంచనా. నోకియా ఈ సిరీస్, ఎన్ సిరీస్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసి, వాడిన వాళ్లు మాత్రం ఎప్పటికీ నోకియా బ్రాండ్‌ను మరచిపోలేరు. నోకియా ప్లాంట్ మూత నోకియా కంపెనీ భారత్‌లో తొలి మొబైల్ తయారీ కేంద్రాన్ని చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌లో 2009లో ప్రారంభించింది. ఇప్పటివరకూ విక్రయమైన నోకియా ఫోన్లలో 25 శాతం ఫోన్లను, (ఇది ప్రపంచంలో అమ్ముడైన 11 శాతం ఫోన్లకు సమానం) ఈ ఫ్యాక్టరీయే తయారు చేసింది. ఈ నెల 1 నుంచి ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఆగిపోయింది. ఏదీ శాశ్వతం కాదు టెక్నాలజీ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని నోకియా నిష్ర్కమణ నిరూపిస్తోంది. అయితే భవిష్యత్తులో నోకియా ప్రాభవం మరింత పెరిగినా ఆశ్చర్యం లేదని వారంటున్నారు. ఎందుకంటే నోకియా కంపెనీ హియర్ మ్యాపింగ్ డివిజన్‌ను మైక్రోసాఫ్ట్‌కు విక్రయించలేదు. మైక్రోసాఫ్ట్‌తో కుదిరిన ఒక ఒప్పందం ప్రకారం ప్రస్తుతం నోకియా కంపెనీ టెలికాం పరికరాలు, హియర్ మ్యాప్స్, టెక్నాలజీస్ వ్యాపారాలను నిర్వహిస్తోంది.