సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురు, ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి సహ-వ్యవస్థాపకుడు రాందేవ్ విదేశీ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలపై మరోసారి ధ్వజమెత్తారు. విదేశీ ఫాస్ట్ మూవింగ్ కన్జుమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) దిగ్గజ కంపెనీల కథ త్వరలోనే ముగియనుందంటూ జోస్యం చెప్పారు. యునీలీవర్, కోల్గేట్, పాంటీన్, నెస్లే వంటి అగ్రగామి సంస్థలపై బహిరంగంగానే టార్గెట్ చేసిన రాందేవ్ భారతదేశంలో పోటీ తీవ్రంగా సాగుతోంది. ఇక కంపెనీల ఆట కట్టేనని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఈ కంపెనీలు స్వర్గానికి పోవడం ఖాయమని పేర్కొన్నారు. దీనికోసం ఎంతో కాలం ఎదురు చూడాల్సిన అవసరం లేదని కేవలం కొద్ది సమయం మాత్రమే మిగిలివుందన్నారు.
మనిషి 100 సంవత్సరాల్లో స్వర్గానికి చేరతాడు. ఈ కంపెనీలు కేవలం మరో రెండు రోజుల్లో సమసిపోనున్నాయని తెలిపారు. ఇప్పటికే తమ రాకతో ఈ కంపెనీలు శీర్షాసనం (తల్లకిందులు) వేశాయని, మరో రెండు రోజుల్లో ఇక మోక్షమేనంటూ తనదైన యోగా భాషలో చెప్పుకొచ్చారు. ‘‘ప్యాంటీన్ ప్యాంట్ తడిచిపోనుంది.. కోల్‌గేట్ గేటు మూతపడుతుంది.. నెస్లేలో పక్షులు ఎగిరిపోతాయి’’ అన్న 2016 నాటి రాందేవ్ వ్యాఖ్యలు గురించి అడిగినప్పుడు ఆయన ఇలా స్పందించారు.
కాగా ఆయుర్వేద ఉత్తత్పులతో మార్కెట్లోకి దూసుకొచ్చిన 'పతంజలి' 2018 సంవత్సరానికి 20వేలకోట్ల రూపాయలసంస్థగా అవతరించనున్నామని ఇటీవల ప్రకటించింది. అంతేకాదు ఇప్పటివరకూ ఎఫ్ఎంసీజీ మార్కెట్‌ను ఏలిన ఐటీసీ, డాబర్, హిందూస్థాన్ యూనిలీవర్, కోల్గేట్ పామోలివ్, ప్రోక్టర్ అండ్ గాంబిల్ తదితర సంస్థలకు గట్టి సవాల్ విసిరింది. అంతేకాదు రెండంకెల వృద్ధిని నమోదు చేయడం కష్టంగా మారిన తరుణంలో పతంజలి ఏకంగా మూడంకెల వృద్ధిని సాధించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment