Colgate
-
రూ.248 కోట్ల ట్యాక్స్ డిమాండ్ నోటీసులు
కోల్గేట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్ 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ.248.74 కోట్ల ట్యాక్స్ డిమాండ్ నోటీసును అందుకుంది. ధరల బదిలీలో సమస్యల కారణంగా జులై 26న ఈ నోటీసులు అందినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.ఈ ఆదాయ పన్ను నోటీసుల వల్ల కంపెనీ ఆర్థిక కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని ఫైలింగ్‌లో పేర్కొంది. ‘ఆదాయ పన్ను శాఖ నుంచి కంపెనీకు జులై 26న నోటీసులు అందాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.248,74,78,511 కోట్ల ట్యాక్స్ చెల్లించాలని ఉంది. దానికి వడ్డీ రూ.79.63 కోట్లుగా నిర్ణయించారు. ధరల బదిలీలో సమస్యల కారణంగా ఈ నోటీసులు జారీ చేసినట్లు ఆదాయ పన్ను శాఖ తెలిపింది. దీనికి సంబంధించి అప్పీలేట్ ట్రిబ్యునల్‌లో అప్పీల్ చేస్తాం. ట్యాక్స్ డిమాండ్ నోటీసుల ద్వారా కంపెనీ ఆర్థిక వ్యవహారాలపై ఎలాంటి ప్రభావం ఉండదు’ అని తెలిపింది.ఇదీ చదవండి: అప్పు చెల్లించని వైజాగ్ స్టీల్‌ప్లాంట్!కోల్గేట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్ ఓరల్ కేర్, పర్సనల్ కేర్‌లో ఉత్పత్తులు తయారుచేస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.5,644 కోట్ల విలువైన నికర విక్రయాలు నమోదు చేసింది. -
కోల్గేట్ పేస్ట్ ఎగబడి కొంటున్నారు! ఎందుకంటే..
Colgate Products Shortage In Maharastra: కోల్గేట్ పేస్ట్, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు అక్కడ జనాలు ఎగబడిపోతున్నారు. కిరాణ.. చిల్లర దుకాణాల్లో, మార్ట్‌లలోనూ కోల్గేట్ పేస్టులు హాట్ హాట్‌గా అమ్ముడుపోతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. త్వరలో కోల్గేట్ పేస్టుల కోరత అక్కడ ఎదురు కానుంది. కాబట్టే, అంత డిమాండ్ నడుస్తోంది. అవును.. మహారాష్ట్ర వ్యాప్తంగా కోల్గేట్ ఉత్పత్తుల పంపిణీ నిలిపివేయాలని డిస్ట్రిబ్యూటర్స్(పంపిణీదారులు) నిర్ణయించారు. జనవరి 1వ తేదీ నుంచి పేస్ట్‌లు, ఇతర ఉత్పత్తులను దశల వారీగా పంపిణీ ఆపేయనున్నారు. ఇవాళ(జనవరి 1, 2022) నుంచి మ్యాక్స్ఫ్రెష్ పేస్ట్‌ల ఉత్పత్తిని ఆపేశారు. వారం తర్వాత వేదశక్తి పేస్ట్‌ను సైతం పంపిణీ నిలిపివేయాలని నిర్ణయించారు. జనవరి మధ్య నుంచి కోల్గేట్ టూత్ బ్రష్స్లు పంపిణీ ఆగిపోనుంది. ఇక పూర్తి ఉత్పత్తుల పంపిణీ బంద్‌ను ఫిబ్రవరి 1 నుంచి నిర్ణయించారు. కారణం.. ధరల అసమానత. Fast-moving consumer goods(ఎఫ్ఎంసీజీ) కంపెనీల ఉత్పత్తుల విషయంలో సంప్రదాయ వ్యాపారపు రేట్లకు.. ఆర్గనైజ్డ్‌ఛానెల్ అంటే జియోమార్ట్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ, ఉడాన్, ఎలాస్టిక్ రన్ లాంటి కామర్స్ బీ2బీ కంపెనీలకు మరో రేట్లు ఉంటోంది. అయితే పూణేలో జరిగిన ఒక ఉత్పత్తి లాంచ్ ఈవెంట్లో కంపెనీ తన ఉత్పత్తులను అన్ని ఛానెల్‌లలో ఒకే ధరకు విక్రయించినట్లు తెలిపింది. కానీ, డిస్ట్రిబ్యూటర్లు ఇందులో నిజం లేదని అంటున్నారు. రిటైల్ మార్జిన్ 8-12 శాతం ఉండగా, ఆన్లైన్ డిస్ట్రిబ్యూటర్లకు.. బీ2బీ స్టోర్స్‌కు 15-20 శాతం ఉంటోందని చెప్తున్నారు. దీనికి నిరసనగానే పంపిణీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు చిల్లర వ్యాపారులు వ్యవస్థీకృత(ఆర్గనైజ్డ్) ఛానెల్ నుంచి స్టాక్లను ఎత్తివేయడం పెంచుకుంటూ పోతున్నారు. కోల్గేట్ స్పందన.. కోల్గేట్ పాల్మోలైవ్ ఇండియా, పంపిణీదారుల చర్యలపై స్పందించింది. పంపిణీదారులతో ఎనిమిది దశాబ్దాలుగా బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయని, పారదర్శకత ఉందని, డిస్ట్రిబ్యూటర్ నెట్‌వర్క్‌తో సంప్రదింపులు జరుపుతామని, సవాళ్లను అధిగమిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ఇంతకు ముందు Fast-moving consumer goods అయిన మరో కంపెనీ హిందుస్థాన్ లివర్ ప్రొడక్టుల విషయంలోనూ పంపిణీదారులు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. అయితే మహాలో తమ ఉత్పత్తుల సరఫరా అంతరాయం లేకుండా ఉంటుందని HUL చెబుతోంది.మరోవైపు Edelweiss సెక్యూరిటీస్ తన నివేదికలో ఈ సమస్యలు (కంపెనీ మరియు పంపిణీదారులు) ముందుగానే జరిగాయని, HUL మరియు డిస్ట్రిబ్యూటర్లు త్వరలో ఒక ఒప్పందానికి వస్తారని అంచనా వేసింది. లేఖలు రాసినా.. ఆల్ఇండియా కన్జూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ (నాలుగున్నర లక్షలమంది ఉన్నారు).. ఎఫ్ఎంసీజీ కంపెనీలతో సమావేశమై ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ఇదివరకే ప్రయత్నించింది. ఒకే రకమైన ధరలు, పాలసీలు ఉండాలన్న డిమాండ్‌ను ప్రస్తావిస్తూ ఎఫ్ఎంసీజీల ముందు ఉంచింది(రెండు లేఖలు రాసింది). లేకుంటే జనవరి 1 నుంచి సహాయక నిరాకరణోద్యమం చేస్తామని ప్రకటించింది కూడా. ఈ క్రమంలో నెస్లే ఇండియా, ఐటీసీ, డాబర్, మారికోలు చర్చించినా.. ఓ కొలిక్కి రాలేదని సమాచారం. చదవండి: లేస్ చిప్స్ ‘ఆలు’పై పేటెంట్ రైట్స్ రద్దు.. భారత రైతులకు భారీ ఊరట -
కోల్గేట్, ప్యాంటీన్, నెస్లేలకు బ్యాడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురు, ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి సహ-వ్యవస్థాపకుడు రాందేవ్ విదేశీ ఎఫ్ఎంసీజీ కంపెనీలపై మరోసారి ధ్వజమెత్తారు. విదేశీ ఫాస్ట్ మూవింగ్ కన్జుమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) దిగ్గజ కంపెనీల కథ త్వరలోనే ముగియనుందంటూ జోస్యం చెప్పారు. యునీలీవర్, కోల్గేట్, పాంటీన్, నెస్లే వంటి అగ్రగామి సంస్థలపై బహిరంగంగానే టార్గెట్ చేసిన రాందేవ్ భారతదేశంలో పోటీ తీవ్రంగా సాగుతోంది. ఇక కంపెనీల ఆట కట్టేనని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఈ కంపెనీలు స్వర్గానికి పోవడం ఖాయమని పేర్కొన్నారు. దీనికోసం ఎంతో కాలం ఎదురు చూడాల్సిన అవసరం లేదని కేవలం కొద్ది సమయం మాత్రమే మిగిలివుందన్నారు. మనిషి 100 సంవత్సరాల్లో స్వర్గానికి చేరతాడు. ఈ కంపెనీలు కేవలం మరో రెండు రోజుల్లో సమసిపోనున్నాయని తెలిపారు. ఇప్పటికే తమ రాకతో ఈ కంపెనీలు శీర్షాసనం (తల్లకిందులు) వేశాయని, మరో రెండు రోజుల్లో ఇక మోక్షమేనంటూ తనదైన యోగా భాషలో చెప్పుకొచ్చారు. ‘‘ప్యాంటీన్ ప్యాంట్ తడిచిపోనుంది.. కోల్గేట్ గేటు మూతపడుతుంది.. నెస్లేలో పక్షులు ఎగిరిపోతాయి’’ అన్న 2016 నాటి రాందేవ్ వ్యాఖ్యలు గురించి అడిగినప్పుడు ఆయన ఇలా స్పందించారు. కాగా ఆయుర్వేద ఉత్తత్పులతో మార్కెట్లోకి దూసుకొచ్చిన 'పతంజలి' 2018 సంవత్సరానికి 20వేలకోట్ల రూపాయలసంస్థగా అవతరించనున్నామని ఇటీవల ప్రకటించింది. అంతేకాదు ఇప్పటివరకూ ఎఫ్ఎంసీజీ మార్కెట్‌ను ఏలిన ఐటీసీ, డాబర్, హిందూస్థాన్ యూనిలీవర్, కోల్గేట్ పామోలివ్, ప్రోక్టర్ అండ్ గాంబిల్ తదితర సంస్థలకు గట్టి సవాల్ విసిరింది. అంతేకాదు రెండంకెల వృద్ధిని నమోదు చేయడం కష్టంగా మారిన తరుణంలో పతంజలి ఏకంగా మూడంకెల వృద్ధిని సాధించడం విశేషం. -
కోల్గేట్ కష్టాలు
న్యూఢిల్లీ: ఊళ్లలో ఎక్కువ మంది వినియోగించే టూత్‌పేస్ట్ ఏంటంటే ఠక్కున వచ్చే సమాధానం కోల్గేట్. ఎన్నో సంవత్సరాల నుంచి భారత్‌లోని మారుమూల గ్రామల్లో సైతం టూత్‌పేస్ట్ అంటే కోల్గేట్ అనే పేరు పాతుకుపోయింది. అలాంటిది తొలిసారి ఆ కంపెనీ తాము కష్టాలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. బాబా రామ్‌దేవ్ కంపెనీ పతంజలి నుంచి కోల్గేట్ గట్టి పోటీ ఎదురవుతోందని తెలిపింది. ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో రూ.142.58 కోట్ల ఆదాయానికి గండి పడినట్లు చెప్పింది. గతేడాది ఇదే సమయానికి ప్రకటించిన వివరాల్లో కోల్గేట్ రూ.143.27 కోట్ల లాభాలు గడించింది. దీంతో నష్టనివారణ చర్యలకు దిగిన కోల్గేట్ కంపెనీ సీఈవో ఇయాన్ కుక్ పెట్టుబడిదారులతో భేటీ అయ్యారు. భారత్‌లో మారుతున్న పరిస్ధితులకు అనుగుణంగా ప్రొడక్ట్స్‌ను అందుబాటులో ఉంచాలని సూచించారు. పతంజలి నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో వినియోగదారుని అభిరుచిని తెలుసుకుని ఉత్పత్తులను తయారు చేయాలని చెప్పారు. పతంజలి 'దేశీయత' అనే భిన్నమైన కాన్సెప్ట్‌తో మార్కెట్‌ను కొల్లగొడుతోందని, దానికి సరిజోడుగా సహజసిద్ధంగా తయారు చేశామని చెబుతోందని ఇన్వెస్టర్ల కాన్ఫెరెన్స్‌లో చెప్పుకొచ్చారు కుక్. కొల్గేట్ కూడా ప్రజల అభిరుచులకు అనుగుణంగా సహజపద్దతిలో ఉత్పత్తులను తయారుచేసి అందించే మార్గాన్ని అనుసరించాలని సూచించారు. -
జీఎస్టీ ఎఫెక్ట్:కోల్గేట్ ధరలు తగ్గాయ్
ముంబై: ఓరల్ కేర్ ఉత్పత్తుల్లో లీడర్ గా ఉన్నకోల్గేట్ జీఎస్టీ అమలు తరువాత తన అనేక ఉత్పత్తులపై తగ్గింపు ధరలను ప్రకటించింది. దంత ఉత్పాదనల్లో అగ్రగామి కోల్గెట్ సంస్థ తన ఉత్పత్తులపై 8 నుంచి 9 శాతం మేర ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా టూత్‌పేస్టులు, టూత్‌బ్రష్‌లపై ఈ తగ్గిపు వర్తించనుంది. జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోల్గేట్ తెలిపింది. జీఎస్టీ పరిధిలో టూత్ పేస్టులపై పన్ను రేటు 18శాతంగా నిర్ణయించడంతో ఈ తగ్గింపు. ఇప్పటివరకు ఇది 24శాతంగా ఉంది. మారిన ధరలు జులై 1 నుంచి అమల్లోకి వచ్చాయని కోల్గెట్-పామోలివ్(ఇండియా) అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ తగ్గింపు ధరల వల్ల కోల్గెట్ స్ట్రాంగ్ టూత్‌పేస్ట్(100 గ్రా.) ధర రూ. 52 నుంచి రూ.46కు అందుబాటులో ఉండనుంది. కోల్గెట్ స్లిమ్సాఫ్ట్ టూత్‌బ్రష్ ధర రూ.65 నుంచి రూ.60కి దిగి వచ్చింది. ఎడెల్వీస్ రీసెర్చ్ నివేదిక ప్రకారం అత్యధిక శాతం టోకు వర్తకం చేస్తున్న కంపెనీలు జీఎస్టీపన్నురేటుకు ప్రభావితంకానున్నాయి. చాలా కొద్దిమంది మాత్రమే టోకువ్యాపారులు కింద నమోదు కానందువల్ల హోల్‌సేల్ మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడిన కాల్గేట్ వాల్యూమ్ 7-8 శాతం తగ్గిపోతుందని భావిస్తున్నారు.కాగా ఓరట్ కేర్ మార్కెట్ లో కోల్గేట్ వాటా సుమారు 56 శాతం. కాగా జీఎస్టీ అమలు తరువాత దాదాపు అన్ని కంపెనీలూ తగ్గింపు ధరలను ప్రకటిస్తున్నాయి. హిందుస్థాన్ యూనిలివర్ సంస్థ ఇప్పటికే వస్తువుల ధరలను తగ్గించగా..ఇమామి కూడా తన ఉత్పత్తులపై ధరలను తగ్గించింది.