జీఎస్‌టీ ఎఫెక్ట్:కోల్గేట్ ధరలు తగ్గాయ్
ముంబై: ఓరల్ కేర్ ఉత్పత్తుల్లో లీడర్ గా ఉన్నకోల్గేట్ జీఎస్‌టీ అమలు తరువాత తన అనేక ఉత్పత్తులపై తగ్గింపు ధరలను ప్రకటించింది. దంత ఉత్పాదనల్లో అగ్రగామి కోల్గెట్ సంస్థ తన ఉత్పత్తులపై 8 నుంచి 9 శాతం మేర ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా టూత్‌పేస్టులు, టూత్‌బ్రష్‌లపై ఈ తగ్గిపు వర్తించనుంది. జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోల్గేట్ తెలిపింది. జీఎస్‌టీ పరిధిలో టూత్ పేస్టులపై పన్ను రేటు 18శాతంగా నిర్ణయించడంతో ఈ తగ్గింపు. ఇప్పటివరకు ఇది 24శాతంగా ఉంది.
మారిన ధరలు జులై 1 నుంచి అమల్లోకి వచ్చాయని కోల్గెట్-పామోలివ్(ఇండియా) అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ తగ్గింపు ధరల వల్ల కోల్గెట్ స్ట్రాంగ్ టూత్‌పేస్ట్(100 గ్రా.) ధర రూ. 52 నుంచి రూ.46కు అందుబాటులో ఉండనుంది. కోల్గెట్ స్లిమ్‌సాఫ్ట్ టూత్‌బ్రష్ ధర రూ.65 నుంచి రూ.60కి దిగి వచ్చింది.
ఎడెల్వీస్ రీసెర్చ్ నివేదిక ప్రకారం అత్యధిక శాతం టోకు వర్తకం చేస్తున్న కంపెనీలు జీఎస్‌టీపన్నురేటుకు ప్రభావితంకానున్నాయి. చాలా కొద్దిమంది మాత్రమే టోకువ్యాపారులు కింద నమోదు కానందువల్ల హోల్‌సేల్ మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడిన కాల్గేట్ వాల్యూమ్ 7-8 శాతం తగ్గిపోతుందని భావిస్తున్నారు.కాగా ఓరట్ కేర్ మార్కెట్ లో కోల్గేట్ వాటా సుమారు 56 శాతం.
కాగా జీఎస్‌టీ అమలు తరువాత దాదాపు అన్ని కంపెనీలూ తగ్గింపు ధరలను ప్రకటిస్తున్నాయి. హిందుస్థాన్ యూనిలివర్ సంస్థ ఇప్పటికే వస్తువుల ధరలను తగ్గించగా..ఇమామి కూడా తన ఉత్పత్తులపై ధరలను తగ్గించింది.