కనకంబు మోత..
కనకంబు మోత..
Published Sun, Jul 23 2017 11:51 PM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM
హడలెత్తిస్తున్న ధర
జీఎస్టీ ఎఫ్టెక్ట్
జిల్లాలో భారీగా తగ్గిన అమ్మకాలు
వెండిదీ అదే దారి
కొనుగోలుదారుల అయోమయం
కంచు మోగినట్టు కనకంబు మోగునా.. అనే నానుడి అందరికీ తెలిసిందే..! ఇప్పుడు కనకం కూడా మోతమోగిస్తోంది. పెరుగుతున్న ధర, కొనుగోలుదారులను బెంబేలెత్తిస్తుంటే.. తగ్గుతున్న అమ్మకాలు వ్యాపారులను హడలెత్తిస్తున్నాయి.
నరసాపురం :
పసిడి ధరలు మళ్లీ మిడిసి పడుతున్నాయి. మూడేళ్ల గరిష్టానికి చేరాయి. నోట్లరద్దు తరువాత పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలతో ధరలు కాస్త తగ్గాయి. అయితే మళ్లీ క్రమంగా పెరుగుతూ వచ్చాయి. జీఎస్టీ అమల్లోకి రావడంతో మరింత పెరిగాయి . ప్రస్తుతం నరసాపురం మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29400లు, 22 క్యారెట్ల కేడీఎం ఆభరణాల బంగారం ధర రూ. 27,350గా ట్రేడవుతోంది. అంటే 916 కేడీఎం ఆభరణాల బంగారం కాసు ధర ప్రస్తుత రూ.21, 880. నాలుగైదు నెలలుగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. మరోవైపు వెండి ధరలూ పెరుగుతున్నాయి. కిలో వెండి ధర రూ.39వేలకు చేరింది.
జీఎస్టీ ఎఫెక్ట్‌తో కొనుగోలుదారుల్లో అయోమయం
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గతంలో బంగారంపై ఒక శాతం వ్యాట్ ట్యాక్స్ ఉండేది. ప్రస్తుతం 3 శాతం జీఎస్టీ పన్ను విధించడంతో ధరలు పెరిగాయి. అయితే మరోవైపు బంగారంపై విధించిన నిబందనల వల్ల కొనుగోలుదారుల్లో తీవ్ర అయోమయం నెలకొంది. దీంతో ఎవరూ ఈ 20 రోజులుగా బంగారం షాపుల మెట్లెక్కడంలేదు. రూ.10వేలు దాటి అమ్మకాలు, కొనుగోళ్లు చేయదలిస్తే బ్యాంకు ద్వారానే లావాదేవీలు సాగించాలనే నిబంధన అమల్లోకి వచ్చింది. అయితే ఇది పూర్తి స్థాయిలో అమలు కానప్పటికీ బంగారం కొనుగోళ్లు సాగించేందుకు ఎవరూ సాహసించడంలేదు. ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలు బంగారం కొనాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారు.
మోసపోతున్న వినియోగదారులు
జీఎస్టీ మతలబులు తెలియక కొనుగోలుదారులు కొన్నిచోట్ల మోసపోతున్నారు. నిజానికి జీఎస్టీతో 2 శాతం వరకూ మాత్రమే బంగారంపై అదనపు భారం పడింది. బంగారం ధరలోనే జీఎస్టీ, ఇతర పన్నులు అన్నీ కలిపి ఉంటాయి. అయితే జిల్లాలో కొందరు వ్యాపారులు ఆరోజు ఉన్న బంగారం ధరకు అదనంగా జీఎస్టీ జత చేతచేస్తున్నట్టు తెలుస్తోంది. అదనంగా జత చేసిన జీఎస్టీని తగ్గించి, డిస్కౌంట్ ఇస్తున్నామని కొనుగోలుదారులను మభ్యపెడుతున్నట్టు సమాచారం. నిజానికి అంతర్జాతీయ మార్కెట్‌ను అనుసరించి బంగారం ధరలు నిర్ణయమవుతాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో జౌన్స్(31.110 గ్రాములు) బిస్కెట్ బంగారం ధర 1244.45 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం రూపాయితో డాలర్ మారకం విలువ రూ 64.35లుగా ఉంది. అంటే జౌన్స్ బంగారం ధర మన కరెన్సీలో రూ 80,080గా ఉంది. ఈలెక్కన 24 క్యారెట్‌ల బంగారం గ్రాము ధర «అంతర్జాతీయ మార్కెట్‌ను అనుసరించి రూ.2574.10లుగా ఉంది. ఇది మన మార్కెట్‌కు వచ్చే సరికి కస్టమ్స్ డ్యూటీ 10 శాతం, జీఎస్టీ 3 శాతం పడుతుంది. ఈ 13శాతం పన్నుతోపాటుగా బ్యాంకు చార్జీలు, డీలర్ చార్జీలు అన్నీ కలుపుకుని గ్రాము ధర రూ.2940 అవుతుంది. అంటే మొత్తం పన్నులు అన్నీ ఆరోజు చెప్పే ధరలోనే కలిపి ఉంటాయి. అయితే కొందరు వ్యాపారులు వినియోగదారుల్లో అవగాహన లేకపోవడంతో జీఎస్టీని అదనంగా వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. జీఎస్టీతో కలిపి బిల్లు ఇస్తే ఈ వివరాలు అన్నీ క్షుణ్ణంగా బిల్లులో పొందుపరచాల్సి ఉంటుంది. అయితే ఇంకా బిల్లుపై వ్యాపారం పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో మోసాలు జరుగుతున్నట్టు సమాచారం. అంతే కాకుండా మనప్రాంతంలో పాత బంగారం మార్చుకుని, వేరే కొత్త వస్తువులు తీసుకోవడం ఎక్కువ. ఈ క్రమంలో వినియోగదారులు భారీగా మోసపోతున్నట్టు తెలుస్తోంది.
రూ.3కోట్ల వరకూ తగ్గిన అమ్మకాలు
ధర పెరగడంతో పాటుగా ప్రస్తుతం ఉన్న అయోమయ పరిస్థితుల వల్ల బంగారం అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడింది. మొన్నటి వరకూ కళకళలాడిన జ్యూయలరీ షాపులు వెలవెల బోతున్నాయి. ఒక్క నరసాపురం మార్కెట్‌లోనే హోల్‌సేల్, రిటైల్ కలిపి రోజుకు రూ.3కోట్ల వరకూ బంగారం అమ్మకాలు జరుగుతాయి. ఏలూరు, తుణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం పట్టణాల్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతాయి. పెరిగిన ధరలతో జిల్లాలో రోజుకు రూ.3 కోట్ల వరకూ అమ్మకాలు తగ్గినట్టుగా అంచనా. ప్రస్తుతం శ్రావణమాసం, పెళ్లిళ్ల సీజన్లు ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా సామాజిక అవసరాల నిమిత్తం బంగారం కొనుగోలు చేయాల్సిన పేద, మధ్య తరగతి వారు ఇబ్బంది పడుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌ను అనుసరించే..
అంతర్జాతీయ మార్కెట్ ధరను అనుసరించే బంగారం ధరలు ఉంటాయి. ఇక్కడ కస్టమ్స్ డ్యూటీ 10శాతం, జీఎస్టీ 3శాతం కలుపుకుని ధర చెబుతారు. అదనంగా జీఎస్టీ వసూలు చేయకూడదు. అలా జరినట్టు అనిపిస్తే వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి న్యాయం పొందవచ్చు. జీఎస్టీతో అమ్మకాలు బాగా తగ్గాయి. బంగారం కొనాలా? లేదా? అనే అయోమయంలో జనం ఉన్నారు. కొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుంది. ఇప్పటిలో ధరలు తగ్గే అవకాశం కనిపించడం లేదు.
వినోద్ కుమార్ జైన్, నరసాపురం బులియన్ మర్చంట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు
Advertisement
Advertisement