♦ తగ్గని పప్పులు,మసాలా దినుసుల ధరలు
♦ 50 శాతం మంది వ్యాపారులకు జీఎస్టీ రిజిస్ట్రేషన్లు లేవు
♦ మధ్య తరగతి ప్రజలకు తప్పని ధరాఘాతం
♦ నిద్రావస్థలో వాణిజ్య పన్నుల యంత్రాంగం
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి వెంకటరమణ మృత్యుంజయకుంటలో నివాసం ఉంటున్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ఇంట్లోని వారు సరుకులు తీసుకురమ్మని పంపారు. ఆయన సమీపంలోని ఓ దుకాణానికి వెళ్లారు.సరుకులు కావాలని పట్టీ ఇచ్చారు. దుకాణదారుడు అన్నీ ఇచ్చాడు. ఇదేమందయ్యా..! కందిపప్పు కిలో రూ.60–65 మధ్య ధర ఉంటే నీవేమో రూ.90 రాశావని దుకాణదారుడిని నిలదీశారు. అవునయ్యా...జీఎస్టీ అమలులోకి వచ్చింది.. నన్నేం చేయమంటావని అన్నాడు. అన్ని సరుకులకు జీఎస్టీ లేదు కదా? అని వెంకటరమణ దుకాణదారుడిని ప్రశ్నించారు. మా ధర ఇంతే తక్కువకు ఎక్కడైనా వస్తే తెచ్చుకో...అని అన్నాడు.
కడప అగ్రికల్చర్/కోటిరెడ్డి సర్కిల్:
మామూలుగా జీఎస్టీ అమలైతే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయని అందరూ భావించారు. కానీ హోల్‌సేల్ వ్యాపారులు పన్నులు చెల్లించలేమంటూ రిటైలర్లకు విక్రయించే ధరలను పెంచేశారు. ఇదే సాకు చూపి చిరు వ్యాపారులు సైతంధర పెంచి విక్రయిస్తున్నారు. కంపెనీ ప్యాకెట్లలో లేని(నాన్ ప్యాక్‌డ్) వస్తువులకు జీఎస్టీ లేదని నిబంధనలు చెబుతున్నాయని వినియోగదారులు అంటున్నారు. కానీ దుకాణదారులు అన్ని వస్తువులకు పన్నులు ఉన్నాయంటూ ధరలను పెంచేశారు. జీఎస్టీకి సంబంధించి ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌లను చాలా మంది వ్యాపారులు చేసుకోలేదు. కానీ బిల్లులు ఇవ్వకుండానే ధరలు మాత్రం పెంచారు. హోల్‌సేల్‌లో కొన్నప్పుడు తాము ముందే పన్నులు చెల్లించామని వ్యాపారులు వినియోగదారులతో వాదనలకు దిగుతున్నారు.
జీఎస్టీ అమలులో ఉన్నా..
మార్కెట్‌లో జీఎస్టీ వచ్చినప్పటి నుంచి చాలా సరుకుల ధరలు తగ్గాల్సి ఉంది. ఇప్పటికీ మూడేళ్ల నుంచి ఉన్న ధరలతోనే అమ్ముతున్నారు. పప్పులు, మసాలా దినుసులు, బియ్యం ధరలు తగ్గిస్తూ జీఎస్టీ శ్లాబ్‌లో ఉంచారు. వ్యాపారులు మాత్రం ప్రభుత్వం చెప్పినట్లు ధరలు ఏ మాత్రం తగ్గలేదని వినియోగదారులను బోల్తా కొట్టిస్తున్నారు. జిల్లాలో దాదాపు 70 శాతం మంది సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు. చాలీ చాలని సంపాదనతో జీవనం సాగిస్తున్నారు. ఇల్లు గడవడం కూడా ఇబ్బందిగా ఉన్న తరుణంలో జీఎస్టీ దెబ్బతో ధరలు పెరిగి కుంగిపోతున్నారు. పప్పులు, మసాలా దినుసుల ధర బాగా తగ్గినా వ్యాపారులు ఒక్క రూపాయి కూడా తగ్గించలేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ శ్లాబ్‌కి మార్కెట్‌లోని వస్తువుల ధరలకు చాలా తేడా కనిపిస్తోంది. హోల్‌సెల్‌గా వస్తువులను సరఫరా చేసే బడా వ్యాపారులు సిండికేట్ కావడం, కార్పొరేట్ వ్యాపార సంస్థల చేతుల్లో ధరల నిర్ణయాధికారం ఉంటుందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
పట్టించుకోని కమర్షియల్ ట్యాక్స్ యంత్రాంగం
జిల్లాలో చాలా మంది వ్యాపారులు సిండికేటై జీఎస్టీ సాకుతో ధరలనుతగ్గించలేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కిలో కంది పప్పు కొంతమంది వ్యాపారులు రూ.60–65 మధ్య అమ్ముతుంటే మరి కొందరు రూ.80–90లతో విక్రయిస్తున్నారు. బియ్యం కిలో ధర రూ.50 ఉండగా దానిని రూ.80లకు విక్రయిస్తున్నారు. కంపెనీ ప్యాకింగ్‌లేని కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, వేరుశనగ పప్పులను, మసాలా దినుసులను ఇష్టారాజ్యంగా వారికి తోచిన ధరకు విక్రయిస్తున్నారు.
సామాన్యులు ఇదేమిటని ప్రశ్నిస్తే ఏం చేయమంటావ్.. ప్రభుత్వం జీఎస్టీ అనే పన్ను విధించింది. ఆ ధరకే మేం కొనుగోలు చేసి మీకు విక్రయిస్తున్నామనే సమాధానం వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. జిల్లాలోని సరుకుల దుకాణా లను తనిఖీ చేయాల్సిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జీఎస్టీ పేరు.. దోపిడీ తీరు
Published Mon, Aug 28 2017 9:00 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM
Advertisement
Advertisement