సాక్షి, మెదక్ : ఒకే దేశం ఒకే పన్ను విధానం జీఎస్టీ(వస్తు సేవల పన్ను) అమలులోకి వచ్చి నేటికి ఏడాది. జూన్ 30వ తేదీ అర్ధరాత్రి అనగా జూలై 1 నుంచి దేశ వ్యాప్తంగా జీఎస్టీ అమలులోకి వచ్చింది. ఆరంభంలో ప్రతిపక్ష పార్టీలతో పాటు వ్యాపార వర్గాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుండ అమలు చేసింది. జీఎస్టీకి ముందు జిల్లాలో వ్యాట్(విలువ ఆధారిత పన్ను) అమలులో ఉండేది. దీని పరిధిలో 1,132 రకాల చెల్లింపుదారులు ఉండేవారు.
జీఎస్టీ వచ్చిన తర్వాత పన్ను చెల్లింపుదారుల సంఖ్య మరింత పెరిగింది. వివిధ రకాల ఉత్పత్తులపై పన్ను చెల్లించే వారి సంఖ్య 1,972కు చేరుకుంది. అదనంగా మరో 840 మంది వ్యాపారులు, వ్యాపార సంస్థలు వస్తు సేవల పన్న చెల్లింపు పరిధిలోకి వచ్చాయి. అన్ని రకాల వ్యాపారాల్లో 20 లక్షలకుపైగా ఆదాయం ఉన్న వ్యాపారులు, వ్యాపారసంస్థలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటం జరిగింది. ఏడాది కాలంగా ప్రతి మూడు మాసాలకు ఒకమారు రిటర్న్‌లు ఫైల్‌చేస్తూ పన్నులు చెల్లిస్తున్నారు. వ్యాట్ అమలులో ఉన్నప్పుడు ప్రతినెలా పన్నుల రూపంలో సుమారు రూ.2 కోట్లు వచ్చేవి. అయితే జీఎస్టీ అమలు తర్వాత ఆదాయం గణనీయంగా పెరిగింది.
ప్రతినెలా రూ.3 కోట్లకుగాపై పన్నులు వసూలు అవుతున్నాయి. దీంతో జిల్లాలో జీరో దందా తగ్గింది. అన్ని రాష్ట్రాల్లో ఒకే పన్ను విధానం అమలు అవుతుండటంతో పన్నుఎగవేత లేకుండా పోయింది. అలాగే ప్రజలకు చాలా ఉత్పత్తులు ఒకే ధరకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో అన్ని వర్గాల ప్రజలపై ఆర్థిక భారం తగ్గింది. కమర్షియల్ ట్యాక్స్ చెక్ పోస్టులు ఎత్తివేయడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఉత్పత్తుల రవాణా వేగం పెరిగింది. వ్యాపారులకు ట్యాక్స్ చెల్లించటం సులువైంది.
ఆన్‌లైన్‌లో చెల్లింపు విధానంతో వ్యాపారుల ఇబ్బందులు చాలా వరకు తగ్గాయి. అయితే జీఎస్టీపై అందరి వ్యాపారులకు ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన రాలేదు. దీని అమలులో ఇంకా కొన్ని ఇబ్బందులు నెలకొంటున్నాయి. పూర్తి స్థాయి నెట్‌వర్క్ లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వ్యాపారులు, వ్యాపార సంస్థలు పన్నులు సక్రమంగా చెల్లిస్తుంది లేనిదీ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు గతంలో మాదిరిగా పర్యవేక్షించని పరిస్థితి నెలకొంది. అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి దాడులు నిర్వహించాలన్నా.. నిబంధన ప్రతిబంధకంగా మారుతోంది.
Comments
Please login to add a commentAdd a comment