సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో జీఎస్‌టీ జిఎస్‌టి శ్లాబులను కుదించే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ తెలిపారు. అంతేకాదు 12 శాతం, 18 శాతం పన్ను శ్లాబులను సైతం కాలక్రమేణా విలీనం చేసే అవకాశాలున్నాయన్న సంకేతాలనందించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ‘ఇక్ఫాయ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లుర్నింగ్’లో ప్రసంగించిన సుబ్రమణియన్ జీఎస్‌టీ అమలు ఒక విప్లవాత్మక ఆర్థిక సంస్కరణగా అభివర్ణించారు. తదుపరి ఆరు నుంచి తొమ్మిది నెలల్లో వ్యవస్థ స్థిరపడతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన జిఎస్‌టి చట్టం వచ్చే 6-9 నెలల కాలంలో స్థిరత్వం సాధించనుందని, ఇతర దేశాలకు సైతం మార్గదర్శకం కానుందని సుబ్రమణియన్ పేర్కొన్నారు. కొత్త పరోక్ష పన్నుల విధానంలో నిలకడ వచ్చాక పన్ను శ్లాబులను కుదించే ప్రక్రియ ప్రారంభం కావచ్చన్నారు. భవిష్యత్‌లోపెట్రోల్, డీజిల్‌ను జిఎస్‌టి పరిధిలోకి తెచ్చే విషయంలో రాష్ర్టాల అంగీకారమే కీలకమని అన్నారు. అయితే, భారత్‌లాంటి పెద్ద దేశంలో ఒకే జిఎస్‌టి రేటు మాత్రం సాధ్యపడకపోచ‍్చని పేర్కొన్నారు. జిఎస్‌టి పోర్టల్‌లో రిటర్నులు ఫైలింగ్ వ్యవస్థల్లో కొన్ని సాంకేతిక అవాంతరాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రాలు భిన్న ఐటీ వ్యవస్థలను కలిగి ఉన్న నేపథ్యంలో జిఎస్‌టి సిస్టమ్ కొంత సంక్లిష్టంగా మారిందన్నారు. పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సాంకేతిక అవాంతరాలు గురించి అడిగినప్పుడు వ్యవస్థ ఎంత క్లిష్టంగా ఉందో మీకు చెప్పలేను. ఇంకా బాగా చేయగలిగి ఉండే బావుండేదని తాను భావిస్తున్నానన్నారు. కానీ జీఎస్‌టీ కౌన్సిల్ ఈ అంశాలన్నింటినీ పరిశీలించి సరైన చర్య తీసుకుంటోంది అది ముఖ్యమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జిఎస్‌టిలో 5, 12, 18, 28 శాతం ఇలా నాలుగు పన్ను శ్లాబులుండగా, ఇటీవలి కౌన్సిల్ సమావేశాల్లో జీఎస్‌టీ స్లాబుల్లో పలు మార్పులు చేపట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment