కోల్గేట్ కష్టాలు
న్యూఢిల్లీ: ఊళ్లలో ఎక్కువ మంది వినియోగించే టూత్‌పేస్ట్ ఏంటంటే ఠక్కున వచ్చే సమాధానం కోల్గేట్. ఎన్నో సంవత్సరాల నుంచి భారత్‌లోని మారుమూల గ్రామల్లో సైతం టూత్‌పేస్ట్ అంటే కోల్గేట్ అనే పేరు పాతుకుపోయింది. అలాంటిది తొలిసారి ఆ కంపెనీ తాము కష్టాలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది.
బాబా రామ్‌దేవ్ కంపెనీ పతంజలి నుంచి కోల్గేట్ గట్టి పోటీ ఎదురవుతోందని తెలిపింది. ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో రూ.142.58 కోట్ల ఆదాయానికి గండి పడినట్లు చెప్పింది. గతేడాది ఇదే సమయానికి ప్రకటించిన వివరాల్లో కోల్గేట్ రూ.143.27 కోట్ల లాభాలు గడించింది.
దీంతో నష్టనివారణ చర్యలకు దిగిన కోల్గేట్ కంపెనీ సీఈవో ఇయాన్ కుక్ పెట్టుబడిదారులతో భేటీ అయ్యారు. భారత్‌లో మారుతున్న పరిస్ధితులకు అనుగుణంగా ప్రొడక్ట్స్‌ను అందుబాటులో ఉంచాలని సూచించారు. పతంజలి నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో వినియోగదారుని అభిరుచిని తెలుసుకుని ఉత్పత్తులను తయారు చేయాలని చెప్పారు.
పతంజలి 'దేశీయత' అనే భిన్నమైన కాన్సెప్ట్‌తో మార్కెట్‌ను కొల్లగొడుతోందని, దానికి సరిజోడుగా సహజసిద్ధంగా తయారు చేశామని చెబుతోందని ఇన్వెస్టర్ల కాన్ఫెరెన్స్‌లో చెప్పుకొచ్చారు కుక్. కొల్గేట్ కూడా ప్రజల అభిరుచులకు అనుగుణంగా సహజపద్దతిలో ఉత్పత్తులను తయారుచేసి అందించే మార్గాన్ని అనుసరించాలని సూచించారు.