మంచి మాట: జీవనమధురిమలు | secret of life is to know and experience the sweetness of life | Sakshi
Sakshi News home page

మంచి మాట: జీవనమధురిమలు

Published Mon, Jul 11 2022 12:39 AM | Last Updated on Mon, Jul 11 2022 12:39 AM

secret of life is to know and experience the sweetness of life - Sakshi

ప్రతి ఒక్కరి జీవితంలో మాధుర్యముంటుంది. కానీ, దానిని చేరుకునే సోపానం ఒకటి కాదు అనేక రకాలు.
మనకి అనువైనదేదో తెలియచేప్పేది మన జీవిత నేపథ్యం. ఈ జీవన మాధుర్యానుభూతి.. స్థాయి.. గాఢతలను నిర్ణయించేది మన జీవిత దృక్పథం.. వైఖరి.. భావన. సుఖం.. సంతోషం .. ఆనందం వీటి భావన, అనుభూతి మనందరిలో ఒకే రకంగా ఉండదు. జీవన మాధుర్యమూ అంతే!
కొందరికి ఐశ్వర్యం జీవన మాధుర్యం. మరికొందరికి పుస్తకాలు. అందమైన ప్రకృతి, పరోపకారం .. జీవితార్థ శోధన.. ఆధ్యాత్మికత, జీవాత్మ – పరమాత్మల సంబంధ, సంయోగ యోచన, వృత్తి, హోదా... సజ్జన సాంగత్యం.. ఇలా అనేకానేక ఆలోచనలు జీవన మాధుర్యంలోని విభిన్నతను, వైవిధ్యతను సూచిస్తున్నాయి.


లోకో భిన్న రుచిః.
చెరుకు తియ్యగా ఉంటుంది. ఇది మనకందరకు తెలుసు. ఈ  భావన అనుభవంలోకి రావాలంటే చెరకు గడ మీద ఉండే మందపాటి పెచ్చును తీసి, ముక్కను కొరికి నమలాలి. అపుడు కొద్దిగా తీపిదనం తెలుస్తుంది. ఎంత బాగా నమిలితే అంతటి  రసం.. అంతటి తీపి. అలాగే జీవితం కూడ. ఇదీ చెరకు గడే.. ఎలా జీవించాలో తెలుసుకోవాలి. అనుభవించటం తెలియాలి. అనుభవించినకొద్దీ జీవితంలోని మాధుర్యం తెలుస్తుంది. క్షీరసాగర మధనం తరువాతే అమృతం లభించింది. దానిని మన జీవితంలో వెతికి పట్టుకోగలిగే చూపు.. నేర్పు కావాలి. లేనప్పుడు ఎవరైనా గురువును పెద్దల్ని.. అనుభవజ్ఞుల్ని ఆశ్రయించాలి.

మధుపం అనేక పుష్పాలమీద వాలి.. వాటిలోని మకరందాన్ని ఆహారంగా స్వీకరిస్తుంది. తేనె అన్ని పుష్పాలలో ఉండదు. వేటిలో ఉంటుందో దానికి తెలుసు. వాటి మీద వాలి వాటి నుంచి తేనెను పీల్చుకుంటుంది. జీవిత పుష్పంలోని మకరందాన్ని ఆస్వాదించాలంటే అది ఎలా ఎక్కడ ఏ రూపంలో ఉందో తీసుకోగలగాలి. దాన్ని అందుకోవాలి.

జీవితంలోని తీపిని మనకు తెలియచెప్పేది కుటుంబం. ఇది ప్రధాన సాధనం. బంధాలు – అనుబంధాలలోని తీయదనపు రుచి తెలుసుకున్న తరువాత స్నేహం ఆ రుచిని మరింత పెంచుతుంది. మన ఇంటి ఆవరణలో... మన వీధిలో ఉండే వాళ్ళతో సావాసం ఓ అద్భుత మధురసమే. తరువాత విద్యాభ్యాస కాలంలో స్నేహితులు, కాకి ఎంగిళ్ల తిళ్ళు.. మధ్యాహ్న భోజనాలలో పంచుళ్లు,  వారితో గిల్లికజ్జాలు.. మౌనవ్రతాలు..ఊరేగటాలతో పాటు విద్యలో అసూయ.. ఒకరినొకరు దాటి వెళ్లాలనుకునే పోటీ తత్వం... సాహసాలు.. దుస్సాహసాలు ... ఇలా ఎన్ని మధురిమలు! గుండె పట్టలేనన్ని! ఇవి అనుభవించిన కాలంలోనే కాక తరువాతి కాలంలో కూడ నెమరువేసుకునే జ్ఞాపకాల తీపి ఊటలవుతాయి. ఒంటరితనంలో, మనసు శూన్యమైన సమయంలో.. గాయపడిన వేళ.. ఈ మధురిమలు ఎంత ఊరటనిస్తాయి! మనసు అతలాకుతలం కాకుండా కాపాడి మనల్ని నిలబెడతాయి.

జీవన మాధుర్యాన్ని తెలుసుకుని.. దాన్ని అనుభవించేవారు విద్వాంసులే కానక్కర లేదు. వారు విద్యావిహీనులు కావచ్చు. సామాన్యులూ కావచ్చు. ఎవరైతే ఆ రుచిని ఒడిసి పట్టుకుని ఆస్వాదిస్తారో వారే గొప్ప వేదాంతులు.. యోగులు.. . సత్యశోధకులు. జీవిత మాధుర్యాన్ని తెలుసుకుని అనుభవించటమే జీవన రహస్యం. ఏమిటది? రెండక్షరాలలో ఉంటుందది. అదే.. తృప్తి...

వివాహానంతరం ఒక స్త్రీ.. పురుషుడు దాంపత్యమనే నావలో జీవనసాగరంలో ప్రయాణం చేయాలి. ఆరంభపు అనురాగం అంబరమే. ఈ ఆనందపు తీపి గురుతులు మనస్సుకెంత ఉల్లాసాన్ని.. ఉత్సాహాన్ని... హాయిని ఇస్తాయో! భార్యాభర్తల దాంపత్యపు తీయని ఫలాలే పిల్లలు. వారి పెంపకం.. ముద్దుమురిపాలు.. ఆపై వీరి వివాహం. మేము సైతం మీ జీవన మాధుర్యానికంటూ వచ్చేవాళ్లే కదా  మనవలు.. మనవరాళ్లు. వివాహం వల్ల ఒనగూరే మధురిమలెన్నెన్నో !
రోహిణి కార్తె చండ్ర నిప్పులు తరువాత పలుకరించే తొలకరి జల్లులో ఒక ఆనందముంది. బాగా వేడెక్కిన భూమిని వానచుక్క చుంబించిన తరుణాన అవనినుండి వచ్చే మట్టి వాసనే అది.

శీతాకాలపు ఉషోదయాన మంచు కురిసిన పచ్చిక మీద పాదాలుంచిన క్షణం.. ఓహ్‌... అది ఎంతటి హాయిని... ఆహ్లాదాన్ని ఆనందాన్నిస్తుంది! పిల్ల తెమ్మర మన నాసికకు చేరవేసే పూల సుగంధం కూడ ఒక జీవన మధురిమే. ఇలా మనకి ఆనందాన్నిచ్చేవన్నీ మన జీవన మాధుర్యాన్ని పెంచేవే. ఈ జీవన మధురిమలు ఎవరికైనా సొంతమే. ఎవరైనా ఆనందించవచ్చు. కావలసినది కొంచెం స్పృహ. తపన. అన్వేషణ.

జీవిత అంతరార్థాన్ని, తనలోని అంతర్యామిని అర్థం చేసుకుంటూ ఆ సర్వాంతర్యామిని ఈ సకల చరాచర సృష్టిలో చూసే ప్రయత్నం కొందరు చేస్తారు. ఇదే వారి దృష్టిలో మానవ జీవితంలోని మాధుర్యాన్ని చూపగలిగే మార్గం. ఇదే గొప్పదైనది. ఇదే అసలైనది అని వారి భావన. భగవంతుడి తత్వాన్ని అవగతం చేసుకునే ఓ అద్భుతమైన సోపానం.
మానవ సేవలో అంకితమవ్వటం మాధవ సేవే కదా! మంచి చేసేది... మంచిని పెంచేది ప్రతిదీ మాధుర్యాన్ని పంచి ఇచ్చేదే.

జీవితంలోని మాధుర్యాన్ని దర్శించాలంటే బాధలను, కష్టాలను దూరంగా ఉంచి, ఆనందకరమైన జ్ఞాపకాలను సదా మననం చేసుకుంటూ ఉండాలి. చెడ్డవారిలోనూ మంచిని చూడగలగాలి. చేదులోను తీపిని చూసే మానసిక స్థితిని పెంచుకోవాలి. అప్పుడు సృష్టి అంతా మధురంగానే ఉంటుంది.

– లలితా వాసంతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement