
Yemen Hell Of Well: అదొక భారీ బావి. దూరం నుంచి చూస్తే చిన్న గుంతలా కనిపిస్తుంది. దగ్గరికెళ్లి చూస్తే.. లోపల చీకట్లు అలుముకుని భయంకరంగా అనిపిస్తుంది. దాని గురించి చుట్టుపక్కల ఉన్న ఊరి వాళ్లు కథలు కథలుగా చెప్తుంటారు. కొందరేమో దుష్టశక్తులు కొలువైన బావిగా చెప్తారు. ఎక్కువ మంది మాత్రం శవాల దిబ్బగా పేర్కొంటారు. ఖైదీలను, శత్రువులను గుంపులుగా అందులో పడేసి ఊచకోత కోసేవాళ్లని ప్రచారం వినిపించేది మొన్నటిదాకా. కానీ..
112 మీటర్ల లోతున్న ఆ బావి నరక కూపం కాదని, అదొక ప్రకృతి అందంగా తేల్చేశారు. యెమెన్(యెమన్) ఆల్ మహారాలోని బార్‌హౌట్ బావి.. చాలా ఏళ్ల నుంచి ఒక మిస్టరీగా ఉండిపోయింది. లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ భారీ బావి గురించి ఎన్నో కథలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వీటన్నింటికి తేల్చేందుకు తాజాగా ఎనిమిది మంది సాహసికులతో ఓ బృందం లోపలికి దిగింది.
అందులో శవాల గుట్టలుగానీ, అస్థిపంజరాలుగానీ ఏవీ కనిపించలేవు. కనీసం కంపు వాసన కూడా రాలేదు. లోయ అడుగున ఓ జలపాతం, రంగు రాళ్లు, మేలిమి ముత్యాలు దొరికాయి వాళ్లకి. కాకపోతే కొన్ని పాములు మాత్రం కనిపించాయట. అక్కడ దొరికిన వాటి మీద రీసెర్చ్ చేసి.. ఆ బావి వయసు తేల్చే పనిలో పడ్డారు పరిశోధకులు.
గతంలో యెమెన్ అధికారుల బృందం ఒకటి ఈ బావిలో 50-60 మీటర్ల దాకా వెళ్లి భయంతో వెనక్కి వచ్చేసిందట. ప్రస్తుతం ఈ భారీ బావి మిస్టరీని చేధించినప్పటికీ.. ఆ ఊరి ప్రజలు మాత్రం ఆ బావి పక్కకు వెళ్లమనే చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment