Mystery: సెకండ్‌ షోకి వెళ్లి శవాలుగా తేలి.. గ్రిమ్స్‌ సిస్టర్స్‌ డెత్‌ స్టోరీ | Mystery: Unsolved Chicago Grimes Sisters Death Story In Telugu | Sakshi
Sakshi News home page

Mystery: తెల్లటి బొమ్మలు కాదు! సెకండ్‌ షోకి వెళ్లి శవాలుగా తేలి.. గ్రిమ్స్‌ సిస్టర్స్‌ డెత్‌ స్టోరీ

Published Sat, Sep 3 2022 3:23 PM | Last Updated on Sat, Sep 3 2022 4:53 PM

Mystery:  Unsolved Chicago Grimes Sisters Death Story In Telugu - Sakshi

ఇది ఇద్దరు అక్కాచెల్లెళ్ల విషాద గాథ. షికాగో చరిత్రలో అత్యంత అపఖ్యాతికి గురైన అపరిష్కృత వ్యథ. అది 1956 డిసెంబరు 28. షికాగోలోని ఇల్లినాయీకి చెందిన బార్బరా గ్రిమ్స్‌(15), ప్యాట్రీషియా గ్రిమ్స్‌(12) అనే ఇద్దరు సోదరీమణులు.. మెకిన్లీ పార్క్, బ్రైటన్‌ థియేటర్‌లోని అప్పటి స్టార్‌ హీరో అండ్‌ సింగర్‌ ‘ఎల్విస్‌ ప్రెస్లీ’ సినిమా ‘లవ్‌ మీ టెండర్‌’ సెకండ్‌ షోకి వెళ్లారు.

వాళ్లింటికి ఆ థియేటర్‌ కేవలం ఒకటిన్నర మైళ్ల దూరం. వాళ్లు ఆ సినిమా చూడటం అది పదకొండవసారి. ప్రెస్లీకి వీరాభిమానులైన ఆ అక్కాచెల్లెళ్లు  ప్రెస్లీ ఫ్యాన్స్‌ క్లబ్‌లో సభ్యులు కూడా.   

రాత్రి 7:30కి ఇంటి నుంచి బయలుదేరిన ఆ అమ్మాయిలు.. సినిమా చూసి, 11:45 కల్లా వచ్చేస్తామని తల్లి లోరిటాకి మాటిచ్చారు. పన్నెండు దాటినా రాకపోయేసరికి భయపడిన లోరిటా.. తన మరో కూతురు థెరిసా, కొడుకు జోయిలను బస్‌స్టాండ్‌కి పంపించింది చూసి రమ్మని. వాళ్ల ముందే మూడు బస్సులు వెళ్లిపోయాయి కానీ బార్బరా, ప్యాట్రీషియా మాత్రం రాలేదు. ఆ కుటుంబం.. ఆ బాలికల స్నేహితుల ఇళ్లకు పరుగుతీసింది.

అక్కడా నిరాశే ఎదురైంది. దాంతో వెంటనే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రౌండ్‌ సెర్చ్‌ మొదలుపెట్టారు. రోజులు గడిచేకొద్దీ సాక్షులు పెరిగారు తప్ప బాలికల ఆచూకీ మాత్రం దొరకలేదు. 

ప్యాట్రీషియా స్కూల్‌ ఫ్రెండ్‌ డోరతీ.. ‘ఆ రోజు రాత్రి నేనూ, మా అక్క కూడా అదే సినిమాకు వెళ్లాం. లేట్‌ అవుతుందనే ఉద్దేశంతో తొమ్మిదిన్నరకు ఇంటర్‌వెల్లో ఇంటికి వెళ్లిపోయాం. వెళ్తూ వెళ్తూ వాళ్లిద్దరినీ చూశాను. పాప్‌కార్న్‌ కొనుక్కోవడానికి క్యూలో నిలబడ్డారు. సంతోషంగానే కనిపించారు’ అని చెప్పింది.

మరికొందరు ప్రత్యక్షసాక్షులు.. మెర్క్యురీ మోడల్‌ కారులో వచ్చిన ఒక యువకుడితో బాలికలు మాట్లాడటం చూశామని.. ఆ వ్యక్తి అచ్చం ప్రెస్లీని పోలి ఉన్నాడని చెప్పారు. పత్రికల్లో విస్తృత ప్రచారం మొదలైంది. ‘ఆచూకి చెప్పండి’ అంటూ రివార్డ్‌లూ ప్రకటించారు.

అనుమానాలు, అరెస్ట్‌లు ముమ్మరంగానే సాగాయి. తన పిల్లల్ని వదిలిపెట్టిన వారిని మనస్ఫూర్తిగా క్షమిస్తానంటూ లోరిటా కిడ్నాపర్‌లకు పలు విజ్ఞప్తులూ చేసింది. డిసెంబర్‌ 28న బాలికలు తన బస్‌ ఎక్కారని, దాదాపు రాత్రి 11:05 గంటలకు వెస్ట్రన్‌ అవెన్యూలో దిగారని ఓ బస్‌ డ్రైవర్‌ సాక్ష్యమిచ్చాడు.

ఆ ప్రదేశం థియేటర్‌కి.. బాలికల ఇంటికి సరిగ్గా మధ్యలో ఉంటుంది. కాలం గడుస్తున్నా కొద్దీ.. ఆ అమ్మాయిల్ని ఎవ్వరూ కిడ్నాప్‌ చేయలేదని, వాళ్లంతట వాళ్లే ఇంటి నుంచి పారిపోయి స్వచ్ఛందంగా బాయ్‌ఫ్రెండ్స్‌తో ఉంటున్నారనే అభిప్రాయం స్థిరపడిపోయింది.

1957 జనవరి 19న టెలివిజన్‌లో ప్రెస్లీ గ్రేస్‌ల్యాండ్‌ ఎస్టేట్‌ నుంచి అమ్మాయిల కోసం అధికారిక ప్రకటన వెలువడింది. ‘మీరు నిజమైన ప్రెస్లీ అభిమానులైతే వెంటనే ఇంటికి వెళ్లిపోండి. మీ మీద బెంగతో మీ అమ్మ చిక్కిశల్యమవుతోంది’ అంటూ ప్రెస్లీ కూడా స్పందించాడు. అయినా కేసులో ఎలాంటి పురోగతి లేదు.

జనవరి 22న విల్లో స్ప్రింగ్స్‌లోని నిర్మానుష్య రహదారి పక్కన.. కరిగిన మంచు ముక్కల మధ్య.. లియోనార్డ్‌ ప్రెస్కాట్‌ అనే కార్మికుడికి..  రెండు తెల్లటి బొమ్మలు కనిపించాయి. అనుమానం వచ్చిన లియోనార్డ్‌.. దగ్గరల్లో ఉన్న తన ఇంటికి వెళ్లి భార్యను తీసుకొచ్చి వాటిని చూపించాడు. అవి బొమ్మలు కావు శవాలని గుర్తించిన అతడి భార్య అక్కడికక్కడే కళ్లు తిరిగి పడిపోయింది.

తేరుకుని ఆ ఇద్దరూ స్టేషన్‌కు పరుగుతీశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ శవాలు గ్రిమ్స్‌ సిస్టర్స్‌వని గుర్తించారు. వారిది నిజంగా కిడ్నాప్‌ అని,  లైంగికదాడి చేసి చంపేశారని నమ్మేవాళ్లు పెరిగారు. వాళ్లు కనిపించకుండా పోయిన(డిసెంబర్‌ 28) ఐదు గంటల వ్యవధిలోనే హత్యకు గురయ్యారని రిపోర్ట్స్‌ తేల్చాయి.

అయితే డిసెంబర్‌ 30 తర్వాత, జనవరి మొదటి వారాల్లో వాళ్లను హోటల్స్‌ దగ్గర, స్టోర్స్‌ దగ్గర చూశామంటూ చాలా మంది సాక్ష్యమిచ్చారు. అప్పటికే చనిపోయిన వారిని వాళ్లంతా ఎలా చూశారనేది పెద్ద మిస్టరీగా మారింది.

బాలికల శరీరాలపై తీవ్రమైన గాయాలేమీ లేవు కానీ కొట్టినట్లుగా కొన్ని మచ్చలు ఉన్నాయి. ఎలుక కొరికిన గాట్లున్నాయి (శవాలపై జరిగిన దాడి కావచ్చు). బాలికల్ని ఎక్కడో చంపి.. కారులో కౌంటీలైన్‌ రోడ్‌కి తీసుకొచ్చి పడేసి ఉంటారని, మంచులో ఉండటం వల్లే శవాలు త్వరగా పాడుకాలేదని అంచనాకు వచ్చారు నిపుణులు.

ఎన్నిసార్లు పరీక్షలు నిర్వహించినా వాళ్లిద్దరూ ఊహించని షాక్‌ వల్లే చనిపోయినట్లు రిపోర్ట్స్‌ వచ్చాయి తప్ప మరే కారణాన్ని స్పష్టపరచలేదు. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి 3 లక్షల మందిని విచారించారు పోలీసులు. రెండు వేల మందిపై పూర్తి నిఘా పెట్టారు. ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.

వారిలో ఎడ్వర్డ్‌ బెడ్‌వెల్‌ అనే వ్యక్తిపై సుదీర్ఘ విచారణ జరిగింది. నేరాన్ని అంగీకరించాలని తనను తీవ్రంగా ఒత్తిడి చేశారని అతడు కోర్టు ముందు వాపోయాడు. ఆ తర్వాత అభియోగాల నుంచి బయటపడ్డాడు.

అయితే అసలు నేరస్థులు ఎవరు? బాలికలు తమ ఇష్టంతోనే వెళ్లారా? లేక వాళ్లను బలవంతంగా లాక్కెళ్లారా? బాలికలకు తెలిసిన వాళ్ల పనేనా? లేక అపరిచితుల కుట్రా? అసలు సాక్ష్యులంతా నిజమే చెప్పారా లేదా? అనేది నేటికీ తేలలేదు.
-సంహిత నిమ్మన
చదవండి: Mystery: పసికందుగా మాయమై.. ఐదుగురు పిల్లల తల్లిగా! కానీ ఆమె తల్లిదండ్రుల్ని చంపిందెవరు?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement