సాక్షి, విశాఖపట్టణం: మూడు రోజుల కిందట విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అదృశ్యమైన ఉద్యోగి శ్రీనివాసరావు ఆచూకీ ఇంకా లభించలేదు. బ్లాస్ట్ ఫర్నేస్‌లో ఆత్మాహుతి చేసుకుంటున్నట్టు అతడు లేఖ రాసి అదృశ్యమయ్యాడు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం కోసం ఆత్మహుతి అవుతున్నట్టు లేక రాసి కనిపించకపోవడం కలకలం రేపింది. అయితే ఆయన అదృశ్యం వెనుక మిస్టరీ దాగి ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం అతడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. శ్రీనివాసరావు కాల్ డేటా బట్టి పలువురిని విచారిస్తున్నారు. అయితే పోలీసుల విచారణలో అతడి గురించి పలు షాకింగ్ విషయాలు తెలిసినట్లు సమాచారం. ఉద్యోగాల పేరిట పలువురు వద్ద రూ.లక్షలు వసూలు చేసినట్టు శ్రీనివాస్‌పై ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కొందరు బాధితులు బయటకు వస్తున్నారు.
శ్రీనివాసరావు పని చేసిన స్టీల్ వైర్ రాడ్ మిల్ ఈ విభాగంలో ప్రత్యేకంగా డాగ్ స్క్వాడ్ ద్వారా పోలీసులు విచారణ చేపట్టారు. జాగిలాలు అతను కూర్చున్న ప్రదేశం నుంచి బ్లాస్ట్ ఫర్నేస్‌కు అక్కడి నుంచి వాహనం పార్కింగ్ చేసిన ప్రదేశం వరకు వెళ్లాయి. ఈ దశలో బ్లాస్ట్ ఫర్నేస్‌లోకి వెళ్లే అవకాశాలు తక్కువ కావడంతో శ్రీనివాసరావు మరో చోట ఉండి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
గాజువాక సింహగిరి కాలనీలో ఉంటున్న శ్రీనివాస రావు భార్య సుమ ఆధ్యాత్మక చింతనతో పలువురితో స్నేహ సంబంధాలు కొనసాగిస్తోంది. ఆ పరిచయాలతో స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ శ్రీనివాస రావు పలువురు వద్ద లక్షల రూపాయలు తీసుకున్నట్టు ఫిర్యాదులు అందాయి. ఆ డబ్బుతోనే గాజువాక మురళీనగర్ పరిసర ప్రాంతాల్లో శ్రీనివాసరావు పెద్ద ఎత్తున భవంతులు నిర్మించుకున్నాడని బాధితులు చెబుతున్నారు. శ్రీనివాస రావు అదృశ్యమైన రోజే తమకు ఆన్‌లైన్‌లో అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుతాయని చెప్పినట్లు బాధితులు వాపోయారు. తమను నమ్మించి మోసగించాడని ఆందోళన చెందుతున్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని సాకుగా చూపించి మోసం నుంచి బయట పడాలని శ్రీనివాసరావు ప్రయత్నించాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే అతను ఆచూకీ కనిపించకపోవడం అనుమానాలకు దారితీస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment