రాయవరం: రాయవరంలో కిడ్నాప్‌కు గురైన చిన్నారి వేమగిరి చైతన్యకుమార్ 48 గంటలు దాటినా ఆచూకీ లభించలేదు. ఈనెల 24న రెండున్నరేళ్ల చైతన్యకుమార్ కిడ్నాప్‌కు గురైనట్టుగా రాయవరం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న విషయం పాఠకులకు విదితమే. రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి పర్యవేక్షణలో అనపర్తి సీఐ ఎన్‌వీ భాస్కరరావు, ఎస్సై సురేష్‌ల ఆధ్వర్యంలో ఐదు దర్యాప్తు బృందాలు కేసును దర్యాప్తు చేస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా మంగళవారం ఒక బృందం చైతన్యకుమార్ తల్లిదండ్రుల స్వగ్రామమైన అడ్డతీగల మండలం డొక్కపాలేనికి వెళ్లి విచారణ చేశారు. అసలు బాబు కిడ్నాప్‌కు గురయ్యాడా? లేక తుల్యభాగ డ్రైన్‌లో పడిపోయాడా? ఇలా అంతుచిక్కని ప్రశ్నలతో పోలీసులు తలలు పట్టుకుంటుండగా.. తమ చిట్టికన్న ఏమయ్యాడో!, ఎక్కడున్నాడో! అని తల్లిదండ్రులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. నిద్రాహారాలు లేకుండా నీరసించి తమ కుమారుడి ఆచూకీ కోసం కుమిలిపోతున్నారు.
వలలతో గాలింపు
చైతన్యకుమార్ కిడ్నాప్‌కు గురైనట్టుగా చెబుతున్న వి.సావరం ఇటుకల బట్టీ వద్ద, రాయవరం గ్రామ పరిధిలోని లోవరాజు, దుర్గాభవానీలు నివాసం ఉంటున్న బట్టీ వద్ద పోలీసులు మరోమారు దర్యాప్తు చేపట్టారు. చైతన్యకుమార్ కనిపించకుండా పోయిన బట్టీకి ఎదురుగా తుల్యభాగ మేజర్ డ్రైన్ ఉండడంతో, డ్రైన్లో బాలుడు పడిపోయి ఉండి ఉండవచ్చనే అనుమానంతో గాలింపు చేపట్టారు. డ్రైన్‌లో గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టడంతో పాటుగా, డ్రైన్‌కు అడ్డంగా వల కట్టారు. అలాగే కాకినాడ నుంచి తీసుకుని వచ్చిన స్నిఫర్ డాగ్‌తో బాలుడి ఆచూకీకి ప్రయత్నించారు. స్నిఫర్ డాగ్ రెండు బట్టీల వద్దకు వెళ్లింది.
తలలు పట్టుకుంటున్న పోలీసులు
48 గంటలు దాటినా బాలుడి ఆచూకీ లభించక పోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఘటనా స్థలానికి నాలుగు వైపులా ఉన్న గ్రామాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. సీసీ ఫుటేజీల్లో ఎటువంటి ఆధారాలు లభించలేదు. కనీసం ఏ ఒక్క చిన్న క్లూ లభించినా, దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టేందుకు అవకాశం ఉండేది. అసలు బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడా? తుల్యభాగ మేజర్ డ్రైన్లో పడి పోయాడా? అంటూ పలు కోణాల్లో పోలీసుల దర్యాప్తు సాగుతుంది. సెల్ టవర్ల ద్వారా కాల్ డేటాను పరిశీలించే పనిలో పడ్డారు.
ఇంకా మిస్టరీగానే చిన్నారి కిడ్నాప్ కేసు
Published Wed, Jan 27 2021 8:39 AM | Last Updated on Wed, Jan 27 2021 11:37 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment