అలికిడిలేని ఇళ్ల చుట్టూ హడలెత్తించే కథలల్లుకోవడం కొత్తేం కాదు. అందుకే చాలా పాడుబడిన భవనాలు ఇప్పటికీ మిస్టరీలుగా ప్రపంచాన్ని వణికిస్తుంటాయి. థాయ్‌లండ్ రాజధాని బ్యాంకాక్‌లో 49 అంతస్తులతో అసంపూర్ణంగా మిగిలిపోయిన ‘ఘోస్ట్ టవర్’ కూడా అలాంటిదే! దీని అసలు పేరు సాథోర్న్ యూనిక్ టవర్. ఇదొక దయ్యాల భవనంగా 1997 నుంచి 2014 వరకూ పుకార్లతో షికార్లు చేసింది. ఈ భవంతిలోని 43వ అంతస్తులో 2014 డిసెంబర్ 5న స్వీడిష్ టూరిస్ట్ మృతదేహం..ఈ పుకార్లకు సాక్ష్యాన్నిచ్చింది.
2014లో.. అప్పటికే 17 ఏళ్లుగా మూసే ఉంటున్న ఈ టవర్‌లో.. స్వీడిష్ టూరిస్ట్ ఉరి తాడుకు వేలాడటం స్థానికులను హడలెత్తించింది. ప్రపంచ మీడియాను కదిలించింది. నథాపత్ అనే 33 ఏళ్ల ఫొటోగ్రాఫర్.. మొదటగా ఈ భవనంలో స్వీడిష్ టూరిస్ట్ మృతదేహాన్ని గుర్తించాడు. 30 ఏళ్ల స్వీడిష్ టూరిస్ట్ జేబులో దొరికిన డ్రైవింగ్ లైసెన్స్ సాయంతో నవంబర్ 10 థాయిలండ్‌కు వచ్చాడని.. అక్కడే ఓ గెస్ట్‌హౌస్‌ను అద్దెకు తీసుకున్నాడని తేలింది. మృతదేహం దొరికిన్నాటికే అతడు చనిపోయి ఐదు రోజులు అయ్యుండొచ్చని వైద్యనిపుణులు అంచనా వేశారు. కానీ మరణానికి అసలు కారణం స్పష్టం కాలేదు.
అతని కలే ఈ భవనం..
1990లో రంగ్సన్ టోర్సువాన్ అనే ప్రముఖ థాయ్ వాస్తుశిల్పి.. విలాసవంతమైన ‘కండోమినియం కాంప్లెక్స్’ కట్టాలని కలగన్నాడు. అతడు స్వయంగా డెవలపర్ కావడంతో ఆశపడినట్లే దీని నిర్మాణాన్ని అనుకున్న సమయానికి ప్రారంభించాడు. అయితే అనుకోకుండా 1993లో థాయ్ సుప్రీంకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి మర్డర్ కేసులో ఇరుక్కున్న టోర్సువాన్.. జైలుకెళ్లాల్సి వచ్చింది. ఆర్థిక కష్టాలు మొదలుకావడం, యజమాని జైల్లో ఉండటంతో 1997లోనే ఈ నిర్మాణం ఆగిపోయింది. అప్పటికే 80 శాతం పూర్తయిన ఈ టవర్.. అసంపూర్ణంగానే మూలపడింది. నాటి నుంచి నేటికీ ఆ భవనంలో ప్రేతాత్మలున్నాయని చాలామంది నమ్ముతారు. ఆ నమ్మకానికి స్వీడిష్ డెత్ మిస్టరీ మరింత బలం చేకూర్చింది. చివరికి టోర్సువాన్.. 2010లో నిర్దోషిగా బయటికి వచ్చాడు.
దయ్యాలు, మూఢనమ్మకాల చుట్టూ తిరిగే కొందరు మాత్రం ఈ పాడుబడిన భవనం గురించి మాట్లాడుకునేటప్పుడు.. టోర్సువాన్ పతనానికి ఈ భవననిర్మాణమే కారణమని భావిస్తుంటారు. ఎందుకంటే ఆ స్థలంలో గతంలో శ్మశానవాటిక ఉండేదని, దాన్ని పూర్తిగా పూడ్చేసి టోర్సువాన్ ఈ టవర్ కట్టాడని చెప్పుకుంటారు. ఒకప్పుడు ఈ టవర్‌పైకి ఎక్కడానికి అడ్డదార్లను వెతికే ఔత్సాహికులు కొందరు ఇక్కడి సెక్యూరిటీ గార్డులకు లంచం ఇచ్చి మరీ లోపలికి వెళ్లి సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పెట్టేవారు.
కానీ స్వీడిష్ టూరిస్ట్ మరణం తర్వాత సెక్యూరిటీ మరింత పెరిగింది. అలాగే 2015 నుంచి రంగ్సాన్ టోర్సువాన్ వారసుడు పన్సిత్ టోర్సువాన్.. టవర్‌పైకి ఎక్కి ఆన్‌లైన్‌లో ఫొటోలు షేర్ చేసేవారిపై కేసులు పెట్టడం మొదలుపెట్టాడు. దాంతో ఈ టవర్‌లోకి అడుగుపెట్టే సాహనం ఎవరూ చేయడం లేదు. ఏది ఏమైనా ఈ టవర్‌లో దయ్యాలు ఉన్నాయా? స్వీడిష్ టూరిస్ట్ ఎలా చనిపోయాడు? ఎవరైనా అతన్ని చంపి, అక్కడ ఉరితాడుకు కట్టేసి నేరం నుంచి తప్పించుకున్నారా? లేక దయ్యాలే దాడి చేశాయా? వంటివన్నీ నేటికీ మిస్టరీనే!
∙సంహిత నిమ్మన
(చదవండి: అక్కడ కవి పుట్టిన రోజు ‘బర్న్స్ నైట్’ పేరుతో ఓ పండుగలా ..!)
Comments
Please login to add a commentAdd a comment