సాక్షి, తిరుపతి: ఉన్నట్లుండి గడ్డివాములకు నిప్పంటుకోవడం.. ఇళ్లలో బట్టలకు మంటలు.. ఒకానొక టైంలో తాళం వేసిన ఇళ్లలోని బీరువాలో బట్టలు తగలబడిపోవడం.. జిల్లాలో గత నెలరోజులుగా చర్చనీయాంశంగా మారింది శానంబట్ల(కొత్త) గ్రామ మంటల మిస్టరీ. భయభ్రాంతులతో బిక్కుబిక్కుమంటూ గడిపారు ఆ ఊరి ప్రజలు. ఒకానొక టైంలో ఇది ఊరికి పట్టిన శాపమంటూ ఊరు విడిచిపోయారు కొందరు. అయితే తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు చేర్చారు. ఆకతాయిల పనిగా మొదలై.. ఇది ప్రతీకార చర్యగా కొనసాగిందని నిర్ధారించారు.
చంద్రగిరి మండలం కొత్తశానంభట్ల గ్రామం లో మంటల మిస్టరీ చేధించారు పోలీసులు. తొలుత కొందరు ఆకతాయిలు ఓ గడ్డివాముకు నిప్పు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇదనుగా తల్లి బంధువులపై విద్వేషంతో రగిలిపోతున్న కీర్తి అనే మహిళ.. తొలుత ఎదురింట్లో గడ్డివాముకు నిప్పు పెట్టింది. ఆ తర్వాత వరుసగా బంధువుల ఇళ్లలో నిప్పు పెడుతూ వచ్చింది. కేవలం అగ్గిపుల్లలతోనే నిప్పు పెడుతూ ఊరందరినీ భయభ్రాంతులకు గురి చేసిందామె.
ఈలోపు అగ్ని ప్రమాదంలో నష్టపోయివారికి కొందరు ఆర్థిక సాయం అందిస్తూ వచ్చారు. దీంతో అత్యాశకు పోయిన గ్రామంలోని ఇద్దరు.. కావాలనే తమ ఇళ్లలో నిప్పు పెట్టుకున్నారు. దర్యాప్తులో ఇదంతా గుర్తించిన పోలీసులు.. కీర్తితో పాటు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం వాళ్లను మీడియా ముందు ప్రవేశపెట్టి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు ఎంఆర్‌పల్లి పోలీసులు.
ఇదిలా ఉంటే.. ఉన్నట్లుండి గడ్డి వాములు తగలబడి పోవడం, బీరువాలు, కప్‌బోర్డుల్లోని బట్టలకు నిప్పంటుకోవడంలాంటి పరిణామాలతో కొత్తశానంభట్ల గ్రామస్తులు వణికిపోయారు. తొలుత పిల్లపాలెం అన్నదమ్ములకు సంబంధించిన నాలుగు ఇళ్లలో, వారి పొలాల్లో మాత్రమే మంటలు వ్యాప్తి చెందగా.. ప్రస్తుతం ఇతరుల ఇళ్లలోనూ మంటలు వ్యాపించడంతో ప్రజలు వణికిపోయారు. ఈ మంటల వెనుక కారణం ఏంటో తేల్చే పనిలో పోలీసులు తలమునకలయ్యారు. క్లూ టీంతో ఆధారాలు సేకరిస్తూ.. గ్రామంలో భారీగా పికెటింగ్ నిర్వహించారు. అదే సమయంలో.. ఇది గ్రామ దేవత శాపమని, ఓ బుడబుక్కలవాడి శాపమని, కాదు.. 40 ఏళ్ల కిందట సైతం ఇలాగే మంటలు వ్యాపించేవని కొందరు వృద్ధులు ప్రచారంలోకి దిగడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment