పదహారేళ్ల జేనెట్ బయటకు వెళ్లడానికి రెడీ అయింది. ‘మమ్మీ! ఫ్రెండ్‌ను కలవడానికి ట్రెయిన్‌లో వెళుతున్నా... తొందరగానే వచ్చేస్తాలే’ చెప్పింది జేనెట్. ‘సరేనమ్మా! జాగ్రత్త!’ సాగనంపింది తల్లి.
ఇది జరిగి నేటికి సరిగ్గా యాభయ్యేళ్లు. అంటే, 1972 ఆగస్టు 7న తల్లితో చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది జేనెట్ డి పామా. వెళ్లడమైతే వెళ్లింది గాని, ఇంటికి తిరిగి రాలేదు.
ఇంటి నుంచి వెళ్లిన అమ్మాయి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు వెదుకులాడారు. ఆరాతీశారు. ఫ్రెండ్ దగ్గరకు కూడా చేరలేదని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అమెరికాలోని న్యూజెర్సీలో యూనియన్ కౌంటీ స్ప్రింగ్‌ఫీల్డ్ టౌన్‌షిప్ క్లియర్‌వ్యూ రోడ్డులో ఉంటుందా ఇల్లు. స్ప్రింగ్‌ఫీల్డ్ పోలీసులు ఇంటికి వచ్చి, తల్లిదండ్రుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.
స్ప్రింగ్‌ఫీల్డ్ పోలీసులు రోజుల తరబడి చాలాచోట్ల గాలించారు. ఫలితం కనిపించలేదు. ఆరువారాలు గడిచాక ఒకరోజు– సెప్టెంబర్ 19న ఒక కుక్క కుళ్లిపోయే దశలో ఉన్న అమ్మాయి మోచేతిని నోట కరుచుకుని వచ్చింది. దాని ఆధారంగా పోలీసులు వెదుకులాట మొదలుపెట్టారు.
కుక్క వచ్చిన దారిలో వెదుకులాడుతూ స్ప్రింగ్‌ఫీల్డ్‌లోని హూడై క్వారీ కొండ శిఖరం మీదకు చేరుకున్నారు. అక్కడ కనిపించిన దృశ్యం ఒళ్లు జలదరించేలా ఉంది. అర్ధగోళాకారంలో పేర్చి ఉన్న చెట్ల కొమ్మలు, కలప దుంగల కింద అమ్మాయి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. మృతదేహం ఒక ముగ్గులాంటి ఆకారం మీద పడి ఉంది.
మృతదేహం చుట్టూ జంతువులను బలిచ్చినట్లుగా జంతు కళేబరాల అవశేషాలు కనిపించాయి. పరిసరాల్లోని దృశ్యాన్ని బట్టి క్షుద్రపూజల కోసం ఎవరో తాంత్రికులు అమ్మాయిని బలి ఇచ్చి ఉండవచ్చని స్థానికులు చెవులు కొరుకున్నారు. అయితే, పోలీసులు ఆ వాదనలను కొట్టి పారేశారు.
చకచకా చెట్ల కొమ్మలను, దుంగలను తొలగించి, మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం కనిపించకుండా పోయిన జేనెట్‌దేనని గుర్తించారు. నిబంధనల ప్రకారం అక్కడ జరగాల్సిన తతంగాన్ని పూర్తి చేశాక, పోస్ట్‌మార్టమ్ కోసం తరలించారు.
పోస్ట్‌మార్టంలో ఆమె మరణానికి దారితీసిన కారణాలేవీ బయటపడలేదు. శరీరంపై కత్తిపోట్లు, తూటాల గాయాలు ఏవీ లేవు. అఘాయిత్యం జరిపి, హింసించి గాయపరచిన ఆధారాల్లేవు. ఎముకలు విరిగిన గుర్తుల్లేవు. కనీసం మాదక ద్రవ్యాలు లేదా విషపదార్థాల ఆనవాళ్లు కూడా శవపరీక్షలో దొరకలేదు. కచ్చితమైన ఆధారాలు దొరకకున్నా, బహుశ గొంతు నొక్కేయడం వల్ల ఆమె మరణించి ఉంటుందని పోస్టుమార్టం జరిపిన డాక్టర్లు నివేదిక ఇచ్చి, అంతటితో చేతులు దులిపేసుకున్నారు.
జేనెట్ చనిపోయిన రెండువారాల నుంచి పత్రికల్లో రకరకాల కథనాలు మొదలయ్యాయి. క్షుద్ర తాంత్రికుల నరబలికి ఆమె బలైపోయి ఉంటుందనే వాదనతో ఈ పత్రికలు ప్రచురించిన కథనాలు అమెరికా అంతటా కలకలం రేపాయి. యూనియన్ కౌంటీలోని వాచుంగ్ అభయారణ్యం క్షుద్రతాంత్రికులకు అడ్డాగా పేరు మోసింది.
జేనెట్ మృతదేహం వాచుంగ్ అభయారణ్యానికి చేరువలోనే ఉన్న క్వారీ కొండపై లభించడంతో జనాలు కూడా పత్రికల వాదనను నమ్మారు. అంతేకాదు, జేనెట్ మరణానికి కొద్దినెలల ముందు జాన్ లిస్ట్ అనే ఉన్మాది యూనియన్ కౌంటీలో తన భార్యను, తల్లిని, ముగ్గురు పిల్లలను చంపేసి పారిపోయాడు.
దాంతో యూనియన్ కౌంటీ జనాలు సాయంత్రమైతే చాలు ఇంటి బయటకు అడుగు పెట్టాలంటేనే వణికిపోయేవాళ్లు. అయితే, జేనెట్ మరణానికి పోస్ట్‌మార్టంలో కూడా కారణాలు బయట పడకపోవడంతో కేసు మూలపడింది.
దశాబ్దాలు గడిచాక ఈ కేసు మళ్లీ చర్చలోకి వచ్చింది. అదెలాగంటే, ‘వీయర్డ్ ఎన్‌జే మేగజైన్’ కార్యాలయానికి 1990ల చివర్లోను, 2000 ప్రారంభంలోను జేనెట్ మరణానికి సంబంధించి వరుసగా ఆకాశ రామన్న ఉత్తరాలు వచ్చాయి. ఆ పత్రిక ఎడిటర్ మార్క్ మోరాన్ ఈ కేసుపై పరిశోధన ప్రారంభించాడు.
తన పరిశోధనలో కనుగొన్న అంశాలతో, పలు అనుమానాలతో వరుస కథనాలను ప్రచురించాడు. ఈ కేసు ఫైలును స్ప్రింగ్‌ఫీల్డ్ పోలీసులు పోగొట్టుకుని ఉంటారని లేదా నాశనమైనా చేసి ఉంటారనే అనుమానం కూడా ఆయన తన కథనాల్లో వ్యక్తం చేయడంతో దీనిపై మళ్లీ కలకలం మొదలైంది. మీడియా గట్టిగా నిలదీయడంతో 1999 నాటి ఫ్లాయిడ్ తుపానులో ఈ కేసు ఫైలు గల్లంతైందని పోలీసులు అంగీకరించారు.
అయితే, దాని ప్రతి మాత్రం పదిలంగానే ఉందని చెప్పారు. దరిమిలా జేనెట్ మరణంపై ఎడిటర్ మోరాన్ తన పత్రికలోనే పనిచేసే కరస్పాండెంట్ జెస్సీ పోలాక్‌తో కలసి ‘డెత్ ఆన్ ది డెవిల్స్ టీత్’ అనే పుస్తకం రాశాడు. ఈ పుస్తకం స్థానికంగా సంచలనం కలిగించింది.
జేనెట్‌కు న్యాయం జరిపించాలంటూ స్థానికులు ఏకంగా ‘జస్టిస్ ఫర్ జేనెట్ డి పామా’ పేరుతో ఒక సంస్థనే ప్రారంభించి, న్యాయ పోరాటానికి రంగంలోకి దిగారు. జేనెట్ దుస్తులను డీఎన్‌ఏ పరీక్షలకు పంపాలంటూ కోర్టుకు వెళ్లారు. అధునాతనమైన డీఎన్‌ఏ పరీక్షల ద్వారా ఈ సంఘటనకు గల కారణాలు బయటపడవచ్చని భావిస్తున్నామని ఈ సంస్థ ప్రతినిధులు ఆశాభావంతో ఉన్నారు. ఈ కేసులో నిజం ఎప్పటికైనా బయటపడుతుందా? జేనెట్‌ను చంపిందెవరో వెలుగులోకి వస్తుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
చదవండి: 1991 Austin Yogurt Shop Killings: యోగర్ట్ షాప్ హత్యలు.. ఇప్పటికీ మిస్టరీ గానే..!
Comments
Please login to add a commentAdd a comment