నిందితుడు హ్యాకర్ శ్రీకృష్ణ
సాక్షి, బనశంకరి(కర్ణాటక): బిట్‌కాయిన్ కుంభకోణంలో సీసీబీ పోలీసుల విచారణలో రోజూ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. కుంభ కోణానికి కేంద్రబిందువైన శ్రీకృష్ణ అలియాస్ శ్రీకి, పలు వెబ్‌సైట్లను హ్యాక్ చేసి బిట్‌కాయిన్ కార్యకలాపాలకు ఎలా పాల్పడింది బహిర్గతమైంది. ఐదేళ్ల పాటు బిట్‌కాయిన్ దందాలో భాగస్వామిగా తాజాగా సీసీబీ పోలీసులకు పట్టుబడిన రెండో వ్యక్తి రాబిన్ ఖండేన్‌వాలా.
ఇతడు శ్రీకి దందా పట్ల నోరువిప్పాడు. హ్యాకింగ్ ఎలా చేశారు, ఎవరికి బిట్‌కాయిన్లను విక్రయించారు, ఈ దందాలో ఎవరెవరు భాగస్వామిగా ఉన్నారు అనే విషయాలపై రాబిన్ ఏడు పేజీల వాంగ్మూలం ఇచ్చాడు.
ఎవరీ ఖండేన్‌వాలా?
పశ్చిమబెంగాల్ కు చెందిన రాబిన్‌ఖండేన్‌వాలా సీఏ పట్టభద్రుడు కాగా 2012 నుంచి 16 వరకు తండ్రి నిర్వహించే రైస్‌మిల్ చూసుకునేవాడు. 2016లో రాబిన్ సర్వీసెన్ పేరుతో బిట్‌కాయిన్ లావాదేవీలను ప్రారంభించాడు. పలు వెబ్‌సైట్ల తెరిచి అమ్మకం, కొనుగోళ్లను చేసేవాడు. ఇంతవరకు రూ.50 కోట్లు వ్యవహారాలు నిర్వహించినట్లు తెలిసింది. 2017 ఏప్రిల్‌లో హ్యాకర్ శ్రీకృష్ణ ఆన్‌లైన్లో పరిచయమయ్యాడు.
ఇద్దరు చాటింగ్ చేసుకునేవారు. ఈ సమయంలో శ్రీకృష్ణ తనవద్దనున్న 900 బిట్‌కాయిన్లు విక్రయించాలని కోరగా, రాబిన్ వాటిని అమ్మి ఆ డబ్బును శ్రీకి అకౌంట్‌లోకి జమచేశాడు. సుమారు రూ. ఐదారు కోట్ల వ్యవహారాలు నడిపారు.
వందలాది కాయిన్ల అమ్మకాలు
శ్రీకి గోవాలో పోకర్ ఆన్‌లైన్ గేమ్ వెబ్‌సైట్లను హ్యాక్ చేశాడని రాబిన్ చెప్పాడు. అలా శ్రీకి కోట్లాది రూపాయలను దోచుకుని గోవాలో విలాసాలు చేసేవాడు. 2017 నుంచి అనేక వెబ్‌సైట్లను హ్యాక్ చేసిన శ్రీకి 130 బిట్‌కాయిన్లను రాబిన్ ఖండేన్‌వాలాకు ఇచ్చాడు.
దీనిని విక్రయించి రూ.3.48 కోట్ల నగదును 50 మందికి పైగా అకౌంట్లలోకి జమచేశాడు. మిగిలిన డబ్బును శ్రీకి జల్సాలకు చెల్లించాడు. శ్రీకి హ్యాక్ చేయడానికి యాపిల్ మ్యాక్‌బుక్ ప్రొ ల్యాప్‌టాప్‌ను వినియోగించేవాడు.
హవాలా ద్వారా రూ.4.98 కోట్లు
2017లో శ్రీకృష్ణ ఇరిడియం టోకెన్లను అందించి రాబిన్ ద్వారా అమ్మేయించాడు. 2018లో బెంగళూరు కు వచ్చినప్పుడు శ్రీకి హ్యాకర్ అని తెలిసిందని విచారణలో చెప్పాడు. ఒక హోటల్‌లో శ్రీకి, మహమ్మద్ నలపాడ్ తదితరులు తనను కలిశారని తెలిపాడు. బిట్‌కాయిన్ల గురించి చర్చ జరిపామని, కొద్దినెలల తరువాత ఓ కేసులో నలపాడ్ అరెస్టయ్యాడు. ఈ సమయంలో శ్రీకికి తన ఇంట్లో ఐదురోజులు ఆశ్రయం ఇచ్చానని, ఈ సమయంలో ఢిల్లీ, చండీఘడ్, జైపూర్, ముంబై తదితరాలకు వెళ్లినట్లు రాబిన్ చెప్పాడు.
2018లో శ్రీకి అడగడంతో 30 బిట్‌కాయిన్లను బదిలీ చేశానని, సుజయ్, సునీశ్, ప్రసిద్ధ్ శెట్టి, సురేశ్ అనే వారిని పరిచయం చేశాడన్నారు. శ్రీకి కి నగదు కావాలనడంతో హైదరాబాద్ అభిషేక్ ద్వారా హవాలా మార్గంలో మొత్తం రూ.4.98 కోట్ల నగదు పంపించానని వివరించాడు.
బిట్‌కాయిన్ నిందితులను వదలం : సీఎం
శివాజీనగర: బిట్ కాయిన్ స్కామ్‌ను బయటికి తీసుకురావడం, విచారణ చేపట్టింది మేమే. ఇందులో ఎంతటి బలమైన వ్యక్తులున్నా శిక్షిస్తాం అని సీఎం బొమ్మై చెప్పారు. ఆదివారం విధానసౌధ ముందు నెహ్రూ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించిన తరువాత మాట్లాడారు.
ఈ కేసులు ఈడీ, సీబీఐకి అప్పగించాము. వారు కోరిన సమాచారాన్ని అందించాము. 2018లో కాంగ్రెస్ సర్కారు నిందితుడు శ్రీకృష్ణను విచారించి ఉంటే అన్ని విషయాలూ బహిరంగమయ్యేవి. ఈ కేసు విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం. ఎక్కడ మోసం జరిగినా చర్యలు తీసుకొంటాము అని చెప్పారు.
నన్ను వదిలేయండి: నలపాడ్
బిట్‌కాయిన్ స్కామ్‌లో నా పాత్ర లేదు, అనవసరంగా నా పేరును ప్రస్తావించి వేధించవద్దు అని కాంగ్రెస్ నేత మహమ్మద్ నలపాడ్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ 2021 జనవరిలో బిట్ కాయిన్ కేసు బయటికి వచ్చింది.
దీంతో నాకు సంబంధం ఉంటే ఎప్పుడో అరెస్టు చేసేవారు కదా అని అన్నారు. యూబీ సిటీలో గొడవ కేసులో 117 రోజులు జైలులో ఉన్నాను, మా నాన్న హ్యారిస్ ఎమ్మెల్యే కాబట్టి నాపై కొందరు బురదచల్లుతున్నారు అని అన్నారు. నన్ను, నా కుటుంబాన్ని వదిలేయండి అని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment