అసలు టార్గెట్‌ ట్యాపింగ్‌ కాదా? Praneet Rao case has become a mystery | Sakshi
Sakshi News home page

అసలు టార్గెట్‌ ట్యాపింగ్‌ కాదా?

Published Tue, Mar 19 2024 5:34 AM | Last Updated on Tue, Mar 19 2024 12:01 PM

Praneet Rao case has become a mystery - Sakshi

మిస్టరీగా మారిన ప్రణీత్‌రావు కేసు

ఎఫ్‌ఐఆర్, రిమాండ్‌ రిపోర్టు అభియోగాల్లో కనిపించని సంబంధిత ‘యాక్ట్‌’

వారం రోజుల విచారణ దేనికోసమనే సందేహాలు

సాక్షి, హైదరాబాద్‌: స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) కార్యాలయం కేంద్రంగా డీఎస్పీ ‘ప్రణీత్‌రావు అండ్‌ కో’ అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి సీఎం రేవంత్‌రెడ్డి సహా అనేక మంది ఫోన్లను ట్యాప్‌ చేశారు... ఈ నెల తొలి వారం నుంచి పోలీసులు లీకుల రూపంలో చెబు తున్న అంశం ఇది. అయితే పంజగుట్ట ఠాణాలో నమోదైన ప్రణీత్‌ కేసు, ఆయన రిమాండ్‌ రిపోర్టులో ఎక్కడా ట్యాపింగ్‌ నేరానికి సంబంధించిన చట్టం ప్రస్తావన లేకపోవడం గమనార్హం.

ఈ నేపథ్యంలో సిట్‌ దర్యాప్తు టార్గెట్‌ వేరే ఉందా? అనే అనుమానాలు కలు గుతున్నా యి. ప్రణీత్‌ వారం రోజుల కస్టడీ దేనికోసమో అంతు చిక్క ట్లేదు. కేసులో ఒక్కటి మినహా అన్నీ బెయిలబుల్‌ సెక్షన్లే. ఏపీలో నమోదైన ‘స్కిల్‌డెవల ప్‌మెంట్‌’ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడానికి కారణమైన ఐపీసీలోని 409సెక్షన్‌ ఈ కేసులోనూ ఉండటంతో ప్రణీత్‌ జ్యుడీషియల్‌ రిమాండ్‌కు వెళ్లాడని నిపుణులు చెప్తున్నారు.

సస్పెన్షన్‌ ఉత్తర్వుల్లో అస్పష్టంగా..
ఎస్‌ఐబీలో అంతర్భాగమైన స్పెషల్‌ ఆపరే షన్స్‌ టార్గెట్‌ (ఎస్‌ఓటీ) బృందానికి నేతృత్వం వహించిన ప్రణీత్‌.. ప్రభుత్వం మారిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా డిస్ట్రిక్ట్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరోకు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐబీ అంతర్గత విచారణలో ఆయన చేసిన అవక తవకలు వెలుగులోకి వచ్చాయి. ఈ విభాగాధిపతి ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రణీత్‌ను సస్పెండ్‌ చేస్తూ డీజీపీ ఈ నెల మొదటి వారంలో ఉత్తర్వులు జారీ చేశారు.

వీటిలో కొంత వరకు ట్యాపింగ్‌కు సంబంధించిన ఆరోపణలున్నాయి. ఎస్‌ఓ టీకి ఉద్దేశించిన లీజ్డ్‌ లైన్, ఇంటర్నెట్‌ కనెక్షన్లను ప్రణీత్‌ దుర్వినియోగం చేశారని అందులో ఆరోపించారు. అందులోనే 42 హార్డ్‌డిస్క్‌లు మార్చేయడం, ధ్వంసం చేయడం అంశాన్నీ ప్రస్తావించారు. ఈ సస్పెన్షన్‌ జరిగిన వారం తర్వాత ఎస్‌ఐబీ ఏఎస్పీ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసుస్టేషన్‌లో ప్రణీత్, ఇతరులపై కేసు నమోదైంది. 

ఆ రెంటిలో కనిపించని ప్రస్తావన...
ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు మూడు చట్టాల్లోని 9 సెక్షన్ల కింద అభియోగాలు చేశారు. ఐపీసీ, ఐటీ, ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక (పీడీపీపీ) చట్టంలోని సెక్షన్లు వాడారు. ఈ నెల 13న అధికారులు న్యాయస్థానంలో రిమాండ్‌ కేసు డైరీని సమర్పించారు. ఇందులో ఓ సెక్షన్‌ తగ్గించి ఎనిమిదింటి కిందే ఆరోపణలు చేశారు.

ఎఫ్‌ఐఆర్‌లో ఐపీసీలోని 120బీ (కుట్ర) ఉండగా... రిమాండ్‌ రిపోర్టులో ఈ సెక్షన్‌ కనిపించలేదు. సెక్షన్‌ 34 చేర్చినప్పుడు 120బీ ఉండాల్సిన అవసరం లేదని, ఈ నేపథ్యంలోనే రిమాండ్‌ రిపోర్టులో తొలగించి ఉంటారని కొందరు చెబుతున్నారు. అయితే ఓ నిందితుడిపై ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు చేయాలంటే కచ్చితంగా టెలిగ్రాఫిక్‌ యాక్ట్‌ను జోడించాలి. అయితే ఎఫ్‌ఐఆర్, రిమాండ్‌ కేసు డైరీ రెండింటిలోనూ ఎక్కడా ప్రత్యక్షంగా ట్యాపింగ్‌ ప్రస్తావన, ఈ యాక్ట్‌ కనిపించకపోవడం గమనార్హం.
 
ఆ అధికారులూ బాధ్యతులే అవుతారు...
ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని అధికారులు అంగీకరిస్తున్నప్పటికీ కేసులో దీన్ని ప్రస్తావించకపోవడం వెనుక బలమైన కారణాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఫోన్లను అనధికారికంగా ట్యాప్‌ చేయడం చాలా ఖరీదుతో కూడిన అంశం. అధికారికంగా ట్యాప్‌ చేయాలంటే సంబంధిత సర్వీస్‌ ప్రొవైడర్‌ సహకారం అనివార్యం. దీనికోసం పోలీసు విభాగం వారికి లేఖ రాయాల్సి ఉంటుంది.

ఇది డీఎస్పీ ప్రణీత్‌ వద్ద నుంచే వచ్చి... ఎస్పీ సహా కొందరు ఉన్నతాధికారులు ఫార్వర్డ్‌ చేయాలి. ఈ లేఖలు సర్వీస్‌ ప్రొవైడర్‌ వద్ద నిర్ణీత కాలం వరకు భద్రంగా ఉండాలి. ట్యాపింగ్‌ కోణంలో దర్యాప్తు చేస్తే ఆధారాలు సేకరించడం, తదుపరి చర్యలు తీసుకోవడం తేలికే అయినప్పటికీ... అప్పట్లో లేఖలు ఫార్వర్డ్‌ చేసి, ప్రస్తుతం ఉన్నత స్థానంలో ఉన్న కొందరు అధికారులకు నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది.

అసలు లేఖలే లేకుండా లేదా ప్రాపర్‌ చానల్‌లో రాకుండా ట్యాపింగ్‌కు సహకరిస్తే సర్వీస్‌ ప్రొవైడర్‌ తీవ్ర ఇబ్బందుల్లో పడతాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అధికారికంగా ఎక్కడా ట్యాపింగ్‌ ప్రస్తావన నేరుగా తీసుకురాకుండా కేసు దర్యాప్తు చేస్తున్నారు. దీని టార్గెట్‌ వేరేది ఏదో ఉంటుందని, అది తెలియాలంటే మరికొన్నాళ్లు పడుతుందని కొందరు అధికారులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement