Mysterious Story Telugu: Who Warned US Journalist Danny Over His Claims On UFOs - Sakshi
Sakshi News home page

UFO Mystery In Telugu: డ్యానీని హెచ్చరించింది ఎవరు? అది ఏలియన్స్‌ పనా? ఏమిటా కథ!

Published Tue, Feb 15 2022 1:04 PM | Last Updated on Tue, Feb 15 2022 5:43 PM

Mystery: US Journalist Danny Dont Look Up Story Of UFO Sight Things - Sakshi

ఆసక్తిని రేపే వింతలు.. అనుకోకుండా తారసపడినప్పుడు.. శోధించాలనే జిజ్ఞాస మనిషిని నిమిషం కూడా కుదురుగా నిలువనివ్వదు. కునుకు పట్టనివ్వదు. ఈ కథలో జరిగిందీ అదే. ఓ పక్క నిజం కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా నిరూపించలేని నిస్సహాయత వెక్కిరిస్తుంటే.. మరోపక్క విశ్లేషించే క్రమంలో ఉద్దేశపూర్వకంగా అవాంతరాలు అడుగడుగునా హెచ్చరిస్తుంటే సాహసంతో ముందుకు నడిచాడు ఓ జర్నలిస్ట్‌.

అది 1987.. అమెరికాలోని వర్జీనియాలో వైథెవిల్‌ అనే ప్రాంతవాసులు రాత్రి అయితే చాలు భయంతో గజగజా వణికేవారు. ఆ భయానికి కారణం ఆకాశంలో ఎగిరే ఓ వింత ఆకారం (ఎగిరే పళ్లెం, ‘యూఎఫ్‌ఓ–అన్‌ ఐడెంటిఫైడ్‌ ఫ్లయింగ్‌ ఆబ్జెక్ట్‌’). ఏ ఇద్దరు మాట్లాడుకున్నా అదే కలకలం. ఆనోటా ఈనోటా ఆ వింత.. ‘వేవ్‌ రేడియో’ రిపోర్టర్‌ డ్యానీ చెవినా పడింది. అక్టోబర్‌ 7న అదే విషయాన్ని పెద్ద జోక్‌గా శ్రోతలతో షేర్‌ చేసుకున్నాడు డ్యానీ. విన్నవారు మాత్రం జోక్‌గా తీసుకోలేదు. నిజమేనంటూ సీరియస్‌ అయ్యారు. ఆ వింతను మేమూ చూశామనే ఫోన్‌కాల్స్‌ పెరిగాయి.

రోజులు గడుస్తున్నాయి. అక్టోబర్‌ 17న నైట్‌ డ్యూటీలో ఉన్న డ్యానీకి.. వైథెవిల్‌ చుట్టుపక్కల ప్రజల నుంచి ఫోన్‌కాల్స్‌ పోటెత్తాయి. ‘ఆకాశంలో ఓ వింత ఆకారం కనిపించింది. శబ్దం రావట్లేదు కానీ మెరుస్తోంది. చూడటానికి చాలా పెద్దగా ఉంది. దానికి రంగురంగుల లైట్స్‌ ఉన్నాయి.. మాకు భయంగా ఉంది’ అని చెప్పారు ఫోన్‌ చేసినవాళ్లంతా. దాంతో డ్యానీ.. ‘అమెరికా ప్రయోగాత్మకంగా యుద్ధ విమానాలను పరీక్షిస్తుండొచ్చు, కంగారు పడాల్సిన పనిలేదు’ అంటూ ధైర్యం చెప్పుకొచ్చాడు.

అయితే డ్యానీ ఆ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేదు. పెంటగాన్‌ అధికారుల దగ్గర ఆరా తీశాడు. వాళ్లేమో ‘ప్రభుత్వం ఎలాంటి ప్రయోగాలు చెయ్యడం లేదని.. జనావాసం మధ్యలో అలాంటి ప్రయోగాలు ఎందుకు చేస్తామ’ని ఎదురు ప్రశ్నించారు. దాంతో డ్యానీకి యూఎఫ్‌ఓల రాక నిజమేనన్న అనుమానం మొదలైంది. నాలుగు రోజుల తర్వాత డ్యానీ తన స్నేహితుడు రోజర్‌ హాల్‌తో కలసి కారులో.. వైథెవిల్‌కి దక్షిణ దిశగా బయలుదేరారు. తీరా అక్కడికి వెళ్లాక ఎంతసేపు ఎదురు చూసినా ఎలాంటి అలజడి లేదు.

ప్రజలు అనవసరంగా భయపడుతున్నారని తీర్మానించుకుని వెనుదిరిగారు ఇద్దరూ. కారు స్టార్ట్‌ చేసి కాస్త ముందుకు వెళ్లేసరికి.. కారు అద్దంలోంచి మెరుపులు విరజిమ్మడం చూసి ఆశ్చర్యపోయారు. కారు దిగి, ఆ వింతని కళ్లారా చూశారు. విశాలమైన ఆకాశంలో ఓ పెద్ద క్రాఫ్ట్‌ గిర్రున తిరుగుతూ.. మరో గుండ్రటి ప్లేట్‌ని తనలో కలుపుకుని ఒక్కసారిగా అంతర్ధానమైపోయింది. ఆ షాక్‌లో ఇద్దరూ ఫొటోలు తియ్యలేకపోయారు. అందుకే మరునాడు రాత్రి అదే సమయానికి అదే చోటికి వెళ్లి.. ఆ దృశ్యాలను కెమెరాలో బంధించారు.  ఆధారాలు ఉన్నాయనే నమ్మకంతో యూఎఫ్‌ఓ ఫొటోలు తీశామని తెలుపుతూ..  ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ఉంటుందని ప్రకటించాడు డ్యానీ.

అయితే అదే రోజు రాత్రి డ్యానీకి రెండు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. దాదాపుగా బెదిరింపు కాల్స్‌ లాంటివి. ముందు కాల్‌ చేసిన వ్యక్తి.. ‘అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ సంస్థ(సీఐఏ)కీ, అమెరికా ప్రభుత్వానికి  యూఎఫ్‌ఓపై చాలా ఆసక్తి ఉంది’ అని చెప్పగా.. తర్వాత కాల్‌ చేసిన వ్యక్తి.. ‘యూఎఫ్‌ఓలపై ప్రయోగాలొద్దు. అదంతా ప్రభుత్వ వ్యవహారం. ఈ విషయంలో గోప్యత చాలా అవసరం. అదే అందరికీ మంచిది’ అంటూ హెచ్చరించాడు. దాంతో మరునాడు(అక్టోబర్‌ 23న) ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో నోరు విప్పలేకపోయాడు డ్యానీ.

‘పూర్తి సమాచారం రాగానే యూఎఫ్‌ఓపై మాట్లాడతాను’ అంటూ కాన్ఫరెన్స్‌ని ముగించాడు. తీరా ఇంటికి వచ్చి చూస్తే ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి కానీ యూఎఫ్‌ఓ ఫొటోలు మాత్రం కనిపించలేదు. డ్యానీకి అర్థమైంది.. ఇదంతా రాత్రి కాల్‌ చేసినవాళ్ల పనేనని. డిసెంబర్‌ చివరి నాటికి యూఎఫ్‌ఓ చూసిన సాక్ష్యుల సంఖ్య పెరగసాగింది. దాంతో ఈ విషయంపై మాట్లాడటానికి.. డ్యానీ పెంటగాన్‌లోని రక్షణశాఖ అధికారులని కలిశాడు. ‘యూఎఫ్‌ఓలు ఉన్నట్లు ప్రభుత్వం నమ్ముతోంది. కానీ ప్రజలకు ఎలాంటి నష్టం జరగదనేది ప్రభుత్వాభిప్రాయం’ అని చెప్పారు.

దాంతో డ్యానీ సమాధానపడలేదు. యూఎఫ్‌ఓలపై దూకుడు పెంచాడు. మరో రెండు నెలలు దాటింది. 1988 మార్చి 19న వర్జీనియా బీచ్‌లో బ్రాడ్‌కాస్టర్స్‌ కాన్ఫరెన్స్‌ కోసం వెళ్లాడు డ్యానీ. ‘డ్యానీని పిలుస్తారా?’ అంటూ అక్కడికో ఫోన్‌ వచ్చింది. కాసేపటికి రిసీవర్‌ అందుకున్న డ్యానీ.. ‘ఐయామ్‌ డ్యానీ.. హూ ఈజ్‌ దిస్‌’ అనగానే ఓ వృద్ధ స్వరం గంభీరంగా పలికింది. ‘నేను రిటైర్డ్‌ మిలిటరీ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ని. కావాలంటే నా మాటలను రికార్డ్‌ చేసుకో. నేను నీకు వార్నింగ్‌ ఇస్తున్నట్లు నిరూపించేందుకు ఈ వాయిస్‌ టేప్‌ నీకు ఉపయోగపడుతుంది.

నీలాగే యూఎఫ్‌ఓలపై పరిశోధనలు చేసిన నా కొడుకు ల్యుకీమియాతో చనిపోయాడు. నీకు అదే గతిపడుతుంది. ఎందుకంటే అమెరికా ప్రభుత్వానికి నీలాంటి వాళ్ల ధోరణి నచ్చదు. నా మాట విని ఈ విషయాన్ని ఇక్కడితో వదిలెయ్‌. విడిచిపెట్టకపోతే నీపైన, నీ కుటుంబం పైనా రసాయన ప్రయోగాలు జరిగే ప్రమాద ముంది’ అని హెచ్చరించాడు ఆ పెద్దాయన.

‘డోంట్‌ లుక్‌ అప్‌’ పుస్తకం విడుదల
‘రోనోకే టైమ్స్‌’ బ్యూరో రిపోర్టర్‌ పాల్‌ డెల్లింగర్‌ 1866 నుంచి వైథెవిల్‌లోనే నివాసముండేవాడు. 1988లో అతడు కూడా డ్యానీలానే యూఎఫ్‌ఓని ప్రత్యక్షంగా చూసి పలు కథనాలు రాశాడు. ఆ వింతను ప్రత్యక్షంగా చూసినవారినెందరినో ఇంటర్వ్యూలూ చేశాడు. ఈ క్రమంలోనే డ్యానీతో జతకట్టాడు. రోనోకే టైమ్స్, వేవ్‌ రేడియో ఒకే బిల్డింగ్‌లో ఉండటంతో డ్యానీకి, పాల్‌కి స్నేహం కుదిరింది. దాంతో ఇద్దరూ కలసి యూఎఫ్‌ఓకి సంబంధించిన వాస్తవ సంఘటనలతో ‘డోంట్‌ లుక్‌ అప్‌’ అనే పుస్తకాన్ని రచించి, ప్రచురించారు.

208 పేజీలతో నిండిన ఈ పుస్తకంలో కేవలం వైథెవిల్‌ యూఎఫ్‌ఓ సంఘటనలే కాకుండా కామన్వెల్త్‌ అంతటా ఉన్న రహస్యాల గురించి ప్రస్తావించారు. ఈ పుస్తకం వేల కాపీల్లో అమ్ముడుపోయినప్పటికీ ఆ మిస్టరీలు నాటికీ, నేటికీ మిస్టరీలుగానే మిగిలిపోయాయి. అదే పనిగా వాటి గురించి ఆలోచిస్తూ.. యూఎఫ్‌ఓ స్ట్రెస్‌కు లోనయ్యాడు డ్యానీ. అతడి పరిస్థితి చూసి, కుటుంబ సభ్యులు.. ఇదంతా వదిలిపెట్టేయమంటూ ఒత్తిడి తెచ్చారు.

1990 డిసెంబర్‌ తర్వాత డ్యానీకి యూఎఫ్‌ఓలు కనిపించలేదు. 1992లో ‘అన్‌ సాల్వ్‌డ్‌ మిస్టరీస్‌’ అనే పలు సిరీస్‌లు ప్రేక్షకుల్ని అలరించాయి. అయితే పుస్తకంలో చెప్పినట్లు ‘నేను పైకి చూడను.. నేను దేనికోసం వెతకను.. కానీ నిజంగా ఆ రోజు నేను ఈ బుక్‌ రాయకుండా ఉండి ఉంటే ప్రపంచానికి తెలిసేదే కాదు. కథ అనేది ఎప్పటికీ నిలిచిపోతుందని నేను నమ్ముతాను’ అంటారు డ్యానీ.

2022 జనవరిలో డ్యానీ మరో పోరాటం మొదలుపెట్టాడు. నెట్‌ఫ్లిక్స్‌లో 2021లో విడుదలైన ‘డోంట్‌ లుక్‌ అప్‌’ సినిమా టైటిల్‌ను తమ బుక్‌ నుంచే తీసుకున్నారని.. కేవలం ఆశ్చర్యార్థకాన్ని తొలగించి.. ఆ పేరును యథాతథంగా వాడుకున్నారని, దానికి తన అనుమతి తీసుకోలేదంటూ బాధ్యుల మీద దావా వేశాడు డ్యానీ. అదలా ఉండగా ఆనాటి యూఎఫ్‌ఓలు ప్రభుత్వం పనా? లేక ఏలియన్స్‌ పనా? మరి డ్యానీని హెచ్చరించింది ఎవరు? ఇలా పలు ప్రశ్నలతోనే మిస్టరీగా చరిత్రలో చేరింది ఈ కథ.
-సంహిత నిమ్మన 

చదవండి: టేస్టీ ఐలాండ్‌.. అక్కడ మట్టిని కూరల్లో మసాలాగా వాడతారు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement