రూ.4.34 కోట్ల విలువైన హెరాయిన్ పేస్ట్ స్వాదీనం
ముగ్గురు పెడ్లర్స్, ఐదుగురు వినియోగదారుల అరెస్ట్
పరారీలో ప్రధాన నిందితుడు సవర్‌ఝట్.. కేసు వివరాలను వెల్లడించిన మాదాపూర్ డీసీపీ వినీత్
గచ్చిబౌలి: నగరంలో స్థిరపడిన రాజస్తాన్‌కు చెందిన కొందరు వ్యాపారుల ద్వారా డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారని మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ పేర్కొన్నారు. శుక్రవారం మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వినీత్ ఆ కేసు వివరాలు వెల్లడించారు. ఘట్‌కేసర్‌కు చెందిన దినేశ్‌చౌదరి, మంగళారంచౌదరి హెరాయిన్ పేస్ట్ కోసం రాజస్తాన్‌కు చెందిన సవర్‌ఝట్‌కు రూ.48 వేలు అడ్వాన్స్‌గా చెల్లించారు.
ఈ నెల 7వ తేదీన రాజస్తాన్ నుంచి ఓ కారులో సైనిక్‌పురికి హెరాయిన్ పేస్ట్ తీసుకొచ్చారు. ఈసీఐఎల్ ఎక్స్ రోడ్డులోని ఓ హోటల్‌లో మంగరామ్, దినేశ్, గణేశ్‌లు రమేశ్‌చంద్, సురేశ్‌చంద్‌లను కలిశారు. హెరాయిన్ ఎలా విక్రయించాలో వివరించారు. ఆ తర్వాత మరో కారులో గచ్చిబౌలి టెలికాంనగర్‌లోని ప్రకాశ్ లైట్‌హౌస్‌లో హెరాయిన్ పేస్ట్‌ను దాచేందుకు తీసుకొచ్చారు. దీనిపై విశ్వసనీయ సమాచారం అందడంలో ఎస్‌ఓటీ మాదాపూర్, రాయదుర్గం పోలీసులు 14న రాత్రి 11 గంటల సమయంలో లైట్‌హౌస్‌పై దాడి చేశారు.
హెరాయిన్ పేస్ట్‌తోపాటు పెడ్లర్స్ మంగళారంచౌదరి, దినేశ్ చౌదరి, గణేశ్ చౌదరిలతోపాటు వినియోగదారులు నితిన్‌గుర్జార్, ప్రకాశ్ లైట్‌హౌస్ యజమాని ప్రకాశ్ చౌదరితోపాటు అమీన్‌పూర్‌కు చెందిన జైవత్రం వసనారం దేవసి, సైనిక్‌పురికి చెందిన ప్రకాశ్æచౌదరి, భువనగిరికి చెందిన బానారాం చౌదరిలను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సవర్‌ఝట్ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రూ.4.34 కోట్ల విలువైన హెరాయిన్ పేస్ట్, రెండు కార్లు, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులకు మెడికల్ టెస్ట్‌లు నిర్వహించగా అందరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని పోలీసులు పేర్కొన్నారు.
ప్రకాశ్ లైట్‌హౌస్ యజమాని మధ్యప్రదేశ్‌లోని ఓ పీఎస్‌లో ఎన్‌డీపీఎస్ చట్టం కింద ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు. రాజస్తాన్‌కు చెందిన ప్రధాన పెడ్లర్ సవర్‌ఝట్ ఎక్కడి నుంచి హెరాయిన్ తీసుకొస్తున్నారనే విషయంపై దర్యాప్తు కొనసాగిస్తామని డీసీపీ తెలిపారు. నగరంలో స్థిరపడిన రాజస్తాన్‌కు చెందిన వ్యాపారులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. డ్రగ్ సరఫరా చేసినా, కొనుగోలు చేసినా, వాడుతున్నట్టు తెలిసినా డయల్ 100, 9490617444 ఫోన్‌నంబర్లకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటీ డీసీపీ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీలు జయరాం, శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ శ్రీకాంత్, ఇన్‌స్పెక్టర్ సీహెచ్.వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్ విక్రయించే రాజస్తానీ అరెస్ట్
8 గ్రాములు హెరాయిన్, 34 గ్రాములు ఓపీఎం స్వాధీనం
పటాన్‌చెరు టౌన్: మాదకద్రవ్యాలు విక్రయించే ఓ రాజస్తానీ వ్యక్తిని అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌లో అదనపు ఎస్పీ సంజీవరావు ఆ వివరాలు వెల్లడించారు. పటాన్ చెరు మండల పరిధిలోని చిట్కుల్ రాధమ్మ కాలనీలో మాదకద్రవ్యాలు నిల్వ ఉన్నాయనే సమాచారం మేరకు టీనాబ్, ఎస్‌ఓటీ, పటాన్‌చెరు పోలీసులు సంయుక్తంగా ఓ ఇంటిపై దాడులు చేశారు. ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న రాజస్తాన్‌కు చెందిన రెయిలింగ్ పనులు పనిచేసే బుధారామ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు.
దీంతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీడీఎల్‌లో ఉంటున్న చిన్నాన్న కొడుకు కోశాలరామ్ డ్రగ్స్ తక్కువ ధరకు తీసుకొచ్చి ఇక్కడ విక్రయించేవాడని, తొలుత తమకు అలవాటు అయ్యిందని, ఆ తర్వాత వ్యాపారంగా మార్చుకున్నట్టు నిందితుడు తెలిపాడు. అతని నుంచి 8 గ్రాములు హెరాయిన్, 34 గ్రాములు ఓపీఎం, సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment