
పక్కనున్న బార్బర్ షాపు నుంచి తెచ్చుకున్న తెలుగు దినపత్రికను చదివిందే చదువుతున్నాడు డిటెక్టివ్ డీలక్స్. అతని అసిస్టెంట్ అయోమయం భూతద్దంతో గది గోడల మీదున్న దోమల్ని వెదుకుతున్నాడు, చంపడం కోసమని! బాస్ ఓవర్ స్మార్ట్ ఐతే, అసిస్టెంట్ సార్థకనామధేయుడు. ఈలోగా అడుగుల చప్పుడు వినిపించడంతో, ‘క్లయెంట్స్ ఎవరో వస్తున్నారేమో!’ అన్నాడు డీలక్స్. ‘రెంట్ బకాయి కోసం ఇంటి యజమానేమో!’ అనుకున్నాడు అయోమయం భయంగా. డీలక్స్ న్యూస్ పేపర్ పక్కన పడేసి, కాలు మీద కాలు వేసుకుని, ఏదో డిక్టేట్ చేస్తూన్నవాడిలా పోజు పెడితే... అయోమయం టేబుల్ మీదున్న నోట్ బుక్ దుమ్ము దులిపి, పెన్ తీసుకుని, నిల్చునే నోట్స్ రాసుకుంటున్నట్లు అభినయించాడు.
‘డిటెక్టివ్ డీలక్స్ గారు కావాలి’ అంటూ గదిలోకి అడుగు పెట్టింది ఓ ఆంగ్లో–ఇండియన్ యువతి.
పాతికేళ్ళుంటాయి ఆమెకు. సన్నగా, చామన చాయలో ఉంది. లైట్ బ్లూ కలర్ చుడీదార్ ధరించింది. తన పేరు మిస్ రీటా అని చెప్పింది.
‘సార్! మా బేబీ తప్పిపోయింది... మీరు వెదికి పట్టుకోవాలి!’ అందామె.
‘బేబీ వయసు ఎంత ఉంటుంది?’ ప్రశ్నించాడు డిటెక్టివ్. ‘వన్ ఇయర్’ చెప్పిందామె.
ప్రశ్నల వర్షం కురిపించాడు డీలక్స్– ‘తప్పిపోయినప్పుడు ఏం దుస్తులు తొడిగారు?’... ‘ఆరెంజ్ కలర్ జుబ్బా‘. ‘నడుస్తుందా?’... ‘పరుగు కూడా పెడుతుంది.’ ‘మాటలు వచ్చా?’
‘మన మాటలు అర్థం చేసుకుంటుంది’ చెప్పిందామె. ‘బేబీ పేరేమిటి?’ అడిగాడు.
‘పేరే బేబీ...’ అందామె, ‘క్యూట్ పమరేనియన్.’ ఉలికిపడ్డారు గురుశిష్యులు. ‘పమరేనియనా?’ అడిగాడు డిటెక్టివ్ ఆశ్చర్యంగా. ‘మీరు మాట్లాడేది మనిషి పిల్ల గురించేగా?’
‘కాదండి. కుక్కపిల్ల గురించి!’ కూల్‌గా జవాబిచ్చిందామె. ‘అంటే, తప్పిపోయింది కుక్కపిల్లా?’... ఔనని తల ఊపిందామె.
వెంటనే ముఖం గంభీరంగా పెట్టేసి, ‘హత్య కేసుల్ని, బ్యాంక్ దోపిడీలనూ పరిశోధించే మేము... ఆఫ్టరాల్ ఓ కుక్క పిల్ల...’ ‘బేబీ...’ అందించిందామె.
‘ఓకే. ఇలాంటి పెట్టీ కేసుల్ని చేపడతామని ఎలా అనుకున్నారు మీరు?’ అన్నాడు – ‘కొంపదీసి మాకు కేసులేవీ లేవన్న సంగతి పక్కనున్న షాపువాడు ఈమెకు చెప్పేయలేదు కదా!’ అని మనసులో అనుకుంటూ.
‘ప్లీజ్, సార్! ఈ కేసు మీరే టేకప్ చేయాలి...ఫీజు ఎంతైనా పరవాలేదు’ అందామె. ‘నో!’ అన్నాడు డీలక్స్ బింకంగా. ‘మా ప్రిస్టేజ్ ఏం కాను?’ ‘ప్లీజ్! అలా అనకండి...బేబీ నా ప్రాణం’... బతిమలాడిందామె.
ఆర్నెల్ల తరువాత వచ్చిన ఈ ఒక్క కేసూ, ఓవరేక్షన్ తో గురుడు ఎక్కడ చెడగొడతాడోనని భయమేసింది అయోమయానికి. ‘బాస్! కుక్కపిల్లలంటే మనకూ ఇష్టమే కదా! ఈవిడ ఇంతగా ప్రాధేయపడుతుంటే... మనకిది చిన్న కేసైనా సరే...తిరస్కరించడం భావ్యం కాదేమో!’ అన్నాడు చటుక్కున కలుగజేసుకుని.
‘ఓకే. నా అసిస్టెంట్ చెప్పాడు కనుక ఈ కేసును టేకప్ చేస్తున్నాం’ దర్పంగా అన్నాడు డీలక్స్.
ఆమె చెప్పిన వివరాలివి... ఆమెకు కుక్కపిల్లలంటే అమిత ఇష్టం. ఏడాది క్రితం ఓ పమెరేనియన్ కుక్కపిల్లను తెచ్చుకుని, దానికి ’బేబీ’ అని పేరు పెట్టుకుని, అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. మూడు రోజుల క్రితం బేబీ అదృశ్యమయింది. నెల కిందట ఆమె వద్దకు ఓ వ్యక్తి వాకింగ్ కు వెళుతున్నప్పుడు బేబీని చూశాడనీ, తనకు బాగా నచ్చిందనీ, దాన్ని తనకు అమ్మమనీ అడిగాడు. ఆమె నిరాకరించింది. ఆలోచించుకుని చెప్పమంటూ, తన చిరునామా ఆమెకు ఇచ్చి వెళ్ళాడు. ఇప్పుడు బేబీ మాయం కావడంతో అది అతని పనే అయివుంటుందని అనుమానంగా ఉంది. అతని ఇంటికి వెళ్లి అడిగితే, పప్పీ సంగతి తనకు తెలియదన్నాడు. కాని, అతనే బేబీని దొంగిలించి ఉంటాడన్నది ఆమె అనుమానం... ‘సార్! నా బేబీ కనిపెట్టి తెచ్చారంటే... పాతికవేలు ఇస్తాను మీకు. ఖర్చులు అదనం’ అందామె.
ఇటీవల అంత పెద్ద మొత్తం ఎప్పుడూ చూసి ఉండలేదేమో... పాతికవేలనే సరికి మదిలోనే ఆనందంతో డిస్కో చేశారు గురుశిష్యులు. ఎగై్జట్మెంట్ ను కప్పిపుచ్చుకుంటూ, ‘బేబీ ఫోటో ఉందా?’ అనడిగాడు డీలక్స్. పప్పీ ఫోటోను, అనుమానితుడి చిరునామాను డిటెక్టివ్ కి ఇచ్చిందామె. ‘మీ చిరునామా, ఫోన్ నంబరూ ఇవ్వండి. పప్పీ – సారీ – బేబీ దొరకగానే ఫోన్ చేస్తాం’ అన్నాడు డీలక్స్.
‘అవసరంలేదు. మూడు రోజుల తరువాత నేనే వస్తాను’ అంటూ, పదివేలు అడ్వాన్స్ ఇచ్చి, ‘థాంక్స్’ చెప్పి బయటకు నడచిందామె.
మిస్ రీటా ఇచ్చిన చిరునామా ఓ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ మేజర్ సూర్యకాంత్ నివాసం. ఇల్లు పెద్దదే. ఇంటి ముందు పోర్టికో. చుట్టూ ప్రహరీ గోడ. కాంపౌండ్ లోపల పూల మొక్కలు, పళ్ళ చెట్లూను... లోపలికి వెళ్దామా వద్దా అని డిటెక్టివ్ లు తచ్చాడుతూండగానే, గోల్డ్–బ్రౌన్ కలర్ కుక్కపిల్ల ఒకటి గుమ్మం దగ్గరకు వచ్చి, వారిని చూసి మొరిగింది.
జేబులోంచి ఫోటో తీసి చూసిన అయోమయం, ‘గురూ! బేబీ!!’ అన్నాడు ఆనందంగా. ‘మిస్ రీటా అనుమానం నిజమే నన్నమాట. వెళ్ళి పట్టుకొచ్చెయ్ దాన్ని’ అన్నాడు డీలక్స్.
దొంగోడిలా అటు ఇటు చూస్తూ గేటు వైపు అడుగులు వేశాడు అయోమయం.
అదే సమయంలో– ఓ ముసలాయన, ‘బేబీ! కమిన్’ అంటూ బయటకు వచ్చాడు. ఎత్తుగా, దృఢంగా, మీసాలతో భయంకరంగా ఉన్నాడు. అతన్ని చూడగానే భయంతో అప్రయత్నంగానే చేతులు ఎత్తేశారు డిటెక్టివ్ లు. వారిని చూసి, ‘పట్టపగలే ఇల్లు దోచుకోవడానికి వచ్చారా? కదలకుండా అక్కడే నిల్చోండి. గన్ తీసుకొస్తాను’ అంటూ లోపలికి వెళ్ళాడు అతను. అంతవరకు బిగుసుకుపోయిన డిటెక్టివ్ ద్వయం, అతను కనుమరుగవగానే క్షణంలో అక్కడ నుంచి అదృశ్యమైపోయారు.
బేబీని దొంగిలించింది ఆర్మీ మేజరేనని తేలినా, డైరెక్ట్ గా అతన్ని ఎదుర్కొనే సాహసం చేయలేకపోయారు డిటెక్టివ్ లు. పప్పీని కిడ్నాప్ చేయాలని నిశ్చయించుకున్నారు.
అర్థరాత్రి – మేజర్ సూర్యకాంత్ ఇంటికి వెళ్ళారు. పరిసరాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. ఆ ఏరియా వాచ్ మాన్ ఎక్కడా కనిపించలేదు. మెయిన్ గేట్ కు తాళం వేసుంది. కాంపౌండ్‌ను ఆనుకుని పేవ్‌మెంట్ మీద గుబురు వృక్షం ఒకటి ఉంది. ఆ చెట్టు మీంచి ప్రహరీ గోడ ఎక్కి అటువైపుకు దిగారు గురు శిష్యులు. లోపల చీకటిగా ఉంది. పెన్ టార్చ్ వెలుతురులో జాగ్రత్తగా మొక్కల మధ్య నడుస్తూ, ఓ సారి ఇంటి చుట్టూ ప్రదక్షిణం చేసి వచ్చారు. ఇంటికి పక్క వైపు పై అంతస్తులో ఓ గది కిటికీ తలుపులు, గాలి కోసం కాబోలు తెరచి ఉన్నాయి.
అయోమయాన్ని క్రిందనే ఉంచి, డ్రైనేజ్ పైప్ ఆధారంగా పైకి ఎగబాకాడు డీలక్స్. కిటికీ పైన ఎక్కి కూర్చుని, గదిలోకి చూశాడు. బెడ్ ల్యాంప్ వెలుగుతోంది. బెడ్ మీద మిలిటరీ ముసలాయన పడుకుని ఉన్నాడు. మరో మంచం మీద– అతని భార్య కాబోలు, ఓ ముసలావిడ, ఓ ఐదేళ్ళ పాప నిద్రిస్తున్నారు. ఓ మూలగా నేలపైన వేసిన పక్క మీద ‘బేబీ’ పడుకుని ఉంది. నిక్కరు, జుబ్బా తొడిగారు దానికి... మెల్లగా గదిలోకి జారాడు డీలక్స్.
చటుక్కున కళ్ళు తెరచింది బేబీ. అది నోరు తెరచే లోపునే జేబులోంచి బిస్కెట్ తీసి దాని ముందు వేశాడు డీలక్స్. ఓ క్షణం అతని వంక అదోలా చూసి, బిస్కెట్ అందుకుందది. అందులో మత్తు మందు కలిసిందేమో, తినగానే కళ్ళు మూసేసింది. బేబీని చంకలో పెట్టుకుని, వచ్చిన దారినే బయటపడ్డాడు డీలక్స్.
చెప్పినట్టే మూడో రోజున డిటెక్టివ్ ఆఫీసుకు వచ్చింది మిస్ రీటా. గదిలో పప్పీని చూడగానే, ‘ఓ బేబీ’ అంటూ ఆనందంతో అరిచింది. పప్పీ కూడా ఆమెను చూడగానే తోక ఊపుకుంటూ ఆమె దగ్గరకు పరుగెత్తింది. దాన్ని చేతుల్లోకి తీసుకుని ముద్దాడిందామె. డిటెక్టివ్‌లకు మిగతా ఫీజు చెల్లించి, ‘థాంక్స్’ చెప్పుకుని, పప్పీతో నిష్క్రమించింది.
వారం రోజుల తరువాత – దినపత్రికలో వెలువడిన ఓ ప్రకటన డిటెక్టివ్ లను ఆకట్టుకుంది. అందులో ‘బేబీ’ ఫొటో ఉంది. దాని క్రింద ఇలా రాసివుంది – ’ఈ ఫొటోలోని పమెరేనియన్ పప్పీ పేరు ‘బేబీ’. గోల్డ్–బ్రౌన్ కలర్‌లో ముద్దుగా ఉంటుంది. ఏడాది వయసు. వారం రోజుల కిందట పప్పీని ఎవరో దొంగిలించుకుపోయారు. అదంటే ఐదేళ్ళ మా మనవరాలు సిరికి ప్రాణం. పప్పీ కనిపించకపోవడంతో సిరి అన్నపానీయాలు మానేసి, బెంగతో మంచం పట్టింది.
వెంటనే పప్పీని తెచ్చి చూపించకపోతే పాప ప్రాణానికే ముప్పు అంటున్నారు డాక్టర్లు. పప్పీని ఎత్తుకువెళ్ళినవారికి ఇదే మా విజ్ఞప్తి!... దయచేసి పప్పీని వాపసు చేసేయండి. ఓ చిన్నారి ప్రాణాలను కాపాడండి. వారిపైన ఎటువంటి కేసూ పెట్టమని హామీ ఇస్తున్నాము. పప్పీని తెచ్చి ఇచ్చిన వారికి ఐదులక్షల రూపాయల బహుమతి కూడా ఇవ్వబడుతుంది.... ఇట్లు, మేజర్ సూర్యకాంత్. మొబైల్ నంబర్ –’
ఆ రోజు రాత్రి గదిలో ముసలావిడ పక్కలో నిద్రిస్తూన్న పాప అమాయక వదనం డీలక్స్ మదిలో మెదిలింది. ‘మిస్ రీటా బేబీ, ఈ పప్పీ ఒకటే కదా? మనం పొరబడ్డామనుకున్నా, ఆమెను చూడగానే పప్పీ తోక ఊపుకుంటూ దగ్గరకు పరుగెత్తింది కదా!’ అన్నాడు. అయోమయం బుర్ర గోక్కున్నాడు.
‘మరైతే, ఈ ప్రకటనకు అర్థం ఏమిటి?’ సాలోచనగా అన్నాడు డీలక్స్.
‘పోనీ, మనం పప్పీని మిస్ రీటా దగ్గర నుండి తీసేసుకుని మేజర్ కు అప్పగించేస్తేనో? ఐదు లక్షల బహుమతి కూడా లభిస్తుంది మనకు!‘ అన్నాడు అయోమయం.
‘కానీ, మిస్ రీటా అడ్రెస్ మనకు తెలియదుగదా?’
నాలుగు రోజులపాటు ఆ ప్రకటన గురించే ఆలోచిస్తూ, తర్జన భర్జనలు పడ్డారు డిటెక్టివ్ లు.. ఐదో రోజున – ‘రాత్రులు ఆ పాపే కలలో ఉంటోంది నాకు. ఓసారి మనం మేజర్ సూర్యకాంత్‌ను కలవడం మంచిదనిపిస్తోంది’ అన్నాడు డీలక్స్.
∙∙∙
డిటెక్టివ్స్ వెళ్ళేసరికి మేజర్ ఇంటి వద్దే ఉన్నాడు. డీలక్స్ తమను తాము పరిచయం చేసుకుని, ‘పత్రికలలో మీ ప్రకటన చూశాం. పాప స్థితికి విచారిస్తున్నాం. పాప కోసం బేబీని వెదకాలనుకుంటున్నాం’ అన్నాడు.
మేజర్ నవ్వి, ‘మీ కన్సర్న్ కి థాంక్స్! బేబీ నిన్ననే దొరికింది’ అంటూ, వారిని ఓ గదిలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ నీరసంగావున్న ఐదేళ్ళ సిరి పప్పీతో ఆడుకుంటోంది!
’గత సాయంత్రం మా సర్వెంట్ మెయిడ్ బాయ్‌ఫ్రెండ్ కి, ఎవరి దగ్గరో కనిపించిందంట పప్పీ. వాళ్ళతో పోట్లాడి దాన్ని తీసుకువచ్చేశాడట! ప్రకటించిన ప్రకారం అతనికి బహుమతి ఇవ్వబోతున్నాం’ చెప్పాడు మేజర్.
అదే సమయంలో– ‘సాబ్!’ అంటూ అక్కడికి వచ్చింది ఓ యువతి. ఆమెను చూసి ఉలికిపడ్డారు డిటెక్టివ్ లు. ‘మిస్ రీటా...!’ అన్నపలుకులు వారి నోటి నుండి అప్రయత్నంగా వెలువడ్డాయి.
‘మా సర్వెంట్ మెయిడ్ అంజలి’ పరిచయం చేశాడు మేజర్. ‘పప్పీని తెచ్చింది ఈమె బాయ్ ఫ్రెండే.’
డిటెక్టివ్‌లను చూసి కంగారుగా లోపలికి వెళ్ళిపోబోయిందామె. డీలక్స్ బుర్రలో హఠాత్తుగా ఫ్లడ్ లైట్ వెలిగింది. ‘ఆగు!’ అంటూ ఆమెకు అడ్డు వెళ్ళాడు. ‘చెప్పు, నీ అసలు పేరేమిటి? అంజలా? మిస్ రీటాయా?’
తెల్లబోయిన మేజర్, ‘ఈమె మీకు ముందే తెలుసా?’ అనడిగాడు.
జరిగిందంతా వివరించాడు డిటెక్టివ్, మేజర్ ముఖంలో రంగులు మారుతూంటే.
ఆమె వంక గుడ్లురిమి చూశాడు మేజర్. ‘చెప్పు, ఎందుకు చేశావు ఇదంతా?’
భయపడిపోయింది ఆమె. ఏడుస్తూ అసలు సంగతి చెప్పేసింది. ‘పాపకు పప్పీ అంటే ప్రాణం. యాక్సిడెంట్‌లో తల్లిదండ్రులను కోల్పోయిన పాపంటే ఆ వృద్ధ దంపతులకు ప్రాణం. వారి ప్రేమానురాగాలను క్యాష్ చేసుకుందామన్నాడు అంజలి బాయ్‌ఫ్రెండ్. పప్పీని దొంగిలించి కొద్ది రోజులపాటు దాచిపెడితే, దానికోసం పాప బెంగ పెట్టుకుని తిండి తినదనీ, అప్పుడు పప్పీని తెచ్చి ఇచ్చిన వారికి ధనవంతులైన ఆ దంపతులు పెద్దబహుమానమే ప్రకటిస్తారనీ, పప్పీని కనిపెట్టి తెచ్చినట్టు చెప్పి ఆ బహుమతిని తాము కొట్టివేయవచ్చుననీ పథకం వేశాడు అతను.
దాని ప్రకారమే మారుపేరుతో, కట్టుకథతో పప్పీని దొంగిలించడంలో డిటెక్టివ్‌ల సాయం కోరిందామె. తాము ఆశించినట్లే జరిగిందంతా. కానీ, అనుకోకుండా డిటెక్టివ్ లు రంగప్రవేశం చేయడంతో కుట్ర బయటపడింది. ఇది విని నివ్వెరపోయారంతా.
మేజర్ ఆమె చెంప పగులగొట్టాడు. ‘ఆడపిల్లవై బ్రతికిపోయావు. అదే మగాడైతే నమ్మకద్రోహానికి గన్‌తో షూట్ చేసి పారేసేవాణ్ణి’... ఆవేశంతో ఊగిపోయాడతను. క్షమించమంటూ యజమాని కాళ్ళ మీద పడిందామె ఏడుస్తూ.
‘ఇవాళ పప్పీతో సరిపోయింది. రేపు ర్యాన్సమ్ కోసం పాపనే కిడ్నాప్ చేయవన్న నమ్మకమేమిటి?’ అరిచాడతను. ‘నేను మనసు మార్చుకుని నిన్ను పోలీసులకు అప్పగించకముందే... ఇంటి నుంచి వెళ్ళిపో!’
‘బ్రతుకు జీవుడా!’ అనుకుంటూ బయటకు పరుగెత్తిందామె.
‘సారీ, మేజర్! దాని మాయమాటలు నమ్మి పప్పీని ఎత్తుకుపోయాం మేము. కైండ్లీ ఎక్స్‌క్యూజ్ అజ్!’ అన్నాడు డీలక్స్.
‘ఇట్స్ ఓకే, మేన్! మీ మూలంగానే ఈ ఫ్రాడ్ బైటపడింది’ అన్నాడు మేజర్ సూర్యకాంత్. ‘అంతేకాదు, ఆ దొంగ మూలంగా మున్ముందు సంభవించబోయే అనర్థాలను కూడా అరికట్టారు మీరు. ఐ మస్ట్ థాంక్ యూ.’
‘నేను ప్రకటించిన బహుమతి మీదే! ఇదిగో చెక్కు. మీ పేరు రాసుకోండి’ అంటూ ఐదులక్షలకు చెక్ రాసి సంతకం చేసి, డీలక్స్ చేతిలో పెట్టాడు అతను.
-తిరుమల శ్రీ
Comments
Please login to add a commentAdd a comment