నేలమాళిగలో లిటిల్‌ డెవిల్‌ | Little Devil Crime Story In Telugu | Sakshi
Sakshi News home page

లిటిల్‌ డెవిల్‌

Published Sun, Sep 22 2019 8:54 AM | Last Updated on Sun, Sep 22 2019 8:54 AM

Little Devil Crime Story In Telugu - Sakshi

ఎందుకో హఠాత్తుగా మెలకువ వచ్చింది నాకు. నైట్‌ ల్యాంప్‌ వెలుగుతోంది. 
నా బెడ్‌ పక్క కాళ్ళ దగ్గర ఎవరో ఉన్నట్టు అనిపించింది! కన్నులు నులుముకుని చూశాను. 
ఓ చిన్నపాప! అయిదేళ్ళు ఉండవచ్చును! తెల్లటి ఫ్రాక్‌లో ఉంది.
ఉలికిపడి, ‘‘ఎవరది?’’ అనడిగాను.
జవాబు లేదు. రెప్పవేయకుండా నన్నే చూస్తోంది.
గోడవైపు తిరిగి స్విచ్‌ నొక్కడంతో గదిలో ట్యూబ్‌ లైట్‌ వెలిగింది. వెనక్కి తిరిగేసరికి  పాప అక్కడ లేదు! 
గతుక్కుమన్నాను. తలగడ పక్కనున్న సెల్‌ ఫోన్‌ తీసి ఆన్‌ చేసి టైమ్‌ చూశాను. అర్ధరాత్రి కావస్తోంది.

నిద్రపోతూన్న నన్ను ఎవరో తట్టిలేపినట్టయి మెలకువ వచ్చింది. ఆ చిన్నారి ఎవరు? ఆ వేళప్పుడు గదిలోకి ఎలా వచ్చింది? అంతలోనే ఎలా అదృశ్యమయింది?... అన్నీ ప్రశ్నలే! జవాబులు దొరకడంలేదు. 
ఒకవేళ అది కలఅయ్యుంటుందేమోనని చేతి మీద గిల్లుకున్నాను. నొప్పిపుట్టింది. అంటే, అది వాస్తవ చిత్రమేనన్నమాట! భ్రమ కూడా కాదు. 
బెడ్‌ దిగి గదంతా చూశాను. ఎవరూ లేరు. గది తలుపులు మూసినవి మూసినట్టే ఉన్నాయి. 
కిటికీ వద్ద నిలుచుని బయటకు చూశాను. పరిసరాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. దూరంలో ‘జింజీ ఫోర్ట్‌’ లీలగా కనిపిస్తోంది. 
మళ్లీ బెడ్‌ మీద వాలిపోయాను. ఎంత ప్రయత్నించినా నిద్రపట్టడంలేదు. ఆ పసిపాప ఆకారమే కళ్ళ ఎదుట కనిపిస్తోంది. మూసి ఉన్న గదిలోకి ఆ పాప ఎలా వచ్చింది? ఎలా మాయమయింది? అసలు ఆ పాప ఎవరు? మనిషేనా??– ఆ తలంపే ఉలికిపాటుకు గురిచేసింది నన్ను.
ఆర్కిటెక్చర్‌లో పీహెచ్‌డీ చేస్తున్నాను నేను. ప్రాజెక్ట్‌ వర్క్‌లో భాగంగా వివిధ ప్రాచీన దుర్గాలు, కోటలను దర్శించి వాటి ఆర్కిటెక్చర్‌ని అధ్యయనం చేసి థీసిస్‌ రాయాల్సి ఉంది. ఆ పనిమీదే రెండు రోజుల క్రితం తమిళనాడులో విల్లుపురం జిల్లాలో ఉన్న ‘జింజీ ఫోర్ట్‌’కి వచ్చాను. సమీపంలో ఉన్న ‘సెంజి’ టౌన్‌ ని బట్టి దాన్ని ‘సెంజీ ఫోర్ట్‌’ అని వ్యవహరించడం కూడా కద్దు.

ఫోర్ట్‌ దిగువను ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వసతిగృహం ఉంది. అలనాటి రాజదుర్గానికి చెందిన పురాతన కట్టడం అది. కొద్ది మార్పులతో టూర్స్‌లో వచ్చే డిపార్ట్‌మెంట్‌ సిబ్బందికి బసగా మార్చబడింది. రెండే రెండు పోర్షన్స్‌ నివాసయోగ్యంగా ఉన్నాయి. ఒక్కో పోర్షన్‌లోనూ రెండు గదులు, ఓ హాలూ ఉన్నాయి. ఆ బిల్డింగ్‌ వెనుకనున్న గదిలో వుండే ముసలి వాచ్‌మేన్‌ దాన్ని కనిపెట్టుకుని వుంటాడు. అతని కుటుంబం గ్రామంలో ఉండడం వల్ల ఒంటరిగానే ఉంటున్నాడు. ఇటీవలి కాలంలో అక్కడ దిగకుండా సమీపంలో ఉన్న ‘తిండివనం’ టౌన్‌లోని హోటల్స్‌లో బసచేయనారంభించారట డిపార్ట్‌ మెంట్‌ సిబ్బంది. 
హైదరాబాదులో బైలుదేరినప్పుడే అక్కడ బసచేయడానికి ఆ డిపార్ట్‌మెంట్‌ నుంచి అనుమతి సంపాదించాను. కనీసం రెండు వారాల పాటైనా అక్కడ ఉండవలసివస్తుంది. వాచ్‌మేన్‌కి డబ్బులు ఇచ్చి మూడు పూటలా వండిపెట్టేటట్టు ఏర్పాటు చేసుకున్నాను.

ఉదయం లేచి, కాలకృత్యాలు తీర్చుకుంటూంటే రాత్రి సంఘటన మదిలో మెదిలింది. నా మనసంతా ఆశ్చర్యంతో, రకరకాల ఆలోచనలతో నిండిపోయింది. గబగబా బ్రేక్‌ ఫాస్ట్‌ ముగించి ఫోర్ట్‌ కి బయలుదేరాను. అక్కడ నేను అధ్యయనం చేయవలసినవి పలు అంశాలు ఉన్నాయి. 
అప్పటికే పర్యాటకుల సందడి మొదలయింది. మెట్లు, రాతిగుట్టలూ అధిరోహించి కోటను చేరుకునేసరికి చాలా సమయం పట్టడమేకాక, అలసట కూడా ఆవరించుకుంది. సాయంత్రం ఐదు గంటలు అయేసరికి కోట ప్రాంతాన్ని ఖాళీ చేయవలసి వుంటుంది. పరిసరాలను పర్యవేక్షిస్తూ, పర్యాటకులతో సంభాషిస్తూ పైకి ఎక్కసాగాను నేను. 
జింజీ ఫోర్ట్‌ అద్భుతమైన పురాతన రాజదుర్గం. తొమ్మిదవ శతాబ్దంలో చోళరాజుల కాలంలో నిర్మింపబడ్డ ఓ చిరుదుర్గాన్ని, పదమూడవ శతాబ్దిలో కురుంబార్‌ మోడిఫై చేయడమూ, అనంతరం పదిహేను–పదహారు శతాబ్దాలలో ‘జింజీ’ నాయక్స్‌ దాన్ని విస్తరింపజేయడమూ జరిగాయి. మూడు పెద్ద గుట్టల పైన పదకొండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఆ కోటను బ్రిటిష్‌ వారు ‘ట్రాయ్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌’ అని పిలిచేవారు. ఆ హెరిటేజ్‌ ఫోర్ట్‌ ప్రస్తుతం – వాతావరణపు ఆటుపోట్లకు గురయి, పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా శిథిలావస్థలో రాతిగుట్టల నడుమ రెక్కలు తెగిపడ్డ పక్షిలా మిగిలి ఉంది.

కోట భవంతులు పూర్వవైభవాన్ని కోల్పోయినా చూడచక్కగా ఉన్నాయి. గ్రానైట్‌ స్టోన్, లైమ్‌ మోర్టార్‌ ల కలయిక అవి. వాటి ఆర్కిటెక్చరల్‌ బ్యూటీ ఆకట్టుకుంటూ విస్మయానికి గురిచేస్తుంది. 
సాయంత్రం వరకూ ఆ శిథిలాలలో తిరుగాడుతూ అవసరమైన నోట్స్‌ రాసుకుంటూ, వీడియో, ఫొటోలు తీస్తూ గడిపేశాను. బసకు చేరుకుని ఫ్రెషప్‌ అయి, వాచ్‌మేన్‌ తాత ఇచ్చిన టీ తాగుతూంటే గతరాత్రి అనుభవాన్ని అతనితో పంచుకుందామా అనిపించింది. అంతలోనే మనసు మార్చుకున్నాను, నవ్విపోతాడేమోనని. 
ఆ రాత్రి మెలకువగా ఉండి ఆ పాప మళ్ళీ వస్తుందేమో చూడాలనుకున్నాను. కానీ, రోజంతా అలసిసొలసి ఉండడంతో మంచం ఎక్కగానే గాఢంగా నిద్రపట్టేసింది. ఆ రాత్రి పాప వచ్చిందో లేదో తెలియదుగానీ, నాకు మాత్రం అసలు మెలకువే రాలేదు. 
అయితే, ఆ మర్నాటి రాత్రి మళ్ళీ మెలకువ వచ్చేసింది. ఎవరో కాలు పట్టుకుని కదుపుతున్నట్టయి కళ్లు తెరచాను. అదే పాప! తెల్లటి ఫ్రాక్‌ లో. కాళ్ళ దగ్గర. నన్నే చూస్తోంది. 
అయితే, నేను ట్యూబ్‌ లైట్‌ వెలిగించేసరికి అదృశ్యమయిపోయింది!
మూసి ఉన్న గదిలోకి ఆ చిన్నారి ఎలా వస్తోంది? ఎలా మాయమవుతోంది?... నాలో అయోమయం అధికమయింది. మర్నాడూ అదే అనుభవం!
ఆ రోజు సాయంత్రం నేను ఫోర్ట్‌ నుంచి తిరిగివచ్చేసరికి వాచ్‌ మేన్‌ కూతురట – నలభయ్యేళ్ళ స్త్రీ. పేరు కర్పగం అట. నాకు ఎదురువచ్చింది. ‘‘ఇంద గెస్ట్‌ హౌస్‌ లో ఇరకరది నీంగె దానా?’’ (ఈ గెస్ట్‌ హౌస్‌ లో ఉంటున్నది మీరేనా?) అనడిగింది అరవంలో. 
తమిళం కొంతవరకు అర్థంచేసుకోగలను నేను. ఔనన్నాను. పేరు అడిగితే చెప్పాను. 
‘‘ఇంద కోటత్తిలే పేయి ఇరుకుదని సొల్లువాంగ. ఉన్నోడె వేలై శీఘ్రమా ముడుచికిటు పోయిడు. అంద తొల్లై నమ్మకెన్నదుకు!’’ (ఈ కోటలో దయ్యాలు ఉన్నాయంటారు. నీ పని త్వరగా పూర్తిచేసుకుని వెళ్ళిపో. ఆ గొడవ మనకెందుకు!) అంది.

ఆమె ‘కోటలో దయ్యాలు’ అనేసరికి నా గుండె గతుక్కుమంది. ‘నా గదిలో కనిపించేది దయ్యమా!? కోట నుంచి నన్ను వెన్నంటి వచ్చిందా??’ అన్న తలంపు హఠాత్తుగా మదిని తాకడంతో గుండె ఝల్లుమంది. 
ఆ రాత్రి పడుకుంటే అదే ఆలోచన మదిని తొలిచేస్తూంటే నిద్ర పట్టలేదు. ఏదో తెలియని భయం కమ్ముకుంది. నిజానికి దయ్యాలు, భూతాల ఉనికి పట్ల నాకు నమ్మకంలేదు. అదంతా పురాతన కాలపు ఫాంటసీ అని నా అభిప్రాయం. అయితే, నాలుగు రోజులుగా అవుతూన్న నా అనుభవానికి సంజాయిషీ ఏమిటి? పగటివేళ కోటలో తిరుగుతూ నోట్స్‌ రాసుకుంటూ బిజీగా ఉన్నా, మధ్యలో ఆ చిన్నారి గుర్తుకు రాకమానడంలేదు. కోటలో దయ్యాలు తిరగడం గురించి ఫోర్ట్‌ వాచ్‌మేన్‌ని కదిపాను. అది నిజమేననీ, నైట్‌ డ్యూటీలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు వాటిని చూస్తాననీ చెప్పాడు. వాళ్ళు చెబుతున్నది నిజమైతే, ‘కోటలోని దయ్యాలు గెస్ట్‌ హౌస్‌ వరకు వస్తాయా!?’. ఆ సంగతి ఏమిటో తేల్చుకోవాలన్న పట్టుదల కలిగింది నాలో. 
ఆ రోజు రాత్రి –మనిషి పడుకున్నట్టు తలగడలను పక్కమీద పేర్చి పైన దుప్పటి కప్పేసాను. నైట్‌ ల్యాంప్‌ వెలిగించి, మంచం పక్కన దాక్కున్నాను.

అర్ధరాత్రి అయేసరికి – ఆ ‘లిటిల్‌ డెవిల్‌’ బెడ్‌ దగ్గర ప్రత్యక్షమయింది. దీక్షగా బెడ్‌ మీది శాల్తీ వంక చూసింది. తరువాత తన బుల్లి చేత్తో మెల్లగా కుదిపింది. అంతలోనే ఏదో అనుమానం వచ్చినట్టుంది, కప్పిన దుప్పటిని లాగేసింది. మంచం మీద ఉన్నది మనిషి కాదని తెలియడంతో అక్కణ్ణుంచి వెళ్ళిపోబోయింది. 
చటుక్కున బయటకు వచ్చి ఆ చిన్నారి చేయి పట్టుకున్నాను. ‘‘ఎవరు నువ్వు? మనిషివా, దయ్యానివా?’’ అనడిగాను.
ఏడుపు లంకించుకుంది ఆ పిల్ల, ‘‘నాన్‌ పేయి ఇల్లే, అక్కా!’’ అని అరవంలో అంటూ.
ట్యూబ్‌ లైట్‌ వేసి, బెడ్‌ మీద నా పక్కన కూర్చోబెట్టుకుని దాని ఏడ్పు ఆపడానికి ప్రయత్నించాను. బిస్కెట్స్‌ ఇచ్చి తినమన్నాను. కుదుటపడ్డాక ఆ పిల్ల చెబుతూన్న సంగతులు వింటూంటే నా బుర్ర గిర్రున తిరిగిపోయింది.
ఆ చిన్నారి పేరు జయంతి. మదురైకి చెందిన అరవపిల్ల. యూకేజీ చదువుతోంది. బయట ఆడుకుంటూంటే ఎవరో ‘ఆంటీ’ ఐస్‌ క్రీమ్‌ ఇప్పిస్తానంటూ తీసుకువెళ్ళి, ఎత్తుకువచ్చేసింది. ఆ బిల్డింగులో నేలమాళిగలో ఉన్న ఓ గదిలో బంధించి ఉంచింది. తనలాంటి పిల్లలు మరికొందరు ఉన్నారక్కడ. ఓ పురుషుడు, స్త్రీ రోజూ రాత్రివేళ వచ్చి తమకు చాలీచాలని తిండి పెట్టి వెళ్ళిపోతారు. అమ్మనాన్నలు కావాలని ఏడిస్తే కొడతారు. తాము అక్కడ ఎన్ని రోజులుగా ఉన్నారో ఆ పిల్లలకు తెలియదు.

‘జయంతి స్మార్ట్‌ గాళ్‌. పిల్లలందరూ పడుకున్నాక నేలమాళిగను పరిశీలిస్తూంటే, గోడలో ఉన్న రహస్యపు మీట చేతికి తగలడమూ, అక్కడ ఉన్న రహస్యమార్గం తెరచుకోవడమూ జరిగాయి. ఆ మెట్లగుండా ధైర్యంగా పైకి వెళ్ళిందా పిల్ల. పైన ద్వారం వద్ద కప్పబడి ఉన్న డోర్‌ మ్యాట్‌ ని ఎలాగో తొలగించి గదిలో ప్రవేశించింది. అది నేను ఉన్న గదే కావడం విశేషం. నిద్రిస్తూన్న నా వద్దకు వచ్చి, నన్ను లేపాలనీ, బూచోళ్ళ గురించి చెప్పాలనీ అనుకునేది. కానీ, నేను కూడా వాళ్ళ మనిషినేమోనన్న భయంతో పారిపోతోంది. పూర్వం రాజుల కాలంలో సెక్యూరిటీ కోసం ప్రతి కట్టడంలోనూ ఓ రహస్యమార్గాన్ని ఏర్పాటుచేసుకోవడం కద్దు. ఆ రహస్యమార్గం గురించి ఎవరికీ తెలిసినట్టులేదు.
నన్ను నా పోర్షన్లోని యాంటీరూమ్‌కి తీసుకువెళ్ళింది జయంతి. ఆ గదిలో ఓ పెద్ద, పాత చెక్కబీరువా ఉంది. అందులో సామాన్లు పెట్టుకోవడమే తప్ప దాని వెనుకపక్క ఎప్పుడూ చూళ్ళేదు నేను. బీరువాకీ, గోడకూ మధ్య తగినంత ఖాళీస్థలం ఉంది. అక్కడ ఓ డోర్‌ మ్యాటూ, దాని క్రింద రహస్యమార్గమూ కనిపించాయి!

జయంతిని తీసుకుని సెల్‌ ఫోన్‌ టార్చ్‌ సాయంతో ఆ ఇరుకు మార్గం గుండా క్రిందకు దిగాను. నేలమాళిగలోని ఆ హాల్లో నేలపైన పరచియున్న జంబుఖానా మీద పడుకుని నిద్రపోతున్నారు సుమారు డజనుమంది చిన్నారులు. బాలబాలికలు – రెండు నుండి ఎనిమిదేళ్ళ వయసులవాళ్ళు అంతా. 
ఓ మూలగా బాత్‌ రూమ్‌ ఉంది. చెక్కస్టాండు  పైన పిల్లల బట్టలు, తువాళ్ళూ ఉన్నాయి. ఓ బల్ల మీద ఏవో తినుబండారాలు ఉన్నాయి.  హాల్లోంచి  ఉన్న సన్నటి నడవా ఓ చిన్న గదికి దారితీసింది. ఆ గదిలో ఓ మూల చెక్కబీరువా, రెండు మడతమంచాలూ తప్ప ఇంకేమీ లేవు. ఆ గదికి తలుపు ఉంది. అది బైటనుండి మూసివున్నట్టు తెలుస్తోంది. ‘బూచోళ్ళు’ ఆ గదిలోంచే వచ్చి వెళతారని చెప్పింది జయంతి.
అలికిడికి నిద్రలేచిన పిల్లలు నన్ను చూసి భయంతో ఏడుపు లంకించుకున్నారు. అందరూ అరవపిల్లలే. తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుండి ఎత్తుకురాబడ్డవాళ్ళు.

వారిని సముదాయించి, భయం పోగొట్టి, నా గదికి చేర్చాను. అమ్మనాన్నల దగ్గరకు చేర్చుతానని చెప్పడంతో వారి వదనాలు వెలిగిపోయాయి. నాదగ్గర ఉన్న బిస్కెట్స్, బ్రెడ్, పళ్ళూ ఇస్తే ఆవురావురుమంటూ తిని మంచినీళ్ళు తాగారు. వాళ్ళను పడుకోమని చెప్పి, ‘హండ్రెడ్‌’ కి ఫోన్‌ చేసి పోలీసులను ఎలర్ట్‌ చేసాను. 
పోలీసులు వెంటనే వచ్చి వాచ్‌ మేన్‌ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ’కొన్ని నెలల క్రితం ఓ దంపతులు వచ్చి తనతో పరిచయం చేసుకున్నారనీ, పైన ఫోర్ట్‌లో ఏదో పనిచేస్తున్నట్టు చెప్పారనీ, వచ్చినపుడల్లా డ్రింక్‌ బాటిల్స్‌ తెచ్చిచ్చి తనచేత బాగా తాగించేవారనీ, అంతకు మించి తాను ఏ పాపమూ ఎరుగననీ’ చెప్పాడు అతను. నేలమాళిగ సంగతి తాను ఎరుగననీ, వెనుకపక్క పాడుబడ్డ తలుపుకు ఎప్పట్నుంచో తాళంకప్ప వ్రేలాడుతుంటుందనీ, దాని విషయం తాను ఎన్నడూ పట్టించుకోలేదనీ అన్నాడు. 
పిల్లల్ని నా గదిలోనే ఉంచి, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది కిడ్నాపర్స్‌ కోసం నేలమాళిగలో ఓ రోజంతా మాటువేసారు. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో వచ్చి తాళం తెరచి లోపల ప్రవేశించిన ‘దంపతులను’ పట్టుకున్నారు. నలభైలలో ఉంటారు ఇద్దరూ. భార్యాభర్తలేనని తెలిపారు.

మొదట తమకేమీ తెలియదంటూ బుకాయించినా, పోలీసులు తమదైన శైలిలో ఇంటారాగేట్‌ చేయడంతో నిజం కక్కకతప్పలేదు వాళ్ళు... అంతర్రాష్ట్ర కిడ్నాపర్స్‌ గ్యాంగ్‌కు అనుబంధంగా పనిచేస్తూన్న తమిళనాడుకు చెందిన గ్యాంగ్‌ సభ్యులు వాళ్ళు. చిన్నపిల్లలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎత్తుకువచ్చి, పోలీసుల గాలింపు సద్దుమణిగే వరకు అక్కడ దాచి వుంచుతారు. ఆ తరువాత ఒక్కొక్కరిగా వారిని అక్కణ్ణుంచి తరలించి అంతర్రాష్ట్ర ముఠాకి అప్పగిస్తారు. 
ఆ దంపతులు ఇచ్చిన సమాచారంతో, పోలీసులు ఆ చిన్నారులను వారి వారి తల్లిదండ్రులకు అప్పగించడం, ఇతర ముఠాసభ్యులను, అంతర్రాష్ట్ర ముఠాకి చెందిన కొందరినీ అరెస్ట్‌ చేయడమూ జరిగిపోయాయి. 
చిన్నారి జయంతి ధైర్యసాహసాలను మెచ్చుకుని, ప్రభుత్వం ఆమె పేరును ‘బ్రేవరీ అవార్డ్‌’కు కేంద్రానికి సిఫారసు చేసింది. ‘పెద్దయ్యాక నువ్వు ఏమవుతావమ్మా?’ అనడిగితే, ‘పోలీసునవుతాను’ అంటూ జయంతి తడుముకోకుండా జవాబిచ్చింది. దాంతో, ప్రభుత్వపు ఖర్చుతో ఆ చిన్నారిని చదివించి, పోలీస్‌ ఆఫీసర్‌ ని చేస్తామంటూ హోమ్‌ మినిస్టర్‌ ప్రకటించారు. డాక్టరేట్‌ని పొందడం కంటే ఎక్కువ ఆనందం కలిగింది నాకు. ‘షి ఈజ్‌ రియల్లీ ఎ లిటిల్‌ డెవిల్‌!’ అనుకున్నాను మురిపెంగా, జయంతిని తలచుకుంటూ.
- తిరుమలశ్రీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement