‘‘ఏమయ్యా రైటరు!.. ఏ సినిమా చూశావూ... ఏ కథ రాశావూ?’’ అడిగాడు దున్నపోతు రత్తయ్య. నిజానికి ఆయన ఇంటి పేరు ‘దున్నపోతు’ కాదు. నిర్మాతగా ఆయన మొదటి సినిమా ‘దున్నపోతు’. దీంతో ‘దున్నపోతు రతయ్య’గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇప్పుడు మనం రైటర్ కాపీరోవా ఆండ్రూ నికోల్ గురించి చెప్పుకుందాం...
పేరు చూసి కాఫీ పొడిలో కాలెయ్యవద్దు. వీరు పదహారణాల ఆంధ్రులు. వీరి స్వగ్రామం మండపేట తాలూకలోని లింగపేట. వీరి అసలు పేరు మల్లెల డొల్లయ్య. పై చదువుల కోసం తల్లిదండ్రులు పట్నానికి పంపిస్తే... తెలుగు సినిమా చరిత్రను తిరగరాయాలనే కసితో కాలేజీ ఎగ్గొట్టేవాడు. ప్రతి తాజా సినిమా చూసి విశ్లేషించేవాడు.
‘‘ఆడు అలా తీశాడు కాని... నేను డైరెక్టర్ అయితే ఇలా తీసేవాడిని’’ అని కొత్త స్క్రీన్‌ప్లే చెప్పేవాడు.
‘‘డైరెక్టర్ కావడం అంత వీజీ కాదు... ముందు రైటర్ అవ్వు. ఒక్క సినిమా హిట్ అయినా చాలు డైరెక్టరై పోవచ్చు’’ అని ఎవరో సలహా ఇచ్చారు.
‘‘నా జీవితంలో ఒక్క పుస్తకం కూడా చదవలేదు... రైటర్ ఎలా అవుతాను?’’ సమంజసమైన డౌటు అడిగాడు డొల్లయ్య.
‘‘రైటర్ కావడానికి చదవాల్సింది పుస్తకాలు కాదు... చూడాల్సింది యూట్యూట్‌లో సినిమాలు’’ అని సలహా ఇచ్చాడు హితుడు.
అలా డొల్లయ్య చూడని సినిమా లేదు. హాలీవుడ్ సినిమాలు, కొరియన్ సినిమాలు అన్నిటినీ కంటితో నమిలి మింగేశాడు. న్యూమరాలజిస్ట్ సలహాతో తన పేరును ‘కాపీరోవా ఆండ్రూ నికోల్’గా మార్చుకున్నాడు.
‘‘సార్ మొన్న క్రిమినల్ సినిమా చూసి... కొత్త కథ తయారుచేశానండీ...’’ అని గొంతు సవరించాడు కాపీరోవా ఆండ్రూ నికోల్.
‘‘తెలుగు సినిమా చూసి ఏం కాపీ కొట్టావయ్యా బాబు!’’ ఆశ్చర్యంగా అడిగాడు దున్నపోతు రత్తయ్య.
‘‘నేను చూసింది నాగార్జున, మనీష కోయిరాలా, మహేష్‌భట్టు క్రిమినల్ కాదండీ! అమెరికన్ యాక్షన్ థ్రిల్లరండీ’’ అన్నాడు అరనవ్వుతో నికోల్..
‘‘అందులో ఏం దొబ్బేశావు?’’ ఆసక్తిగా అడిగాడు దున్నపోతు.
‘‘ఒక బ్రెయిన్ నుంచి మరొక బ్రెయిన్‌కు మెమొరీస్ ట్రాన్స్‌ఫర్ చేయడం’’ అని కథ చెప్పడం మొదలుపెట్టాడు కాపీరోవా ఆండ్రూ నికోల్.
మన సినిమాలో హీరో పేరు అప్పారావు. పీయంపీ డాక్టరండీ. ఒక్క పేషెంట్‌గా కూడా ఈయన క్లీనిక్‌కు రారండి. ఈ డిప్రెషన్‌లో సైంటిస్టుగా మారి రకరకాల ప్రయోగాలు చేస్తుంటాడు. అలా చేస్తున్న క్రమంలో ‘క్రిమినల్’ సినిమాలో డా.ఫ్రాంక్‌లాగా మెమోరీ ట్రాన్స్‌ఫర్ ఫార్ములా కనుగొంటాడు.
అంతే... మన అప్పారావు పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది.
ఈ ఫార్ములా కోసం వేలంపాట మొదలవుతుంది.
ఈ వేలంపాటలో ‘శ్రీకాఠిన్య’ అనే విద్యాసంస్థ అత్యధికంగా డబ్బు చెల్లించి ఈ ఫార్ములాను సొంతం చేసుకుంటుంది.
ఇక్కడ మనం ‘శ్రీకాఠిన్య’ గురించి చెప్పుకోవాలి.
‘చావో రేవో ర్యాంకో’ (సీఆర్‌ఆర్) అనే కొత్త విద్యాసంస్థ ధాటికి ‘శ్రీకాఠిన్య’ ప్రాభవం తగ్గిపోయింది. చదువు విషయంలో ‘సీఆర్‌ఆర్’ ఎంత స్ట్రిక్ట్ అంటే... ఏ విద్యార్థి అయినా సరిగ్గా చదవకపోతే ఒక గదిలో వేసి కొన్ని తెలుగు సీరియల్స్ చూపించి శిక్షించేవాళ్లు. అందుకే తమ పిల్లల్ని ఎక్కడో చూసుకోవాలని కలలు కనే పేరెంట్స్ ‘ఇక్కడైతేనే బాగుంటుంది’ అని ‘చావో రేవో ర్యాంకో’లో చేర్పించడం ప్రారంభించారు. ఈ దెబ్బకు ‘శ్రీకాఠిన్య’ దివాలా తీసింది.
తమ విద్యాసంస్థలను కోళ్లఫామ్‌లుగా మార్చాలనుకుంటున్న సమయంలో అనుకోని వరం దొరికింది ‘శ్రీకాఠిన్య’కు! అదే మెమొరీ ట్రాన్స్‌ఫర్!!
‘‘సార్... సిగరెట్ తాగి మిగతా కథ కంటిన్యూ చేస్తాను’’ అని సిగరెట్ ముట్టించాడు రైటర్.
‘‘నాకో డౌటు... అసలే శ్రీకాఠిన్య వాడు దివాలా తీశాడు. ఉప్పుడు ఈ ఫార్ములాతో ఆడేం చేసుకోగలడు?’’ డౌటు అడిగాడు దున్నపోతు రత్తయ్య.
‘‘మంచి డౌటు అడిగారు. ఇంటర్వెల్‌లో ప్రేక్షకులు దీని గురించే ఆలోచిస్తూ టీలు తాగుతూ, సిగరెట్లు కాలుస్తుంటారు. కథ ఎప్పుడూ సాఫీగా సాగవద్దని మా గురువుగారు చెబుతుంటారు. ప్రేక్షక మహాశయుడు వీలైనంత ఎక్కువగా జట్టు పీక్కునేలా చేయాలట! ఇది కూడా అలాంటి మెలికే!
మళ్లీ కథలోకి వద్దాం...
ఫార్ములా చేజిక్కించుకున్న వెంటనే పెద్ద ప్రకటన ఇస్తుంది శ్రీకాఠిన్య...
‘‘పేరెంట్స్ మహాశయులకు...
నా పిల్లాడు డాక్టర్ కావాలి... ఇంజనీర్ కావాలని ఎవరికి మాత్రం ఉండదు?
కలలు ఊరకే రావు.
మన కష్టాల్లో నుంచే వస్తాయి.
మనలాగా పిల్లలు కష్టపడవద్దనేది ఆ కల.
ఆ కలను నిజం చేసుకోవడానికి... మా విద్యాసంస్థలో చేర్పించండి.
అవును.
మీ డౌటు మాకు అర్థమైంది.
‘మా వాడు చదువులో దద్దమ్మండీ...
మా వాడు టెన్త్‌లోనే అత్తెసరు మార్కులతో పాసయ్యాడు...
మావాడు చదువు అనే మాట వినగానే పారిపోతున్నాడు...
ఇంకా డాక్టరేం అవుతాడు? ఇంజనీర్ ఏం అవుతాడు... మా బొంద!’ అనే కదా మీ డౌటు!
ఇవి పాతరోజులు కావండి.
కొత్త టెక్నాలజీ వచ్చిన కొత్తరోజులు.
మీ వాడు చదువులో రత్నమా? రాయా? అనేది మాకు అవసరం లేదు.
మీరు చేయాల్సిందల్లా మీ అబ్బాయిని మా కాలేజీలో చేర్పించడమే.
అంతే... మీ అబ్బాయిని డాక్టర్‌నో, ఇంజనీర్‌నో చేసి మీ చేతిలో పెడతాం.
రండి... గొప్ప అవకాశాన్ని వినియోగించుకోండి’’
అంతే...‘శ్రీకాఠిన్య’ కాలేజీలో పుంఖానుపుంఖాలుగా విద్యార్థులు చేరారు. చదువులో వెనకబడినవాడా, ముందు పడినవాడా? అనేదానితో సంబంధం లేకుండా అందరూ డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు’’ అని కథ ముగించాడు రైటర్ నికోల్.
‘‘హౌ?’’ ఆశ్చర్యంగా అడిగాడు రత్తయ్య.
‘‘ఏం లేదండీ... పరీక్షలకు ఒక రోజు ముందు చదువులో వెనకబడిన విద్యార్థులకు బాగా చదివే విద్యార్థుల మెమొరీస్‌ను ట్రాన్స్‌ఫర్ చేస్తారు. దీంతో జీరో విద్యార్థి సైతం హీరోలా ఆన్సర్‌పేపర్ రాసి ర్యాంకు తెచ్చుకుంటాడు’’ అసలు విషయం చెప్పాడు రైటర్ నికోలస్.
– యాకుబ్ పాషా
Comments
Please login to add a commentAdd a comment