అదిగో ఫిల్మ్‌నగర్ బస్‌స్టాప్‌లో నిల్చుని సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాడే... అతని పేరు లక్కీవర్మ. చాలా సంవత్సరాల నుంచి సినిమా ఫీల్డ్‌లో ఉన్నాడు. పే....ద్ద డైరెక్టర్ కావాలనేది అతడి చిన్న ఆశ. కానీ... క్యాలెండర్లు మారుతున్నాయి, కాలం మారుతోంది, హీరోల కొడుకులు హీరోలు అవుతున్నారు, ఆ యువ హీరో తముళ్లు హీరోలు అవుతున్నారు. లక్కీవర్మ మాత్రం ఎక్కడ వేసిన బ్లాంకెట్ అక్కడే అన్నట్లుగా ఉన్నాడు.
నిజం చెప్పాలంటే ‘లక్కీ’ దగ్గర కిలోల కొద్ది టాలెంట్ ఉంది. కానీ, ఒక్క గ్రాము ‘లక్’ కూడా కలిసిరావడం లేదు. ఎటు వెళ్లినా ‘బ్యాడ్‌లక్’ అనేది అప్పులోడు తగులుకున్నట్లు తగులుకుంటోంది.
‘లక్కీ’ సినిమా ఫీల్డ్‌లోకి వచ్చిన కొత్తలో ప్రేమకథల హవా నడిచేది. ఆ సమయంలో ‘ప్రేమ అంటే దోమ కాదురా’ పేరుతో పవర్‌ఫుల్ లవ్‌స్టోరీ తయారుచేసి ఒక నిర్మాతకు వినిపించడం, అది ఓకే కావడం జరిగిపోయింది. కానీ అది పట్టాలెక్కే సమయానికి ఫ్యాక్షన్ కథల ట్రెండ్ మొదలైంది.
దీంతో ‘మనం అనుకున్న కథ వద్దు. మాంచి ఫ్యాక్షన్ కథ రాయ్... బడ్జెట్ ఎక్కువైనా చేద్దాం’’ అన్నాడు నిర్మాత.
దీంతో ‘ప్రేమంటే దోమ కాదురా’ సబ్జెక్ట్ అటకెక్కింది.
చాలా ఊళ్లూ తిరిగి... గ్రౌండ్ వర్క్ చేసి, రీసెర్చ్ చేసి, ఇంకా ఏదేదో చేసి గొప్ప పవర్‌ఫుల్ ఫ్యాక్షన్ కథ తయారు చేసి నిర్మాతని కలిశాడు లక్కీవర్మ.
నిర్మాత: ఏమయ్యా కథ ఎక్కడి వరకు వచ్చింది?
వర్మ: డైలాగులతో సహా బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేశాను. సినిమా పేరు ‘నువ్వు ఒక్కసారి నరికితే... నేను వెయ్యి సార్లు నరుకుతా’
నిర్మాత: టైటిల్ పవర్‌ఫుల్‌గా ఉందయ్యా...
వర్మ: కథ ఇంకా పవర్‌ఫుల్‌గా ఉంటుంది సార్ వినండి.......... ............... ......... ........
నిర్మాత: అబ్బ! ఎంత గొప్పకథ రాశావయ్యా! డౌటే లేదు, మన సినిమా అన్ని రికార్డ్‌లను బ్రేక్ చేస్తుంది. వచ్చే నెలలోనే సినిమా స్టార్ట్ చేద్దాం.
సంతోషం తట్టుకోలేక తబ్బిబ్బై పోయాడు లక్కీవర్మ. ‘ఇది కలా నిజమా!’ అంటూ తనను తాను రక్తం వచ్చేట్లు గిల్లుకున్నాడు.
నిర్మాత చెప్పిన ‘వచ్చే నెల’ రెండు సంత్సరాలు దాటినా రాలేదు. క్యాలెండర్ మారింది, కాలం మారింది.
ట్రెండ్ కూడా మారింది...‘ఫ్యామిలీ డ్రామా’ ట్రెండ్ మొదలైంది. ప్రేక్షక మహాశయులను ఎంత ఏడిపిస్తే, సినిమా అంత పెద్ద హిట్ అయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో రెండు నెలలు కష్టపడి ‘పితృదేవోభవ’ అనే కథ రాశాడు లక్కీవర్మ.
స్క్రిప్ట్ పూర్తయిన తరువాత డా.సున్నిత కుమార్‌ను కలిశాడు.
అదేమిటి ప్రొడ్యూసర్‌ని కలవాలి కాని డాక్టర్‌ను కలవడమేమిటి? అనే కదా మీ డౌటు... అసలు విషయం ఏమిటంటే ఈ డాక్టర్‌గారికి సినిమాల పిచ్చి. అందుకే తొలిసారిగా నిర్మాతగా మారి మంచి కథల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక్కడ డాక్టర్‌గారి గురించి ఒక విషయం చెప్పాలి... ఈయన చాలా సున్నితమనస్కుడు. అందుకే వాళ్ల నాన్నగారు ‘సున్నిత కుమార్’ అని పేరెట్టాడు.
ఇక మళ్లీ లక్కీవర్మ దగ్గరికి వద్దాం.
వర్మ: సార్... మీరు చెప్పినట్లే ట్రెండ్‌కి తగ్గ కథ తయారుచేశాను. సినిమా పేరు ‘పితృదేవోభవ’. ఈ కథ వింటే కఠిన రాళ్లు సైతం కన్నీరవుతాయి సార్. వినండి..... ....... ........ ........ ........ ....
వర్మ కథ చెప్పడం పూర్తికాగానే సున్నిత కుమార్ గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. కన్నీళ్లు తుడుచుకోవడానికి కర్చీఫ్‌లు సరిపోక ఏకంగా టవల్స్‌తోనే తుడుచుకుంటున్నాడు.
‘‘సార్ కథ నచ్చిందా?’’ అడిగాడు వర్మ.
‘నచ్చిందా లేదా’ అని చెప్పకుండా ఏడ్చాడు సున్నిత కుమార్. ఏడుస్తూనే ఉన్నాడు... రాత్రి ఏడు దాటినా... ఏడుస్తూనే ఉన్నాడు... అలా అలా సున్నిత కుమార్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఒక చీకటిగదిలో కూర్చుని అదేపనిగా ఏడుస్తూనే ఉన్నాడు. అతడిని మామూలు మనిషిని చేయడానికి ఇంటిల్లిపాదికి హెడ్డు ప్రాణం టెయిల్‌కు వచ్చింది.
ఒక నెల తరువాత డాక్టర్‌గారి ఇంటి గేట్ తట్టాడు వర్మ.
‘‘ఎవరు మీరు?’’
‘‘నేను డైరెక్టర్ లక్కీవర్మ. సార్‌కి బాగా తెలుసు. నా కథ నచ్చిందో లేదో తెలుసుకుందామని వచ్చాను’’
‘‘నువ్వేనా లక్కీ అంటే... ఏసేంయండిరా వీడ్ని... నీ కథ వినే మా సార్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు... కుమ్మండి రా వీడ్ని...’’
చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అక్కడి నుంచి బయటపడ్డాడు లక్కీవర్మ. ఆ తరువాత ఆ ఇంటి దగ్గరే కాదు... హైదరాబాద్‌లోనే కనిపించలేదు.
సరిగ్గా అయిదు సంవత్సరాల తరువాత...
ప్రదేశం: అమెరికాలోని న్యూయార్క్ సిటీ.
‘లింకన్ సెంటర్ ఫర్ ది పెర్‌ఫార్మింగ్ ఆర్ట్స్’ ఆడిటోరియంలో ‘ఎన్‌ఆర్‌ఐ’ల సమావేశం.
‘ఎక్కడో పుట్టి
ఎక్కడో పెరిగి
ఈ అమెరికా వచ్చి...
‘చపక్ చిపక్ స్కూల్ ఆఫ్ డ్రామా’ అనే ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించి... వందల మంది నటులను, డైరెక్టర్లను, సాంకేతిక నిపుణులను తయారు చేశాడు.
ఇవ్వాళ ప్రపంచంలో వంద మంది గొప్ప డైరెక్టర్లు, గొప్ప హీరోలు, గొప్ప నటులు ఉంటే అందులో తొంబైతొమ్మిది మంది ఈ ‘చపక్ చిపక్’ నుండే రావడం గొప్ప విషయం.
ఆ వ్యక్తి మన తెలుగువాడు కావడం గర్వకారణం.
వెల్‌కమ్ టు మిస్టర్ లక్కీవర్మ... ఫౌండర్ ఆఫ్ ‘చపక్ చిపక్ స్కూల్ ఆఫ్ డ్రామా’.
ఆ సన్మానభలో శ్రీ లక్కీవర్మ ఇలా మాట్లాడారు...
‘‘టెన్త్ క్లాసు కూడా పాస్ అవ్వని వ్యక్తులు స్కూళ్లు పెట్టి లక్షలు గడిస్తున్నారు. ఈ స్కూళ్లలో చదివిన వాళ్లు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు... అవుతున్నారు. ఈ ఫార్ములా బాగుంది అనిపించింది. డైరెక్టర్ కాకపోతేనేం... ఎంతో మంది డైరెక్టర్లను తయారుచేస్తాను... అనుకుంటూ అష్టకష్టాలు పడి అమెరికా చేరుకున్నాను. ‘వీనస్ కె డెకో’ అని పేరు మార్చుకున్నాను. ‘పందెంలో కప్పు గెలుచుకోలేదని బాధపడుతూ కూర్చోకు... కప్పులు అమ్మే దుకాణం పెట్టి కసి తీర్చుకో’ అన్నది నా థియరీ.’’
చప్పట్లతో ఆడిటోరియం దద్దరిల్లింది.
– యాకుబ్ పాషా
Comments
Please login to add a commentAdd a comment