అటు అమెరికా ఇటు ఇరాన్‌... మధ్యలో జిన్నీ! | Funday Laughing Gas Comedy Story | Sakshi
Sakshi News home page

అటు అమెరికా ఇటు ఇరాన్‌... మధ్యలో జిన్నీ!

Published Sun, Jun 2 2019 1:03 PM | Last Updated on Sun, Jun 2 2019 1:03 PM

Funday Laughing Gas Comedy Story - Sakshi

చీటికి మాటికి తమ మీద ఆంక్షలు విధిస్తున్న అమెరికా ప్రెసిడెంటు ట్రంపు మీద ఇరాన్‌ ప్రెసిడెంట్‌ హసన్‌ రోహానీకి పీకలలోతు కోపం వచ్చింది.  తనకు కోపం వచ్చినప్పుడల్లా కలం కాగితం తీసి కవితలు రాయడం రోహానీ అలవాటు. ఇది హైస్కూల్‌ రోజుల నుంచి ఉంది.
ఈసారి కూడా అలాగే చేశాడు.
కాగితం తీసి కలంతో ఇలా కవిత రాశాడు:
‘బాంబులు విసిరినా
బరిసెలతో పొడిచినా
తెలుగు టీవీ సీరియల్స్‌ చూపించినా
అక్కుపక్షి అమెరికాకు నో సరెండర్‌...నో సరెండర్‌
వాహ్వా...వాహ్వా!’
కవిత రాసి పావుగంట దాటినా  కోపం అట్లాగే  ఉంది. అంతే వేడితో ఉంది.
ఈసారి స్కెచ్‌పెన్‌తో డ్రాయింగ్‌ పేపర్‌ మీద ట్రంపు బొమ్మ గీసి ముక్కలు ముక్కలుగా చింపేసి వికటాట్టహాసం చేశాడు. అయినా కోపం తగ్గలేదు. వేడి తగ్గలేదు.
ఈసారి ట్రంప్‌ మైనపు బొమ్మను తయారుచేసి టెహరాన్‌ గ్రౌండ్‌లో నిలబెట్టి దూరం నించి ఒక రాయి విసిరాడు. గురి చూసి కొట్టడంలో మనోడు కాస్త వీక్‌.
అది వెళ్లి ఎక్కడో పడింది. ఎక్కడో కాదు... పిచ్చి పొదల మాటున ఉన్న ఒక దీపం మీద పడింది. అది మామూలు దీపం కాదు... అక్షరాలా అల్లావుద్దీన్‌ దీపం! ఆవులిస్తూ అంతెత్తున లేచింది జిన్నీ భూతం.
‘‘ఏంది నీ లొల్లి. మంచి నిద్రలో ఉంటే డిస్టర్బ్‌ చేశావు! ఏం కావాలో అడిగిచావు’’ అన్నది జిన్నీ భూతం మణికట్టు గడియారంలో టైమ్‌ చూసుకుంటూ.
జిన్నీ భూతాన్ని చూడగానే సంతోషంతో ఒడలు పులకించాయి ఇరాన్‌ ప్రెసిడెంట్‌కు.
‘యురేకా తకామికా
నీ ముద్దూ తిరేదాకా
దొరికెరా మజాగా ఛాన్సు..’ అని చిరంజీవి సినిమాలోని పాట అందుకున్నాడు.
‘‘పాట సంగతి తరువాత....ముందు వరం అడిగి చావు’’ అని గద్దించింది జిన్నీ భూతం.
‘‘అయ్యా జిన్నీ భూతం...
 మీకు తెలియంది కాదు...మా దేశానికి ప్రధాన ఆధారం ఆయిల్‌. ఆ అమెరికా ట్రంపు ఉన్నాడు చూశారూ... మా మీద ఆంక్షలు విధించాడు. గ్రీస్, ఇటలీ, తైవాన్, టర్కీ... ఇవేమీ మా ఆయిల్‌ను దిగుమతి చేసుకోవడం లేదు. ఇప్పుడు ఈ కూటమిలో ఇండియా కూడా చేరింది. టాప్‌ బయర్స్‌ మా ఆయిల్‌ను దిగుమతి చేసుకోవడం లేదు’’ అని బాధ పడిపోయాడు ఇరాన్‌ ప్రెసిడెంటు.
‘‘మరిప్పుడు నన్నేటి సేయమంటావు? ట్రంపు తల తీసి నీ చేతుల్లో పెట్టమంటవా?’’ అని అడిగింది జిన్నీ భూతం.
‘‘ఆడి తలతో నేనేం చేసుకునేది! అందులో ఏముంది గనుక!’’ వాపోయాడు  ఇ. ప్రెసిడెంట్‌.
‘‘అతడిని ఏమీ చేయనక్కర్లేదు. టాప్‌బయర్స్‌ మళ్లీ మా ఆయిల్‌ను దిగుమతి చేసుకునేలా చేస్తే అదే పది రియాల్లు’’ అని దీనంగా అడిగాడు ప్రెసిడెంట్‌.
‘‘చూడు రోహానీ...
నేను చెప్పినట్లు చేస్తే నీ ప్రాబ్లం తొలిగిపోతుంది’’ అన్నది జిన్నీ భూతం.
‘‘ఏంచేయంటారు?’’ మర్యాదతో కూడిన ఆసక్తితో అడిగాడు ప్రెసిడెంటు రోహానీ.
‘‘సింపుల్‌... మీ ఆయిల్‌ను  ఏ దేశాలైతే దిగుమతి చేసుకోవడం లేదో... ఆ దేశాల్లో నన్ను వదులు చాలు’’ అన్నది జిన్నీ భూతం.
‘‘అలాగే’’ అన్నాడు ప్రెసిడెంటు.
∙∙
‘‘విక్రమార్కా... చాలా రోజుల తరువాత టఫ్‌ క్వచ్చన్‌ అడుగుతున్నాను.  ఇంతకీ జిన్నీ భూతం ఏం చేసింది? టాప్‌బయర్స్‌ మళ్లీ ఇరాన్‌ ఆయిల్‌ను దిగుమతి చేసుకొనేలా చేసిందా? నా ప్రశ్నకు జవాబు తెలిసి కూడా చెప్పకపోయావో మటాష్‌...’’ అని అరిచాడు విక్రమార్కుడి భుజం మీది భేతాళుడు.
అప్పుడు చిరునవ్వుతో విక్రమార్కుడు అలా చెప్పడం మొదలుపెట్టాడు....
∙∙
ఇటలీ... పర్మ సిటీ...రోడ్డు నంబర్‌: 2
తన ఇంటి పెరట్లో ఒక మూలన పడి ఉన్న పాతదీపాన్ని చూసి...
‘‘కొంపదీసి ఇది అల్లావుద్దీన్‌ అద్భుతదీపం అయితే కాదు కదా’’ అని బుర్రగొక్కున్నాడు నలభైనాలుగు సంవత్సరాల ఇంజనీర్‌ బట్కేనల్‌ జుమ్‌ జుమ్‌.
‘‘కొంపదీసి ఏమిటయ్యా బాబూ... నేను నిజంగానే అద్భుతదీపాన్ని’’ అరిచింది జిన్నీ.
‘‘నాకు ఒకే ఒక కోరిక ఉంది. అది తీర్చు జిన్నీ’’ అని దీనంగా అడిగాడు బట్కేనల్‌ జుమ్‌ జుమ్‌.
‘‘మణులా మాణిక్యాలా? మందుబాటిళ్లా? కమాన్‌ అడుగు’’  ఆఫర్‌ ఇచ్చింది జిన్నీ భూతం.
‘‘అవేం అక్కర్లేదు’’ నసిగాడు జుమ్‌ జుమ్‌.
‘‘మరి ఏం కావాలి?’’ అడిగింది జిమ్మి.
‘‘మా ఆవిడ పుట్టింటికి వెళ్లేలా చూడు... నాకు వక్కపొడి కూడా తినే అలవాటు లేదనేది మా ఆవిడకు ఉన్న భ్రమ. ఆమె భ్రమ నా పాలిటి భయమై... నన్ను మందుకు దూరం చేసింది. ఆమె ఒక వారం రోజులు పుట్టింటికి పోతే నాన్‌స్టాప్‌గా మందుకొట్టాలనేది నా చిరు కోరిక’’  లొట్టలు వేస్తూ అన్నాడు బట్కేనల్‌ జుమ్‌ జుమ్‌.
‘‘అదిసరేగానీ, దీపంలో ఏం ఉంటుంది?’’ అని అడిగింది జిన్నీ భూతం.
‘‘ఆయిల్‌’’ అని ఆన్సర్‌ చెప్పాడు జుమ్‌ జమ్‌.
‘‘ప్రస్తుతం మా దీపంలో అయిల్‌ అయిపోయింది. మళ్లీ పోస్తేగానీ పని చేయదు’’ అన్నది జిన్నీ.
‘‘ఓసే అంతేగా... ఇప్పుడే తీసుకొస్తాను...’’ అని జుమ్‌జుమ్‌ అనేలోపు జిన్నీ భూతం  ఇలా అన్నది...
‘‘నాయనా జుమ్‌ జుమ్‌... మా దీపంలో  ఇరాన్‌ ఆయిల్‌ పోస్తేనే పని చేస్తుంది’’
‘‘ఇరాన్‌ ఆయిల్‌ని బ్యాన్‌ చేశారు కదా’’ అని తల పట్టుకున్నాడు బట్కేనల్‌ జుమ్‌ జుమ్‌.
‘‘అలా తలపట్టుకుంటే కుదరదు. ఇరాన్‌ ఆయిల్‌ పోస్తేగానీ దీపం పనిచెయ్యదు. అప్పుడుగానీ నీ కోరిక నెరవేరదు’’ మరోసారి అన్నది జిన్నీ.
అల్లావుద్దీన్‌ దీపం రోజుకో దేశంలో, రోజుకో ఇంట్లో ప్రత్యక్షమయ్యేది.
‘‘నీ కోరిక తీరుస్తానుగానీ ముందు మా దీపానికి  ఇరాన్‌ ఆయిల్‌ కావాలి’’ అని అడిగేది. ఇలా ‘ఇరాన్‌ ఆయిల్‌’కు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. ఇరాన్‌ ఆయిల్‌ దిగుమతి మీద నిషేధం తొలిగించాలని ఉద్యమాలు చెలరేగాయి. ఈ ఉద్యమాల వేడి తట్టుకోలేక టాప్‌ బయర్స్‌ దేశాలు ఇరాన్‌ ఆయిల్‌ మీద నిషేధాన్ని తొలిగించాయి. ఇరాన్‌ ప్రెసిడెంటు కోరిక అలా నెరవేరింది!
– యాకుబ్‌ పాషా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement