Comedy story
-
ది గ్రేట్ ఇంటర్వ్యూ
‘‘విక్రమార్కా...ఒకడు జాబ్ కోసం ఇంటర్వ్యూకు వెళ్లాడు. కాని ఆఫీసర్ అడిగిన ఫస్ట్ కొచ్చెన్ నుంచి లాస్ట్ కొచ్చెన్ వరకు ఏది అడిగినా కేవలం రెండక్షరాలతోనే మేనేజ్ చేశాడు. ఇది ఎలా సాధ్యం?’’ అడిగాడు భేతాళుడు. ‘‘ఎందుకు సాధ్యం కాదు భేతాళా! అదిగో అటు చూడు...’’ అని సీన్ చూపించాడు విక్రమార్కుడు. అనగనగా ఒక కార్యాలయం. ఆ కార్యాలయంలో... ఆఫీసర్: నీ పేరేమిటి? క్యాండిడేట్: ఎంపీ సార్. ఆఫీసర్: పూర్తి పేరు? క్యాండిడేట్:మనోహర్ పీడ సార్. ఆఫీసర్: మీ నాన్నగారి పేరు? క్యాండిడేట్: ఎంపీ సార్. ఆఫీసర్: పూర్తి పేరు? క్యాండిడేట్: మంగయ్య పీడ సార్. చనిపోయారు. ఆఫీసర్: ఎలా? క్యాండిడేట్: ఎంపీ ఆఫీసర్: అంటే? క్యాండిడేట్:మందు ప్రాబ్లం సార్. ఆఫీసర్: మీ నేటివ్ ప్లేస్? క్యాండిడేట్:ఎంపీ సార్. ఆఫీసర్: అంటే? క్యాండిడేట్: మధ్యప్రదేశ్ సార్ ఆఫీసర్: ఏం చదువుకున్నావు? క్యాండిడేట్: ఎంపీ సార్. ఆఫీసర్: అంటే? క్యాండిడేట్: మెట్రిక్ పాస్ సార్. ఆఫీసర్: ఈ జాబు ఎందుకు చేయాలనుకుంటున్నావు? క్యాండిడేట్: ఎంపీ సార్. ఆఫీసర్: అంటే? క్యాండిడేట్: మనీ ప్రాబ్లం సార్. ఆఫీసర్: నీ పర్సనాలిటీ గురించి చెప్పు... క్యాండిడేట్: ఎంపీ సార్. ఆఫీసర్: అంటే? క్యాండిడేట్: మైండ్ బ్లోయింగ్ –పర్సనాలిటీ సార్. ఆఫీసర్: నీకు ఇష్టమైన కూర? క్యాండిడేట్: ఎంపీ సార్. ఆఫీసర్: అంటే? క్యాండిడేట్: మునక్కాడ పప్పు సార్. ఆఫీసర్: ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? క్యాండిడేట్: ఎంపీ సార్. ఆఫీసర్: అంటే? క్యాండిడేట్:మెహదీపట్నం సార్. ఆఫీసర్: నీకు ఇష్టమైన పుస్తకం? క్యాండిడేట్: ఎంపీ సార్. ఆఫీసర్: అంటే? క్యాండిడేట్: మహాప్రస్థానం సార్. ఆఫీసర్: నీకు ఇష్టమైన డ్రింక్? క్యాండిడేట్: ఎంపీ సార్. ఆఫీసర్: అంటే? క్యాండిడేట్: మంచి పాలు సార్. ఆఫీసర్: నీకు ఇష్టమైన సినిమా? క్యాండిడేట్: ఎంపీ సార్. ఆఫీసర్: అంటే? క్యాండిడేట్: మెషిన్‌గన్ ప్రీచర్ (హాలివుడ్ సినిమా–2011, డైరెక్టర్: మార్క్ ఫోస్టర్) ఆఫీసర్: హాలివుడ్ సంగతి సరే, నచ్చిన తెలుగు సినిమా? క్యాండిడేట్: ఎంపీ సార్. ఆఫీసర్: అంటే? క్యాండిడేట్: మంచు పల్లకి సార్. ఆఫీసర్: నీకు ఇష్టమైన క్రికెటర్? క్యాండిడేట్: ఎంపీ సార్. ఆఫీసర్: అంటే? క్యాండిడేట్: మనోజ్ ప్రభాకర్. ఆఫీసర్: ఇక నువ్వు వెళ్లవచ్చు... ఏమిటీ ఏదో అడగాలనుకుంటున్నావు? క్యాండిడేట్: ఎంపీ సార్. ఆఫీసర్: అంటే? క్యాండిడేట్: మై పెర్ఫార్మెన్స్? ఆఫీసర్: ఎంపీ. క్యాండిడేట్: అంటే? ఆఫీసర్: నువ్వో మెంటల్ పేషెంట్ అని నా అభిప్రాయం. క్యాండిడేట్: ఎంపీ. ఆఫీసర్: అంటే? క్యాండిడేట్: మై ప్లెజర్ సార్. – యాకుబ్ పాషా -
అది ఫిల్మ్‌నగర్; ఏదైనా జరగొచ్చు..
అదిగో ఫిల్మ్‌నగర్ బస్‌స్టాప్‌లో నిల్చుని సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాడే... అతని పేరు లక్కీవర్మ. చాలా సంవత్సరాల నుంచి సినిమా ఫీల్డ్‌లో ఉన్నాడు. పే....ద్ద డైరెక్టర్ కావాలనేది అతడి చిన్న ఆశ. కానీ... క్యాలెండర్లు మారుతున్నాయి, కాలం మారుతోంది, హీరోల కొడుకులు హీరోలు అవుతున్నారు, ఆ యువ హీరో తముళ్లు హీరోలు అవుతున్నారు. లక్కీవర్మ మాత్రం ఎక్కడ వేసిన బ్లాంకెట్ అక్కడే అన్నట్లుగా ఉన్నాడు. నిజం చెప్పాలంటే ‘లక్కీ’ దగ్గర కిలోల కొద్ది టాలెంట్ ఉంది. కానీ, ఒక్క గ్రాము ‘లక్’ కూడా కలిసిరావడం లేదు. ఎటు వెళ్లినా ‘బ్యాడ్‌లక్’ అనేది అప్పులోడు తగులుకున్నట్లు తగులుకుంటోంది. ‘లక్కీ’ సినిమా ఫీల్డ్‌లోకి వచ్చిన కొత్తలో ప్రేమకథల హవా నడిచేది. ఆ సమయంలో ‘ప్రేమ అంటే దోమ కాదురా’ పేరుతో పవర్ఫుల్ లవ్‌స్టోరీ తయారుచేసి ఒక నిర్మాతకు వినిపించడం, అది ఓకే కావడం జరిగిపోయింది. కానీ అది పట్టాలెక్కే సమయానికి ఫ్యాక్షన్ కథల ట్రెండ్ మొదలైంది. దీంతో ‘మనం అనుకున్న కథ వద్దు. మాంచి ఫ్యాక్షన్ కథ రాయ్... బడ్జెట్ ఎక్కువైనా చేద్దాం’’ అన్నాడు నిర్మాత. దీంతో ‘ప్రేమంటే దోమ కాదురా’ సబ్జెక్ట్ అటకెక్కింది. చాలా ఊళ్లూ తిరిగి... గ్రౌండ్ వర్క్ చేసి, రీసెర్చ్ చేసి, ఇంకా ఏదేదో చేసి గొప్ప పవర్ఫుల్ ఫ్యాక్షన్ కథ తయారు చేసి నిర్మాతని కలిశాడు లక్కీవర్మ. నిర్మాత: ఏమయ్యా కథ ఎక్కడి వరకు వచ్చింది? వర్మ: డైలాగులతో సహా బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేశాను. సినిమా పేరు ‘నువ్వు ఒక్కసారి నరికితే... నేను వెయ్యి సార్లు నరుకుతా’ నిర్మాత: టైటిల్ పవర్‌ఫుల్‌గా ఉందయ్యా... వర్మ: కథ ఇంకా పవర్‌ఫుల్‌గా ఉంటుంది సార్ వినండి.......... ............... ......... ........ నిర్మాత: అబ్బ! ఎంత గొప్పకథ రాశావయ్యా! డౌటే లేదు, మన సినిమా అన్ని రికార్డ్లను బ్రేక్ చేస్తుంది. వచ్చే నెలలోనే సినిమా స్టార్ట్ చేద్దాం. సంతోషం తట్టుకోలేక తబ్బిబ్బై పోయాడు లక్కీవర్మ. ‘ఇది కలా నిజమా!’ అంటూ తనను తాను రక్తం వచ్చేట్లు గిల్లుకున్నాడు. నిర్మాత చెప్పిన ‘వచ్చే నెల’ రెండు సంత్సరాలు దాటినా రాలేదు. క్యాలెండర్ మారింది, కాలం మారింది. ట్రెండ్ కూడా మారింది...‘ఫ్యామిలీ డ్రామా’ ట్రెండ్ మొదలైంది. ప్రేక్షక మహాశయులను ఎంత ఏడిపిస్తే, సినిమా అంత పెద్ద హిట్ అయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో రెండు నెలలు కష్టపడి ‘పితృదేవోభవ’ అనే కథ రాశాడు లక్కీవర్మ. స్క్రిప్ట్ పూర్తయిన తరువాత డా.సున్నిత కుమార్‌ను కలిశాడు. అదేమిటి ప్రొడ్యూసర్ని కలవాలి కాని డాక్టర్‌ను కలవడమేమిటి? అనే కదా మీ డౌటు... అసలు విషయం ఏమిటంటే ఈ డాక్టర్గారికి సినిమాల పిచ్చి. అందుకే తొలిసారిగా నిర్మాతగా మారి మంచి కథల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక్కడ డాక్టర్గారి గురించి ఒక విషయం చెప్పాలి... ఈయన చాలా సున్నితమనస్కుడు. అందుకే వాళ్ల నాన్నగారు ‘సున్నిత కుమార్’ అని పేరెట్టాడు. ఇక మళ్లీ లక్కీవర్మ దగ్గరికి వద్దాం. వర్మ: సార్... మీరు చెప్పినట్లే ట్రెండ్‌కి తగ్గ కథ తయారుచేశాను. సినిమా పేరు ‘పితృదేవోభవ’. ఈ కథ వింటే కఠిన రాళ్లు సైతం కన్నీరవుతాయి సార్. వినండి..... ....... ........ ........ ........ .... వర్మ కథ చెప్పడం పూర్తికాగానే సున్నిత కుమార్ గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. కన్నీళ్లు తుడుచుకోవడానికి కర్చీఫ్‌లు సరిపోక ఏకంగా టవల్స్తోనే తుడుచుకుంటున్నాడు. ‘‘సార్ కథ నచ్చిందా?’’ అడిగాడు వర్మ. ‘నచ్చిందా లేదా’ అని చెప్పకుండా ఏడ్చాడు సున్నిత కుమార్. ఏడుస్తూనే ఉన్నాడు... రాత్రి ఏడు దాటినా... ఏడుస్తూనే ఉన్నాడు... అలా అలా సున్నిత కుమార్ డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఒక చీకటిగదిలో కూర్చుని అదేపనిగా ఏడుస్తూనే ఉన్నాడు. అతడిని మామూలు మనిషిని చేయడానికి ఇంటిల్లిపాదికి హెడ్డు ప్రాణం టెయిల్‌కు వచ్చింది. ఒక నెల తరువాత డాక్టర్గారి ఇంటి గేట్ తట్టాడు వర్మ. ‘‘ఎవరు మీరు?’’ ‘‘నేను డైరెక్టర్ లక్కీవర్మ. సార్‌కి బాగా తెలుసు. నా కథ నచ్చిందో లేదో తెలుసుకుందామని వచ్చాను’’ ‘‘నువ్వేనా లక్కీ అంటే... ఏసేంయండిరా వీడ్ని... నీ కథ వినే మా సార్ డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు... కుమ్మండి రా వీడ్ని...’’ చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అక్కడి నుంచి బయటపడ్డాడు లక్కీవర్మ. ఆ తరువాత ఆ ఇంటి దగ్గరే కాదు... హైదరాబాద్‌లోనే కనిపించలేదు. సరిగ్గా అయిదు సంవత్సరాల తరువాత... ప్రదేశం: అమెరికాలోని న్యూయార్క్ సిటీ. ‘లింకన్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ ఆడిటోరియంలో ‘ఎన్ఆర్ఐ’ల సమావేశం. ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈ అమెరికా వచ్చి... ‘చపక్ చిపక్ స్కూల్ ఆఫ్ డ్రామా’ అనే ఇన్స్టిట్యూట్ను స్థాపించి... వందల మంది నటులను, డైరెక్టర్లను, సాంకేతిక నిపుణులను తయారు చేశాడు. ఇవ్వాళ ప్రపంచంలో వంద మంది గొప్ప డైరెక్టర్లు, గొప్ప హీరోలు, గొప్ప నటులు ఉంటే అందులో తొంబైతొమ్మిది మంది ఈ ‘చపక్ చిపక్’ నుండే రావడం గొప్ప విషయం. ఆ వ్యక్తి మన తెలుగువాడు కావడం గర్వకారణం. వెల్కమ్ టు మిస్టర్ లక్కీవర్మ... ఫౌండర్ ఆఫ్ ‘చపక్ చిపక్ స్కూల్ ఆఫ్ డ్రామా’. ఆ సన్మానభలో శ్రీ లక్కీవర్మ ఇలా మాట్లాడారు... ‘‘టెన్త్ క్లాసు కూడా పాస్ అవ్వని వ్యక్తులు స్కూళ్లు పెట్టి లక్షలు గడిస్తున్నారు. ఈ స్కూళ్లలో చదివిన వాళ్లు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు... అవుతున్నారు. ఈ ఫార్ములా బాగుంది అనిపించింది. డైరెక్టర్ కాకపోతేనేం... ఎంతో మంది డైరెక్టర్లను తయారుచేస్తాను... అనుకుంటూ అష్టకష్టాలు పడి అమెరికా చేరుకున్నాను. ‘వీనస్ కె డెకో’ అని పేరు మార్చుకున్నాను. ‘పందెంలో కప్పు గెలుచుకోలేదని బాధపడుతూ కూర్చోకు... కప్పులు అమ్మే దుకాణం పెట్టి కసి తీర్చుకో’ అన్నది నా థియరీ.’’ చప్పట్లతో ఆడిటోరియం దద్దరిల్లింది. – యాకుబ్ పాషా -
‘బేరు’ మన్నాడు!
అతడి పేరు విని ‘భయం’ గజగజా వణికిపోతుంది. అతడి మాట విని ‘భయం’ కుప్పకూలిపోతుంది. అతడిని చూసి ‘భయం’ వెనక్కి చూడకుండా పారిపోతుంది. అతడే ఢిస్కవరీ ఛానల్ ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ ఫేం బేర్ గ్రిల్స్. మన దేశంలోని ‘సాహసి అభిమాన సంఘం’ అనే సంస్థ ‘బేర్’కు సన్మానం చేయాలని నిర్ణయించి ఆయనకు ఆహ్వానం పలికింది. సంతోషంగా ఒప్పుకొని ఇండియాకు బయలుదేరాడు బేర్. సన్మాన సభ హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేయడం జరిగింది. ‘‘నాకేమీ ప్రత్యేక ఏర్పాట్లు చేయనక్కర్లేదు. ఒక సామాన్యుడిలాగే వస్తాను...ఐ లవ్ సింప్లిసిటీ...నో పబ్లిసిటీ’’ అన్నాడు బేర్. ‘‘అలాగే దొర’’ అన్నారు అభిమాన సంఘం వాళ్లు. ఇండియాకు వచ్చేముందు ‘30రోజుల్లో తెలుగు’ పుస్తకాన్ని క్షుణ్ణంగా బట్టీ పట్టడంతో బేర్‌కు తెలుగు పూర్తిగా వచ్చేసింది. ఆరోజు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ట్రైన్ దిగి ఆల్ఫా హోటల్ దగ్గర చాయ్ తాగి ఆటోస్టాండ్ ముందు నిల్చున్నాడు బేర్. ఇంతలో ఒకడు వచ్చి బేర్‌ను ఒక్కసారిగా ఆటోలో ఎత్తిపడేసి ఆటో స్టార్ట్ చేశాడు. ‘‘ఓరీ నీ దుంపతెగ...ఎక్కడికి? అని అడక్కుండా ఆటో స్టార్ట్ చేశావేమయ్యా?’’ అని నోరెళ్లబెట్టాడు బేర్. ‘‘ఎక్కడికి వెళ్లాలి? అని నేను అడిగినా, ఇక్కడికి తీసుకెళ్లాలి అని నువ్వు అడిగినా...ఆటో పోవాల్సిన చోటుకే పోతుంది. జీవితం కూడా అంతే... నేను ఇది కావాలి అని మనిషి తలిస్తే... కాదు నువ్వు అది కావాలి అని విధి తలుస్తుంది. విమానం నడపాలని నేను డిసైడ్ చేసుకున్నాను... కాదు నువ్వు ఆటో నడపాలని విధి డిసైడ్ చేసింది... కొన్ని విషయాలు అంతే’’ అన్నాడు జర్దాపాన్ నములుతున్న డ్రైవరు వేదాంతధోరణిలో. ‘‘నీ వేదాంతం తీరిగ్గా వింటానుగానీ ఆటోను రవీంద్రభారతీకి తీసుకెళ్లు’’ అన్నాడు బేర్. ‘‘అలాగే సార్’’ అన్నాడు వినయంగా ఆటోవాలా. మూసాపేట, కూకట్పల్లి. పటాన్చెరువు.... మళ్లీ సికింద్రాబాద్... అక్కడి నుంచి రామ్‌నగర్ గుండు అక్కడి నుంచి లకిడికాపూల్.... అక్కడి నుంచి రవీంద్రభారతికి తీసుకువెళ్లాడు ఆటోవాలా. అక్కడ ఒక్కరు కూడా లేరు! ఎందుకుంటారండీ... అప్పుడు సమయం సరిగ్గా రాత్రి ఒంటిగంట! ‘‘అదేమిటయ్యా, సికింద్రాబాద్ నుంచి రవీంద్రభారతికి అరగంటలో రావచ్చు అని చెప్పారు ఆర్గనైజర్లు. నువ్వు ఇంచుమించు హైదరాబాద్ అంతా తిప్పావు...’’ అని ఆశ్చర్యపోయాడు బేర్. ‘‘అదేంటి సార్ అలా అంటారు...హైదరాబాద్‌కు మీరు కొత్తా? నేను కొత్తా?’’ అని ఆవేశంగా అడిగాడు ఆటోడ్రైవర్. ‘‘నేనే’’ అన్నాడు బేర్. ‘‘మరి ఎలా వెళ్లాలో మీరెలా డిసైడ్ చేస్తారు? ఏ రూట్లో వెళ్లాలో మీరు చెప్పాలా నాకు. ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ...’’ అంటూ ఆ విధంగా ముందుకు పోయాడు ఆటోవాలా. ‘‘ఓ మైగాడ్’’ అంటూ ఆటోవాలా అడిగినంత డబ్బు ఇచ్చి... ఆ రాత్రి రవీంద్రభారతి పక్క సందులో కాస్త ఖాళీ జాగా ఉన్న చోట పడుకుందామని డిసైడయ్యాడు మిస్టర్ బేర్. బా...గా అలిసిపోయాడేమో పడుకోగానే నిద్ర వచ్చేసింది. కేవలం అయిదు నిమిషాల్లోనే ఆ నిద్రను డిస్టర్బ్ చేస్తూ ఏవో మాటలు వినిపిస్తున్నాయి. నిద్ర పోతునట్లు నటిస్తూనే ఒక చెవి అటు వేశాడు బేర్... ‘మలేరియా దోమల సంఘం వర్ధిల్లాలి’ ‘డెంగ్యూ దోమల సంఘం వర్ధిల్లాలి’ ‘‘అరుపులు ఆపండయ్యా...ఏమిటి మీ సమస్య? మలేరియా దోమల ప్రెసిడెంట్‌గారూ మీరు చెప్పండి’’ ‘‘అయ్యా...ముందొచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు గ్రేట్ అన్నట్లుగా ఉంది నేటి పరిస్థితి. డెంగ్యూ దోమలు ఎప్పుడొచ్చాయండి? నిన్నాగాక మొన్న వచ్చాయి. మేము అనాది కాలం నుంచి ఉన్నాం. అలాంటిది మమ్మల్ని కాదని డెంగ్యూ దోమలు ఆధిపత్యం చలాయిస్తున్నాయి. ప్రజలు డెంగ్యూ దోమలు అంటే భయపడి చస్తున్నారు. మేమంటే లైట్‌గా తీసుకుంటున్నారు. ఈ వివక్ష నశించాలి. రక్తంలో మా వాటా మాకు దక్కాలి. మలేరియ దోమల ఐక్యతా వర్ధిల్లాలి.... వర్ధిల్లాలి’’ ‘‘డెంగ్యూ దోమల ప్రెసిడెంట్‌గారూ ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి’’ ‘‘అయ్యా, మేము ఎవరి రక్తం దోచలేదు... మా రక్తం ఏదో మేము సంపాదించుకుంటున్నాం. ఈ మలేరియా దోమలు రకరకాల ‘దోమల కిల్లర్స్’కు భయపడి మురుగు కాలువలు దాటి బయటికి రావడం లేదు. మేము అలా కాదు... నిరంతరం ప్రజలలో ఉంటున్నాం.... ఎన్ని సమస్యలు ఎదురైనా వారి రక్తం పీలుస్తున్నాం. అంతేగానీ మేము ఊరకే ఎవరి రక్తం దోచుకోవడం లేదు. మలేరియా దోమల్లారా ఇప్పటికైనా మేల్కొనండి... సోమరితనాన్ని వీడండి... కష్టపడండీ’’ సరిగ్గా కొద్దిసేపటి తరువాత... ‘‘అయ్యా... అయ్యా....’’ ‘‘ఏమైంది అలా పరుగెట్టుకుంటూ వస్తున్నావు?’’ ‘‘ఘోరం జరిగిందయ్యా... రండయ్యా వెళదాం...’’ ‘‘ఏమైందిరా?’’ ‘‘ఇంతకుముందు డెంగ్యూ ప్రెసిడెంట్ స్పీచ్ విని మన మలేరిగాడు బాగా ఫీలై పోయాడండి. అది తట్టుకోలేక, అవమాన భారంతో గదిలోకి దూరి ఆల్ ఔట్ ఆన్ చేశాడండీ...’’ సరిగ్గా కొద్దిసేపటి తరువాత... ‘‘సమయానికి వచ్చాం కాబట్టి నిన్ను రక్షించగలిగాం... ఇంత బుద్ధి లేని పని చేస్తావను కోలేదు’’ ‘‘ఏం చేయమంటారయ్యా... రెండు వారాల నుంచి రక్తం లేక ఆకలితో అలమటిస్తున్నాను. దీని కంటే చావే నయం అనుకున్నాను...’’ ‘‘అయ్యో... చూడండి వీడి డొక్క ఎలా ఎండిపోయిందో... ముందు వీడికి ఆహారం పెట్టాలి... అదిగో అక్కడెవడో నిద్రపోతున్నాడు... పదండీ....’’ ఈ మాటలు విని జడుసుకున్నాడు బేర్. తొలిసారిగా ‘భయం’ అంటే ఏమిటో తెలిసి వచ్చింది. ఇక అంతే...అక్కడి నుంచి వెనక్కి చూడకుండా పరుగులు తీశాడు భయమంటే ఎరుగని గ్రిల్స్ బేర్! – యాకుబ్ పాషా -
ఈ దొంగేట్రం పక్కోళ్ల కొంప ముంచింది
‘నేషనల్ కాలేజీ ఆఫ్ దొంగల్స్’ వార్షికోత్సవాలు బిహార్‌లోని చోర్పల్లిలో జరుగుచున్నవి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కర్నాటకకు చెందిన అతి సీనియర్ దొంగ చోరప్పను ప్రత్యేకంగా ఆహ్వానించింది కాలేజీ కమిటీ. దేశంలోని అన్ని జిల్లాల దొంగ విద్యార్థులు హాజరయ్యారు. చోరప్పతో విద్యార్థులకు ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ‘‘తాతా సార్! మీ వృత్తి జీవితం సాఫీగానే సాగిందా? ఒడిదుడుకులు ఏమైనా ఫేస్ చేశారా?’’ సికింద్రాబాద్ నుంచి వచ్చిన విద్యార్థి అడిగాడు. ఇతడు డి.సి(దొంగల కోర్సు) సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ‘‘ఏదీ తనంత తాను నీ దరికి రాదు. శోధించి అడ్రసులు సాధించాలి... ఆ పై కన్నాలు వేయాలి. ఇంత పేరు మోసిన దొంగనైనప్పటికీ కెరీర్ మొదట్లో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. నా పదహారవ ఏట మా నాన్నగారు మంచి ముహుర్తం చూసి ‘దొంగేట్రం’ ఏర్పాటు చేశారు. నాట్యకారులకు ‘అరంగేట్రం’ ఎలాగో మన దొంగలకు ‘దొంగేట్రం’ అలాగన్నమాట! సరిగ్గా ఆరోజే నాకు జలుబు చేసింది. ‘జలుబు తగ్గాక దొంగేట్రం చేస్తాను నాన్నగారు’ అన్నాను. ఆయన కోపంతో అంతెత్తున లేచారు. ‘నువ్వు నా బిడ్డవు. అంటే షేర్. ఆఫ్ట్రాల్ జలుబు ఈ షేర్‌ను ఏంచేస్తుంది!’’ అని గ్యాస్ కొట్టారు. నేను ఆ గ్యాస్‌కు తబ్బిబ్బైపోయి రంగంలోకి దిగాను. ఒక మాంచి ఇల్లు చూసుకొని దూరిపోయాను. ఇంటిల్లిపాది గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. ఏ మూల ఏ వస్తువు ఉందో అని వెదుకుతున్నాను. నాకు డస్ట్ ఎలర్జీ... దీనికి తోడు జలుబు... హాచ్... హాచ్... హాచ్ అని గట్టిగా తుమ్మాను. నా తుమ్ముల దెబ్బకు ఇంటిల్లిపాది లేచారు. ‘‘ఎవరు నువ్వు?’’ అని అడిగారు. టెన్షన్‌తో తుమ్ము వచ్చింది. ‘హాచ్’ అని తుమ్మాను. ‘‘కొంపదీసి దొంగవైతే కాదు కదా?’’ అని అడిగారు. టెన్షన్ మరీ ఎక్కువై...‘హాచ్ హాచ్’ అంటూ అంతులేని తుమ్ములు తుమ్మాను. ‘వామ్మో... తుమ్ము దొంగ’ అని నన్ను చుట్టుముట్టారు. ‘ఇంకా దోచుకోలేదు’ అని ప్రాధేయపడినా వినకుండా నా షర్ట్ జేబులో, ప్యాంట్ జేబుల్లో వెదకడం మొదలుపెట్టారు. షర్ట్ జేబులో చెయ్యి పెట్టినంత వరకూ ఏమీ కాలేదు. ఎప్పుడైతే...ప్యాంట్ జేబులో నుంచి కర్చీఫ్ తీశారో... అప్పుడు మొదలైంది! కర్చీఫ్‌తో నా జలుబు ఒకరి నుంచి ఒకరికి పాకింది. అంతే...ఇల్లంతా ‘హాచ్ హాచ్’ అని ఒకటే తమ్ములు! ఎవరి తుమ్ముల్లో వారు బిజీ బిజీగా ఉన్నారు. ఇదే అదనుగా అక్కడి నుంచి ఉడాయించాను. ఒకవేళ ఆరోజు వారికి దొరికిపోయి ఉంటే నా కేరీర్ ఆరోజే ముగిసిపోయి ఉండేది’’ ఇక నా రెండో ‘దొంగేట్రం’ గురించి... నాకు గులాబ్‌జామ్‌లంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే నా కొంప ముంచినంత పనిచేసింది. అదెలాగో వినండి... ఒకరోజు మిడ్నైట్, బంజారాహిల్స్‌లోని ఒక ఇంట్లో దూరాను. ఇంటావిడ ‘వంటలరత్న’ అనే విషయం నేను ఎరగను. ఆమె స్వీట్లతో రకరకాల ప్రయోగాలు చేస్తుందట. నేను ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే టేబుల్‌పై గులాబ్‌జామ్‌లు ఘమఘమలాడుతున్నాయి. ‘కంట్రోల్’ అనుకున్నాను గట్టిగా. కానీ కంట్రోల్ కాలేకపోయాను. అయిదు నిమిషాల్లో మొత్తం లాగించేశాను. అది గులాబ్‌జామ్ కాదని... కొత్తగా ప్రయోగం చేసిన ‘అలగ్ జామ్’ అని ఆ తరువాత తెలిసింది. అంతే... కడుపులో సుడులు! ఆ ఇంట్లో బంగారం ఎంత ఉంది? నగదు ఎంత ఉంది? అనే దానికంటే ‘టాయిలెట్’ ఎక్కడ ఉందనేదే నా ముఖ్య లక్ష్యం అయింది. నా అదృష్టం కొద్దీ అయిదు నిమిషాల్లోనే అది కనిపించింది. ‘యురేకా’ అంటూ అందులో దూరిపోయాను. కొద్దిసేపటి తరువాత... బయటికి వచ్చాను. అయిదు నిమిషాల్లోనే మళ్లీ కడుపులో అల్లకల్లోలం! అలా లోనికి వెళ్లడం, ఇలా బయటికి రావడం... ఈలోపు తెల్లవారింది. ఇంటి వాళ్లు ‘దొంగా...దొంగా’ అని అరిచారు. నేను ‘పాము...పాము’ అని అరిచాను. ‘పాము ఎక్కడా?’ అని అందరూ భయపడుతున్న తరుణంలో... ‘ఇదే మంచి తరుణం’ అని అక్కడి నుంచి తప్పించుకుపోయాను. ఇక ముచ్చటగా నా మూడో దొంగేట్రం. అనగనగా సుబ్బారావు, సుబ్బలక్ష్మి దంపతులు. ఈ సుబ్బారావు బాగా మందుకొట్టి ఏ అర్ధరాత్రిపూటో ఇంటి తలుపులు దబదబా బాదేవాడు. సుబ్బలక్ష్మికి నిద్ర పాడైపోయేది. ఇక ఇలా కాదని భర్తకు ‘అప్పడాల కర్ర ట్రీట్మెంట్’ ఇవ్వాలని డిసైడైపోయింది. ఒకరాత్రి తలుపులు సగం తీసి కాచుకొని కూర్చుంది. ఇది తెలియక ఆ రాత్రి నేను వారి ఇంటి తలుపు తట్టాను. లోపలికి వచ్చిందో ఎవరో చూడకుండా తల మీద అప్పడాల కర్రతో ఒక వేటు వేసింది. కళ్లు బైర్లు కమ్మాయి! ఆ తరువాత ఆమె తీరిగ్గా ‘‘సారీ...’’ అని చెప్పి... ‘‘సారీ సంగతి సరే, ఇంతకు మీరేవరు? మా ఆయనేమో అనుకొని మీ తల మీద బాదాను... బాదడం సంగతి సరే, మా ఆయన రోజూ పీకలలోతు వరకు తాగి ఇంటికి వస్తున్నాడు... తాగాడు సరే, నోర్ముసుకొని పడుకోవచ్చు కదా... తలుపు ఒకటే బాదడం... బాదడం సరే... ఇంతకీ మీరెవరు? సరే తాగాడనుకోండి... ఏదో వారానికో రెండు వారాలకో అంటే అది వేరే విషయం. రోజూ తాగిరావడం ఏమిటి నాన్సెన్స్! నాన్సెన్స్ సంగతి సరే, ఇంత రాత్రివేళ ఇక్కడ మీరేం చేస్తున్నారు? అసలు మీరెవరు? మీరెవరయితే నాకేంటిగానీ, ఇంతకీ ఆయన ఎక్కడున్నాడు?’’ ఆమె వాగ్ధాటి దెబ్బకు కరెంట్ తుస్సుమంది. ఇదే అదనుగా అక్కడి నుంచి సేఫ్‌గా తప్పించుకున్నాను. ...ఇలాంటి అనుభలెన్నో ఇంకా చాలా ఉన్నాయి. వీటి గురించి నా ఆత్మకథ ‘చోరరత్నారకం’లో రాశాను. చదవండి.. నేర్చుకోండి.. ఆచరించండి..’’ అని తన ప్రసంగాన్ని ముగించాడు అతి సీనియర్దొంగ చోరప్ప. – యాకుబ్ పాషా -
అప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు!
‘‘హాచ్ హాచ్ హాచ్’’ అని తుమ్ముతూనే విక్రమార్కుడిని ఏదో అడగబోతున్నాడు బేతాళుడు. ‘‘మిస్టర్ బేతాళా, తుమ్మి అయినా అడుగు, అడిగాక అయినా తుమ్ము’’ సలహా ఇచ్చాడు విక్రమార్కుడు. ‘‘సరే’’ అంటూ నాన్‌స్టాప్‌గా నలభై తుమ్ములు తుమ్మిన తరువాత ఇలా అడిగాడు బేతాళుడు. ‘‘రాజా, వుప్పుడు నీకో పిట్టకథ చెబుతాను. ఆ తరువాత కొచ్చెన్ అడుగుతాను...ఒకేనా?’’ అడిగాడు బేతాళుడు. ‘‘ఒకే’’ అన్నాడు విక్రమార్కుడు. ‘‘వాటీజ్ దిస్!’’ కోపంగా ఫైల్ గిరాటు వేశాడు లండన్ మేయర్ బోరిస్ జాన్సన్ టపుకు టపుకు. అది లండన్ తాజా జనాభా వివరాలను తెలియజేసే ఫైల్. ‘‘ఏమైంది సార్?’’ భయంగా అడిగాడు ఉప మేయర్ హారిస్ జర్మీ డలాఢల్. ‘‘డలాఢల్...నీకో ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? కేవలం రెండు నెలల్లోనే మన లండన్ జనాభా మూడుకోట్లు పెరిగింది?’’ అన్నాడు మేయర్. ‘‘స్వల్పకాలంలో ఇంత అనూహ్యంగా పెరగిపోవడం ఏమిటి? దీనిమీద ఎంక్వైరీ కమిటీ వేయాల్సిందే’’ పట్టుబట్టాడు ఉపమేయర్. ‘‘గుడ్ ఐడియా...ఇప్పుడే వేస్తాను’’ అని ఎంక్వైరీ కమిటీ వేశాడు మేయర్. ‘‘విక్రమార్కా! లండన్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అదే బంకింగ్‌హామ్ ప్యాలెస్, అదే టవర్ ఆఫ్ లండన్, అదే...బిగ్‌బెన్...ఇప్పటికిప్పుడు అనూహ్యంగా వచ్చిన మార్పులేమీ లేవు. మరి కేవలం రెండు నెలల్లో జనాభా ఇంత అనూహ్యంగా పెరగడానికి కారణం ఏమిటి? తెలిసి కూడా జవాబు చెప్పలేక పోయావో నా జలుబు నీకు అంటిస్తాను’’ అని హెచ్చరించాడు బేతాళుడు. అప్పుడు విక్రమార్కుడు ఇవ్విధంబుగా సమాధానం చెప్పాడు... ఇండియా నుంచి పారిపోయిన విజయ్‌మాల్యాకు లండన్‌లో బోర్ కొడుతోంది. మరోవైపు డబ్బులకు కూడా కటకటగా ఉంది. ఒకరోజు వాష్‌రూమ్‌లో అతనికి ఒకచక్కని ఆలోచన వస్తుంది. వెంటనే అద్దం ముందుకు వచ్చి తన భుజం తానే తట్టుకున్నాడు మాల్యా. మరుసటి రోజు లండన్‌లోని బాకర్ స్రీట్‌లో కొత్త స్కూలు ప్రారంభించాడు. ఆ స్కూలు పేరు: ఈజీ బారోయింగ్...ఈజీ ఫ్లైయింగ్. అనుకున్నట్లుగానే ‘ఈఈ’ స్కూల్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రెండు నెలల్లోనే పన్నెండు స్కూళ్లు స్టార్ట్ చేశారు. తొలిరోజు క్లాసులో మాల్యా పాఠం... ‘‘ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులకు నా నమోవాకాలు. చరిత్రలో ఇప్పటి వరకు అప్పు అపహాస్యానికి గురైంది...అవమానానికి గురైంది... అప్పు చేసిన వారిని అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు... ఈ పరిస్థితి మారాలి...అప్పుకు విలువ పెరగాలి... పూజలో కప్పురం ఎంత అవసరమో, మనిషి అభివృద్ధికి కూడా అప్పు అంతే అవసరం... కప్పురం తాను కరుగుతూ వెలుగునిచ్చినట్లే... అప్పు కూడా ఎన్నో అవమానాలు భరిస్తూ కూడా మనకు వెలుగునిస్తుంది. అందుకే అంటాను...అప్పుకప్పూరంబు నొక్కపోలిక నుండి... ఈ పోలిక భౌతికమైనది కాదు....గుణాలకు సంబంధించినది! ఇప్పుడు చరిత్ర నుంచి కొన్ని పాఠాలు చెబుతాను: హబ్సన్–గాబ్సన్ థియరీ ప్రకారం. అప్పు చేయడం తప్పు కాదు. దివాలా తీయడం అంతకంటే తప్పుకాదు. ఎటొచ్చి దివాలా తీసిన భయం మీ కళ్లలో ఎప్పటికీ కనిపించకూడదు. అవసరమైతే అబద్ధాలతో ఎదుటివారిని దబాయించాలి. ఈస్ట్–ఇండియా గెజిట్ 1816 నోట్ ప్రకారం... అప్పు చేయడం ఆషామాషీ విషయం కాదు. దానికి ప్రత్యేకమైన తెలివితేటలు ఉండాలి. అట్లాంటి వాళ్లను మొనగాళ్లు అందురు. అందులో నేనొకరిని. గ్రీకు బిజినెస్ ఫిలాసఫీ 1915 ప్రకారం లేచిన సముద్రపు అల తప్పనిసరిగా టప్పుమని కిందికి పడాలి. అది ప్రకృతి ధర్మం. నువ్వు ఎంత పెద్ద వ్యాపారవేత్త అయినప్పటికీ... ఎప్పుడో ఒకప్పుడు దభాల్న కింద పడాల్సిందే... అదే వ్యాపారధర్మం. కాబట్టి ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు. ఇటలీ బిజినెస్ రూల్స్ 1678 ప్రకారం..దివాలా తీసిన తరువాత... హడివిడిగా ఎక్కడికంటే అక్కడికి పారిపోకుండా... మనకు అన్నీ అనుకూలంగా ఉన్న దేశానికి పారిపోవాలి. మాల్యా చెబుతున్న పాఠాలను గోడ చాటు నుంచి విన్నారు ఎంక్వైరీ కమిటీ వాళ్లు. సీన్ కట్ చేస్తే.... మేయర్ ఆఫీసు కార్యాలయం. ‘‘సార్...మన లండన్ జనాభా పెరగడానికి విజయ్ మాల్యానే కారణం’’ అని చెప్పాడు ఎంక్వైరీ కమిటీ పెద్ద (హెడ్). ‘‘ఎలా?’’ కళ్లజోడు చేతుల్లోకి తీసుకుంటూ అత్యంత ఆశ్చర్యంగా అడిగాడు మేయర్. ‘‘అప్పులు చేయడం ఎలా? అవలీలగా పారిపోవడం ఎలా?’’ పేరుతో మొదట స్కూల్, ఆ తరువాత యూనివర్శిటీ స్టార్ట్ చేశాడు మాల్యా. ఈ యూనివర్శిటీలో చేరడానికి దేశాదేశాల నుంచి విద్యార్థులు వెల్లువలా వస్తున్నారు...దీంతో మన లండన్ జనాభా....’’ అసలు విషయం చెప్పాడు ఎంక్వేరీ కమిటీ పెబ్బ. ‘‘మిస్టర్ మాల్యా, రెండురోజుల్లో తట్ట అండ్ బుట్ట సర్దుకొని లండన్ విడిచి వెళ్లకపోతే కఠిన కరాగారా శిక్ష విధించబడుతుంది’’ అని హెచ్చరించాడు మేయర్. ఈ విషాదాన్ని తట్టుకోలేక ఆరోజు బార్‌కు వెళ్లాడు మాల్యా. అక్కడ అతనికో వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ మాట ఈమాట మాట్లాడుకున్న తరువాత.... ‘‘అక్కడొక విండో కనిపిస్తుంది చూశావా? అది మామూలు విండో కాదు. మ్యాజిక్ విండో’’ అని చెప్పాడు అతడు. ‘‘మ్యాజిక్ విండోనా!’’ ఆశ్చర్యపోయాడు మాల్యా. ‘‘అవును. మూమూలుగా విండోలో నుంచి దూకితే కాళ్లు విరుగుతాయి. ఈ విండో నుంచి దూకితే గాల్లో తేలిపోతాం’’ అని చెప్పాడు అతడు. ‘‘నువ్వేదో తాగివాగుతున్నట్లున్నావు’’ అతడి మాటల్ని తేలిగ్గా తీసుకున్నాడు మాల్యా. ‘‘అయితే చూడు...’’ అని ఆ వ్యక్తి విండో నుంచి దూకాడు... గాల్లోకి దూసుకుపోయాడు! ‘చూశావా! నా మాటల్ని నమ్మలేదు కదూ’’ అన్నాడు తిరిగివచ్చి. ‘‘ఇదేదో బాగుందే. నేను సైతం దూకుతాను’’ అని దూకాడు మాల్యా. వెంటనే అతడి రెండు కాళ్లు విరిగాయి. మాల్యా తిరిగి లేచి నడిచేంత వరకు లండన్‌లోని ఉండనివ్వాలని కోర్టు తీర్పు ఇచ్చించి. ‘హమ్మయ్య’ అనుకున్నాడు మాల్యా. ‘‘అదిసరే, ఆడు దూకితే గాల్లో తేలిపోవడం ఏమిటి? ఈడు దూకితే కాళ్లు విరగడం ఏమిటి? ఇంతకీ ఆడు ఎవడు?’’ అడిగాడు బేతాళుడు. ‘‘సూపర్‌మేన్’’ చెప్పాడు విక్రమార్కుడు. – యాకుబ్ పాషా -
రైటర్ కాపీరోవా ఆండ్రూ కథనం ప్రకారం..
‘‘ఏమయ్యా రైటరు!.. ఏ సినిమా చూశావూ... ఏ కథ రాశావూ?’’ అడిగాడు దున్నపోతు రత్తయ్య. నిజానికి ఆయన ఇంటి పేరు ‘దున్నపోతు’ కాదు. నిర్మాతగా ఆయన మొదటి సినిమా ‘దున్నపోతు’. దీంతో ‘దున్నపోతు రతయ్య’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మనం రైటర్ కాపీరోవా ఆండ్రూ నికోల్ గురించి చెప్పుకుందాం... పేరు చూసి కాఫీ పొడిలో కాలెయ్యవద్దు. వీరు పదహారణాల ఆంధ్రులు. వీరి స్వగ్రామం మండపేట తాలూకలోని లింగపేట. వీరి అసలు పేరు మల్లెల డొల్లయ్య. పై చదువుల కోసం తల్లిదండ్రులు పట్నానికి పంపిస్తే... తెలుగు సినిమా చరిత్రను తిరగరాయాలనే కసితో కాలేజీ ఎగ్గొట్టేవాడు. ప్రతి తాజా సినిమా చూసి విశ్లేషించేవాడు. ‘‘ఆడు అలా తీశాడు కాని... నేను డైరెక్టర్ అయితే ఇలా తీసేవాడిని’’ అని కొత్త స్క్రీన్‌ప్లే చెప్పేవాడు. ‘‘డైరెక్టర్ కావడం అంత వీజీ కాదు... ముందు రైటర్ అవ్వు. ఒక్క సినిమా హిట్ అయినా చాలు డైరెక్టరై పోవచ్చు’’ అని ఎవరో సలహా ఇచ్చారు. ‘‘నా జీవితంలో ఒక్క పుస్తకం కూడా చదవలేదు... రైటర్ ఎలా అవుతాను?’’ సమంజసమైన డౌటు అడిగాడు డొల్లయ్య. ‘‘రైటర్ కావడానికి చదవాల్సింది పుస్తకాలు కాదు... చూడాల్సింది యూట్యూట్‌లో సినిమాలు’’ అని సలహా ఇచ్చాడు హితుడు. అలా డొల్లయ్య చూడని సినిమా లేదు. హాలీవుడ్ సినిమాలు, కొరియన్ సినిమాలు అన్నిటినీ కంటితో నమిలి మింగేశాడు. న్యూమరాలజిస్ట్ సలహాతో తన పేరును ‘కాపీరోవా ఆండ్రూ నికోల్’గా మార్చుకున్నాడు. ‘‘సార్ మొన్న క్రిమినల్ సినిమా చూసి... కొత్త కథ తయారుచేశానండీ...’’ అని గొంతు సవరించాడు కాపీరోవా ఆండ్రూ నికోల్. ‘‘తెలుగు సినిమా చూసి ఏం కాపీ కొట్టావయ్యా బాబు!’’ ఆశ్చర్యంగా అడిగాడు దున్నపోతు రత్తయ్య. ‘‘నేను చూసింది నాగార్జున, మనీష కోయిరాలా, మహేష్భట్టు క్రిమినల్ కాదండీ! అమెరికన్ యాక్షన్ థ్రిల్లరండీ’’ అన్నాడు అరనవ్వుతో నికోల్.. ‘‘అందులో ఏం దొబ్బేశావు?’’ ఆసక్తిగా అడిగాడు దున్నపోతు. ‘‘ఒక బ్రెయిన్ నుంచి మరొక బ్రెయిన్‌కు మెమొరీస్ ట్రాన్స్ఫర్ చేయడం’’ అని కథ చెప్పడం మొదలుపెట్టాడు కాపీరోవా ఆండ్రూ నికోల్. మన సినిమాలో హీరో పేరు అప్పారావు. పీయంపీ డాక్టరండీ. ఒక్క పేషెంట్‌గా కూడా ఈయన క్లీనిక్‌కు రారండి. ఈ డిప్రెషన్లో సైంటిస్టుగా మారి రకరకాల ప్రయోగాలు చేస్తుంటాడు. అలా చేస్తున్న క్రమంలో ‘క్రిమినల్’ సినిమాలో డా.ఫ్రాంక్లాగా మెమోరీ ట్రాన్స్ఫర్ ఫార్ములా కనుగొంటాడు. అంతే... మన అప్పారావు పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఈ ఫార్ములా కోసం వేలంపాట మొదలవుతుంది. ఈ వేలంపాటలో ‘శ్రీకాఠిన్య’ అనే విద్యాసంస్థ అత్యధికంగా డబ్బు చెల్లించి ఈ ఫార్ములాను సొంతం చేసుకుంటుంది. ఇక్కడ మనం ‘శ్రీకాఠిన్య’ గురించి చెప్పుకోవాలి. ‘చావో రేవో ర్యాంకో’ (సీఆర్ఆర్) అనే కొత్త విద్యాసంస్థ ధాటికి ‘శ్రీకాఠిన్య’ ప్రాభవం తగ్గిపోయింది. చదువు విషయంలో ‘సీఆర్ఆర్’ ఎంత స్ట్రిక్ట్ అంటే... ఏ విద్యార్థి అయినా సరిగ్గా చదవకపోతే ఒక గదిలో వేసి కొన్ని తెలుగు సీరియల్స్ చూపించి శిక్షించేవాళ్లు. అందుకే తమ పిల్లల్ని ఎక్కడో చూసుకోవాలని కలలు కనే పేరెంట్స్ ‘ఇక్కడైతేనే బాగుంటుంది’ అని ‘చావో రేవో ర్యాంకో’లో చేర్పించడం ప్రారంభించారు. ఈ దెబ్బకు ‘శ్రీకాఠిన్య’ దివాలా తీసింది. తమ విద్యాసంస్థలను కోళ్లఫామ్లుగా మార్చాలనుకుంటున్న సమయంలో అనుకోని వరం దొరికింది ‘శ్రీకాఠిన్య’కు! అదే మెమొరీ ట్రాన్స్ఫర్!! ‘‘సార్... సిగరెట్ తాగి మిగతా కథ కంటిన్యూ చేస్తాను’’ అని సిగరెట్ ముట్టించాడు రైటర్. ‘‘నాకో డౌటు... అసలే శ్రీకాఠిన్య వాడు దివాలా తీశాడు. ఉప్పుడు ఈ ఫార్ములాతో ఆడేం చేసుకోగలడు?’’ డౌటు అడిగాడు దున్నపోతు రత్తయ్య. ‘‘మంచి డౌటు అడిగారు. ఇంటర్వెల్లో ప్రేక్షకులు దీని గురించే ఆలోచిస్తూ టీలు తాగుతూ, సిగరెట్లు కాలుస్తుంటారు. కథ ఎప్పుడూ సాఫీగా సాగవద్దని మా గురువుగారు చెబుతుంటారు. ప్రేక్షక మహాశయుడు వీలైనంత ఎక్కువగా జట్టు పీక్కునేలా చేయాలట! ఇది కూడా అలాంటి మెలికే! మళ్లీ కథలోకి వద్దాం... ఫార్ములా చేజిక్కించుకున్న వెంటనే పెద్ద ప్రకటన ఇస్తుంది శ్రీకాఠిన్య... ‘‘పేరెంట్స్ మహాశయులకు... నా పిల్లాడు డాక్టర్ కావాలి... ఇంజనీర్ కావాలని ఎవరికి మాత్రం ఉండదు? కలలు ఊరకే రావు. మన కష్టాల్లో నుంచే వస్తాయి. మనలాగా పిల్లలు కష్టపడవద్దనేది ఆ కల. ఆ కలను నిజం చేసుకోవడానికి... మా విద్యాసంస్థలో చేర్పించండి. అవును. మీ డౌటు మాకు అర్థమైంది. ‘మా వాడు చదువులో దద్దమ్మండీ... మా వాడు టెన్త్‌లోనే అత్తెసరు మార్కులతో పాసయ్యాడు... మావాడు చదువు అనే మాట వినగానే పారిపోతున్నాడు... ఇంకా డాక్టరేం అవుతాడు? ఇంజనీర్ ఏం అవుతాడు... మా బొంద!’ అనే కదా మీ డౌటు! ఇవి పాతరోజులు కావండి. కొత్త టెక్నాలజీ వచ్చిన కొత్తరోజులు. మీ వాడు చదువులో రత్నమా? రాయా? అనేది మాకు అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా మీ అబ్బాయిని మా కాలేజీలో చేర్పించడమే. అంతే... మీ అబ్బాయిని డాక్టర్నో, ఇంజనీర్నో చేసి మీ చేతిలో పెడతాం. రండి... గొప్ప అవకాశాన్ని వినియోగించుకోండి’’ అంతే...‘శ్రీకాఠిన్య’ కాలేజీలో పుంఖానుపుంఖాలుగా విద్యార్థులు చేరారు. చదువులో వెనకబడినవాడా, ముందు పడినవాడా? అనేదానితో సంబంధం లేకుండా అందరూ డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు’’ అని కథ ముగించాడు రైటర్ నికోల్. ‘‘హౌ?’’ ఆశ్చర్యంగా అడిగాడు రత్తయ్య. ‘‘ఏం లేదండీ... పరీక్షలకు ఒక రోజు ముందు చదువులో వెనకబడిన విద్యార్థులకు బాగా చదివే విద్యార్థుల మెమొరీస్‌ను ట్రాన్స్ఫర్ చేస్తారు. దీంతో జీరో విద్యార్థి సైతం హీరోలా ఆన్సర్పేపర్ రాసి ర్యాంకు తెచ్చుకుంటాడు’’ అసలు విషయం చెప్పాడు రైటర్ నికోలస్. – యాకుబ్ పాషా -
వీరికి అక్కడ ఏం పని?!
శ్రీహరి కోట నుంచి మార్క్–3 రాకెట్ ద్వారా చ్రందయాన్–2 యాత్ర మొదలైన విషయం మీకు తెలిసిందే. సరిగ్గా కొన్ని నెలల తరువాత... రాకెట్ నుంచి విడిపోయిన ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలో సెటిలైపోయింది. చంద్రుడి ఉపరితలాన్ని స్కాన్ చేస్తూ పుంఖాను పుంఖాలుగా ఫొటోలు పంపుతోంది ఆర్బిటర్. నీటిజాడలు, కొన్ని రసాయనాల ఫొటోలు, హీలియం వనరుల ఆనవాలు కనిపెట్టిన ఫొటోలు... ఒక్కటా రెండా... పరంపరగా వస్తూనే ఉన్నాయి. ప్రతి ఒక్క ఫొటోని వేయికళ్లతో జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు ఇస్రో సైంటిస్టులు. అలా చూస్తున్న క్రమంలో ఒక ఫొటోని చూసి షాక్ తిన్నారు! సదరు ఆ ఫొటోలో రామ్‌గోపాల్‌వర్మ–కెఏ పాల్ ఎదురుబొదురుగా కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు!! ‘నిజమా, భ్రమా’ అని ఆ ఫొటోని మళ్లీ మళ్లీ పరిశీలించారు. అక్షరాల నిజమే! ‘‘విక్రమార్కా! ఇంత టఫ్ కొచ్చెన్ నీ లైఫ్టైమ్లోనే ఫేస్ చేసి ఉండవు. ఇప్పుడు చెప్పు...చంద్రమండలం నుంచి ఆర్బిటర్ పంపిన ఫొటోలో రామ్‌గోపాల్‌వర్మ–పాల్లు ఎందుకు ఉన్నారు? ఈ ప్రశ్నకు తెలిసికూడా ఆన్సర్ చెప్పలేకపోయావో...’’ అని హెచ్చరించాడు బేతాళుడు. అప్పుడు విక్రమార్కుడు ఇవ్విధంబుగా సమాధానం చెప్పాడు. ‘‘బేతాళా! నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ ఉన్ పరమ తిక్కలోడని ప్రపంచవ్యాప్తంగా ఆబాలగోపాలానికి తెలిసిందే. ఈ తిక్కలోడు ఒకసారి తన డాబాపై మందుకొడుతూ, ధాబాలో తెప్పించిన స్పెషల్ చికెన్ నంజుకుంటూ, టీవీలో వస్తున్న ‘కలవారి కోడలు కలికి కామక్షి’ ఎపిసోడ్ నెంబర్–16497 చూస్తూ, టీవీలో ప్రకటనలు వచ్చినప్పుడు అలా చంద్రుడి వైపు చూస్తున్నాడు... అలా చంద్రుడి వైపు చూస్తున్నప్పుడు అతడికి మెరుపులాంటి ఐడియా వచ్చింది. ‘‘టీవీ చానళ్లన్నీ భూమి మీదే ఉన్నాయి. పాపం చంద్రుడిపై ఒక్క టీవీ చానల్ కూడా లేదు. చంద్రుడిపై టీవీ చానల్ మనమే స్టార్ట్ చేద్దాం. మన చానల్ పేరు ‘మూన్‌మూన్‌సేన్’. చంద్రుడిపై తొలి టీవీ చానల్ పెట్టిన దేశంగా నార్త్ కొరియా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. వెంటనే ప్రయత్నాలు ప్రారంభించండి’’ అని చుట్ట వెలిగించాడు. వెంటనే సిబ్బంది రంగంలోకి దిగారు. ‘యంయంయస్’ చానల్ కోసం ‘ఖబడ్డార్...నువ్వా నేనా?’ అనే పోగ్రాంను డిజైన్ చేశాడు క్రియేటివ్ హెడ్ కిట్టప్ప సుంగ్ మిన్ జిన్ సూ. ఈ పోగ్రాం కాన్సెప్ట్ ఏందంటే... ఒక టాపిక్‌పై ఇద్దరు వ్యక్తులు భయంకరంగా వాదులాడుకోవాలి. ఆ ఇద్దరూ ఎవరా? అని ప్రపంచం మొత్తం జల్లెడ పట్టి వెదికారు. చివరికి ఇద్దరి పేర్లు ఫైనల్ అయ్యాయి. ఆ ఇద్దరే రామ్‌గోపాల్ వర్మ, పాల్! ‘కేఎన్ఎన్’ (ఖబడ్డార్...నువ్వా నేనా?) కోసం చంద్రమండలపై బ్రహ్మాండమైన సెట్ వేయించారు. చంద్రుడి మీద గురుత్వాకర్షణ శక్తి తక్కువ కాబట్టి ఇద్దరి బరువుకు రెట్టింపు బరువైన కోట్లు వేయించారు. రెండు భారీ సింహాసనాలను తయారు చేయించి రామ్‌గోపాల్‌వర్మ–పాల్లను ఎదురుబొదురుగా కూర్చోబెట్టారు. చంద్రుడి మీద గాలి ఉండదు కాబట్టి ఇద్దరికీ వంద చొప్పున విసనకర్రలు ఇచ్చారు. చంద్రుడిపై అంతులేని దుమ్ముధూళీ కాబట్టి ఇద్దరికి ఇరవై రిన్ సబ్బులు, మినరల్ వాటర్ బాటిళ్లు, నల్ల కళ్లజోళ్లు ఇచ్చారు. ‘‘మరి వోడ్కా!’’ ఆశగా ఆడిగాడు వర్మ. ‘‘మిత్రమా! భూమి మీద వందకేజీలు ఉన్నవాడు... ఇక్కడ యాబై కేజీల బరువు కూడా ఉండడు. ఎందుకంటావ్? ఎందుకంటే ఇక్కడ గురుత్వకార్షణశక్తి తక్కువ కాబట్టి. అలాగే... ఇక్కడ ఫుల్‌బాటిల్ కొట్టినా నైంటీ ఎమ్ఎల్లో సగం తాగినట్లు కూడా ఉండదు. అసలు ఇక్కడ మత్తు పని చేయదు’’ చెప్పాడు క్రియేటివ్ హెడ్ కిట్టప్ప. ‘‘ఇట్స్ ఓకే’’ అన్నాడు వర్మ మూతి తిప్పుకుంటూ. ‘‘బ్రదర్... డిబేట్ స్టార్ట్ చేద్దామా? ఇంతకీ ఏ టాపిక్ మీద డిబేట్ చేద్దాం?’’ ఉత్సాహంగా వర్మను అడిగాడు పాల్. ‘‘డిబేట్ మీదే స్టార్ట్ చేద్దాం’’ అని ఇలా మొదలు పెట్టాడు వర్మ... ‘‘డిబేట్ ఈజ్ ఏ ప్రాసెస్ దట్ ఇన్వాల్స్ ఫార్మల్ డిస్కషన్ ఆన్ ఏ పర్టిక్యులర్ టాపిక్. యూ నో... డిబేటింగ్ సొసైటీస్ ఎమర్జ్డ్ ఇన్ ఇంగ్లాండ్ ఇన్ ఇది ఎర్లీ 18 సెంచరీ...’’ ‘‘సోదరా ఆగు... ఇంగ్లండ్ అంటే గుర్తుకు వచ్చింది... ప్రిన్స్ ఎడ్వర్డ్... హీ ఈజ్ ద ఫస్ట్ కజిన్ ఆఫ్ క్వీన్ ఎలిజెబెత్, పీటర్ మార్క్... ది ఎల్డర్ చైల్డ్ అండ్ ఓన్లీ సన్ ఆఫ్ ప్రిన్సెస్ రాయల్... వీళ్లందరు కూడానూ.. నా సలహా లేనిదే పొద్దున బ్రష్‌పై పేస్ట్ కూడా పెట్టుకోరు...’’ చెప్పుకుంటూ పోతున్నాడు పాల్. ‘‘మిస్టర్ పాల్... నేనేం మాట్లాడుతున్నాను... నువ్వేం మాట్లాడుతున్నావు? నీకెవరు పరిచయం ఉంటే నాకేంటి?’’ చిరాకు పడ్డాడు వర్మ. ‘‘ఇదిగో ఈ చిరాకే, కోపమే సోదర మానవుల మధ్య చిచ్చు రగులుస్తుంది. ఐక్యతకు తూట్లు పొడుస్తుంది... అందుకే అంటున్నాను... టు సేవ్ ది నేషన్ వుయ్ ఆల్ మస్ట్ వర్క్ టు గెదర్... అందుకే ఐ నీడ్ పొలిటికల్ ఫండ్... ఇండియా షుడ్ లీడ్ ద వరల్డ్... చెట్టో రక్షతి రక్షితః... పెద్దలను గౌరవించండి, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనివ్వండి... తగిన చిల్లరతో బస్సులో ప్రయాణించండి... కండక్టర్‌కు సహకరించండి’’ వీరవిహరం చేస్తున్నాడు పాల్. ‘‘మిస్టర్ పాల్... మీరు చిల్లర అంటే గుర్తుకు వచ్చింది... కొన్ని సంవత్సరాల క్రితం మనీ అనే సినిమా తీశాను. సూపర్ హిట్ అయింది. దానికి సీక్వెల్‌గా ‘చిల్లర’ అనే సినిమా తీయాలని డిసైడయిపోయాను. అయితే ఆ సమయంలో నాకు ఫ్లాప్‌ల మీద ఫ్లాపులు పిలవని చుట్టంలా వస్తున్నాయి... అయినా సరే... ఎలాగైలా సినిమా చేయాలని డిసైడయిపోయాను... నా దగ్గర బడ్జెట్ చూసుకుంటే చిల్లర తప్ప ఏమీ లేదు... ఈ రూపాయి, రెండు రూపాయల చిల్లరతో సినిమా ఏంచేస్తాం...’’ చెప్పుకుంటూ పోతున్నాడు వర్మ. ‘‘సోదరా... సమయమంటే గుర్తుకు వచ్చింది. సమయమంటే టైమ్... నీ టైమ్ బాగుందా? బ్యాడా? అని ఎందరో అమెరికా ప్రెసిడెంట్లకు చెప్పాను. అవన్నీ నిజమైన విషయం వరల్డ్ అంతటికీ తెలుసు...’’ దూసుకుపోతున్నాడు పాల్. ఈ చర్చల ధాటికి చంద్రుడిపై ధూళి తుపాను వచ్చింది. భూకంపంలాగా చంద్రకంపం కూడా వచ్చింది. అయినా సరే... ఇద్దరు డిబేట్ చేస్తూనే ఉన్నారు... అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, కొరియా ప్రెసిడెంట్‌కు ఫోన్ చేసి ఇలా వార్నింగ్ ఇచ్చాడు... ‘‘ఒరే తిక్కలోడా... నీ చానల్ మూసేసి ఆ ఇద్దరినీ భూమిపైకి పంపించకపోయావో... నిన్ను శాశ్వతంగా పైకి పంపిస్తాను’’ ఈలోపు భూమిపై ‘సేవ్ ది మూవ్’ అనే ఉద్యమం మొదలైంది. – యాకుబ్ పాషా -
కుక్క కాటుకు పప్పు దెబ్బ..!
‘కుక్క కాటుకు పప్పు దెబ్బ’ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రివ్యూల్లో కొందరైతే ఇరవై స్టార్లు కూడా ఇచ్చారు (డబ్బులు మరీ ఎక్కువ ముట్టి ఉంటాయని కొందరంటారు). సరే హిట్ సంగతి పక్కన పెడదాం. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది పుల్లారావు గురించి. ‘కుక్క కాటుకు పప్పు దెబ్బ’ కథ తనదే అంటూ తెలుగు సినిమా రచయితల సంఘానికి ఫిర్యాదు చేయడమే కాదు ప్రెస్ మీట్ కూడా పెట్టాడు పుల్లారావు. ఆ ప్రెస్మీట్లో ఒక రిపోర్టర్ ఇలా అడిగాడు... ‘‘మీరు అక్కడెక్కడో రాజమండ్రి దగ్గర గంపలగూడెంలో ఉంటారు. డైరెక్టర్ శభాష్ శంకరేమో హైద్రాబాద్‌లో ఉంటాడు. మరి ఆయన మీ కథను ఎలా కాపీ కొట్టగలుగుతాడు?!’’ అప్పుడు పుల్లారావు ఇలా స్పందించాడు: ‘‘గుడ్క్వశ్చన్ అడిగారు. మా పెద్దమ్మ కుమారుడు దద్దమ్మకుమార్ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తాడు. ఓ పాలి తమ్ముడిని చూసి పోదామని బోనాల పండుగరోజు హైదరబాద్‌కు వచ్చానండీ. మా తమ్ముడిగాడితో పాటు హైదరాబాద్‌ను చూసినట్లుంటుంది, ఛాన్సు దొరికితే నా దగ్గర ఉన్న కథలను సినిమావాళ్లకు చెప్పినట్లు ఉంటుందని తట్టాబుట్టాతో దిగనండి. మా దద్దమ్మ కుమార్ రూమ్‌లో ముగ్గురు స్నేహితులు ఉంటారండీ. ఏ మాట కా మాటే చెప్పుకోవాలి.... నాకో వీక్నెస్ ఉందండి. ఎవరైనా నా కథ వింటే, వినాలనే ఆసక్తి కనబరిస్తే చేతికి ఎముక లేకుండా ఖర్చు చేస్తానండీ. మా ఊళ్లో అయితే, కేవలం నా కథలు వినడం ద్వారా సొంత ఇళ్లు కట్టుకున్నవాళ్లు ఉన్నారు. అప్పులు తీర్చేసుకున్నవాళ్లు ఉన్నారు. కూతుళ్ల పెళ్లిళ్లు చేసిన వాళ్లు ఉన్నారు. సరే, ఈ సంగతి పక్కన పెడితే రూమ్‌లో దిగిన రెండోరోజే నాలో గొప్ప రైటర్ ఉన్నాడనే విషయాన్ని దద్దమ్మగాడి ఫ్రెండ్స్ కనిపెట్టారు. ‘‘కథ వినిపించు బ్రో’’ అని అడిగేవారు. ‘‘మరి మీరు ఆఫీసుకు వెళ్లాలి కదా...సండే వినిపిస్తానులే’’ అని సర్దిచెప్పబోతే... ‘‘తొక్కలో ఆఫీసు. నీ కథ కంటే ఎక్కువా ఏమిటి? రేపు నువ్వు పే......ద్ద డైరెక్టరైపోతే...గ్రేట్ డైరెక్టర్ పుల్లరావుగారు సినిమాల్లోకి రాకముందు మాకు కథలు చెప్పేవారు తెలుసా! అని గొప్పగా చెప్పుకోవాలని మాకు మాత్రం ఉండదా ఏమిటి. బ్రో...కథ వినిపించు...’’ అని బతిమిలాడేవాళ్లు. పాపం వాళ్లను చూస్తే ముచ్చటేసేది. ఆఫీసు ఎగ్గొట్టి మరీ నా స్టోరీ వినడానికి ఉత్సాహం చూపిస్తున్నారంటే నేనెంత అదృష్టవంతుణ్ణో కదా అని మురిసిపోయేవాడిని. ఈలోపు ఆ ముగ్గురిలో ఒకడు... ‘‘బ్రో...ఆకాశం మబ్బు పట్టి ఉంది. ఈ టైంలో రూమ్‌లో కూర్చుని కథ వినడం బాగోదు. అలా బార్ అండ్ రెస్టారెంట్లో కూర్చొని విందాం’’ అనేవాడు. సరే అని వాళ్లను తీసుకెళ్లి లీటర్ల కొద్ది మందు పోయిస్తూ, బార్లో ఉన్న సమస్త నాన్‌వెజ్ ఐటమ్లు తినిపిస్తూ కథలు చెప్పేవాడిని. ఒకరోజు బార్లో ఇలాగే చెబుతుండగా...మా వెనక సీట్లో కూర్చున్న ఒకడు...జేబులో కాగితం తీసి రాసుకుంటున్నాడు. కొంపదీసి వీడు నా కథను వినలేదు కదా అనే డౌటు వచ్చింది. ఇప్పుడు ఆ డౌటు నిజమైంది. ఆరోజు నేను బార్లో చెప్పింది ‘కుక్క కాటుకు పప్పు దెబ్బ’ కథే! నిజానికి ఆరోజు వాడి దగ్గర ఉన్న కాగితాన్ని లాక్కొని, కాలర్ పట్టుకొని ఉంటే వ్యవహారం ఇక్కడి వరకు వచ్చేది కాదు. కళామాతల్లి సేవలో ఇప్పటి వరకు పది ఎకరాలకు పైగా అమ్ముకున్నాను. ఇక ఉన్న ఒక ఎకరం అమ్ముకునే ఓపిక లేదు. దయచేసి నాకు న్యాయం చేయండి. కాపీ కథ సంస్కృతిని వ్యతిరేకించండి’’ ‘పుల్లరావు కథ కాపీ కొట్టబడింది’ అని కొందరు– ‘శభాష్ శంకర్ కథకు పుల్లారావు కథకు సంబంధమే లేదు’ అని కొందరు వాదించుకోవడం మొదలుపెట్టారు. ఎక్కడా ఏకాభిప్రాయం కుదిరి చావడం లేదు. ఈలోపు ‘పుల్లారావు కథను కాపీ కొట్టారా లేదా?’ అనే దానిపై బెట్టింగ్‌లు కూడా మొదలయ్యాయి. వారం తిరిగేలోపే పుల్లరావు సమస్య రాష్ట్ర సమస్య అయింది. నెల తిరిగేలోపు జాతీయ సమస్య అయింది. విషయం ఎక్కడి దాక వెళ్లిందంటే పుల్లరావు వ్యతిరేక–అనుకూల అంటూ ఇండియా రెండుగా చీలిపోయింది. శాంతిభద్రతల సమస్య తుపానులా ముంచుకొచ్చింది. హాలీవుడ్లో లేటెస్ట్గా ‘కాపీకాస్మిక’ అనే మెషిన్ వచ్చింది. ఈ మెషిన్ వల్ల అక్కడ ఎన్నో జటిల సమస్యలు క్షణాల్లో పరిష్కారమయ్యాయి. అవుతున్నాయి. ఈ మెషిన్ ప్రత్యేకత ఏమిటంటే... రెండు పార్ట్లు ఉంటాయి. కుడివైపు ఉన్న పార్ట్‌లో ఆరోపణ చేస్తున్న వారి కథ, ఎడమవైపు ఉన్న పార్ట్‌లో ఆరోపణ ఎదుర్కొంటున్న వారి కథను పెడతారు. అంతే...పది నిమిషాల్లో రిజల్ట్ తెలిసిపోతుంది. 50 శాతం కాపీ కొట్టారా? 70 శాతం కాపీ కొట్టారా? 100 శాతం కాపీ కొట్టారా ?అనేది స్క్రిన్‌పై డిస్ప్లే అవుతుంది. ‘కాపీకాస్మిక’ గురించి గవర్నమెంటుకు తెలిసి ఆఘమేఘాల మీద ఆ మెషిన్‌ను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. మొట్టమొదట పుల్లారావు కేసును తీసుకున్నారు. ‘గెలుపు ఎవరిది?’ ‘పుల్లారావు గెలుస్తాడా?’....ఇలా రకరకాల హెడ్డింగ్లతో ప్రత్యక్షప్రసారాన్ని ప్రారంభిచాయి ఛానళ్లు. మెషిన్ కుడి వైపు ఉన్న పార్ట్‌లో...పుల్లారావు కథ పెట్టారు. మెషిన్ ఎడమ వైపు పార్ట్‌లో.... శభాష్ శంకర్ కథ పెట్టారు....ఆ తరువాత స్విచ్ నొక్కారు. దేశమంతా నరాలు తెగేంత ఉత్కంఠ! పదినిమిషాల్లో ఆ ‘కాపీకాస్మిక’ మెషిన్ ముక్కలు చెక్కలయింది...వేడి వేడి పొగలు...రక్తం పారుతోంది!!!!! ‘‘ఇలా అయిందేమిటి!’’ అంటూ హాలివుడ్ సాంకేతిక నిపుణులను పిలిపించారు. వారు ఇండియాకు వచ్చి మెషిన్‌ను పరిశీలించి... ‘‘ఈ కథలను యంత్రమే తట్టుకోలేకపోయింది. మరి మనుషులు ఎలా తట్టుకుంటున్నారు?’’ అని పెద్దగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు! దీని గురించి మీకేమైనా తెలుసా? – యాకుబ్ పాషా -
10జి టెక్నాలజీ!!
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ చాలా కోపంగా ఉన్నాడు. ఆ కోపంలో చుట్టెనక చుట్ట కట్టి... పదహారు చుట్టలు కట్టి కాలుస్తున్నాడు. ‘‘అలా ఉన్నారేంది?’’ అని అడిగాడు అసిస్టెంట్ డీమ్ డాంగ్. ‘‘ఈ దినపత్రిక చూశావా!’’ అని న్యూస్‌పేపర్‌ను డీమ్ డాంగ్ ముఖం మీద కొట్టాడు ప్రెసిడెంట్ కిమ్ జోంగ్. ‘త్వరలో 5జీ టెక్నాలజీ... దూసుకుపోతున్న చైనా, దక్షిణ కొరియా’ అని గట్టిగా చదివాడు డీమ్ డాంగ్. ‘‘మన శత్రుదేశం పేరు ప్రపంచంలో ప్రతి పౌరుని నాలుక మీద వినిపిస్తోంది. దీనికి కారణం 5జీ. మన శత్రుదేశం పేరు గొప్పగా వినిపించడం నాకు సుతరామూ నచ్చడం లేదు’’ అని చుట్ట వెలిగించాడు కిమ్ జోంగ్. ‘‘మరైతే ఏటి సేయమంటారు?’’ వినయంగా అడిగాడు అసిస్టెంట్ డీమ్ డాంగ్. ‘‘సౌత్ కొరియాను తలదన్నే టెక్నాలజీని మనం కనిపెట్టాలి. ఐ వాంట్ 10జీ టెక్నాలజీ... వెంటనే మన సైంటిస్టులకు కబురు పెట్టు’’ అన్నాడు కిమ్ జోంగ్. ‘‘ఇంకెక్కడి సైంటిస్టులండీ బాబు... మీ దెబ్బకు అందరూ కర్రెగడ్డ పిచ్చాసుపత్రిలో ఉన్నారు’’ విషయం చెప్పాడు డీమ్ డాంగ్. ‘‘కర్రెగడ్డ పిచ్చాసుపత్రిలో ఉన్నారా, ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో ఉన్నారా అనేది నాకు అనవసరం. నాకు 10జీ టెక్నాలజీ కావాలి... వాళ్లను పిచ్చాసుపత్రి నుంచి ప్రయోగశాలలకు తీసుకెళ్లండి. క్విక్... ఐ వాంట్ 10జీ టెక్నాలజీ’’ అరిచినంత పనిచేశాడు కిమ్ జోంగ్. ‘‘అయ్యా...నాదో చిన్న విన్నపం’’ అని గొణిగాడు అసిస్టెంట్ డీమ్ డాంగ్. ‘‘ధైర్యంగా చెప్పు’’ అడిగాడు కిమ్ జోంగ్. ‘‘5జీ టెక్నాలజీతో రకరకాల ఆరోగ్యసమస్యలు, పరావ్యరణ సమస్యలు వస్తాయని ఇప్పటికే ప్రపంచం భయపడుతోంది. 10జీ టెక్నాలజీ వస్తే ఇంకేమైనా ఉందా?’’ అని భయంగా అడిగాడు డీమ్ డాంగ్. ‘‘ప్రపంచానికి ఏమవుతుందోనని భయపడితే నేను కిమ్ జోంగ్‌ని ఎందుకు అవుతాను! సో... కాబట్టి... ఈ భూగోళానికి ఏమైనా సరే... నా కోరిక నెరవేరాలి... ఐ వాంట్ 10జీ టెక్నాలజీ’’ దృఢంగా అన్నాడు కిమ్ జోంగ్. ‘‘అలాగేనయ్యా... తమరి ఆజ్ఞ’’ అంటూ అక్కడి నుంచి వెళ్లాడు డీమ్ డాంగ్. ∙∙ కర్రెగడ్డ పిచ్చాసుపత్రిలో ఉన్న సైంటిస్టులందరినీ ఏసీ ప్రయోగశాలలకు తీసుకువచ్చారు. వారికి సకల సౌకర్యాలూ సమకూర్చారు. ఎవరో ఒక సైంటిస్ట్ ‘‘నాకు బావర్చీ బిర్యానీ కావాలి’’ అని అడిగితే స్పెషల్ ఫ్లయిట్ వేయించి హైదరాబాద్ బేగంపేట నుంచి తెప్పించి మరీ ఇచ్చారు. ‘‘ఏపీ ఏజెన్సీ ఏరియాలో ఇప్పసార బాగుంటుందట. అది తాగాలని ఉంది’’ అని ఒక సీనియర్ సైంటిస్ట్ కోరితే...ఏజెన్సీ నుంచి ఇప్పపువ్వును తెప్పించి ప్రత్యేక నిపుణులతో ఇప్పసారా తయారు చేయించి బాటిళ్లకు బాటిళ్లు ఇచ్చారు. ఒక సైంటిస్ట్... ‘‘నాకు బొంగులో చికెన్’’ కావాలని అడిగితే అలాగే చేశారు. ఇలా ఏది అడిగినా కాదనకుండా సమకూర్చారు. ప్రయోగశాలల్లో ప్రయోగాలు నిరాటంకంగా జరుగుతూనే ఉన్నాయి... ∙∙ సరిగ్గా నెలరోజుల తరువాత... ‘యురేఖా...’ అని అరిచాడు అతి సీనియర్ సైంటిస్ట్. ఈ సౌండ్ కోసమే ఎదురుచూస్తున్న కిమ్ జోంగ్ ఆ రోజుల్లో గంగూలీలా షర్ట్ విప్పి ‘గున్నా గున్నా మామిడి’ అని తీన్మార్ డ్యాన్స్ చేశాడు. చిన్నసైజు భూకంపం వచ్చిందిగాని ప్రాణనష్టం జరగలేదు. ‘‘సార్... ఎట్టకేలకు 10జీ టెక్నాలజీని కనిపెట్టాను...’’ ఆనందంగా అరిచాడు సీనియర్ సైంటిస్ట్ డుంగ్ జాంగ్. ‘‘మిత్రమా... 5జీ టెక్నాలజీ కంటే మన 10జీ టెక్నాలజీ ఏ రకంగా భిన్నం? దీని స్పెషాలిటీ ఏమిటి?’’ ఆసక్తిగా అడిగాడు ప్రెసిడెంట్ కిమ్ జోంగ్. ‘‘10జీ టెక్నాలజీ వచ్చాక... సెల్ఫోన్లు అంటూ ప్రత్యేకంగా ఉండవు. మన చెవులే సెల్ఫోన్లు. ఎవరైనా మనకు ఫోన్ చేస్తే... చెవిలో డుర్ర్ర్ర్ర్ర్... అని సౌండ్ వస్తుంది. ఏంచక్కా మాట్లాడవచ్చు. ఇక మన కనురెప్పలే స్క్రీన్లు. కళ్లు మూసుకోని ఏంచక్కా ఎన్నో సినిమాలు చూడవచ్చు. 10జీ టెక్నాలజీతో లంచ్‌టైమ్‌లో మనం భోజనానికి వెళ్లనవసరం లేదు... భోజనమే మన దగ్గరకు వచ్చి... నోట్లో దూరిపోతుంది... టైం వేస్ట్ అనేదే ఉండదు...’’ ఇలా చాంతాడంత లిస్ట్ చదువుతూనే ఉన్నాడు 10జీ టెక్నాలజీ కనిపెట్టిన సైంటిస్ట్. ‘‘శబ్భాష్’’ అని మెచ్చుకోలుగా ఆ సైంటిస్ట్ భుజం తట్టాడు కిమ్ జోంగ్. అది తట్టినట్లు లేదు... కొట్టినట్లు ఉంది... సైంటిస్ట్ భుజం వాచింది. ఆ నొప్పి నుంచి తేరుకుంటూ... ‘‘ఈ 10జీ టెక్నాలజీని పరీక్షించడానికి ధైర్యం ఉన్న మొనగాడు కావాలి’’ అని అడిగాడు సైంటిస్ట్. ‘‘చెట్టంత మొనగాడిని నేను ఉండగా... ఇంకా ఎవడో ఎందుకు? వాడుకో... నన్ను పూర్తిగా వాడుకో’’ అన్నాడు చిద్విలాసంగా కిమ్. ‘‘అయితే తమరు ఇలా వచ్చి కూర్చోండి’’ అని కిమ్‌ను కుర్చీలో కూర్చోపెట్టి రకరకాల వైర్లు బిగించాడు సైంటిస్ట్. కొద్దిసేటి తరువాత.... ‘ఢాం’ అనే శబ్దం వినిపించింది. ‘సచ్చాన్రో’ అని ప్రాణభయంతో అరిచాడు కిమ్ జోంగ్. ‘‘సారీ...మీరు చావలేదు’’ అన్నాడు సైంటిస్ట్. ‘‘మరి ఏమైంది?’’ ఆడిగాడు కిమ్. ‘‘ప్రయోగం విఫలం కావడం వల్ల... తలలో ఉండాల్సిన మీ మెదడు మోకాళ్లలోకి వచ్చేసింది’’ విషయం చెప్పాడు సైంటిస్ట్. ‘‘మరిప్పుడు నేను మామూలుగానే మాట్లాడుతున్నాను కదా’’ ఆశ్చర్యంగా అన్నాడు కిమ్. ‘‘ఇంకో అయిదు నిమిషాల్లో జజ్జనకరి జనారే...మొదలవుతుంది’’ తాపీగా చెప్పాడు సైంటిస్ట్. ‘‘అంటే?’’ ఆందోళనగా అడిగాడు కిమ్ జోంగ్. ‘‘ఇప్పుడు మీకు మీ మాతృభాష మాత్రమే కాదు... ప్రపంచంలోని ఎన్నో ప్రాంతీయ భాషలు వస్తాయి. విశేషం ఏమిటంటే ఆయా భాషల్లో ఏంచక్కా పాటలు కూడా పాడుతారు’’ అని సైంటిస్ట్ అన్నాడో లేదో...కిమ్ జోంగ్ సుబ్బరంగా తెలుగు మాట్లాడేస్తున్నాడు. మాట్లాడడం ఏమిటి ఖర్మ! ఇలా పాటలు కూడా పాడుతున్నాడు.... ‘నేను పుట్టాను లోకం నవ్వింది నేను నవ్వాను లోకం ఏడ్చింది నేను పుట్టాను లోకం తాగింది నేను తాగాను లోకం ఊగింది నాకింకా లోకంతో పని ఏముంది...డోన్ట్ కేర్!’ – యాకుబ్ పాషా -
అటు అమెరికా ఇటు ఇరాన్... మధ్యలో జిన్నీ!
చీటికి మాటికి తమ మీద ఆంక్షలు విధిస్తున్న అమెరికా ప్రెసిడెంటు ట్రంపు మీద ఇరాన్ ప్రెసిడెంట్ హసన్ రోహానీకి పీకలలోతు కోపం వచ్చింది. తనకు కోపం వచ్చినప్పుడల్లా కలం కాగితం తీసి కవితలు రాయడం రోహానీ అలవాటు. ఇది హైస్కూల్ రోజుల నుంచి ఉంది. ఈసారి కూడా అలాగే చేశాడు. కాగితం తీసి కలంతో ఇలా కవిత రాశాడు: ‘బాంబులు విసిరినా బరిసెలతో పొడిచినా తెలుగు టీవీ సీరియల్స్ చూపించినా అక్కుపక్షి అమెరికాకు నో సరెండర్...నో సరెండర్ వాహ్వా...వాహ్వా!’ కవిత రాసి పావుగంట దాటినా కోపం అట్లాగే ఉంది. అంతే వేడితో ఉంది. ఈసారి స్కెచ్‌పెన్‌తో డ్రాయింగ్ పేపర్ మీద ట్రంపు బొమ్మ గీసి ముక్కలు ముక్కలుగా చింపేసి వికటాట్టహాసం చేశాడు. అయినా కోపం తగ్గలేదు. వేడి తగ్గలేదు. ఈసారి ట్రంప్ మైనపు బొమ్మను తయారుచేసి టెహరాన్ గ్రౌండ్లో నిలబెట్టి దూరం నించి ఒక రాయి విసిరాడు. గురి చూసి కొట్టడంలో మనోడు కాస్త వీక్. అది వెళ్లి ఎక్కడో పడింది. ఎక్కడో కాదు... పిచ్చి పొదల మాటున ఉన్న ఒక దీపం మీద పడింది. అది మామూలు దీపం కాదు... అక్షరాలా అల్లావుద్దీన్ దీపం! ఆవులిస్తూ అంతెత్తున లేచింది జిన్నీ భూతం. ‘‘ఏంది నీ లొల్లి. మంచి నిద్రలో ఉంటే డిస్టర్బ్ చేశావు! ఏం కావాలో అడిగిచావు’’ అన్నది జిన్నీ భూతం మణికట్టు గడియారంలో టైమ్ చూసుకుంటూ. జిన్నీ భూతాన్ని చూడగానే సంతోషంతో ఒడలు పులకించాయి ఇరాన్ ప్రెసిడెంట్‌కు. ‘యురేకా తకామికా నీ ముద్దూ తిరేదాకా దొరికెరా మజాగా ఛాన్సు..’ అని చిరంజీవి సినిమాలోని పాట అందుకున్నాడు. ‘‘పాట సంగతి తరువాత....ముందు వరం అడిగి చావు’’ అని గద్దించింది జిన్నీ భూతం. ‘‘అయ్యా జిన్నీ భూతం... మీకు తెలియంది కాదు...మా దేశానికి ప్రధాన ఆధారం ఆయిల్. ఆ అమెరికా ట్రంపు ఉన్నాడు చూశారూ... మా మీద ఆంక్షలు విధించాడు. గ్రీస్, ఇటలీ, తైవాన్, టర్కీ... ఇవేమీ మా ఆయిల్‌ను దిగుమతి చేసుకోవడం లేదు. ఇప్పుడు ఈ కూటమిలో ఇండియా కూడా చేరింది. టాప్ బయర్స్ మా ఆయిల్‌ను దిగుమతి చేసుకోవడం లేదు’’ అని బాధ పడిపోయాడు ఇరాన్ ప్రెసిడెంటు. ‘‘మరిప్పుడు నన్నేటి సేయమంటావు? ట్రంపు తల తీసి నీ చేతుల్లో పెట్టమంటవా?’’ అని అడిగింది జిన్నీ భూతం. ‘‘ఆడి తలతో నేనేం చేసుకునేది! అందులో ఏముంది గనుక!’’ వాపోయాడు ఇ. ప్రెసిడెంట్. ‘‘అతడిని ఏమీ చేయనక్కర్లేదు. టాప్బయర్స్ మళ్లీ మా ఆయిల్‌ను దిగుమతి చేసుకునేలా చేస్తే అదే పది రియాల్లు’’ అని దీనంగా అడిగాడు ప్రెసిడెంట్. ‘‘చూడు రోహానీ... నేను చెప్పినట్లు చేస్తే నీ ప్రాబ్లం తొలిగిపోతుంది’’ అన్నది జిన్నీ భూతం. ‘‘ఏంచేయంటారు?’’ మర్యాదతో కూడిన ఆసక్తితో అడిగాడు ప్రెసిడెంటు రోహానీ. ‘‘సింపుల్... మీ ఆయిల్‌ను ఏ దేశాలైతే దిగుమతి చేసుకోవడం లేదో... ఆ దేశాల్లో నన్ను వదులు చాలు’’ అన్నది జిన్నీ భూతం. ‘‘అలాగే’’ అన్నాడు ప్రెసిడెంటు. ∙∙ ‘‘విక్రమార్కా... చాలా రోజుల తరువాత టఫ్ క్వచ్చన్ అడుగుతున్నాను. ఇంతకీ జిన్నీ భూతం ఏం చేసింది? టాప్బయర్స్ మళ్లీ ఇరాన్ ఆయిల్‌ను దిగుమతి చేసుకొనేలా చేసిందా? నా ప్రశ్నకు జవాబు తెలిసి కూడా చెప్పకపోయావో మటాష్...’’ అని అరిచాడు విక్రమార్కుడి భుజం మీది భేతాళుడు. అప్పుడు చిరునవ్వుతో విక్రమార్కుడు అలా చెప్పడం మొదలుపెట్టాడు.... ∙∙ ఇటలీ... పర్మ సిటీ...రోడ్డు నంబర్: 2 తన ఇంటి పెరట్లో ఒక మూలన పడి ఉన్న పాతదీపాన్ని చూసి... ‘‘కొంపదీసి ఇది అల్లావుద్దీన్ అద్భుతదీపం అయితే కాదు కదా’’ అని బుర్రగొక్కున్నాడు నలభైనాలుగు సంవత్సరాల ఇంజనీర్ బట్కేనల్ జుమ్ జుమ్. ‘‘కొంపదీసి ఏమిటయ్యా బాబూ... నేను నిజంగానే అద్భుతదీపాన్ని’’ అరిచింది జిన్నీ. ‘‘నాకు ఒకే ఒక కోరిక ఉంది. అది తీర్చు జిన్నీ’’ అని దీనంగా అడిగాడు బట్కేనల్ జుమ్ జుమ్. ‘‘మణులా మాణిక్యాలా? మందుబాటిళ్లా? కమాన్ అడుగు’’ ఆఫర్ ఇచ్చింది జిన్నీ భూతం. ‘‘అవేం అక్కర్లేదు’’ నసిగాడు జుమ్ జుమ్. ‘‘మరి ఏం కావాలి?’’ అడిగింది జిమ్మి. ‘‘మా ఆవిడ పుట్టింటికి వెళ్లేలా చూడు... నాకు వక్కపొడి కూడా తినే అలవాటు లేదనేది మా ఆవిడకు ఉన్న భ్రమ. ఆమె భ్రమ నా పాలిటి భయమై... నన్ను మందుకు దూరం చేసింది. ఆమె ఒక వారం రోజులు పుట్టింటికి పోతే నాన్‌స్టాప్‌గా మందుకొట్టాలనేది నా చిరు కోరిక’’ లొట్టలు వేస్తూ అన్నాడు బట్కేనల్ జుమ్ జుమ్. ‘‘అదిసరేగానీ, దీపంలో ఏం ఉంటుంది?’’ అని అడిగింది జిన్నీ భూతం. ‘‘ఆయిల్’’ అని ఆన్సర్ చెప్పాడు జుమ్ జమ్. ‘‘ప్రస్తుతం మా దీపంలో అయిల్ అయిపోయింది. మళ్లీ పోస్తేగానీ పని చేయదు’’ అన్నది జిన్నీ. ‘‘ఓసే అంతేగా... ఇప్పుడే తీసుకొస్తాను...’’ అని జుమ్జుమ్ అనేలోపు జిన్నీ భూతం ఇలా అన్నది... ‘‘నాయనా జుమ్ జుమ్... మా దీపంలో ఇరాన్ ఆయిల్ పోస్తేనే పని చేస్తుంది’’ ‘‘ఇరాన్ ఆయిల్‌ని బ్యాన్ చేశారు కదా’’ అని తల పట్టుకున్నాడు బట్కేనల్ జుమ్ జుమ్. ‘‘అలా తలపట్టుకుంటే కుదరదు. ఇరాన్ ఆయిల్ పోస్తేగానీ దీపం పనిచెయ్యదు. అప్పుడుగానీ నీ కోరిక నెరవేరదు’’ మరోసారి అన్నది జిన్నీ. అల్లావుద్దీన్ దీపం రోజుకో దేశంలో, రోజుకో ఇంట్లో ప్రత్యక్షమయ్యేది. ‘‘నీ కోరిక తీరుస్తానుగానీ ముందు మా దీపానికి ఇరాన్ ఆయిల్ కావాలి’’ అని అడిగేది. ఇలా ‘ఇరాన్ ఆయిల్’కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇరాన్ ఆయిల్ దిగుమతి మీద నిషేధం తొలిగించాలని ఉద్యమాలు చెలరేగాయి. ఈ ఉద్యమాల వేడి తట్టుకోలేక టాప్ బయర్స్ దేశాలు ఇరాన్ ఆయిల్ మీద నిషేధాన్ని తొలిగించాయి. ఇరాన్ ప్రెసిడెంటు కోరిక అలా నెరవేరింది! – యాకుబ్ పాషా -
ప్రభు, ఊర్వశిల కామెడీ గలాటా
ప్రముఖ నటుడు ప్రభు నటన గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నవరసాలను ఏకకాలంలో నటించగల దిట్ట ఆయన. అలాంటి నటుడు తాజాగా నటిస్తున్న చిత్రాల్లో ఉన్నోడు కా చిత్రం ఒకటి. ఇందులో ఆయన నటి ఊర్వశితో కలిసి వినోదాల విందు చేయనున్నారు. అభిరామి మెగామాల్ పతాకంపై అభిరామి రామనాథన్ నిర్మిస్తున్న చిత్రం ఉన్నోడు కా. ఈ చిత్రం గురించి ప్రభు తనదైన స్టైల్లో చెబుతూ చాలా కాలం తరువాత పూర్తి హాస్యభరిత కథా చిత్రంలో నటిస్తున్నాను. ఈ చిత్రంలో తాను రెండు వైవిధ్యభరిత గెటప్‌లలో కనిపించనున్నాను. చేతిలో కత్తి పట్టి గ్రామీణ గెటప్ ఒకటి కాగా నగరంలో కొడుకు ప్రేమకు సాయం చేసే పాశం ఉన్న తండ్రిగా మరో గెటప్లోనూ నటిస్తున్నాను. ఇందులో తనకు జంటగా నటి ఊర్వశి నటిస్తున్నారు. మేమిద్దరం కలిస్తే వినోదాల విందే. ఈ చిత్రానికి అభిరామీ రామనాథన్ కథను రాశారు. కథ వినగానే నటించాలని నిర్ణయించుకున్నాను. కారణం ఇలాంటి వినోదాత్మక కథలు అరుదుగా లభిస్తుంటాయి. ఈ రోజుల్లో కుటంబ సమేతంగా కలసి చూసి ఆనందించే కథా చిత్రాలు రావడం తక్కువనే చెప్పాలి. ఆ కొరతను ఈ ఉన్నోడు కా చిత్రం తీరుస్తుంది. ప్రేమ,హాస్యం,సెంటిమెంట్,యాక్షన్ అంటూ జనరంజకమైన అంశాలు పుష్కరంగా ఉన్న చిత్రం ఇది.అంతే కాదు చక్కని సందేశం కూడా ఉంటుంది. యువ జంటగా ఆరి,మాయ నటిస్తున్నారు.నేను ఇప్పటికి 60కి పైగా కొత్త దర్శకులతో పని చేశాను. ఆ కోవలోకి ఈ చిత్రం దర్శకుడు ఆర్కే చేరతారు. దీనికి సత్య సంగీతాన్ని అందిస్తున్నారు అని ప్రభు ఉన్నోడు కా చిత్ర వివరాలను తెలిపారు. -
పెద్ద ఆకారాలూ చిన్న వికారాలూ
కామెడీ కథ చిన్నప్పట్నుంచీ నాకు బల్లి అంటే చెప్ప డానికి వీల్లేనంత భయం. దాని ఆకారం చూస్తే పరమ అసహ్యం. కొందరికి ఇదే విధంగా కప్పన్నా, ఉడతన్నా, బొజ్జెంకన్నా, తొండన్నా భయమూ - అసహ్యమూ కలగడం కద్దు. కాని ఒకరి భయాన్నీ, అసహ్యాన్నీ మరొకరు అర్థం చేసుకోవడానికే ప్రయత్నించకపోగా విడ్డూరంగా చూస్తారు. కొందరికి బల్లి అంటే భయం లేదు గనక ఎదుటివాళ్లు బల్లిని చూసి భయపడుతున్నారని తెలిస్తే తాటాకులు కట్టి ఏడిపించి ఎగతాళి చేసి గోల చేస్తారు. యిందుకే పిల్లికి చెలగాటం ఎలక్కు ప్రాణ సంకటం అన్నారు. ఈ ప్రాణసంకటంతో బాధపడే ఎలుకల్లో నేనొకదాన్ని. బల్లి నాకు పరమ శత్రువు. అది వుంటే గదిలో కాలు పెట్టను ఒకవేళ అంతగా ఆ గదిలోకి వెళ్లాల్సొస్తే పనివాళ్లను పిలిచి ఆ బల్లిని బయటికి తరిమించి అది వెళ్లిపోయిందో లేదో జాగ్రత్తగా చూసి మరీ లోపలడుగు బెడతాను. విధిలేని సందర్భాల్లో పులి బోనులో తల దూర్చినట్లు భయపడుతూ, లోపలికెళ్లి అది వున్న వేపు వెళ్లకుండా అది ఏవైపు తిరుగుతుంటుందో చూసుకుంటూ, అదీ నేనూ రాహుకేతువుల్లాగా ఎదురు బదురుగా తిరుగుతుంటాం. ఎంత దూరంలో వున్నాసరే దాని కదలిక నా కండ్లు కట్టేస్తుంది. అది కాస్త జరిగితే నాకు తెలీకుండానే నా శరీరం ఆటోమేటిగ్గా యింకో వైపు జరుగుతుంది. కాని యింత కాన్సన్ట్రేషన్ దానిమీద వుంచినా, నా అవస్థ ఎదుటివాళ్లు పసిగట్ట కుండా తంటాలు పడుతుంటాను. ఓసారి క్లాసులో ఝాన్సీ లక్ష్మీబాయి ధైర్య సాహసాలను వర్ణించి చెబుతోంది మా మేష్టరమ్మ. ‘సడన్’గా నా ముందున్న బల్ల కింద బల్లి కదులు తున్నట్లు అనుమానం కలిగింది. నా గుండె గతుక్కుమంది. ఇంక అక్కడ క్షణం కూడా కూర్చోలేక ముళ్ల మీదున్నట్లు బాధ పడ్డాను. భయంతో వణుకుతున్న నేను మేష్టరమ్మ చూడకుండా పక్క పక్కలకు జరగడం నా వరసలో కూర్చున్న పిల్లలు పసిగట్టేశారు. ‘‘బల్లేమైనా కనిపించిందా!’’ అని రహస్యంగా అడిగి మెల్లిగా నవ్వు కున్నారు. నేను కూర్చున్న వరసలో కలకలం బయల్దేరడం మేష్టరమ్మ కంటబడ్డది. ‘‘ఏమిటది! పాఠం వినకుండా ‘న్యూసెన్స్’ చేస్తున్నారు!’’ అంటూ కోప్పడ్డది. వెంటనే నా వరసలోవున్న ఒకమ్మాయి లేచి నిలబడి ‘‘మరే... మరే... మేష్టరమ్మ గారండీ... మరే మరుండ్లా...’’ ‘‘ఇంక చాలు. కూర్చో’’ అంటూ కసిరింది మేష్టరమ్మ. నే చెప్తానంటూ యింకో అమ్మాయి లేచింది. ‘‘అసలే... మేష్టరమ్మ గారండీ... అసలుండ్లా... అసలామ్మాయికే... అసలూ...’’‘‘ఆపు.. నీ అసలూ పెసలూ’’ కోపంతో అరిచింది మేష్టరమ్మ. క్లాసంతా ఒక్కసారి నిశ్శబ్దం అయిపోయింది. కాళ్లకు వేసుకున్న ‘హై హీల్స్’ చెప్పులు టక్టక్ మనిపించుకుంటూ పెద్ద రథంలా ఒచ్చి మా ముందు నిలబడ్డది మేష్టరమ్మ. పిల్లలంతా బిగుసుకు పోయారు. నేను గుటకలు మింగడం మొదలెట్టాను. ‘‘ఎందుకు భయపడ్డావ్! ఏం జరిగింది చెప్పు’’ అంటూ కోపంగా వున్న మేష్టరమ్మ నా బెత్తంతో ముందున్న బల్లమీద గట్టిగా బాదింది. ఆ దెబ్బకు చెంగున మేష్టరమ్మ మీదికి దూకింది... అంతవరకూ నేను బల్లి అనుకుని భయపడ్డ కప్ప. మేష్టరమ్మ కెవ్వున కేకేసి భయంతోనూ, అసహ్యం తోనూ కేర్బార్మంటూ గెంతడం మొదలెట్టింది. పిల్లలందరం నవ్వు బిగబట్టుకోలేక చచ్చాం. కప్ప ఒక్కసారి హై జంప్ చేసి తపక్కున మేష్టరమ్మ తలమీదికెళ్లి చతికిలపడ్డది. ‘‘అమ్మో’’ అంటూ మళ్లీ ఒక్క పొలికేక పెట్టి, కంపరంతో ఎగరడం మొదలెట్టింది మేష్టరమ్మ. ఆ ఎగరడంలో ‘బేలెన్స్’తప్పి మేష్టరమ్మ తపక్కున కిందపడ్డది. మేష్టరమ్మను కిందపడేసిన కప్ప ఒక్క గంతులో వెళ్లి మేష్టరమ్మ కుర్చీలో కూల బడ్డది. కిందబడ్డ మేష్టరమ్మ కాలు బెణికి లేవలేకపోయింది. క్లాసులో వున్న పిల్లలందరం సాయంపట్టి లేవదీశాం. ఒకళ్లిద్దరు లేవదీసే శరీరం కాదు మేష్టరమ్మది. నవ్వు ఆపుకోడానికి అవస్థ పడుతున్న మా పిల్ల కోతుల ముఖాలు చూసి కప్పగంతుల్తో అలసిపోయి, ముచ్చెమటలు పట్టిన మేష్టరమ్మ ఒకింత సిగ్గుపడ్డది. మరుక్షణం తన సీట్లో కూర్చున్న కప్పను చూసి త్రుళ్లిపడి ‘‘ఛాఛాఛా... చూస్తారేం! నా సీట్లోనించి తీసేయండా డర్టీ క్రీచర్ని!’’ అంటూ కంపరంతో ఒళ్లు విదిలించుకుంది. మేష్టరమ్మ కప్ప దగ్గరకెళ్లడానికి భయ పడుతున్న పిల్లలంతా ఒకళ్ల ముఖాలు యింకోళ్లు చూసుకుంటూ నిలబడ్డారు. కప్పంటే భయంలేని నేను వెళ్లి కప్పను పెన్సిల్‌తో బయటికి నెట్టేశాను. మేష్టరమ్మ నన్ను చూసి ఆశ్చర్యంతో, ‘‘నీకు కప్పంటే భయంలేదూ’’ అన్నది. ‘లే’దన్నాను. ‘‘మరెందుకు యిందాక భయపడి పక్కకు జరిగావు’’ అని అడిగింది. ‘‘అదీ.. అదీ.. మేష్టరమ్మ గారండీ, అదుండ్లా అమ్మాయికీ... అదే...’’ ఆ ‘అది’ చెప్పేలోగా నేనే చెప్పేశాను బల్లి అనుకుని భయపడ్డానని. ‘‘వాట్! నీకు బల్లిని చూస్తే భయమా!’’ అన్నది మేష్టరమ్మ నన్ను చూసి ఎగతాళిగా నవ్వుతూ. ‘‘మీకు కప్పంటే ఎంత బయ్యమో అంత బయ్యం అమ్మాయికి బల్లంటే...’’ అంది ఓ పిల్ల. ‘‘నాన్సెన్స్... బల్లిని చూసి భయపట్టం మీనింగ్లెస్. పాపం అది మోస్ట్ హారమ్లెస్ క్రీచర్. యింకా కప్పంటే భయపట్టంలో అర్థం వుంది’’ అంటూ కుంటుతున్న మేష్టరమ్మ వెళ్లి కప్ప వెళ్లిపోయిందో లేదో జాగ్రత్తగా పరిశీలించి మరీ కుర్చీ ఆక్రమించుకుంది. మళ్లీ పాఠం చెప్పడానికి పుస్తకం తీసింది. కాని దృష్టి పుస్తకం మీద నిలవలేదు. తన చుట్టు పక్కలేవుంది చూపంతా. మళ్లీ ఆ కప్ప ఎక్కడ ఎగిరొచ్చి మీదపడుతుందోనన్న భయంతో పాఠం ముందుకు సాగలేదు. ఏ చిన్న కాగితం కదిలినా మేష్టరమ్మ అదిరి పడి పుస్తకం కింద పడెయ్యడం చూసి నవ్వు ఆపుకోలేక సమతమమయ్యాం. యింక లాభం లేదని గ్రహించిన మేష్టరమ్మ తన కాలు నొప్పి సాకుతో మమ్మల్ని యిండ్లకు పంపించే సింది. యింట్లో ఈ సంగతి విన్న నాన్న ‘‘ఛాఛా కప్పకు భయపడే టీచరు మీకేం చదువు చెప్తుంది. యింక నువ్వా స్కూలుకు వెళ్లనవసరంలా..’’ అని మర్నాడే నన్ను తీసుకెళ్లి అన్నయ్య వాళ్లు చదివిన ఎలిమెంటరీ స్కూల్లో చేర్పించాడు. ఆడ పిల్లలూ, మగపిల్లలూ కలిసి చదివే ఆ స్కూలు వాతావరణం అలవాటైందాకా అవస్థపడ్డాను. మేరుపర్వతం లాంటి మా మేష్టరమ్మను చూసివున్న నా కండ్లకు తిరగలి పిడిలాగా వున్న మా కొత్త మేష్టరు నలుసులా కనిపించాడు. ఆ స్కూల్లో చేరిన కొత్తల్లో ఒకరోజు మా క్లాసుకు హెడ్మాస్టరొచ్చాడు. ఏనుగు పక్కన ఎర్రచీమలాగా కనిపించాడు హెడ్ మాస్టర్ పక్కన మా మాస్టరు. యిద్దరూ కొత్తగా చేరిన పిల్లల చదువు విషయం ఏదో మాట్లాడుతూ మా ముందుకొచ్చారు. అంతకుముందు చాలాసేపట్నుంచీ ఒక కుర్రాడు తన నిక్కరు జేబులోంచి బటానీలు తీసి తన చొక్కా జేబులో ఒక్కొక్కటీ వేస్తున్నాడు. హెడ్మాస్టరు దగ్గరికి రావడం చూసి బిగుసుకుపోయి నిలబడ్డాడు. ఆ కుర్రాడి చొక్కా జేబులో ఏదో కదలడం మాతోబాటు హెడ్మాస్టరు కంట కూడా పడ్డది. ‘‘ఏమిట్రా అదీ! నీ చొక్కా జేబులో ఏమిటి కదుల్తోంది’’ అంటూ హెడ్మాస్టర్ గర్జించాడు. ఆ కుర్రాడు ఉలిక్కిపడ్డాడు. తక్షణం లాంగ్‌జంప్ చేసి చెంగున హెడ్ మాస్టర్ మీదికి దూకింది, అంతవరకూ ఆ కుర్రాడి జేబులో బటానీలు తిన్న ఉడత పిల్ల. హెడ్మాస్టర్ ఒక్క వెర్రికేక పెట్టి పక్క నున్న మా తిరగలి పిడి మాస్టర్‌ను అమాం తంగా వాటేసుకున్నాడు. అంతవరకూ హెడ్మాస్టర్ ఒంటిమీద చెడా మడా ఎగిరి గంతులేసిన ఉడతపిల్ల టింగురంగా అంటూ హెడ్ మాస్టర్ బట్టతల మీదికెగిరి కూర్చుని గీకడం మొదలెట్టింది. యింక పిచ్చెత్తినట్టు కేకలు పెడుతూ, మా మాస్టర్‌ను పట్టుకుని కుప్పిగంతులెయ్యడం మొదలెట్టారు హెడ్మాస్టర్. అంతవరకూ గుడ్లప్పజెప్పి మాస్లర్ల దురవస్థ చూస్తూ నిలబడ్డ మా క్లాసు పిల్లల్లో ఒక పిల్లాడు ధైర్యం చేసి ముందు కొచ్చి, హెడ్ మాస్టరు తల గోకుతూ కూర్చున్న ఉడత పిల్లను పట్టి తీసేశాడు. ఆయాస పడుతూ బీభత్సంగా చెమటలు కక్కుతున్న హెడ్ మాస్టర్... పక్కకు తిరిగి నవ్వు ఆపుకోడానికి ప్రయత్నిస్తున్న పిల్లలందర్నీ చూసి అవమానంతోనూ, కోపంతోనూ ‘ఫూల్స్, యిడియట్స్, స్టుపిడ్స్... బుద్ధి ఉండక్కర్లా, ఉడతల్ని తెస్తారా క్లాసుకు? ఇకమీద ఎవరైనా ఉడతల్ని తెస్తే డిస్మిస్’’ అని మడిపడుతూ వెళ్లిపోయాడు. తర్వాత మా మాస్టరే చెప్పాడు... హెడ్మాస్టర్కు ఉడతంటే చచ్చేంత భయం అనీ, స్కూల్లో ఉడత లెక్కువగా ఉన్నాయనే భయంతో ఉడతల్ని పట్టేవాళ్లను పిలిపించి తన రూము చుట్టూ అంగరక్షకుల్లాగా ఉంచాడనీ. ఇక హెడ్ మాస్టర్ ని కట్టేశారు మా క్లాసు పిల్లలు. ఆయన పోతుంటే దూరాన్నుంచే ‘ఉడతా ఉడతా ఊచ్... సన్నబియ్యం సాచ్’ అంటూ గోల చేసేవాళ్లు. కాని హెడ్ మాస్టర్ నాకంటే ఒక విధంగా అదృష్టవంతుడు. ఉడతలు ఇంట్లో మకాం పెట్టవు. వాటిలాగే ఈ బల్లులు కూడా ఏ అరణ్యాల్లోనో ఉండ కుండా మనుషుల్తో బాటు యిండ్లలో వుంటూ అన్ని గదుల్లోనూ నిర్భయంగా తిరగడమే నా ప్రాణానికి సంకటంగా తయారయ్యింది. నేను పగలంతా బల్లుల్ని వేటాడితే, బల్లులు రాత్రుళ్లు కల్లో నన్ను వేటాడేవి. మనిషి సైజు బల్లులు... నన్ను కొరకొరా చూసేవి. తిట్టేవి. ఎగతాళిగా నవ్వుతూ వెక్కిరించేవి. చివరకు కోపంతో నామీద దూకడానికి ప్రయత్నించినప్పుడు కెవ్వుమని అరిచేదాన్ని. ఇంటిల్లిపాదీ నిద్ర లేవడమే కాకుండా ఇరుగు పొరుగువాండ్లు కూడా లేచి లైట్లేసుకుని పరుగెత్తుకొచ్చే వాళ్లు, మా ఇంట్లో దొంగలు పడ్డారేమో నని. అసలు సంగతి అమ్మా నాన్నా చెప్ప గానే నవ్వుకుంటూ వెళ్లిపోయేవాళ్లు. ఇంక ఆ రాత్రి నాకు నిద్ర పట్టేది కాదు. పెద్దయ్యాను. పెళ్లయ్యింది. పిల్లవాడు కూడా పుట్టాడు. కానీ నా బల్లి భయం మాత్రం పోలేదు. ఒకరోజు పూజకు కూర్చున్నాను. ఎప్పుడు చేరిందో నాకెదురుగావున్న గోడమీద బల్లి... గుండె జల్లుమంది. పూజ సింపుల్‌గా చేసి, మా అత్తగారు ఆరగింపు తెచ్చేలోగానే బయట పడ్డాను. మర్నాడు ప్రొద్దుటే పూజగది కొచ్చి ఒకసారి నాలుగు వైపులా చూశాను. బల్లి కనిపించలేదు. నిర్భయంగా పూజకు కూర్చున్నాను. గణపతికో టెంకాయ కొట్టి, అమ్మవారికి ఆరగింపు పెట్టి, కుంకుమా ర్చనకు కూర్చున్నాను. మీనాక్షి అమ్మవారికి కట్టిన పట్టు పావడాలోంచి తొంగి చూసింది బల్లి. పీటతో సహా ఎక్స్‌ప్రెస్ స్పీడ్‌లో జర్రున వెనక్కి వెళ్లి మా అత్తగారి మీద పడ్డాను. మా అత్తగారు భయంతో వణుకుతున్న నా భుజాలు పట్టి కుదిపారు. బల్లిని చూపించాను. ‘ఓసి నీ యింట వాన గురవా... బల్లిని చూశా ఇంతచేటు భయ పడ్డావ్’ అంటూ పడీ పడీ నవ్వారు అత్త గారు. ఈలోపుగా ఆఫీసుకు బయల్దేరిన మావారు దేవుడికి నమస్కరించుకోడాని కొచ్చారు. ‘వెంకటేశ్వరా... బల్లులు రాకుండా చేసే శక్తి మీ భార్యల దగ్గర లేదని తేలిపోయింది. మీరైనా ఈ బల్లుల్ని ఈ గదికి రాకుండా చూస్తేనే మీ భార్యలకు ఎప్పుడైనా ఓ టెంకాయ చిప్ప దొరుకు తుంది. లేదంటే పూజగది బంద్’ అంటూ నన్ను కాసేపు ఏడిపించి, బల్లిని తరిమేసి ఆఫీసుకెళ్లిపోయారు. ‘ఓసి నీ భయం బంగారంగానూ’’ అంటూ మళ్లీ నవ్వారు మా అత్తగారు. అంతలో ఏ మూల నుంచో ‘మ్యావ్’ అని సన్నగా వినిపించింది. మా అత్తగారి నవ్వు ఆగిపోయింది. ఉన్నట్టుండి ఎందుకంత సీరియస్‌గా మారిపోయిందో నాకర్థం కాలేదు. కిచకిచమంటూ అటక మీద శబ్దం వినిపించింది. మరుక్షణం రెడు ఎలుకలు కిందికి దూకాయి. వాటి వెనకాలే వో గండుపిల్లి మా అత్తగారి ముందుకు దూకింది. ‘వోయమ్మ, చచ్చానేవ్’ అంటూ వెర్రికేక పెట్టి అమాంతంగా వచ్చి నామీద పడ్డది భయంతో. ఆవిడకు పిల్లంటే అంత భయమని నాకంతవరకూ తెలీదు. నేను బల్లిని చూసినరోజు ఏదో ఒక హడావిడి జరిగి పనికి బ్రేక్ పడేది. ఒక సారి రికార్డింగ్ జరుగుతోంది. మైక్ ముందు పాడుతున్నాను. ఎప్పుడొచ్చిందో, ఎట్లా వచ్చిందో మైక్ వెనక నుంచి తొంగి చూసింది బల్లి. నా గొంతు భయంతో బిగుసుకుపోయి ‘కీక్’ అనటం విన్న సౌండ్ ఇంజినీరు కట్ కట్ అంటూ గోలెత్తాడు. ప్రాణం అరచేతిలో పెట్టుకుని ఒక్క దూకులో బయటపడ్డాను. ‘ఏమిటి బల్లేనా’ అంటూ వచ్చారు మావారు. ఈ లోగా ఆర్కెస్ట్రా వాళ్లంతా చుట్టూ చేరారు. చెప్పొద్దని కళ్లతో బతిమాలుకున్నాను మావార్ని. అబ్బే... ధర్మరాజును చంపి పుట్టారు మావారు. అబద్ధం చెప్పరు. నిజం చెప్పారు. అంతా ఒక్కసారి గొల్లున నవ్వారు. నా ప్రాణం చచ్చిపోయింది. మా సౌండ్ ఇంజినీరు మైక్ దగ్గరికెళ్లి కర్చీఫ్‌తో మైక్ మీద మన్ను దులిపాడు. తక్షణం జటాయువులాంటి రెక్కల్తో ఏరోప్లేన్లాగా ఎగిరి ఆయన రెండెకరాల నుదురు మీద సేఫ్‌గా లేండ్ అయింది ఓ బొజ్జెంక. కెవ్వున కేసేసి మెలికలు తిరిగి వెల్లకిలా పడ్డాడు సౌండ్ ఇంజినీరు. చటుక్కున మావారు కర్చీఫ్‌తో సౌండ్ ఇంజినీరు నుదురును ఎద్దులా దున్నుతున్న ఆ బొజ్జెంకను తరిమేశారు. నవ్వు ఆపుకోలేక ఆర్కెస్ట్రా వాళ్లంతా బయటికి పరుగెత్తారు. తర్వాత తెలిసింది... సౌండ్ ఇంజినీరుకు బొజ్జెంకంటే చచ్చేంత భయం ఒకసారి ఎవరిదో పిక్చరు షూటిం గుకు వెళ్లాను. అది ఒక బ్రహ్మాండమైన అరణ్యం సెట్టు. ఓ పాడుబడ్డ దేవాలయ మంటపం, దాని చుట్టూ అరణ్యం. ఆ సంవత్సరం తయారయిన అన్ని పిక్చర్లలోనూ అరణ్య రోదన ఘట్టాలన్నీ అక్కడే తీశారు. అది ఇంకా కొంతకాలం ఉంటే దాని ప్రతిభ స్థల పురాణంలో కెక్కేదే. కాని పాములు, తేళ్లు, ఎలకలు, పందికొక్కులు యిత్యాది అడవిమృగాలు చేరుతున్నాయని, ఇంకొన్నాళ్లు ఉంచితే పులులు, సింహాలు కూడా చేరవచ్చని భయపడ్డ స్టూడియో యజమాని సెట్టు పీకేయించాడు. అది తీసేముందు నేనూ వెళ్లాను. ఆరోజు నాతోబాటు నా ఇష్టసఖి పాత్రధారి కూడా ఉంది. దేవాలయ మంటపంలో మొదటి షాటు. నా ఇష్టసఖి మేకప్ సరిచేసుకుంటుంటే మామూలు ప్రకారం నా కండ్లు మంటపం స్తంభాల మీదికెళ్లాయి. ఏదో పురుక్కోసం చరచర వస్తోంది నేనున్న వైపునకే పెద్ద బల్లి. ఒక్క దూకులో వచ్చి అరణ్యంలో పడ్డాను. ‘పాము ఏమో’ అంటూ అంతా మంటపం లోకి పరుగెత్తారు. ‘పామును చూశారా, ఏవైపు వెళ్లింది’ అంటూ ఇష్టసఖి ఆతృతగా అడిగింది. అటూ ఇటూ చూసి, ‘పాము కాదు బల్లి’ అన్నాను. గొల్లుమని నవ్వింది. అంతా పరిగెత్తుకు వచ్చారు. మూతి ముడుచుకున్న డెరైక్టర్ ‘అదేం చేస్తుందమ్మా, మోస్ట్ హామ్లెస్ క్రీచర్’ అంటూ దాన్ని అరణ్యంలోకి తరిమారు.‘రెడీ స్టార్ట్’ అంటూ కేకేశాడు డెరైక్టర్. కష్టాల్లో ఉన్న నాకు నా ఇష్టసఖి ధైర్యం చెప్పే షాట్. డైలాగ్ మొదలెట్టింది. ‘అమ్మా... అధైర్య పడకండి. మీకు అండగా నేను’... డైలాగ్ పూర్తి కాలేదు. ఉన్నట్టుండి ఓ పోతులాంటి తొండ ఒక్క దూకు దూకి నా ఇష్టసఖి జడ పట్టుకుంది. ఒక్క గావుకేక పెట్టి, భయంతో వచ్చి నన్ను కావలించుకోబోయిందామె. బల్లి గాభరాలో వున్న నేను తుళ్లిపడి వెనక్కి జరిగాను. భయంతోనూ, అసహ్యంతోనూ చెమటలు కక్కుతోన్న నా ఇష్టసఖి రెండు చేతులూ బారజాపి, వెర్రి కేకలు పెట్టి, అరుస్తూ ఏడవసాగింది. ఇంకోవైపు కూతురు అవస్థకు ఏడుపులూ పెడబొబ్బలూ పెడుతూ ఎగుర్తోంది నా ఇష్టసఖి తల్లి. డెరైక్టరు జడనొకసారి విదిలించాడు. తొండ వదల్లా. కర్రతో అదిలించాడు కదల్లా. ‘జడ కత్తిరించాల్సిందే’ అన్నాడు అసిస్టెంట్ డెరైక్టర్ అతివాగుడు అవతారం. నాకు చటుక్కున స్ఫురణకొచ్చింది. ‘ఆ అమ్మాయి జడమీద పూలకు బదులుగా పెట్టుకున్న సీతాకోక చిలకను తీసిపారేయండి’ అన్నాను. వెంటనే దాన్ని లాగి పారేశాడు ైడెరైక్టర్. దాంతో పాటే జడ వదలిపెట్టి కిందికి దూకింది తొండ. అందరూ నావైపు ఆశ్చర్యంగా చూశారు. అరిచి, ఏడ్చి అలసిపోయిన నా ఇష్టసఖి నన్నొచ్చి గట్టిగా కావలించుకొంది. వాళ్లమ్మ కూడా ‘నా బిడ్డను కాపాడావు తల్లీ, దానికి తొండను చూస్తే చచ్చేంత భయం’ అంటూ నా చేతులు రెండూ కండ్లకద్దుకుంది. నా ఇష్టసఖి రెస్టు కోరడం వల్ల నా సలహా మీద ఆరోజు షూటింగ్ కేన్సిల్ చేశారు. ఇంటికి బయలుదేరుతున్న నా దగ్గరికి ఇష్టసఖి పరుగెత్తుకొచ్చింది. ‘క్షమించండి. బల్లి భయంతో పరుగెత్తిన మిమ్మల్ని చూసి నవ్వినందుకు వెంటనే తగిన శాస్తి చేశాడు దేవుడు. భయంతో చచ్చిపోవాల్సిన నన్ను బ్రతికించారు’ అంటూ ఎంతో కృతజ్ఞతతో నమస్కరించి వెళ్లిపోయింది. బల్లి అంటే భయంతో గజగజలాడే నేను, తొండంటే భయపడే మరొక ప్రాణిని రక్షించగలిగానా? నాలో నేనే నవ్వుకున్నాను. భానుమతీ రామకృష్ణ -
పి.కె. 2015
కామెడీ కథ ‘నీ మిత్రుడు పోలకంటి కనకాంబరం ఉరఫ్ పి.కె.ని ప్రభుత్వ ఆసుపత్రిలో పడేశాం. నీవు రాగలవు’ కమల నాకు పంపిన మెసేజది. కమల పి.కె. చెల్లెలు. ఎందుకు చెప్మా అని ఫోన్ పట్టుకొని కొంచెంసేపు ఆలోచించాను. స్పాట్ వాల్యుయేషన్ జరుగుతున్నాది. సెలవివ్వరు. మరీ అర్జంటనీ.. ప్రాణాల మీదకొచ్చిందని చెప్పి బయలుదేరాలి. ఒకరోజులో రావాలి. వాడుండేది విశాఖలో. నేను విజయవాడలో. ఫర్వాలేదు సమయం సరిపోతుంది. ‘‘రాత్రికి బయలుదేరుతున్నానని’’ నేను తిరుగు సందేశం ఫోన్లో పంపాను. పి.కె.తో నా స్నేహానికి మూడు పదుల వయసు. మా ఇద్దరి చిన్నతనం విజయనగరం ఐకోనేరు గట్టు సత్యన్నారాయణ స్వామి కోవెల న్యూపూర్ణ జంక్షన్ దగ్గరే గడిచిపోయింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పీజీకి వచ్చాక వాడు టీచర్ పోస్టులకు, నేను గ్రూప్స్, బ్యాంకులకు ప్రిపేర్ అయ్యేవాళ్లం. అనుకొన్న విధంగానే వాడు టీచర్‌గా సెలక్టు అయ్యాడు. నేను ఎస్బీఐ పీఓగా విజయవాడ రీజియల్గా వెళ్లిపోయాను. అయినా మా మధ్య స్నేహం చెడిపోలేదు. ఇప్పుడు వాడికి నాలుగు పదులు మీద మరో రెండు సంవత్సరాలు అదనంగా ఉన్నాయి. ఎందుకో పెళ్లిమీదకు మనసు పోవటం లేదనేవాడు. విశాఖలోని ఎండాడ దగ్గర ఓ ఫ్లాట్ కొనుక్కున్నాడు. భీమిలిలో ఉద్యోగం. రేపో మాపో ఎం.ఇ.ఓ. ప్రమోషన్ వస్తుందన్నాడు. అలాంటిది ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది? కళ్లు తెరిచేసరికి... తెల్లవారుజాము నాలుగయింది. మరో నలభై నిమిషాల్లో విశాఖ వచ్చేస్తుంది. మరి నిద్రరాలేదు. విశాఖ చేరగానే రూమ్ తీసుకుని ఎనిమిది కల్లా ఎన్.ఆర్.ఐ. ఆసుపత్రికి వెళ్లాను. ముందు కె.జి.హెచ్. అనుకున్నారుట. అతడిని మరింత డిప్రెషన్లోకి నెట్టడం ఇష్టంలేక, కమల... వాళ్లాయన, వాళ్లమ్మ (పి.కె. తల్లి అన్నమాట) ఎన్.ఆర్.ఐ.లోకి మార్చారట. బ్రతికించారు. వార్డులోకి వెళ్లి కెవ్వుమని అరచి, దబ్బుమని పడిపోయాను. కమల, నర్సు నీళ్లుకొట్టారు. వారికి ఇది చాలా సహజ ప్రక్రియగా మారిపోయింది. అనగా... పి.కె.ను చూడటానికి వచ్చినవారంతా నాలాగే కెవ్వుకేకలు ప్లస్ దబ్బుమన్న శబ్దాలను చేశారన్నమాట. ‘ఓ మై గాడ్! మంచం మీదున్నది... మా పి.కె.నా?’ ఒక్కమాటలో చెప్పాలంటే అంగారక గ్రహవాసిలా ఉన్నాడు. కోతి మూతి, సన్నని కొబ్బరిచిప్ప లాంటి ముఖం, చిప్పమీద నిలిచిన సన్నని చెత్తలా జుత్తు... సారీ వెంట్రుకలు,... ఏంటో తల తిరుగుతున్నట్టుగా ఉంది. మళ్లీ పడబోయాను. నర్సు చెయ్యిచ్చింది. థాంక్యూ అన్నాను. వెల్కమ్... నాజూకుగా అని వెళ్లిపోయింది. ‘‘అవునే. వీడెందుకిలా తయారయ్యాడు’’ అన్నాను కమలతో. ‘‘నాకూ తెలియదన్నయ్యా. ఈ మధ్య ఎంతోమంది అమ్మాయిలను చూడటానికి వెళ్లాడట. వారంతా మూకుమ్మడిగా వీడిని తిరస్కరించారట’’ ‘‘అయితే, దానికీ దీనికీ ఏమిటి సంబంధం?’’ అన్నాను ఆశ్చర్యంగా. అంతకన్నా ఆశ్చర్యం ఏమిటంటే... వాడి చేతికున్న పదివేళ్లకు పది ఉంగరాలున్నాయి. వాడి మెడలో హనుమాన్ రక్షణ కవచం, హయగ్రీవ, మన్మథ, యమ తదితర లాకెట్లు మూర్ఛ బిళ్లల్లా ఉన్నాయి. ఇంతలో ఇద్దరు డాక్టర్స్ గబగబా వచ్చి, గంభీరంగా రిపోర్ట్స్ చూసి, వాడి ముఖాన్ని అటూ ఇటూ తిప్పి, కాళ్లెత్తి (పేషెంట్‌వి) చూసి, వేగంగా వెళ్లిపోయారు. నర్సు ఎందుకైనా మంచిదని ఏదో ఇంజక్షన్ పొడిచి వెళ్లిపోయింది. ‘‘వీడో ప్రయోగశాలన్నమాట. ఏటీయం కార్డు కూడా.’’ ఇంతలో వాడు కదలి, కళ్లతో చేతులతో ఏదో చూపించాడు. మేము అటు చూశాం. టీవీలో ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్ వస్తున్నది. వాడి కళ్లలో మెరుపు. వెంటనే మరో యాడ్. ఫలానా సాఫ్ట్ డ్రింక్ తాగితే ఉత్సాహం మీ వెంట ఉంటుందని ఫలానా హీరో తాగాడని మీరు కూడా తాగాలని. ఆ తర్వాత లో దుస్తుల యాడ్. తమ కంపెనీవే ధరించమని, అవి వేసుకొంటే ఆడవాళ్లు ఇంట్లో వంట చేస్తున్నా, పడక గదిలో ఉన్నా, ఎక్కడి పనులు అక్కడే వదిలేసి మీ వెంటబడతారని చెబుతున్నది. మరో మూడు బనియన్లవారు అలాగే చెప్పారు. ‘ఎంత నాన్సెన్స్’ అని టీవీ కట్టేశాను. కానీ పి.కె. ఊరుకోలేదు. వేయమన్నాడు. వేశాను. యాడ్స్‌ను తీక్షణంగా చూస్తున్నాడు. ఇంతలో ఇద్దరు డాక్టర్స్ వచ్చారు. ఈసారి వారి వెంట ఇద్దరు ఆడవాళ్లు వచ్చారు. ఆ నలుగురు వాడి చుట్టూ చేరి, రకరకాలుగా పరీక్షించి, నవ్వుకొంటూ ఇంగ్లిష్‌లో మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు. నాకర్థమైంది. ‘‘కమలా... ఇక్కడ మనం ఎన్నాళ్లున్నా వీడికి నయం కాదు. అయినా వీడికి కావలసింది డెర్మటాలజిస్టులు, జనరల్ సర్జన్స్ కాదు. సైకియాట్రిస్టు’’ ‘‘వాట్... వీడికి పిచ్చా’’ అంది గాబరాగా కమల. ‘‘అబ్బా కమలా! సైకియాట్రిస్టు అనగానే పిచ్చి తప్ప మరేమీ ఉండదా? అభివృద్ధి చెందిన నగరాల్లో ప్రతి వేయిమందికి ఒక సైకాలజిస్టు, సైకియాట్రిస్టు ఉంటారు తెలుసా? డిప్రషన్, ఈరోజు మనదేశంలో దీపికా పదుకొనే వంటివారు కూడా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఆమె దాని నుంచి బయటపడింది కూడా.’’ ఏభైవేలు చెల్లించి బయటపడ్డాం. ‘‘రెండు రోజులు నా అబ్జర్వేషన్లో ఉంచండి. అంత కాంప్లికేటెడ్ కాదని నా ఉద్దేశ్యం. ఏదో మానసికమైన ఆరాటమే. భయపడవలసిన పనిలేదు.’’ డా. నరేంద్ర అమెరికాలో చదువుకొని, పది సంవత్సరాలు ప్రాక్టీసు చేసి, ఇండియాలో స్థిరపడిన సైకియాట్రిస్టు. నగరంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొన్న వ్యక్తి. ద్వారకా నగర్ ప్రాంతంలో మంచి క్లినిక్ కమ్ ఇల్లు కట్టాడు. నాకు విజయవాడలో పరిచయమయ్యాడు. కమలను పి.కె.తో ఉంచి, నరేంద్రకు నా స్పాట్ విషయాన్ని చెప్పి, విజయవాడ బస్సెక్కాను. నాలుగు రోజులు గడిచాయి. నా పని కూడా ముగింపు దశకు వచ్చింది. పి.కె. ఎలాగున్నాడో అని ఆలోచిస్తుంటే కమల ఫోన్ చేసింది... డా. నరేంద్ర రమ్మన్నాడని. నేను విశాఖ వచ్చి నరేంద్రను కలిశాను. ‘సైకాలజీలో ప్రేరణ స్వభావమని ఒక అంశముంది. అది ఉత్సుకతతో ప్రారంభమవుతుంది. ఏ మనిషైనా ప్రేరణ కలిగించిన ఉత్సుకతతో తనకు కావలసిన గమ్యాన్ని చేరుకోవాలనుకుంటాడు. అనుకూలమైన గమ్యం అయితే ముందుకు సాగుతాడు. ప్రతికూలమైన గమ్యమైతే వదిలివేస్తాడు. కాని కొందరు ప్రతికూల గమ్యాన్ని కూడా వదలకుండా దానిని చేరాలనుకుంటే ప్రమాదకరమైన లేదా దుఃఖదాయకమైన పరిస్థితులు సంభవిస్తాయి. మీ వాడి కేసులో అదే జరిగింది. అతని గమ్యం లైంగిక సంతృప్తి. ప్రేమ, సాహచర్యము అనేవి అందుకు మార్గాలు. ఆ మార్గాల్లో దానిని పొందటానికి ప్రయత్నించాడు. కానీ విఫలత అతనిలో కసిని పెంచింది. తను అందంగా మారితే గమ్యం సులువవుతుందనే ఆశ అతను ఉన్మాది కాకుండా రక్షించింది. మీవాడు అదృష్టవంతుడు. శారీరకంగా కొంత తిప్పలు పడ్డాడు. మానసికంగా పూర్తిగా నష్టపోలేదు. అతడి చేష్టలు మనకు నవ్వు తెప్పించాయి కాని ఎవర్నీ బాధ పెట్టలేదు’... డాక్టర్ ద్వారా తెలిసిన పి.కె. సమస్య ఇది. పి.కె. పెళ్లి సంబంధం కోసం వెళ్లాడు. పిల్ల అతనిని చూసి నవ్వింది. నల్లగా ఉన్నావని, ముఖంపైనే చెప్పింది. ఓరోజు టీవీలో ఫేస్ క్రీములు ప్రకటన వస్తున్నాది. అవి రాసుకుంటే కేవలం వారం రోజుల్లో తెల్లగా, రాయంచలా మారిపోతారని, వాడకపోతే జీవితం నాశనమవుతుందని ఉంది. ఆనాటి నుంచి దాదాపు ఇరవై రకాల క్రీములను రోజుకు నాలుగుసార్లు రాయటం ప్రారంభించాడు. వంటికి అదేదో సెంటు రాసుకొని, ఓ పబ్‌కు వెళ్లాడు పి.కె. సెంటు వాసనకు పబ్‌లో అమ్మాయిలంతా బల్లుల్లా అతన్ని అతుక్కుపోతారని ప్రకటనలో చూశాడట. ఆ సెంటు రాసుకున్నాడు. ఆడపిల్లలు కాదు కదా, కనీసం గోడమీద బల్లి కూడా తనమీద పడకపోవటంతో చిరాకేసిందతనికి. కోపం కూడా వచ్చి, విపరీతంగా తాగి, నానా భీభత్సం చేస్తే పబ్వాళ్లు బయటకు గెంటారు... జేబులో పర్సు లాగేసుకొని! హీరో హోండా కొంటే అమ్మాయిలు పడతారని ఒక ప్రకటనలో చెబితే అది కూడా కొన్నాడు. ‘‘బాగున్నాడా... మావాడు’’ అన్నాను. ‘‘ఫర్వాలేదు నయం చేశాను. రేపు తీసుకువెళ్లండి. కొన్నాళ్లు టీవీకి దూరంగా, ఏ హిల్ స్టేషన్‌కో తీసుకువెళ్లండి. రిలాక్స్ అవుతాడు. పెళ్లి చేయండి. అవసరం కూడా. శారీరకంగా కాదు, మానసికంగా కూడా అతనికో తోడు అవసరం.’’ అన్నాడు. ‘‘వీటిని అరికట్టలేమా?’’ అన్నాను. ‘‘కష్టం. వ్యాపారస్తులకు తమ ప్రోడక్టులు అమ్ముకోవడం కావాలి. అదెలాగ అనేది అనవసరం. వ్యాపారం అంతే. విచక్షణ అనేది కొనుగోలుదారునికి ఉండాలి’’ డాక్టర్‌కు కృతజ్ఞతలు చెప్పబోతుంటే... ‘‘నేను ఈ ట్రీట్మెంట్కు పి.కె. 2015 అని పేరు పెట్టుకున్నాను. అందుకు గాను బిల్లో ట్వంటీ పర్సంట్ రాయితీ ఇస్తున్నా’’ అనే నరేంద్ర మాటలకు నేను, కమల నవ్వుకున్నాం. పి.కె.ను మెల్లగా నడిపించుకుంటూ ఆటోను చేరుకున్నాం. పి.కె.ను చూస్తుంటే మా అక్క గుర్తుకు వచ్చింది. టీవీ లేకుండా క్షణం ఉండలేదు. కుటుంబమంతా ఒక్క గదిలోనే సర్దుకుంటారు. మిగిలిన ఆరు గదులలో టీవీలో వచ్చే ప్రకటనలలోని వస్తువులు, సౌందర్య సామగ్రి, దైవాల యొక్క తాయత్తులతో నిండిపోయాయి. నేను ఆటో ఎక్కుతుండగా, ‘మామయ్యా! అమ్మ తిక్కతిక్కగా మాట్లాడుతూ పడిపోయింది. రావా’’ ఫోన్ చేసింది విమల. అది నా అక్క కూతురు. అక్కా... నీక్కూడా పి.కె. 2015 తప్పదా?... - భమిడిపాటి గౌరీశంకర్