అప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు! | Comedy Story Written By Yakub Pasha | Sakshi
Sakshi News home page

అప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు!

Published Sun, Aug 11 2019 12:13 PM | Last Updated on Sun, Aug 11 2019 12:16 PM

Comedy Story Written By Yakub Pasha - Sakshi

‘‘హాచ్‌ హాచ్‌ హాచ్‌’’ అని తుమ్ముతూనే విక్రమార్కుడిని ఏదో అడగబోతున్నాడు బేతాళుడు.
‘‘మిస్టర్‌ బేతాళా, తుమ్మి అయినా అడుగు, అడిగాక అయినా తుమ్ము’’ సలహా ఇచ్చాడు విక్రమార్కుడు.
‘‘సరే’’ అంటూ నాన్‌స్టాప్‌గా నలభై తుమ్ములు తుమ్మిన తరువాత ఇలా అడిగాడు బేతాళుడు.
‘‘రాజా,  వుప్పుడు నీకో పిట్టకథ చెబుతాను. ఆ తరువాత కొచ్చెన్‌ అడుగుతాను...ఒకేనా?’’ అడిగాడు బేతాళుడు.
‘‘ఒకే’’ అన్నాడు విక్రమార్కుడు.

‘‘వాటీజ్‌ దిస్‌!’’ కోపంగా ఫైల్‌ గిరాటు వేశాడు లండన్‌ మేయర్‌ బోరిస్‌ జాన్సన్‌ టపుకు టపుకు.
అది లండన్‌ తాజా జనాభా వివరాలను తెలియజేసే ఫైల్‌.
‘‘ఏమైంది సార్‌?’’ భయంగా అడిగాడు ఉప మేయర్‌ హారిస్‌ జర్మీ డలాఢల్‌.
‘‘డలాఢల్‌...నీకో ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? కేవలం రెండు నెలల్లోనే మన లండన్‌ జనాభా మూడుకోట్లు పెరిగింది?’’ అన్నాడు మేయర్‌.
‘‘స్వల్పకాలంలో ఇంత అనూహ్యంగా పెరగిపోవడం ఏమిటి? దీనిమీద ఎంక్వైరీ కమిటీ వేయాల్సిందే’’ పట్టుబట్టాడు  ఉపమేయర్‌.
‘‘గుడ్‌ ఐడియా...ఇప్పుడే వేస్తాను’’ అని ఎంక్వైరీ కమిటీ వేశాడు మేయర్‌.

‘‘విక్రమార్కా! లండన్‌ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అదే బంకింగ్‌హామ్‌ ప్యాలెస్, అదే టవర్‌ ఆఫ్‌ లండన్, అదే...బిగ్‌బెన్‌...ఇప్పటికిప్పుడు అనూహ్యంగా వచ్చిన మార్పులేమీ లేవు. మరి కేవలం రెండు నెలల్లో  జనాభా ఇంత అనూహ్యంగా పెరగడానికి కారణం ఏమిటి? తెలిసి కూడా జవాబు చెప్పలేక పోయావో నా జలుబు నీకు అంటిస్తాను’’ అని హెచ్చరించాడు బేతాళుడు. అప్పుడు విక్రమార్కుడు ఇవ్విధంబుగా సమాధానం చెప్పాడు...

ఇండియా నుంచి పారిపోయిన విజయ్‌మాల్యాకు లండన్‌లో బోర్‌ కొడుతోంది. మరోవైపు డబ్బులకు కూడా కటకటగా ఉంది. ఒకరోజు వాష్‌రూమ్‌లో అతనికి ఒకచక్కని ఆలోచన వస్తుంది. వెంటనే అద్దం ముందుకు వచ్చి తన భుజం తానే తట్టుకున్నాడు మాల్యా. మరుసటి రోజు లండన్‌లోని బాకర్‌ స్రీట్‌లో కొత్త స్కూలు ప్రారంభించాడు. ఆ స్కూలు పేరు: ఈజీ బారోయింగ్‌...ఈజీ ఫ్లైయింగ్‌.
అనుకున్నట్లుగానే ‘ఈఈ’ స్కూల్‌కు సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. రెండు నెలల్లోనే పన్నెండు  స్కూళ్లు స్టార్ట్‌ చేశారు. తొలిరోజు క్లాసులో మాల్యా పాఠం...
‘‘ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులకు నా నమోవాకాలు. చరిత్రలో ఇప్పటి వరకు అప్పు అపహాస్యానికి గురైంది...అవమానానికి గురైంది... అప్పు చేసిన వారిని అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు... ఈ పరిస్థితి మారాలి...అప్పుకు విలువ పెరగాలి... పూజలో కప్పురం ఎంత అవసరమో, మనిషి అభివృద్ధికి కూడా అప్పు అంతే అవసరం... కప్పురం తాను కరుగుతూ వెలుగునిచ్చినట్లే... అప్పు కూడా ఎన్నో అవమానాలు భరిస్తూ కూడా మనకు వెలుగునిస్తుంది. అందుకే అంటాను...అప్పుకప్పూరంబు నొక్కపోలిక నుండి... ఈ పోలిక భౌతికమైనది కాదు....గుణాలకు సంబంధించినది!

ఇప్పుడు చరిత్ర నుంచి కొన్ని పాఠాలు చెబుతాను:

హబ్‌సన్‌–గాబ్‌సన్‌ థియరీ ప్రకారం. అప్పు చేయడం తప్పు కాదు. దివాలా తీయడం అంతకంటే తప్పుకాదు. ఎటొచ్చి  దివాలా తీసిన భయం మీ కళ్లలో ఎప్పటికీ కనిపించకూడదు. అవసరమైతే అబద్ధాలతో ఎదుటివారిని దబాయించాలి.
ఈస్ట్‌–ఇండియా గెజిట్‌ 1816 నోట్‌ ప్రకారం... అప్పు చేయడం ఆషామాషీ విషయం కాదు. దానికి ప్రత్యేకమైన తెలివితేటలు ఉండాలి.  అట్లాంటి వాళ్లను మొనగాళ్లు అందురు. అందులో నేనొకరిని. గ్రీకు బిజినెస్‌ ఫిలాసఫీ 1915 ప్రకారం లేచిన సముద్రపు అల తప్పనిసరిగా టప్పుమని కిందికి పడాలి. అది ప్రకృతి ధర్మం. నువ్వు ఎంత పెద్ద వ్యాపారవేత్త అయినప్పటికీ... ఎప్పుడో ఒకప్పుడు దభాల్న కింద పడాల్సిందే... అదే వ్యాపారధర్మం. కాబట్టి ఫీల్‌ అవ్వాల్సింది ఏమీ లేదు.
ఇటలీ బిజినెస్‌ రూల్స్‌ 1678 ప్రకారం..దివాలా తీసిన తరువాత... హడివిడిగా  ఎక్కడికంటే అక్కడికి పారిపోకుండా... మనకు అన్నీ అనుకూలంగా ఉన్న దేశానికి పారిపోవాలి.
మాల్యా చెబుతున్న పాఠాలను గోడ చాటు నుంచి విన్నారు ఎంక్వైరీ  కమిటీ వాళ్లు.

సీన్‌ కట్‌ చేస్తే.... మేయర్‌ ఆఫీసు కార్యాలయం.
‘‘సార్‌...మన లండన్‌ జనాభా పెరగడానికి విజయ్‌ మాల్యానే కారణం’’ అని చెప్పాడు  ఎంక్వైరీ కమిటీ పెద్ద (హెడ్‌).
‘‘ఎలా?’’ కళ్లజోడు చేతుల్లోకి తీసుకుంటూ అత్యంత ఆశ్చర్యంగా అడిగాడు మేయర్‌.
‘‘అప్పులు చేయడం ఎలా? అవలీలగా పారిపోవడం ఎలా?’’ పేరుతో మొదట స్కూల్, ఆ తరువాత యూనివర్శిటీ స్టార్ట్‌ చేశాడు మాల్యా. ఈ యూనివర్శిటీలో చేరడానికి దేశాదేశాల నుంచి విద్యార్థులు వెల్లువలా వస్తున్నారు...దీంతో మన లండన్‌ జనాభా....’’ అసలు విషయం చెప్పాడు ఎంక్వేరీ కమిటీ పెబ్బ.
‘‘మిస్టర్‌ మాల్యా,  రెండురోజుల్లో తట్ట అండ్‌ బుట్ట సర్దుకొని లండన్‌ విడిచి వెళ్లకపోతే కఠిన కరాగారా శిక్ష విధించబడుతుంది’’ అని హెచ్చరించాడు మేయర్‌.
ఈ విషాదాన్ని తట్టుకోలేక ఆరోజు బార్‌కు వెళ్లాడు మాల్యా. అక్కడ అతనికో వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ మాట ఈమాట మాట్లాడుకున్న తరువాత.... ‘‘అక్కడొక విండో కనిపిస్తుంది చూశావా? అది మామూలు విండో కాదు. మ్యాజిక్‌ విండో’’ అని చెప్పాడు అతడు.

‘‘మ్యాజిక్‌ విండోనా!’’ ఆశ్చర్యపోయాడు మాల్యా.
‘‘అవును. మూమూలుగా విండోలో నుంచి దూకితే కాళ్లు విరుగుతాయి. ఈ విండో నుంచి దూకితే గాల్లో తేలిపోతాం’’ అని చెప్పాడు అతడు.
‘‘నువ్వేదో తాగివాగుతున్నట్లున్నావు’’ అతడి మాటల్ని తేలిగ్గా తీసుకున్నాడు మాల్యా.
‘‘అయితే చూడు...’’ అని ఆ వ్యక్తి విండో నుంచి దూకాడు...
గాల్లోకి దూసుకుపోయాడు!
‘చూశావా! నా మాటల్ని నమ్మలేదు కదూ’’ అన్నాడు తిరిగివచ్చి.
‘‘ఇదేదో బాగుందే. నేను సైతం దూకుతాను’’ అని దూకాడు మాల్యా. వెంటనే అతడి రెండు  కాళ్లు విరిగాయి. మాల్యా తిరిగి లేచి నడిచేంత వరకు లండన్‌లోని ఉండనివ్వాలని  కోర్టు తీర్పు ఇచ్చించి. ‘హమ్మయ్య’ అనుకున్నాడు మాల్యా.

‘‘అదిసరే, ఆడు దూకితే గాల్లో తేలిపోవడం ఏమిటి? ఈడు దూకితే కాళ్లు విరగడం ఏమిటి? ఇంతకీ ఆడు ఎవడు?’’ అడిగాడు బేతాళుడు.
‘‘సూపర్‌మేన్‌’’ చెప్పాడు విక్రమార్కుడు.
– యాకుబ్‌ పాషా


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement