‘కుక్క కాటుకు పప్పు దెబ్బ’ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
రివ్యూల్లో కొందరైతే ఇరవై స్టార్‌లు కూడా ఇచ్చారు (డబ్బులు మరీ ఎక్కువ ముట్టి ఉంటాయని కొందరంటారు).
సరే హిట్ సంగతి పక్కన పెడదాం.
ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది పుల్లారావు గురించి. ‘కుక్క కాటుకు పప్పు దెబ్బ’ కథ తనదే అంటూ తెలుగు సినిమా రచయితల సంఘానికి ఫిర్యాదు చేయడమే కాదు ప్రెస్ మీట్ కూడా పెట్టాడు పుల్లారావు.
ఆ ప్రెస్‌మీట్‌లో ఒక రిపోర్టర్ ఇలా అడిగాడు...
‘‘మీరు అక్కడెక్కడో రాజమండ్రి దగ్గర గంపలగూడెంలో ఉంటారు. డైరెక్టర్ శభాష్ శంకరేమో హైద్రాబాద్‌లో ఉంటాడు. మరి ఆయన మీ కథను ఎలా కాపీ కొట్టగలుగుతాడు?!’’
అప్పుడు పుల్లారావు ఇలా స్పందించాడు:
‘‘గుడ్‌క్వశ్చన్ అడిగారు. మా పెద్దమ్మ కుమారుడు దద్దమ్మకుమార్ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తాడు. ఓ పాలి తమ్ముడిని చూసి పోదామని బోనాల పండుగరోజు హైదరబాద్‌కు వచ్చానండీ. మా తమ్ముడిగాడితో పాటు హైదరాబాద్‌ను చూసినట్లుంటుంది, ఛాన్సు దొరికితే నా దగ్గర ఉన్న కథలను సినిమావాళ్లకు చెప్పినట్లు ఉంటుందని తట్టాబుట్టాతో దిగనండి. మా దద్దమ్మ కుమార్ రూమ్‌లో ముగ్గురు స్నేహితులు ఉంటారండీ.
ఏ మాట కా మాటే చెప్పుకోవాలి.... నాకో వీక్‌నెస్ ఉందండి.
ఎవరైనా నా కథ వింటే, వినాలనే ఆసక్తి కనబరిస్తే చేతికి ఎముక లేకుండా ఖర్చు చేస్తానండీ.
మా ఊళ్లో అయితే, కేవలం నా కథలు వినడం ద్వారా సొంత ఇళ్లు కట్టుకున్నవాళ్లు ఉన్నారు.
అప్పులు తీర్చేసుకున్నవాళ్లు ఉన్నారు.
కూతుళ్ల పెళ్లిళ్లు చేసిన వాళ్లు ఉన్నారు.
సరే, ఈ సంగతి పక్కన పెడితే రూమ్‌లో దిగిన రెండోరోజే నాలో గొప్ప రైటర్ ఉన్నాడనే విషయాన్ని దద్దమ్మగాడి ఫ్రెండ్స్ కనిపెట్టారు.
‘‘కథ వినిపించు బ్రో’’ అని అడిగేవారు.
‘‘మరి మీరు ఆఫీసుకు వెళ్లాలి కదా...సండే వినిపిస్తానులే’’ అని సర్దిచెప్పబోతే...
‘‘తొక్కలో ఆఫీసు. నీ కథ కంటే ఎక్కువా ఏమిటి? రేపు నువ్వు పే......ద్ద డైరెక్టరైపోతే...గ్రేట్ డైరెక్టర్ పుల్లరావుగారు సినిమాల్లోకి రాకముందు మాకు కథలు చెప్పేవారు తెలుసా! అని గొప్పగా చెప్పుకోవాలని మాకు మాత్రం ఉండదా ఏమిటి. బ్రో...కథ వినిపించు...’’ అని బతిమిలాడేవాళ్లు.
పాపం వాళ్లను చూస్తే ముచ్చటేసేది.
ఆఫీసు ఎగ్గొట్టి మరీ నా స్టోరీ వినడానికి ఉత్సాహం చూపిస్తున్నారంటే నేనెంత అదృష్టవంతుణ్ణో కదా అని మురిసిపోయేవాడిని.
ఈలోపు ఆ ముగ్గురిలో ఒకడు...
‘‘బ్రో...ఆకాశం మబ్బు పట్టి ఉంది. ఈ టైంలో రూమ్‌లో కూర్చుని కథ వినడం బాగోదు. అలా బార్ అండ్ రెస్టారెంట్‌లో కూర్చొని విందాం’’ అనేవాడు.
సరే అని వాళ్లను తీసుకెళ్లి లీటర్ల కొద్ది మందు పోయిస్తూ, బార్‌లో ఉన్న సమస్త నాన్‌వెజ్ ఐటమ్‌లు తినిపిస్తూ కథలు చెప్పేవాడిని. ఒకరోజు బార్‌లో ఇలాగే చెబుతుండగా...మా వెనక సీట్లో కూర్చున్న ఒకడు...జేబులో కాగితం తీసి రాసుకుంటున్నాడు. కొంపదీసి వీడు నా కథను వినలేదు కదా అనే డౌటు వచ్చింది.
ఇప్పుడు ఆ డౌటు నిజమైంది.
ఆరోజు నేను బార్‌లో చెప్పింది ‘కుక్క కాటుకు పప్పు దెబ్బ’ కథే!
నిజానికి ఆరోజు వాడి దగ్గర ఉన్న కాగితాన్ని లాక్కొని, కాలర్ పట్టుకొని ఉంటే వ్యవహారం ఇక్కడి వరకు వచ్చేది కాదు.
కళామాతల్లి సేవలో ఇప్పటి వరకు పది ఎకరాలకు పైగా అమ్ముకున్నాను. ఇక ఉన్న ఒక ఎకరం అమ్ముకునే ఓపిక లేదు. దయచేసి నాకు న్యాయం చేయండి. కాపీ కథ సంస్కృతిని వ్యతిరేకించండి’’
‘పుల్లరావు కథ కాపీ కొట్టబడింది’ అని కొందరు–
‘శభాష్ శంకర్ కథకు పుల్లారావు కథకు సంబంధమే లేదు’ అని కొందరు వాదించుకోవడం మొదలుపెట్టారు.
ఎక్కడా ఏకాభిప్రాయం కుదిరి చావడం లేదు.
ఈలోపు ‘పుల్లారావు కథను కాపీ కొట్టారా లేదా?’ అనే దానిపై బెట్టింగ్‌లు కూడా మొదలయ్యాయి.
వారం తిరిగేలోపే పుల్లరావు సమస్య రాష్ట్ర సమస్య అయింది. నెల తిరిగేలోపు జాతీయ సమస్య అయింది.
విషయం ఎక్కడి దాక వెళ్లిందంటే పుల్లరావు వ్యతిరేక–అనుకూల అంటూ ఇండియా రెండుగా చీలిపోయింది.
శాంతిభద్రతల సమస్య తుపానులా ముంచుకొచ్చింది.
హాలీవుడ్‌లో లేటెస్ట్‌గా ‘కాపీకాస్మిక’ అనే మెషిన్ వచ్చింది. ఈ మెషిన్ వల్ల అక్కడ ఎన్నో జటిల సమస్యలు క్షణాల్లో పరిష్కారమయ్యాయి. అవుతున్నాయి.
ఈ మెషిన్ ప్రత్యేకత ఏమిటంటే...
రెండు పార్ట్‌లు ఉంటాయి. కుడివైపు ఉన్న పార్ట్‌లో ఆరోపణ చేస్తున్న వారి కథ, ఎడమవైపు ఉన్న పార్ట్‌లో ఆరోపణ ఎదుర్కొంటున్న వారి కథను పెడతారు.
అంతే...పది నిమిషాల్లో రిజల్ట్ తెలిసిపోతుంది.
50 శాతం కాపీ కొట్టారా? 70 శాతం కాపీ కొట్టారా? 100 శాతం కాపీ కొట్టారా ?అనేది స్క్రిన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
‘కాపీకాస్మిక’ గురించి గవర్నమెంటుకు తెలిసి ఆఘమేఘాల మీద ఆ మెషిన్‌ను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది.
మొట్టమొదట పుల్లారావు కేసును తీసుకున్నారు.
‘గెలుపు ఎవరిది?’
‘పుల్లారావు గెలుస్తాడా?’....ఇలా రకరకాల హెడ్డింగ్‌లతో ప్రత్యక్షప్రసారాన్ని ప్రారంభిచాయి ఛానళ్లు.
మెషిన్ కుడి వైపు ఉన్న పార్ట్‌లో...పుల్లారావు కథ పెట్టారు.
మెషిన్ ఎడమ వైపు పార్ట్‌లో.... శభాష్ శంకర్ కథ పెట్టారు....ఆ తరువాత స్విచ్ నొక్కారు.
దేశమంతా నరాలు తెగేంత ఉత్కంఠ!
పదినిమిషాల్లో ఆ ‘కాపీకాస్మిక’ మెషిన్ ముక్కలు చెక్కలయింది...వేడి వేడి పొగలు...రక్తం పారుతోంది!!!!!
‘‘ఇలా అయిందేమిటి!’’ అంటూ హాలివుడ్ సాంకేతిక నిపుణులను పిలిపించారు.
వారు ఇండియాకు వచ్చి మెషిన్‌ను పరిశీలించి...
‘‘ఈ కథలను యంత్రమే తట్టుకోలేకపోయింది. మరి మనుషులు ఎలా తట్టుకుంటున్నారు?’’ అని పెద్దగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు!
దీని గురించి మీకేమైనా తెలుసా?
– యాకుబ్ పాషా
Comments
Please login to add a commentAdd a comment