అతడి పేరు విని ‘భయం’ గజగజా వణికిపోతుంది. అతడి మాట విని ‘భయం’ కుప్పకూలిపోతుంది.
అతడిని చూసి ‘భయం’ వెనక్కి చూడకుండా పారిపోతుంది.
అతడే ఢిస్కవరీ ఛానల్ ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ ఫేం బేర్ గ్రిల్స్.
మన దేశంలోని ‘సాహసి అభిమాన సంఘం’ అనే సంస్థ ‘బేర్’కు సన్మానం చేయాలని నిర్ణయించి ఆయనకు ఆహ్వానం పలికింది. సంతోషంగా ఒప్పుకొని ఇండియాకు బయలుదేరాడు బేర్. సన్మాన సభ హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేయడం జరిగింది.
‘‘నాకేమీ ప్రత్యేక ఏర్పాట్లు చేయనక్కర్లేదు. ఒక సామాన్యుడిలాగే వస్తాను...ఐ లవ్ సింప్లిసిటీ...నో పబ్లిసిటీ’’ అన్నాడు బేర్.
‘‘అలాగే దొర’’ అన్నారు అభిమాన సంఘం వాళ్లు.
ఇండియాకు వచ్చేముందు ‘30రోజుల్లో తెలుగు’ పుస్తకాన్ని క్షుణ్ణంగా బట్టీ పట్టడంతో బేర్‌కు తెలుగు పూర్తిగా వచ్చేసింది.
ఆరోజు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ట్రైన్ దిగి ఆల్ఫా హోటల్ దగ్గర చాయ్ తాగి ఆటోస్టాండ్ ముందు నిల్చున్నాడు బేర్. ఇంతలో ఒకడు వచ్చి బేర్‌ను ఒక్కసారిగా ఆటోలో ఎత్తిపడేసి ఆటో స్టార్ట్ చేశాడు.
‘‘ఓరీ నీ దుంపతెగ...ఎక్కడికి? అని అడక్కుండా ఆటో స్టార్ట్ చేశావేమయ్యా?’’ అని నోరెళ్లబెట్టాడు బేర్.
‘‘ఎక్కడికి వెళ్లాలి? అని నేను అడిగినా, ఇక్కడికి తీసుకెళ్లాలి అని నువ్వు అడిగినా...ఆటో పోవాల్సిన చోటుకే పోతుంది. జీవితం కూడా అంతే... నేను ఇది కావాలి అని మనిషి తలిస్తే... కాదు నువ్వు అది కావాలి అని విధి తలుస్తుంది. విమానం నడపాలని నేను డిసైడ్ చేసుకున్నాను... కాదు నువ్వు ఆటో నడపాలని విధి డిసైడ్ చేసింది... కొన్ని విషయాలు అంతే’’ అన్నాడు జర్దాపాన్ నములుతున్న డ్రైవరు వేదాంతధోరణిలో.
‘‘నీ వేదాంతం తీరిగ్గా వింటానుగానీ ఆటోను రవీంద్రభారతీకి తీసుకెళ్లు’’ అన్నాడు బేర్.
‘‘అలాగే సార్’’ అన్నాడు వినయంగా ఆటోవాలా.
మూసాపేట, కూకట్‌పల్లి. పటాన్‌చెరువు.... మళ్లీ సికింద్రాబాద్... అక్కడి నుంచి రామ్‌నగర్ గుండు అక్కడి నుంచి లకిడికాపూల్.... అక్కడి నుంచి రవీంద్రభారతికి తీసుకువెళ్లాడు ఆటోవాలా.
అక్కడ ఒక్కరు కూడా లేరు!
ఎందుకుంటారండీ... అప్పుడు సమయం సరిగ్గా రాత్రి ఒంటిగంట!
‘‘అదేమిటయ్యా, సికింద్రాబాద్ నుంచి రవీంద్రభారతికి అరగంటలో రావచ్చు అని చెప్పారు ఆర్గనైజర్లు. నువ్వు ఇంచుమించు హైదరాబాద్ అంతా తిప్పావు...’’ అని ఆశ్చర్యపోయాడు బేర్.
‘‘అదేంటి సార్ అలా అంటారు...హైదరాబాద్‌కు మీరు కొత్తా? నేను కొత్తా?’’ అని ఆవేశంగా అడిగాడు ఆటోడ్రైవర్.
‘‘నేనే’’ అన్నాడు బేర్.
‘‘మరి ఎలా వెళ్లాలో మీరెలా డిసైడ్ చేస్తారు? ఏ రూట్లో వెళ్లాలో మీరు చెప్పాలా నాకు. ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ...’’ అంటూ ఆ విధంగా ముందుకు పోయాడు ఆటోవాలా.
‘‘ఓ మైగాడ్’’ అంటూ ఆటోవాలా అడిగినంత డబ్బు ఇచ్చి... ఆ రాత్రి రవీంద్రభారతి పక్క సందులో కాస్త ఖాళీ జాగా ఉన్న చోట పడుకుందామని డిసైడయ్యాడు మిస్టర్ బేర్.
బా...గా అలిసిపోయాడేమో పడుకోగానే నిద్ర వచ్చేసింది. కేవలం అయిదు నిమిషాల్లోనే ఆ నిద్రను డిస్టర్బ్ చేస్తూ ఏవో మాటలు వినిపిస్తున్నాయి. నిద్ర పోతునట్లు నటిస్తూనే ఒక చెవి అటు వేశాడు బేర్...
‘మలేరియా దోమల సంఘం వర్ధిల్లాలి’
‘డెంగ్యూ దోమల సంఘం వర్ధిల్లాలి’
‘‘అరుపులు ఆపండయ్యా...ఏమిటి మీ సమస్య? మలేరియా దోమల ప్రెసిడెంట్‌గారూ మీరు చెప్పండి’’
‘‘అయ్యా...ముందొచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు గ్రేట్ అన్నట్లుగా ఉంది నేటి పరిస్థితి. డెంగ్యూ దోమలు ఎప్పుడొచ్చాయండి? నిన్నాగాక మొన్న వచ్చాయి. మేము అనాది కాలం నుంచి ఉన్నాం. అలాంటిది మమ్మల్ని కాదని డెంగ్యూ దోమలు ఆధిపత్యం చలాయిస్తున్నాయి. ప్రజలు డెంగ్యూ దోమలు అంటే భయపడి చస్తున్నారు. మేమంటే లైట్‌గా తీసుకుంటున్నారు.
ఈ వివక్ష నశించాలి.
రక్తంలో మా వాటా మాకు దక్కాలి.
మలేరియ దోమల ఐక్యతా వర్ధిల్లాలి.... వర్ధిల్లాలి’’
‘‘డెంగ్యూ దోమల ప్రెసిడెంట్‌గారూ ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి’’
‘‘అయ్యా, మేము ఎవరి రక్తం దోచలేదు... మా రక్తం ఏదో మేము సంపాదించుకుంటున్నాం. ఈ మలేరియా దోమలు రకరకాల ‘దోమల కిల్లర్స్’కు భయపడి మురుగు కాలువలు దాటి బయటికి రావడం లేదు. మేము అలా కాదు... నిరంతరం ప్రజలలో ఉంటున్నాం.... ఎన్ని సమస్యలు ఎదురైనా వారి రక్తం పీలుస్తున్నాం. అంతేగానీ మేము ఊరకే ఎవరి రక్తం దోచుకోవడం లేదు.
మలేరియా దోమల్లారా ఇప్పటికైనా మేల్కొనండి... సోమరితనాన్ని వీడండి... కష్టపడండీ’’
సరిగ్గా కొద్దిసేపటి తరువాత...
‘‘అయ్యా... అయ్యా....’’
‘‘ఏమైంది అలా పరుగెట్టుకుంటూ వస్తున్నావు?’’
‘‘ఘోరం జరిగిందయ్యా... రండయ్యా వెళదాం...’’
‘‘ఏమైందిరా?’’
‘‘ఇంతకుముందు డెంగ్యూ ప్రెసిడెంట్ స్పీచ్ విని మన మలేరిగాడు బాగా ఫీలై పోయాడండి. అది తట్టుకోలేక, అవమాన భారంతో గదిలోకి దూరి ఆల్ ఔట్ ఆన్ చేశాడండీ...’’
సరిగ్గా కొద్దిసేపటి తరువాత...
‘‘సమయానికి వచ్చాం కాబట్టి నిన్ను రక్షించగలిగాం... ఇంత బుద్ధి లేని పని చేస్తావను కోలేదు’’
‘‘ఏం చేయమంటారయ్యా... రెండు వారాల నుంచి రక్తం లేక ఆకలితో అలమటిస్తున్నాను. దీని కంటే చావే నయం అనుకున్నాను...’’
‘‘అయ్యో... చూడండి వీడి డొక్క ఎలా ఎండిపోయిందో... ముందు వీడికి ఆహారం పెట్టాలి... అదిగో అక్కడెవడో నిద్రపోతున్నాడు... పదండీ....’’
ఈ మాటలు విని జడుసుకున్నాడు బేర్. తొలిసారిగా ‘భయం’ అంటే ఏమిటో తెలిసి వచ్చింది. ఇక అంతే...అక్కడి నుంచి వెనక్కి చూడకుండా పరుగులు తీశాడు భయమంటే ఎరుగని గ్రిల్స్ బేర్!
– యాకుబ్ పాషా
Comments
Please login to add a commentAdd a comment