నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ చాలా కోపంగా ఉన్నాడు. ఆ కోపంలో చుట్టెనక చుట్ట కట్టి... పదహారు చుట్టలు కట్టి కాలుస్తున్నాడు.
‘‘అలా ఉన్నారేంది?’’ అని అడిగాడు అసిస్టెంట్ డీమ్ డాంగ్.
‘‘ఈ దినపత్రిక చూశావా!’’ అని న్యూస్‌పేపర్‌ను డీమ్ డాంగ్ ముఖం మీద కొట్టాడు ప్రెసిడెంట్ కిమ్ జోంగ్.
‘త్వరలో 5జీ టెక్నాలజీ... దూసుకుపోతున్న చైనా, దక్షిణ కొరియా’ అని గట్టిగా చదివాడు డీమ్ డాంగ్.
‘‘మన శత్రుదేశం పేరు ప్రపంచంలో ప్రతి పౌరుని నాలుక మీద వినిపిస్తోంది. దీనికి కారణం 5జీ. మన శత్రుదేశం పేరు గొప్పగా వినిపించడం నాకు సుతరామూ నచ్చడం లేదు’’ అని చుట్ట వెలిగించాడు కిమ్ జోంగ్.
‘‘మరైతే ఏటి సేయమంటారు?’’ వినయంగా అడిగాడు అసిస్టెంట్ డీమ్ డాంగ్.
‘‘సౌత్ కొరియాను తలదన్నే టెక్నాలజీని మనం కనిపెట్టాలి. ఐ వాంట్ 10జీ టెక్నాలజీ... వెంటనే మన సైంటిస్టులకు కబురు పెట్టు’’ అన్నాడు కిమ్ జోంగ్.
‘‘ఇంకెక్కడి సైంటిస్టులండీ బాబు... మీ దెబ్బకు అందరూ కర్రెగడ్డ పిచ్చాసుపత్రిలో ఉన్నారు’’ విషయం చెప్పాడు డీమ్ డాంగ్.
‘‘కర్రెగడ్డ పిచ్చాసుపత్రిలో ఉన్నారా, ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో ఉన్నారా అనేది నాకు అనవసరం. నాకు 10జీ టెక్నాలజీ కావాలి... వాళ్లను పిచ్చాసుపత్రి నుంచి ప్రయోగశాలలకు తీసుకెళ్లండి. క్విక్... ఐ వాంట్ 10జీ టెక్నాలజీ’’ అరిచినంత పనిచేశాడు కిమ్ జోంగ్.
‘‘అయ్యా...నాదో చిన్న విన్నపం’’ అని గొణిగాడు అసిస్టెంట్ డీమ్ డాంగ్.
‘‘ధైర్యంగా చెప్పు’’ అడిగాడు కిమ్ జోంగ్.
‘‘5జీ టెక్నాలజీతో రకరకాల ఆరోగ్యసమస్యలు, పరావ్యరణ సమస్యలు వస్తాయని ఇప్పటికే ప్రపంచం భయపడుతోంది. 10జీ టెక్నాలజీ వస్తే ఇంకేమైనా ఉందా?’’ అని భయంగా అడిగాడు డీమ్ డాంగ్.
‘‘ప్రపంచానికి ఏమవుతుందోనని భయపడితే నేను కిమ్ జోంగ్‌ని ఎందుకు అవుతాను! సో... కాబట్టి... ఈ భూగోళానికి ఏమైనా సరే... నా కోరిక నెరవేరాలి... ఐ వాంట్ 10జీ టెక్నాలజీ’’ దృఢంగా అన్నాడు కిమ్ జోంగ్.
‘‘అలాగేనయ్యా... తమరి ఆజ్ఞ’’ అంటూ అక్కడి నుంచి వెళ్లాడు డీమ్ డాంగ్.
∙∙
కర్రెగడ్డ పిచ్చాసుపత్రిలో ఉన్న సైంటిస్టులందరినీ ఏసీ ప్రయోగశాలలకు తీసుకువచ్చారు. వారికి సకల సౌకర్యాలూ సమకూర్చారు. ఎవరో ఒక సైంటిస్ట్ ‘‘నాకు బావర్చీ బిర్యానీ కావాలి’’ అని అడిగితే స్పెషల్ ఫ్లయిట్ వేయించి హైదరాబాద్ బేగంపేట నుంచి తెప్పించి మరీ ఇచ్చారు.
‘‘ఏపీ ఏజెన్సీ ఏరియాలో ఇప్పసార బాగుంటుందట. అది తాగాలని ఉంది’’ అని ఒక సీనియర్ సైంటిస్ట్ కోరితే...ఏజెన్సీ నుంచి ఇప్పపువ్వును తెప్పించి ప్రత్యేక నిపుణులతో ఇప్పసారా తయారు చేయించి బాటిళ్లకు బాటిళ్లు ఇచ్చారు.
ఒక సైంటిస్ట్...
‘‘నాకు బొంగులో చికెన్’’ కావాలని అడిగితే అలాగే చేశారు.
ఇలా ఏది అడిగినా కాదనకుండా సమకూర్చారు.
ప్రయోగశాలల్లో ప్రయోగాలు నిరాటంకంగా జరుగుతూనే ఉన్నాయి...
∙∙
సరిగ్గా నెలరోజుల తరువాత...
‘యురేఖా...’ అని అరిచాడు అతి సీనియర్ సైంటిస్ట్.
ఈ సౌండ్ కోసమే ఎదురుచూస్తున్న కిమ్ జోంగ్ ఆ రోజుల్లో గంగూలీలా షర్ట్ విప్పి ‘గున్నా గున్నా మామిడి’ అని తీన్‌మార్ డ్యాన్స్ చేశాడు. చిన్నసైజు భూకంపం వచ్చిందిగాని ప్రాణనష్టం జరగలేదు.
‘‘సార్... ఎట్టకేలకు 10జీ టెక్నాలజీని కనిపెట్టాను...’’ ఆనందంగా అరిచాడు సీనియర్ సైంటిస్ట్ డుంగ్ జాంగ్.
‘‘మిత్రమా... 5జీ టెక్నాలజీ కంటే మన 10జీ టెక్నాలజీ ఏ రకంగా భిన్నం? దీని స్పెషాలిటీ ఏమిటి?’’ ఆసక్తిగా అడిగాడు ప్రెసిడెంట్ కిమ్ జోంగ్.
‘‘10జీ టెక్నాలజీ వచ్చాక... సెల్‌ఫోన్‌లు అంటూ ప్రత్యేకంగా ఉండవు. మన చెవులే సెల్‌ఫోన్‌లు. ఎవరైనా మనకు ఫోన్ చేస్తే... చెవిలో డుర్ర్‌ర్ర్‌ర్ర్... అని సౌండ్ వస్తుంది. ఏంచక్కా మాట్లాడవచ్చు. ఇక మన కనురెప్పలే స్క్రీన్‌లు. కళ్లు మూసుకోని ఏంచక్కా ఎన్నో సినిమాలు చూడవచ్చు. 10జీ టెక్నాలజీతో లంచ్‌టైమ్‌లో మనం భోజనానికి వెళ్లనవసరం లేదు... భోజనమే మన దగ్గరకు వచ్చి... నోట్లో దూరిపోతుంది... టైం వేస్ట్ అనేదే ఉండదు...’’ ఇలా చాంతాడంత లిస్ట్ చదువుతూనే ఉన్నాడు 10జీ టెక్నాలజీ కనిపెట్టిన సైంటిస్ట్.
‘‘శబ్భాష్’’ అని మెచ్చుకోలుగా ఆ సైంటిస్ట్ భుజం తట్టాడు కిమ్ జోంగ్.
అది తట్టినట్లు లేదు... కొట్టినట్లు ఉంది... సైంటిస్ట్ భుజం వాచింది.
ఆ నొప్పి నుంచి తేరుకుంటూ...
‘‘ఈ 10జీ టెక్నాలజీని పరీక్షించడానికి ధైర్యం ఉన్న మొనగాడు కావాలి’’ అని అడిగాడు సైంటిస్ట్.
‘‘చెట్టంత మొనగాడిని నేను ఉండగా... ఇంకా ఎవడో ఎందుకు? వాడుకో... నన్ను పూర్తిగా వాడుకో’’ అన్నాడు చిద్విలాసంగా కిమ్.
‘‘అయితే తమరు ఇలా వచ్చి కూర్చోండి’’ అని కిమ్‌ను కుర్చీలో కూర్చోపెట్టి రకరకాల వైర్లు బిగించాడు సైంటిస్ట్.
కొద్దిసేటి తరువాత....
‘ఢాం’ అనే శబ్దం వినిపించింది.
‘సచ్చాన్రో’ అని ప్రాణభయంతో అరిచాడు కిమ్ జోంగ్.
‘‘సారీ...మీరు చావలేదు’’ అన్నాడు సైంటిస్ట్.
‘‘మరి ఏమైంది?’’ ఆడిగాడు కిమ్.
‘‘ప్రయోగం విఫలం కావడం వల్ల... తలలో ఉండాల్సిన మీ మెదడు మోకాళ్లలోకి వచ్చేసింది’’ విషయం చెప్పాడు సైంటిస్ట్.
‘‘మరిప్పుడు నేను మామూలుగానే మాట్లాడుతున్నాను కదా’’ ఆశ్చర్యంగా అన్నాడు కిమ్.
‘‘ఇంకో అయిదు నిమిషాల్లో జజ్జనకరి జనారే...మొదలవుతుంది’’ తాపీగా చెప్పాడు సైంటిస్ట్.
‘‘అంటే?’’ ఆందోళనగా అడిగాడు కిమ్ జోంగ్.
‘‘ఇప్పుడు మీకు మీ మాతృభాష మాత్రమే కాదు... ప్రపంచంలోని ఎన్నో ప్రాంతీయ భాషలు వస్తాయి. విశేషం ఏమిటంటే ఆయా భాషల్లో ఏంచక్కా పాటలు కూడా పాడుతారు’’ అని సైంటిస్ట్ అన్నాడో లేదో...కిమ్ జోంగ్ సుబ్బరంగా తెలుగు మాట్లాడేస్తున్నాడు. మాట్లాడడం ఏమిటి ఖర్మ!
ఇలా పాటలు కూడా పాడుతున్నాడు....
‘నేను పుట్టాను లోకం నవ్వింది
నేను నవ్వాను లోకం ఏడ్చింది
నేను పుట్టాను లోకం తాగింది
నేను తాగాను లోకం ఊగింది
నాకింకా లోకంతో పని ఏముంది...డోన్ట్ కేర్!’
– యాకుబ్ పాషా
10జి టెక్నాలజీ!!
Published Sun, Jun 30 2019 8:35 AM | Last Updated on Sun, Jun 30 2019 8:35 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment