laughing gas
-
లాఫింగ్ గ్యాస్ ఇంత డేంజరా..! దీన్ని డ్రగ్‌లా..!
లాఫింగ్ గ్యాస్ గురించి వినే ఉంటారు. సై మూవీలో హీరో నితిన్ జెనీలియాని ఆటపట్టిస్తుండటంతో కోపంతో అతడిపైకి వస్తుంది. దీంతో నితిన్ ఈ గ్యాస్‌ని వదలడం జరుగుతుంది. దీంతో ఆమె తెగ నవ్వుతూనే ఉంటుంది. ఇదేంటీ కోపం రావడం లేదేంటీ నాకు నవ్వు వస్తోందంటూ కింద పడిపోతుంది. దీన్ని పీలిస్తే నవ్వు వస్తుందా? అంటే.. రాదుగాని ఉల్లాసభరితంగా అనిపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే మాదకద్రవ్యాల మాదిరి మత్తుని కలిగిస్తుంది. అలాంటి ఈ లాఫింగ్ గ్యాస్‌ని డబ్బాల కొద్ది పీల్చింది ఓ విద్యార్థి. దీంతో ఆమె.. ఈ దిగ్బ్రాంతికర ఘటన యూకేలో చోటు చేసుకుంది. 24 ఏళ్ల ఎల్లెన్ మెర్సస్ గతేడాది ఫిబ్రవరి 9న తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో అంబులెన్స్ సాయంతో ఆస్పత్రికి హుటాహుటినా తీసుకువెళ్లారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు ఆమె చనిపోవడానకి గల కారణాలను దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైద్యులు ఆమె నైట్రస్ ఆక్సైడ్(లాఫింగ్ గ్యాస) పీల్చడం వల్లే చనిపోయిందన్నారు. దీంతో ఆమె ఆస్పత్రికి వచ్చేటప్పుడూ.. పరిస్థితి ఎలా ఉందనే దిశగా విచారణ చేయగా..అబులెన్స్‌లో ఉన్న మెడికల్ టెక్నీషియన్ మైకేలా కిర్ట్లీ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తాను ఎమర్జెన్సీ అని పిలుపు రావడంతో మెర్సర్ ఇంటికి వెళ్లామని అక్కడ ఆమె బెడ్ రూంలో స్ప్రుహలోనే ఉందని, కాకపోతే గుండె స్పందనలు అసాధారణంగా ఉన్నాయన్నారు. ఆమె బాయ్‌ఫ్రెండ్ కాల్ చేయడంతో తాము వచ్చామని చెప్పారు. ఆమె నైట్రస్ఆ క్సైడ్ పీల్చుతోందని ఆ బాటిల్స్ తనకు చూపించడాని అన్నారు. ఈ తాగే క్రమంలోనే నైట్రస్ ఆక్సైడ్ ఆమె కాళ్లపై పడటంతో గాయలయ్యాయని, దీంతో రెండు వారాల నుంచి బాత్రూంకి వెళ్లడానికి ఇబ్బందిపడి మానేసిందని చెప్పుకొచ్చినట్లు తెలిపారు. ఇక విచారణలో మెర్సర్ బాయ్‌ఫ్రెండ్ ఆమె 600 గ్రాములు ఉండే నెట్రస్ ఆక్సైడ్‌ని రోజుకి మూడు బాటిల్స్ చొప్పున తాగేదని, ఇటీవల తగ్గించడం ప్రారంభించిందని చెప్పుకొచ్చాడు. నిజానికి ఇలా నైట్రస్గ్యాస్ని వినియోగించడం చట్ట విరుద్ధం. కానీ పోలీసు ఆ వేలో కేసు నమోదు చేయపోవడం గమనార్హం. ఈ ఘటన అనంతరం యూకే ప్రభుత్వం నవంబర్ 2023లో దీని వినియోగాన్ని పూర్తిగా నిషేధించడమే గాక క్లాస్ సీ డ్రగ్‌గా వర్గీకరించింది. దీన్ని మత్తురాయళ్లు మంచి కిక్ ఇచ్చే డ్రగ్ మాదిరిగా వాడి ప్రాణాలపైకి తెచ్చకుంటున్నారని పేర్కొంది. నిజానికి ఇది అంత ప్రమాదకరమైంది కాదు. వైద్యపరమైన విధానంలో నొప్పి తగ్గించేందుకు, దంత శస్త్ర చికిత్సలోనూ మత్తు ఇవ్వడం కోసం వాడటం జరుగుతుంది. దీన్ని అదే పనిగా పీల్చడం మొదలు పెడితే మాత్రం నాడి సంబంధ సమస్యలు ఉత్ఫన్నమయ్యి ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. (చదవండి: మగవారికి మెనోపాజ్ వస్తుందా?..వైద్యులు ఏమంటున్నారంటే..!) -
ఇస్మార్ట్ బఫెట్
వారెన్ బఫెట్ ఎవరు? అపర సంపన్నుడు. స్టాక్ ఎక్సేంజి శ్వాసను ఈజీగా పసిగట్టి విజయపథంలో దూసుకుపోతున్న అపరకుబేరుడు. అప్పు చేసైనా సరే, పప్పు కొనకుండా ‘స్మార్ట్‌ఫోన్’ కొనే జమానా ఇది. స్మార్ట్‌ఫోన్ కొనడానికి బఫెట్ అప్పు చేయాల్సిన అవసరం లేదు... స్మార్ట్ఫోనేం ఖర్మ ఏకంగా ‘సార్ట్‌ఫోన్ కంపెనీ’నే కొనగల సంపన్నుడు ఎన్నో సంవత్సరాల నుంచి సాదాసీదా ఫోన్‌నే వాడుతున్నాడు. తన సింపుల్ ఫోన్, పరమ పాత ఫోన్ ప్రస్తావన వచ్చినప్పుడు– ‘‘అలెగ్జండర్ గ్రహంబెల్ దీన్ని కానుకగా ఇచ్చాడు’’ అని చమత్కరిస్తుంటాడు. మరి అలాంటి స్మార్మ్‌ఫోన్ వ్యతిరేకి ఉన్నట్టుండి నెట్వర్క్ ఫిరాయించి, పాత సింపుల్ ఫోన్‌ను పక్కన పెట్టేసి ‘స్మార్ట్‌ఫోన్’ కొనేశాడు. వార్తల్లో వ్యక్తిగా కూడా నిలిచాడు. ‘వారెన్ బఫెట్‌కు ఉన్నట్టుండి స్మార్ట్‌ఫోన్ మీద ఎందుకు మనసు మళ్లింది?’ ఇదే విషయాన్ని భేతాళుడు విక్రమార్కుడిని అడిగాడు. అప్పుడు విక్రమార్కుడు ఈవిధంబుగా ఆన్సర్ చెప్పాడు... ∙∙ స్వర్గంలో ‘అరు’ అనే అప్సరస ఉండేది. ఆమెకు ఒకరోజు స్వర్గం మీద బోర్ కొట్టింది. గాలిలో మార్పు కోసం అలా భూలోకం వెళ్లాలనిపించింది. ‘జై భూలోక’ అని అరిచింది. అంతే...ధగధగ మెరుస్తూ పుష్పకవిమానం ప్రత్యక్షమైంది. ‘‘అమ్మా ఆర్డర్ ఇవ్వండి... ఏడు లోకాల్లో ఏలోకం వెళదాం’’ అని వినయంగా అడిగాడు డ్రైవరుడు. ‘‘భూలోకం తీసుకెళ్లు డ్రైవరా...’’ అని ఆజ్ఞాపించింది అరు. ‘‘అట్టాగే నమ్మా’’ అంటూ ఇంజన్ స్టార్ట్ చేశాడు డ్రైవరుడు. పట్టుమని పదినిమిషాలు కాకుండానే పుష్పక విమానం భూలోకం చేరింది. ∙∙ ‘‘డ్రైవరోత్తమా... ఇది ఏ ప్రాంతం?’’ అని అడిగింది అరు. ‘‘దీనిని యు.ఎస్ దేశం అందురు తల్లీ... యు.ఎస్‌లో ఇది ఒమాహ అను సిటీలోని వోల్డ్ మార్కెట్ ఏరియా’’ అని చెప్పాడు డ్రైవరుడు. ఆ వోల్డ్ మార్కెట్ ఏరియాలో ఒక వ్యక్తి సమాజసేవ చేస్తూ కనిపించాడు. ‘‘డ్రైవరోత్తమా ఎవరా వ్యక్తి?’’ అని అడిగింది అరు. ‘‘అతని పేరు వారెన్ బఫెట్. మహా సంపన్నుడు. బిజినెస్మెన్, ఇన్వెస్టర్, దానాలు బాగా చేస్తుంటాడు. మన కుబేరుల వారి దగ్గర కంటే ఈతని దగ్గరే ఎక్కువగా ధనం ఉందట. అప్పుడప్పుడూ ఇలా సమాజసేవ చేస్తుంటాడు’’ బఫెట్‌ను చూడగానే ‘అరు’ లవ్‌లో పడిపోయింది. ∙∙ స్వర్గలోకానికి తిరిగివచ్చిన తరువాత ‘నువ్వేం మాయచేశావోగానీ...’ పాట ఆమెకు పదేపదే గుర్తుకువస్తోంది. ఎలాగైనా సరే బఫెట్‌ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంది. డైరెక్ట్‌గా బఫెట్ దగ్గరకు వెళ్లి ‘‘నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా’’ అంటే అతడికి కోపం రావచ్చు....‘‘ఈ వయసులో నాకు పెళ్లి ఏమిటి!’’ అని తిట్టవచ్చు. అందుకని– దేవుడి కోసం తపస్సు చేసింది. రెండు రోజుల తరువాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ‘‘ఏమి కావాలో కోరుకో’’ అని అడిగాడు దేవుడు. అప్పుడు... ‘‘వారు...అనగా వారెన్ బఫెట్ నన్ను తదేకంగా చూస్తూ ఉండాలి’’ ఓకే! ‘‘నా కళ్లలో కళ్లు పెట్టి చూస్తుండాలి’’ ఓకే! ‘‘నేను తప్ప ఆయనకు మరో లోకం ఉండకూడదు’’ ‘‘ఓకే’’ ‘‘ఆయన నిద్ర నించి లేవగానే నా ముఖమే చూడాలి’’ ‘‘ఓకే’’ ‘‘నా గొంతు వినబడగానే ఎలర్ట్ కావాలి’’ ‘‘ఓకే’’ ‘‘నేను పిలవకపోయినా పిలిచినట్లుగా భ్రమించాలి’’ ‘‘ఓకే’’ ‘‘నేను లేకుండా పక్క దేశానికి కాదు కదా....పక్కింటికి కూడా వెళ్లకూడదు’’ ‘‘ నువ్వు కోరినవన్నీ ఫలిస్తాయి తల్లీ’’ అని మాయమయ్యాడు దేవుడు. వెంటనే అప్సరస అరు ‘స్మార్ట్‌ఫోన్’గా మారింది. వారెన్ బఫెట్ దగ్గరికి చేరింది. శుభం – యాకుబ్ పాషా -
నవ్వించే గ్యాస్ చాంపియన్ల ప్రాణాలు తీసింది
నవ్వు తెప్పించే లాఫింగ్గ్యాస్ ఓ జంట ప్రాణాలు తీసింది. ఉక్రెయిన్‌కు చెందిన స్పీడ్ చెస్ చాంపియన్ స్టానిస్లావ్ బోగ్డానోవిచ్ (27), అతని స్నేహితురాలు అలెగ్జాండ్రా వెర్నిగోరా (18) మరణించారు. వీరు మాస్కోలోని తమ ఫ్లాట్‌లో విగత జీవులుగా కనిపించారు. ప్లాట్‌లో ఉన్న లాఫింగ్ గ్యాస్ బెలూన్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంతకీ ఎందుకు వారు లాఫింగ్ గ్యాస్ తెచ్చుకున్నారనేది మిస్టరీగా మారింది. ఇద్దరూ కూడా స్పీడ్ చెస్ ఛాంపియన్లు. ఇటీవల ఒక ఇంటర్నెట్ చెస్ పోటీలో రష్యా తరఫున బరిలోకి దిగారు. ఉక్రెయిన్‌పై తలపడి, గెలుపొందారు. అయితే తాజాగా వారిద్దరూ వారం రోజుల నుంచి కనపించకుండా పోయారు. అనంతరం వీరి ఫ్లాట్‌లో శవాలై కనిపించారు. వీరి ఇంట్లో లాఫింగ్ గ్యాస్ బెలూన్లు ఉన్నాయి. బెలూన్ సాయంతో ఈ గ్యాస్‌ను పీలుస్తుంటారని తెలుస్తోంది. ఇది శస్త్రచికిత్సల సమయంలో మత్తు కోసం ఉపయోగిస్తుంటారు. దీన్ని సాధారణంగా పీల్చితే విపరీతమైన నవ్వు తెప్పిస్తుంది. అదే సరదా కోసం సొంతంగా పీల్చితే మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ జంట కూడా నవ్వాలనే ఉద్దేశ్యంతోనే దాన్ని పీల్చి ప్రమాదవశాత్తు ప్రాణాలు వదిలి ఉంటారని అనుమానిస్తున్నారు. చదవండి: దుర్మార్గులు దొరికారు -
ట్రంప్‌కు అమెరికా వంటలు నచ్చట్లేదిప్పుడు!
ట్రంప్ ఇండియా నుంచి వచ్చినప్పటి నుంచి అమెరికన్ వంటలు ఎంతమాత్రం నచ్చడం లేదు. పదే పదే ఇండియన్ వంటకాలే గుర్తుకొస్తున్నాయి. ఒక ఫైలు మీద అయితే తన సంతకానికి బదులు ‘ఆంధ్రా నాటుకోడి పులుసు’ అని రాశాడు. ‘‘ఇదేంటి సార్?’’ అని ఆయన పీయే అడగాలనుకున్నాడుగానీ ‘ఎందుకొచ్చిన లొల్లి’ అనే కాన్సెప్ట్‌లో భాగంగా కామ్‌గా ఉండిపోయాడు. ఆరోజు ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ వైట్‌హౌస్‌కు ఫోన్ చేశాడు. ఆ సంభాషణ ఇలా జరిగింది: సెక్రెటరీ: హలో ట్రంపుగారు... ట్రంప్: ‘హలో’ ట్రంపు కాదు... డొనాల్డ్ ట్రంప్‌ని మాట్లాడుతున్నాను...హీ హీ హీ.... సెక్రెటరీ: ఆపవయ్యా బాబూ... నీ నవ్వు... వినలేక ఛస్తున్నాను... ( ఆ సున్నితమైన నవ్వు ఆగిపోయింది) ట్రంప్: విషయం ఏమిటో చెప్పిచావు... సెక్రెటరీ: ఆ ఇరాన్ వాడు మళ్లీ ‘అణ్వాయుధం తయారుచేస్తున్నాను ఖబడ్దార్’ అంటున్నాడు... ట్రంప్: బాసూ, ఇరాన్ అంటే గుర్తుకు వచ్చింది... నేను ఇండియాలో ఉన్నప్పుడు ఇరానీ చాయ్ రుచి చూశాను. అబ్బబ్బా ఎంత బాగుందో! ఆ రోజంతా తాగుతూనే ఉన్నాననుకో... సెక్రెటరీ: ఆపవయ్యా నీ ‘టీ’ గోల! ప్రపంచశాంతి గురించి మాట్లాడుదామని ఫోన్ చేస్తే ఇరాన్ టీ గురించి చెప్పి చావగొడుతున్నావు. అసలు మీ రెండు దేశాల వాళ్లు తెల్లారి లేస్తే చాలు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. ఇదేమన్నా బాగుందా? అని నేను ఐరాస సెక్రెటరీ జనరల్ హోదాలో ప్రశ్నిస్తున్నాను... ట్రంప్: బాసూ... కారాలు మిరియాలు అంటే గుర్తుకువచ్చింది. ఇండియాలో ఉన్నప్పుడు కారం బాగా దట్టించిన రాయలసీమ నాటుకోడి పులుసు రుచి చూశాను... అబ్బా! అదిరిపోయిందనుకో. తింటున్నప్పుడు ఎవరో ‘మిరియాల చారు’ పట్టుకొచ్చారు. అది కలుపుకొని తింటే రుచి ఉంది... నా సామిరంగా... ఇప్పటికి నోట్లో నీళ్లూరుతున్నాయి... (ట్రంప్ రాకతో ఒరిగిందేంటి?) సెక్రెటరీ: ఆపవయ్యా బాబూ నీ బ్యాంబూలో సోది... ట్రంప్: అరే... బొంగులో చికెన్ గురించి నీకు చెప్పడం మరిచాను. ఒకరోజు అది వడ్డించారు. ‘బొంగులో చికెన్’ ఈజ్ ట్రడిషనల్ ఫామ్ ఆఫ్ కుకింగ్. ఆల్మోస్ట్ నో ఆయిల్ అండ్ కారం... డిష్ అదిరిపోయింది అనుకో! సెక్రెటరీ: కాస్త నీ చికెన్ గోల ఆపుతావా! కాసేపు ఇండియా–అమెరికా సంబంధాల గురించి మాట్లాడదాం. నువ్వు ఇండియా పర్యటించడం ‘చారిత్రక ఘట్టం’ అనే చెప్పుకోవాలి. ఏమంటావు ట్రంపూ... ట్రంప్: ‘చారిత్రక’ అంటే గుర్తుకువచ్చింది. ఇండియాలో ఉన్నప్పుడు రకరకాల చారుల రుచిచూశాను. ఎంత బాగా నచ్చిందో! మజ్జిగ చారు, మిరియాల చారు, టమాటా చారు... వీటిలో పప్పుచారు హైలెట్ అనుకో... హై ప్రోటీన్ చారు... ప్రిపరేష్ 16 నిమిషాలు, కుక్ 30 నిమిషాలు, టోటల్...46 నిమిషాలు... సింపుల్‌గా చేసుకోవచ్చు... సెక్రెటరీ: ఏమిటయ్యా బాబూ...అప్పటి నుంచి తెగ చావగొడుతున్నావు. నేను మాట్లాడుతున్నదేమిటి, నువ్వు మాట్లాడుతున్నదేమిటీ. ఏమైనా సంబంధం ఉందా? అయినా తప్పు నీది కాదులే...పొద్దున లేచి ఎవడి ముఖం చూసానో... సరే కర్మగాలి చూశానే అనుకో... నీకు ఫోన్ చేయాలని నాకు ఎందుకు అనిపించాలి... దరిద్రం కాకుంటే... ట్రంప్: ఏమిటయ్యో మాటలు మితిమీరి మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? డోనాల్డ్ ట్రంప్‌తో, అమెరికా ప్రెసిడెంట్‌తో మాట్లాడుతున్నావు. నాకు గానీ తిక్క రేగింది అంటే... సెక్రెటరీ: కూల్ ట్రంప్ కూల్... ట్రంప్: బాసూ... ‘కూల్’ అంటే గుర్తుకు వచ్చింది... ఇండియాలో ఉన్నప్పుడు ‘కుల్ఫీ’ తిన్నానయ్యా... తెగ నచ్చేసిందనుకో... మలై కుల్ఫీ, పిస్తా కుల్ఫీ, మ్యాంగో కుల్ఫీ, స్ట్రాబెర్రీ కుల్ఫీ, బటర్ స్కాచ్ కుల్ఫీ, లిచ్చి కుల్ఫీ, కేసర్ పిస్తా కుల్ఫీ, కేసర్ బాదం కుల్ఫీ... ఒక్కటా రెండా... ఎన్నెన్ని కుల్ఫీలు తిన్నానో... సెక్రెటరీ: నీ ఇండియా పర్యటన నా చావుకొచ్చిందయ్యా. బతికుంటే బలుసాకు బిజినెస్ చేసుకొని బతుకుతాను... ఇక సెలవా మరి... ట్రంప్: నువ్వు బలుసాకు అంటే గుర్తుకొచ్చింది... నేను ఇండియా నుంచి తిరుగుప్రయాణం అవుతున్నప్పుడు బ్రహ్మాండమైన విందు ఇచ్చారు. అందులో స్పెషల్ ఏమిటో తెలుసా? బలుసాకు పప్పు, బలుసాకు పప్పుచారు, బలుసాకు మటన్ కర్రీ, బలుసాకు చికెన్ కర్రీ, బలుసాకు ఫిష్ ఫ్రై, బలుసాకు ఫిష్ పులుసు, బలుసాకు బిర్యానీ, బలుసాకు అప్పడాలు, బలుసాకు వడియాలు, బలుసాకు సకినాలు, బలుసాకు కాజా... గమనిక: అటునుంచి ‘సచ్చాన్రో’ అంటూ పెద్ద శబ్దం వినబడి ఫోన్ కట్ అయిపోయింది. అశుభం – యాకుబ్ పాషా -
అలా... బయటికొచ్చాడన్నమాట!
స్వామి నిత్యానంద కోసం గుజరాత్, కర్ణాటక పోలీసుల గాలింపు కొనసాగుతుంది. ఇదే కాకుండా...ఇంటర్‌పోల్ ఆఫీసర్లు బ్లూ కార్నర్ నోటీసు జారీ చేశారు. తాను దేశం విడిచిపోలేదని, హిమాలయా పర్వత సానువుల్లో తపస్సు చేసుకుంటున్నాని సభ్యసమాజానికి వీడియో సందేశం పంపాడు నిత్యానంద. ఇప్పుడు హిమాలయ పర్వత సానువుల్లో ఏం జరుగుతుందో చూద్దామా మరీ... స్వామి నిత్యానంద సీరియస్‌గా తపస్సు చేసుకుంటున్నాడు. అతడి ముందు ‘ప్లీజ్ డోన్ట్ డిస్టర్బ్ మీ’ అనే బోర్డ్ ఉంది. దేవుడు ప్రత్యక్షమైతే ఒక వరం కోరుకోవాలనేది ఆయన ప్లాన్. తాను అడగదలచిన వరాన్ని మనసులో పదేపదే మననం చేసుకుంటున్నాడు... ‘‘స్వామి! నాకు చిన్న వరం ఇవ్వు. కర్ణాటక రాష్ట్రంలో నాకు బిడదిలో ఆశ్రమం ఉంది. ఈ హిమాలయాల్లో కూడా అలాంటిదే ఒక ఆశ్రమాన్ని స్థాపించాలనేది నా కల. నాకు వరం త్వరగా ఇస్తారని ఆశిస్తున్నాను...’’ రోజులు గడిచాయి. వారాలు గడిచాయి. నెలరోజులు గడిచాయి... దేవుడు ప్రత్యక్షం కాలేదు! విసుగెత్తిన నిత్యానంద తపస్సు విరమించాడు. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది అతని పరిస్థితి. తిరిగి వెళితే పోలీసులు అరెస్ట్ చేస్తారు. అలా అని ఇక్కడ ఉండాలనిపించడంలేదు. అబ్బో ఏం చలి! ‘‘విక్రమార్కా! ఇప్పుడు చెప్పు, ఇంతకీ నిత్యానంద హిమాలయాల్లోనే ఉన్నాడా? బయటి ప్రపంచంలోకి వచ్చాడా? తెలిసి కూడా నా ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయావో...చైనాకు పంపిస్తా...’’ అని హెచ్చరించాడు బేతాళుడు. ‘‘నిత్యానంద పోలీసులకు దొరికిపోయాడు’’ చెప్పాడు విక్రమార్కుడు. ‘‘అదెలా?’’ ఆశ్చర్యపోయాడు బేతాళుడు. అప్పుడు విక్రమార్కుడు ఇలా చెప్పాడు: ‘‘నిత్యానంద బయటి ప్రపంచానికి దూరంగా ఉన్న మాటేగానీ...ల్యాప్ టాపు పుణ్యమా అని సీఐఏ నుంచి చింతపండు ధరల వరకు ప్రతి విషయం ఆయనకు తెలుసు. ఈ విషయం పోలీసులకు లేటుగా తెలిసింది. అంతే....‘హిమాలయాల్లో ప్రాణాంతకమైన హిమోనా వైరస్’ అనే ఫేక్ న్యూస్‌ను బ్లాస్ట్ చేశారు. ఈ వైరస్ తనకెక్కడ సోకిందోనని భయపడిపోయి, హిమాలయాలలో నుంచి పారిపోయి వచ్చి, కనిపించిన ఆస్పత్రిలోకల్లా వెళ్లి ‘నాకు గాని వైరస్ సోకిందా...’ అని టెస్టులు చేయించుకుంటున్న క్రమంలో ఒక హాస్పిటల్లో పోలీసులకు దొరికిపోయాడు నిత్యానంద. ‘‘నేనే లొంగిపోదామని వస్తున్నాను. ఈలోపు మీరు వచ్చారు. నా కోసం మీరు వచ్చినా, మీ కోసం నేను వచ్చినా...మ్యాటర్ సేమ్ కదా...’’ అని పళ్లికిలించాడు నిత్యానంద! బడా బ్యాంక్ రాబరీ! ముంబైలో బ్యాంకు రాబరీ జరిగింది. ఈ రాబరీపై క్షుణ్ణంగా దర్యాప్తు జరపడానికి యస్పీభయంకర్ అనే అధికారిని ప్రభుత్వం నియమించింది. ఆరోజు బ్యాంకుకు వచ్చిన వారిలో మన తెలుగు పౌరుడు సుబ్బారాయుడు కూడా ఉన్నాడు. ఆయనను ప్రశ్నలు అడగడం మొదలు పెట్టాడు భయంకర్. భయంకర్: మీరు ఆ దొంగల్ని చూశారా? సుబ్బా: మీ మీద ఒట్టండి... చూశానండి... ఓ ముగ్గురు కుర్రాళ్లు ముసుగులు ధరించి వచ్చారండీ...వారితో పాటు ఒక ఏనుగు కూడా వచ్చిందండి. భయంకర్: ఏనుగా????!!!!! సుబ్బా: ఏనుగేనండీ...మీ మీద ఒట్టండి! భయంకర్: అది ఆఫ్రికన్ ఏనుగా? ఇండియన్ ఏనుగా? సుబ్బా: అది మనకెలా తెలుస్తదండీ! ఏనుగూ...ఏనుగూ...నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అని అడగలేం కదండీ...హ్హీ హ్హీ....హ్హీ... భయంకర్: నవ్వింది చాలుగానీ, నేను చెప్పింది శ్రద్ధగా విను...ఆఫ్రికా ఏనుగుల చెవులు పెద్దగా ఉంటాయి...మన ఏనుగుల చెవులు వాటితో పోల్చితే చిన్నగా ఉంటాయి. ఇప్పుడు చెప్పు...అది మన ఏనుగా? ఆఫ్రికన్ ఏనుగా? సుబ్బా: ఎలా చెబుతామండీ? భయంకర్: చూశానంటున్నావు కదా... లలల: అది కూడా మాస్కు ధరించి వచ్చిందండీ... – యాకుబ్ పాషా -
అదేంటి బట్టలు చింపుకుంటున్నావు
రైల్వేలో టికెట్ కలెక్టర్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ మొదలైంది... ఆఫీసర్ : మీరు ట్రైన్లో ప్రయాణిస్తున్నారు అనుకుందాం. సాంకేతిక సమస్య వచ్చి పైన ఫ్యాన్లు పని చేయడం లేదని అనుకుందాం. విపరీతంగా ఉక్కబోస్తుంది. అప్పుడు మీరు ఏంచేస్తారు? అప్పారావు : కిటికి తెరుస్తాను సార్. ఆఫీసర్ : గుడ్. కిటికీని ఇంగ్లీష్‌లో ఏమంటారు? అప్పారావు : విండో ఆఫీసర్ : గుడ్. క్యాబినెట్ విండో అంటే ఏమిటి? అప్పారావు : తెలియదు సార్. ఆఫీసర్ : ఓకే....బేవిండో అంటే? అప్పారావు : తెలియదు సార్. ఆఫీసర్ : ఓకే. ఐబ్రో విండో అంటే? సింగిల్–హంగ్ అండ్ డబుల్ హంగ్ విండోస్ అంటే? స్లైడ్ విండో అంటే? మల్టీ లిటిల్ విండో అంటే? అప్పారావు : తెలియదు సార్. ఆఫీసర్ : ఓకే...ఇప్పుడు నేను ఇంగ్లీష్‌లో కొన్ని వాక్యాలు చెబుతాను. వాటిని తెలుగులో చెబితే...ఉద్యోగం నీకే... అప్పారావు : ఓకేసార్. చెప్పండి. ఆఫీసర్ : బ్రౌజర్ విండో దట్ యూ ఆర్ యూజింగ్ టు వ్యూ ది వెబ్ పేజ్ ఈజ్ ఏ విండో. విండోస్ ఆర్ ఏ యూజర్ టు వర్క్ విత్ మల్టీపుల్ ప్రోగ్రామ్స్... అప్పారావు : !!!!!!! ఆఫీసర్ : అదేంటి కంట్లో అంతులేని ఆశ్చర్యాలు కనిపిస్తున్నాయి? అప్పారావు : అంతా అయోమయంగా ఉంది సార్. కళ్లు తిరుగుతున్నాయి... ఆఫీసర్ : ఓకే నువ్వెళ్లొచ్చు. బయట ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నవారు అప్పారావును చుట్టుముట్టారు. ‘ఇంటర్వ్యూలో ఏమడిగారు?’ అంటూ ప్రశ్నల ఎండ కురిపించారు. అప్పుడు అప్పారావు వారితో ఇలా చెప్పాడు... ‘‘ట్రైన్‌ల్లో ఉక్కపోస్తే ఏంచేస్తావు?’’ అని అడిగాడు. పొరపాటున ‘‘కిటికీ తెరుస్తాను’’ అన్నాను. అంతే...వాడు నా గుండె తెరిచి ఒక్క ఆట ఆడుకున్నాడు. మిత్రులారా...పొరపాటున కూడా ‘కిటికీ తెరుస్తాను’ అనే మాట ఉపయోగించవద్దు. అలా అన్నారంటే...మీ చావును అర్జంటుగా కొరియర్లో తెప్పించుకున్నట్లే. బెస్టాఫ్ లక్’’ అని చెప్పాడు అప్పారావు. ‘సుబ్బారావు... సుబ్బారావు’ అనే పిలువు వినబడడంతో ఇంటర్య్వూ హాల్లోకి పరుగెత్తాడు సుబ్బారావు. ఆఫీసర్ : మీరు ట్రైన్లో ప్రయాణిస్తున్నారనుకుందాం. సాంకేతిక సమస్య వల్ల పైన ఫ్యాన్లు పనిచేయడం లేదనుకుందాం. అప్పుడు మీరు ఏంచేస్తారు? సుబ్బారావు : న్యూస్ పేపర్‌తో అటూ ఇటూ ఊపుకుంటాను సార్. ఆఫీసర్ : అయినా ఉక్కపోస్తుందనుకో? సుబ్బారావు : షర్ట్ విప్పుతాను సార్. ఆఫీసర్ : అయినా ఉక్కపోస్తుందనుకో? సుబ్బారావు : బనియన్ విప్పుతాను సార్. ఆఫీసర్ : అయినా ఉక్కపోస్తుందనుకో? సుబ్బారావు : ప్యాంట్ విప్పుతాను సార్... ఆఫీసర్ : ట్రైన్లో ఉన్న ప్రయాణికులు పెడబొబ్బలు పెడుతూ పారిపోవాలనా నీ ఉద్దేశం! ఇన్ని చెబుతున్నావు...‘కిటికీ తెరుస్తాను సార్. చల్లగాలి తగులుతుంది’ అనే మాట ఎందుకు అనడం లేదు? సుబ్బారావు : పొరపాటున కూడా తెరవను సార్. ఆఫీసర్ : అదేమిటయ్య...కిటకీ తెరిస్తే నీకొచ్చిన ఇబ్బంది ఏమిటి? సుబ్బారావు : మీరు తుపాకితో కాల్చి చంపినా సరే...తెరవను సార్... ఆఫీసర్ : అదిసరే...తుపాకీని ఇంగ్లిష్‌లో ఏమంటారు? సుబ్బారావు : గన్. ఆఫీసర్ : గుడ్. లాంగ్గన్, వాల్గన్, సబ్మెషిన్గన్, షాట్‌గన్, కంబాట్ షాట్‌గన్, సెమీ–ఆటోమెటిక్ షాట్‌గన్, ఫీల్డ్‌గన్, స్పేర్గన్, ఫ్లేర్గన్, క్యాప్గన్, వాటర్‌గన్...వీటి గురించి నీకు తెలిసిన విషయాలు చెప్పు... సుబ్బారావు : !!!!!!! ఆఫీసర్ : అదేమిటి నీ కంట్లో అంతులేని ఆశ్చర్యం కనిపిస్తుంది? సుబ్బారావు : అయోమయంగా ఉంది సార్. ఆఫీసర్ : సరే, నేను కొన్ని ఇంగ్లిష్ వాక్యాలు చెబుతాను. వాటిని తెలుగులో చెప్పు చాలు. ఉద్యోగం నీకే ఇస్తాను. సుబ్బారావు : ఓకే సార్. ఆఫీసర్ : ఏ గన్ ఈజ్ ఏ రేంజ్డ్ వెపన్. దట్ ఆర్ సాలిడ్. బట్ కెన్ ఆల్సో బి లిక్విడ్. ది ఆరిజన్ ఆఫ్ ది ఇంగ్లిష్ వర్డ్ గన్ ఈజ్ కన్సిడర్డ్ ఫ్రమ్ ది నేమ్ గివెన్ టు ఏ పర్టిక్యులర్ హిస్టారికల్ వెపన్. డోమినా గునీల్డ వాజ్ ది నేమ్ మెకానికల్ బోల్ట్ త్రోయింగ్ వెపన్ ఆఫ్.... ..... ››...... ..... ... ...... ........ ఆఫీసర్ : అదేంటి బట్టలు చించుకుంటున్నావు. ఇప్పుటి వరకు బానే ఉన్నావు కదా... (సశేషం) – యాకుబ్ పాషా -
దోచేవారెవరురా..!
తొలిసారిగా దేశంలోని దొంగలందరూ సమావేశమయ్యారు. చారల టీషర్ట్ వేసుకున్న సీనియర్ దొంగ చోరకుమార్ మైక్ అందుకొని మాట్లాడడం మొదలు పెట్టాడు... ‘‘దొంగమిత్రులందరికీ దొంగాభివందనములు. దేశ నలుమూలల నుంచి వచ్చిన దొంగమిత్రులారా!... ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామో తెలియజేయడానికి ముందు... తెలుగు సినీ పరిశ్రమకు మన మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందాం..’’ ‘‘వాళ్లకు మన మీద ప్రేమ ఎందుకుంటుందండీ బాబూ... నారు పోశారా? నీరు పోశారా? బీరు పోశారా... కనీసం కల్లు అయినా పోశారా?’’ పాయింట్ లేవనెత్తాడు వర్ధమాన దొంగ రాకెట్కుమార్. ‘‘ప్రేమ లేదని ఎందుకనుకోవాలి. ఎన్నో సినిమాలకు మన పేర్లు పెట్టుకున్నారు. మచ్చుకు కొన్ని...’’ అంటూ ఇలా లిస్ట్ చదివాడు చోరకుమార్. దొంగ దొంగలకు దొంగ దొంగ మొగుడు దొంగల దోపిడి దొంగ రాముడు దొంగపెళ్లి దొంగలు బాబోయ్ దొంగలు దొంగోడొచ్చాడు దొంగగారు స్వాగతం యమదొంగ అమ్మదొంగా మంచిదొంగ జేబు దొంగ అడవి దొంగ కొండవీటి దొంగ టక్కరి దొంగ ఘరానా దొంగ భలే దొంగ ఇద్దరు దొంగలు తోడు దొంగలు...’’ ‘‘సరే...ఈ పేర్ల సంగతి పక్కన పెడితే అసలు ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామంటే... ఇన్నాళ్లుగా మనం అసంఘటిత రంగంలో ఉన్నాం. ఇప్పుడిక సంఘటితం కావాల్సిన సమయం వచ్చింది. మన హక్కుల్ని సాధించుకోవాలి... అవి సాధించుకోవాలంటే మనకంటూ ఒక జాతీయసంఘం ఉండాలి. మన తొలి జాతీయ మహాసభ వచ్చేవారం బిహార్‌లోని చోర్గంజ్లో జరుపుకోబోతున్నాం. ఆ సభలలో కొన్ని తీర్మానాలు చేయడం, ప్రతిభావంతులైన దొంగలకు సన్మానం చేయడం, ప్రతిభా పురస్కాలరాలను ఇవ్వడం, లేటెస్ట్ దొంగ గాడ్జెట్స్‌ను పరిచయం చేయడం జరుగుతుంది’’ అని ప్రకటించాడు చోరకుమార్. బిహార్‌లోని చోర్గంజ్. దేశం నలుమూలల నుంచి దొంగలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిర్వాహకుడు డొనాల్డ్ థీఫ్ మైక్ అందుకున్నాడు... ‘‘మిత్రులారా... అనివార్యకారణాల వల్ల విజయ్‌మాల్యా, నీరవ్ మోడీలు ఈ సమావేశానికి రాలేకపోతున్నట్లు వర్తమానం పంపారు. సభ జయప్రదం కావాలని శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి కృతజ్ఞతలు. వారు స్వదేశానికి రాగానే మన సంఘంలో గౌరవ పదవులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన సభ తరపున కొన్ని తీర్మానాలు చదువుతాను... ► స్కూళ్లలో దొంగతనాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి ► సాటి విద్యార్థుల పెన్నులు, బుక్స్, బ్యాగ్‌లు కొట్టేసే చిన్నారి దొంగలకు ఉపకార వేతనాలు ఇవ్వాలి. ► అత్యుత్తమ దొంగలకు ప్రతి యేడు ‘దొంగశ్రీ’ అవార్డ్లు ప్రకటించాలి. ► వయసు మీద పడిన దొంగలకు ఫించన్లు ఇవ్వాలి. ఒకటా రెండా... ఇలా ఎన్నో తీర్మానాలను ఆమోదించారు. తరువాత ‘అత్యుత్తమ దొంగ’ అనే కార్యక్రమం మొదలైంది... దొంగల్లోని అరుదైన ప్రతిభావిశేషాలను పరిచయం చేసే కార్యక్రమం ఇది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి... ‘‘ఈయన పేరు ఏబీసీడీ. స్క్రిన్ నేమ్ లాగా ఇది ఈయన చోర్ నేమ్. 24 గంటల్లో 84 చోరీలు చేసి దొంగీస్ రికార్డ్‌ల్లోకి ఎక్కాడు’’ ‘‘ఈయన పేరు ఘోటక బ్రహ్మచారి. పేరు చూసి మోసపోవద్దు. ఇప్పటి వరకు పదికి పైగా పెళ్లిళ్లు చేసుకున్నాడు. మామూలుగానైతే పెళ్లిళ్లలోకి బయటివారు దూరి దొంగతనం చేస్తారు. కాని ఈ బ్రహ్మచారి మాత్రం... తన పెళ్లికి వచ్చిన అతిథులను నిలువుదోపిడీ చేస్తాడు. ఎంత కొమ్ములు తిరిగిన డిటెక్టివ్ అయినా...పెళ్లికుమారుడిని పొరపాటున కూడా అనుమానించడనేది ఇతని సిద్ధాంతం. ఈ థియరీకీ కళ్యాణం కట్ కట్... అనే పేరు కూడా పెట్టాడు.’’ ఇలా కొన్ని పరిచయాలైన తరువాత... ‘‘మన దొంగల్లో సైంటిస్ట్‌లు ఉన్నారనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఈయన పేరు టెక్ శ్రీను. మన దొంగజాతి కోసం ఎన్నో ఉపకరణాలు తయారుచేశాడు. ప్రసుత్తం సంచలనాత్మకమైన, చరిత్రను తిరగరాసే మెషిన్‌ను తయారు చేశాడు. ఇదిగో... ఫ్రిజ్‌లా కనిపిస్తున్న దీని పేరు ‘జాం ఝటక్ హాం ఫటక్’. ఈ మెషిన్‌తో ఇంట్లో కూర్చొనే, కడుపులో చల్ల కదలకుండా ఎంచక్కా దొంగతనాలు చేసుకోవచ్చు. చిన్న దొంగతనాలైతే... గంటకు అయిదు, ఒక మాదిరి దొంగతనాలైతే... గంటకు రెండు. పెద్ద దొంగతనాలైతే... రోజుకు రెండు చొప్పున చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మెషిన్‌ను వేలం వేస్తున్నాం. అయితే ఎంత ఎమౌంట్ అయితే పాడుతారో ఆ మొత్తాన్ని ఒక కవర్లో వేసి, తమ పేరు రాసి అప్పటికప్పుడు ఈ మెషిన్ మీద పెట్టాలి’’ అని పాట మొదలుపెట్టాడు పరిచయకర్త. ‘నా పాట కోటి నలభై అయిదు లక్షలు’ అని పాడి ఆ మొత్తాన్ని పెద్దసంచిలో వేసి ‘జాం ఝటక్.. హాంఫటక్’ మెషిన్ మీద పెట్టాడు బెంగాల్ నుంచి వచ్చిన డొంగర్ బెనర్జీ. ‘నా పాట రెండు కోట్ల నలభై లక్షలు’ అని పాడి అట్టి మొత్తాన్ని గోనెసంచిలో వేసి మెషిన్ మీద పెట్టాడు రాజస్థాన్ నుంచి వచ్చి చోర్లాలాచౌహాన్. పాట పదికోట్లు దాటి ఆగిపోయింది. ఈలోపు కరెంట్ పోయింది. కొద్దిసేపట్లోనే పోయిన కరెంట్ వచ్చింది. కానీ ‘జాం ఝటక్’ మెషిన్‌ను కనిపెట్టిన టెక్ శ్రీను మాయమయ్యాడు. ఆయన కనిపెట్టిన మెషిన్ మాయమైంది. ఆ మెషిన్‌పై ఉన్న డబ్బు మాయమైంది. సభ గందరగోళమైంది! – యాకుబ్ పాషా -
10జి టెక్నాలజీ!!
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ చాలా కోపంగా ఉన్నాడు. ఆ కోపంలో చుట్టెనక చుట్ట కట్టి... పదహారు చుట్టలు కట్టి కాలుస్తున్నాడు. ‘‘అలా ఉన్నారేంది?’’ అని అడిగాడు అసిస్టెంట్ డీమ్ డాంగ్. ‘‘ఈ దినపత్రిక చూశావా!’’ అని న్యూస్‌పేపర్‌ను డీమ్ డాంగ్ ముఖం మీద కొట్టాడు ప్రెసిడెంట్ కిమ్ జోంగ్. ‘త్వరలో 5జీ టెక్నాలజీ... దూసుకుపోతున్న చైనా, దక్షిణ కొరియా’ అని గట్టిగా చదివాడు డీమ్ డాంగ్. ‘‘మన శత్రుదేశం పేరు ప్రపంచంలో ప్రతి పౌరుని నాలుక మీద వినిపిస్తోంది. దీనికి కారణం 5జీ. మన శత్రుదేశం పేరు గొప్పగా వినిపించడం నాకు సుతరామూ నచ్చడం లేదు’’ అని చుట్ట వెలిగించాడు కిమ్ జోంగ్. ‘‘మరైతే ఏటి సేయమంటారు?’’ వినయంగా అడిగాడు అసిస్టెంట్ డీమ్ డాంగ్. ‘‘సౌత్ కొరియాను తలదన్నే టెక్నాలజీని మనం కనిపెట్టాలి. ఐ వాంట్ 10జీ టెక్నాలజీ... వెంటనే మన సైంటిస్టులకు కబురు పెట్టు’’ అన్నాడు కిమ్ జోంగ్. ‘‘ఇంకెక్కడి సైంటిస్టులండీ బాబు... మీ దెబ్బకు అందరూ కర్రెగడ్డ పిచ్చాసుపత్రిలో ఉన్నారు’’ విషయం చెప్పాడు డీమ్ డాంగ్. ‘‘కర్రెగడ్డ పిచ్చాసుపత్రిలో ఉన్నారా, ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో ఉన్నారా అనేది నాకు అనవసరం. నాకు 10జీ టెక్నాలజీ కావాలి... వాళ్లను పిచ్చాసుపత్రి నుంచి ప్రయోగశాలలకు తీసుకెళ్లండి. క్విక్... ఐ వాంట్ 10జీ టెక్నాలజీ’’ అరిచినంత పనిచేశాడు కిమ్ జోంగ్. ‘‘అయ్యా...నాదో చిన్న విన్నపం’’ అని గొణిగాడు అసిస్టెంట్ డీమ్ డాంగ్. ‘‘ధైర్యంగా చెప్పు’’ అడిగాడు కిమ్ జోంగ్. ‘‘5జీ టెక్నాలజీతో రకరకాల ఆరోగ్యసమస్యలు, పరావ్యరణ సమస్యలు వస్తాయని ఇప్పటికే ప్రపంచం భయపడుతోంది. 10జీ టెక్నాలజీ వస్తే ఇంకేమైనా ఉందా?’’ అని భయంగా అడిగాడు డీమ్ డాంగ్. ‘‘ప్రపంచానికి ఏమవుతుందోనని భయపడితే నేను కిమ్ జోంగ్‌ని ఎందుకు అవుతాను! సో... కాబట్టి... ఈ భూగోళానికి ఏమైనా సరే... నా కోరిక నెరవేరాలి... ఐ వాంట్ 10జీ టెక్నాలజీ’’ దృఢంగా అన్నాడు కిమ్ జోంగ్. ‘‘అలాగేనయ్యా... తమరి ఆజ్ఞ’’ అంటూ అక్కడి నుంచి వెళ్లాడు డీమ్ డాంగ్. ∙∙ కర్రెగడ్డ పిచ్చాసుపత్రిలో ఉన్న సైంటిస్టులందరినీ ఏసీ ప్రయోగశాలలకు తీసుకువచ్చారు. వారికి సకల సౌకర్యాలూ సమకూర్చారు. ఎవరో ఒక సైంటిస్ట్ ‘‘నాకు బావర్చీ బిర్యానీ కావాలి’’ అని అడిగితే స్పెషల్ ఫ్లయిట్ వేయించి హైదరాబాద్ బేగంపేట నుంచి తెప్పించి మరీ ఇచ్చారు. ‘‘ఏపీ ఏజెన్సీ ఏరియాలో ఇప్పసార బాగుంటుందట. అది తాగాలని ఉంది’’ అని ఒక సీనియర్ సైంటిస్ట్ కోరితే...ఏజెన్సీ నుంచి ఇప్పపువ్వును తెప్పించి ప్రత్యేక నిపుణులతో ఇప్పసారా తయారు చేయించి బాటిళ్లకు బాటిళ్లు ఇచ్చారు. ఒక సైంటిస్ట్... ‘‘నాకు బొంగులో చికెన్’’ కావాలని అడిగితే అలాగే చేశారు. ఇలా ఏది అడిగినా కాదనకుండా సమకూర్చారు. ప్రయోగశాలల్లో ప్రయోగాలు నిరాటంకంగా జరుగుతూనే ఉన్నాయి... ∙∙ సరిగ్గా నెలరోజుల తరువాత... ‘యురేఖా...’ అని అరిచాడు అతి సీనియర్ సైంటిస్ట్. ఈ సౌండ్ కోసమే ఎదురుచూస్తున్న కిమ్ జోంగ్ ఆ రోజుల్లో గంగూలీలా షర్ట్ విప్పి ‘గున్నా గున్నా మామిడి’ అని తీన్మార్ డ్యాన్స్ చేశాడు. చిన్నసైజు భూకంపం వచ్చిందిగాని ప్రాణనష్టం జరగలేదు. ‘‘సార్... ఎట్టకేలకు 10జీ టెక్నాలజీని కనిపెట్టాను...’’ ఆనందంగా అరిచాడు సీనియర్ సైంటిస్ట్ డుంగ్ జాంగ్. ‘‘మిత్రమా... 5జీ టెక్నాలజీ కంటే మన 10జీ టెక్నాలజీ ఏ రకంగా భిన్నం? దీని స్పెషాలిటీ ఏమిటి?’’ ఆసక్తిగా అడిగాడు ప్రెసిడెంట్ కిమ్ జోంగ్. ‘‘10జీ టెక్నాలజీ వచ్చాక... సెల్ఫోన్లు అంటూ ప్రత్యేకంగా ఉండవు. మన చెవులే సెల్ఫోన్లు. ఎవరైనా మనకు ఫోన్ చేస్తే... చెవిలో డుర్ర్ర్ర్ర్ర్... అని సౌండ్ వస్తుంది. ఏంచక్కా మాట్లాడవచ్చు. ఇక మన కనురెప్పలే స్క్రీన్లు. కళ్లు మూసుకోని ఏంచక్కా ఎన్నో సినిమాలు చూడవచ్చు. 10జీ టెక్నాలజీతో లంచ్‌టైమ్‌లో మనం భోజనానికి వెళ్లనవసరం లేదు... భోజనమే మన దగ్గరకు వచ్చి... నోట్లో దూరిపోతుంది... టైం వేస్ట్ అనేదే ఉండదు...’’ ఇలా చాంతాడంత లిస్ట్ చదువుతూనే ఉన్నాడు 10జీ టెక్నాలజీ కనిపెట్టిన సైంటిస్ట్. ‘‘శబ్భాష్’’ అని మెచ్చుకోలుగా ఆ సైంటిస్ట్ భుజం తట్టాడు కిమ్ జోంగ్. అది తట్టినట్లు లేదు... కొట్టినట్లు ఉంది... సైంటిస్ట్ భుజం వాచింది. ఆ నొప్పి నుంచి తేరుకుంటూ... ‘‘ఈ 10జీ టెక్నాలజీని పరీక్షించడానికి ధైర్యం ఉన్న మొనగాడు కావాలి’’ అని అడిగాడు సైంటిస్ట్. ‘‘చెట్టంత మొనగాడిని నేను ఉండగా... ఇంకా ఎవడో ఎందుకు? వాడుకో... నన్ను పూర్తిగా వాడుకో’’ అన్నాడు చిద్విలాసంగా కిమ్. ‘‘అయితే తమరు ఇలా వచ్చి కూర్చోండి’’ అని కిమ్‌ను కుర్చీలో కూర్చోపెట్టి రకరకాల వైర్లు బిగించాడు సైంటిస్ట్. కొద్దిసేటి తరువాత.... ‘ఢాం’ అనే శబ్దం వినిపించింది. ‘సచ్చాన్రో’ అని ప్రాణభయంతో అరిచాడు కిమ్ జోంగ్. ‘‘సారీ...మీరు చావలేదు’’ అన్నాడు సైంటిస్ట్. ‘‘మరి ఏమైంది?’’ ఆడిగాడు కిమ్. ‘‘ప్రయోగం విఫలం కావడం వల్ల... తలలో ఉండాల్సిన మీ మెదడు మోకాళ్లలోకి వచ్చేసింది’’ విషయం చెప్పాడు సైంటిస్ట్. ‘‘మరిప్పుడు నేను మామూలుగానే మాట్లాడుతున్నాను కదా’’ ఆశ్చర్యంగా అన్నాడు కిమ్. ‘‘ఇంకో అయిదు నిమిషాల్లో జజ్జనకరి జనారే...మొదలవుతుంది’’ తాపీగా చెప్పాడు సైంటిస్ట్. ‘‘అంటే?’’ ఆందోళనగా అడిగాడు కిమ్ జోంగ్. ‘‘ఇప్పుడు మీకు మీ మాతృభాష మాత్రమే కాదు... ప్రపంచంలోని ఎన్నో ప్రాంతీయ భాషలు వస్తాయి. విశేషం ఏమిటంటే ఆయా భాషల్లో ఏంచక్కా పాటలు కూడా పాడుతారు’’ అని సైంటిస్ట్ అన్నాడో లేదో...కిమ్ జోంగ్ సుబ్బరంగా తెలుగు మాట్లాడేస్తున్నాడు. మాట్లాడడం ఏమిటి ఖర్మ! ఇలా పాటలు కూడా పాడుతున్నాడు.... ‘నేను పుట్టాను లోకం నవ్వింది నేను నవ్వాను లోకం ఏడ్చింది నేను పుట్టాను లోకం తాగింది నేను తాగాను లోకం ఊగింది నాకింకా లోకంతో పని ఏముంది...డోన్ట్ కేర్!’ – యాకుబ్ పాషా -
మా ఇంటి తథాగతుడు... మా బుజ్జిగాడు!
‘‘అమ్మో... ఇప్పటికి మీరు చెడిపోయింది చాల్లేదా? చందమామలంటూ ఆ దిక్కుమాలిన పాత పుస్తకాలు వీడితో కూడా చదివించి వీణ్ణి కూడా చెడగొట్టక పోతే మీకు మనశ్శాంతి ఉండదా?’’ అంటూ కళ్లతో మా బుజ్జిగాడినీ, నోటితో నన్నూ కోప్పడటం మొదలుపెట్టింది మా ఆవిడ. ‘‘ఏంటి... ఏంటి ఇప్పుడేమైంది?’’ అయోమయంగా అడిగా. ‘‘వీడట... తన పేరును ‘వేపుడు’ అని మార్చుకుంటాట్ట. అల్లరితో మనల్ని వేపుకుతింటుంటాడు కాబట్టి వాడికా పేరు సరేననుకోండి. సరే... మీరెలాగూ వేపుళ్లు తప్ప మామూలు కూరలు తినరు కాబట్టి మీకూ ఆ పేరు ఓకే. కానీ జస్ట్ పదేళ్ల చిన్న కుర్రాడు ఇలా తన పెట్ నేమ్‌ను ‘వేపుడు’ అని పెట్టుకుంటే వాడి ఫ్రెండ్సంతా ఎగతాళి చేయరా? ‘‘చిన్నప్పుడు నేనూ చదివా... ఇప్పడు వాడూ చదవాల్సిందే అంటూ మీరు తెచ్చిన తంటా ఇది. ఇదంతా మీరిచ్చిన చందమామలతో వచ్చిపడ్డ పైత్యం’’ అంటూ మళ్లీ అందుకుంది. అసలు చందమామలు చదవడానికి వాడు చెడిపోవడానికీ... ‘వేపుడు’ అంటూ పేరు మార్చుకోవడానికి లింకేంటో నాకు అర్థం కాలేదు. అదే విషయం మా ఆవిడను అడిగా. ‘‘అటవీ సంరక్షణ... మొక్కల పెంపకం... అంటూ దిక్కుమాలిన టాపిక్కేదో స్కూల్లో ఇచ్చి చచ్చారట. దాని మీద ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ ఏదో పెట్టి వ్యాసం రాసుకురమ్మన్నారట. దాని రఫ్ డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసిన దగ్గర్నుంచి తాను పేరు మార్చుకుంటానంటూ వాడు ఒకటే గొడవట.’’ అప్పుడు చూశా వాడి చేతిలోని ఎస్సే తాలూకు ఫస్ట్ డ్రాఫ్ట్ ప్రతులను. అందులోని ముఖ్యాంశాలివి.. ∙∙ చెట్లెందుకు పెంచాలి... వాటిని ఎందుకు నరకకూడదు అన్న సబ్జెక్టు మీద అంశాల వారీగా వాడు రాసుకున్న పాయింట్లివి... ∙చందమామలోని బేతాళ కథలో పట్టువదలని విక్రమార్కుడు ఎప్పటిలాగే చెట్టెక్కి బేతాళుడిని మోస్తూ మళ్లీ శ్మశానం కేసి నడుస్తూ ఉండాలా వద్దా? మరి మనం కొత్త కొత్త కథలు వినాలనుకున్నప్పుడు వాటిని చెప్పే బేతాళుడు నివసించే శవాన్ని ఎక్కణ్ణుంచి దించుకురావాలి?... చెట్టు మీది నుంచే కదా? మరి చెట్టే లేకపోతే బేతాళుడు ఉండే శవం ఎక్కడుంటుంది? విక్రమార్కుడు దాన్ని ఎక్కడ్నుంచి దించాలి? కాబట్టి మనకు మరిన్ని బేతాళ కథలు కావాలంటే ఇన్నేసి... ఇంకొన్నేసి చెట్లు కావాల్సిందే... అందుకుగాను మొక్కలు నాటాల్సిందే. ∙ఆకాశంలో ఉండే చందమామలోని పెద్ద చెట్టు కిందే ముసలమ్మ నివాసం ఉంటుందట. జాబిల్లిలోని ఆ చెట్టు కిందే ముసలమ్మ వంట చేసుకుంటూ ఉంటుందట. ఆ విషయం భూమ్మీద ఉండే చందమామ పుస్తకంలో రాశారట. బహుశా మనుషులు పెద్ద ఎత్తున చంద్రుడి మీదికి వెళ్తే తప్పక ఆ చెట్టును కొట్టేసి సదరు ముసలమ్మకు ఆశ్రయం లేకుండా చేస్తారనే ఉద్దేశంతోనేనేమో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ బృందం తర్వాత... ఎవర్నీ పెద్దగా చంద్రుడి మీదకు వెళ్లనివ్వలేదేమోనని మా బుజ్జిగాడు అభిప్రాయపడ్డాడు. భూమి మీది నుంచి చూస్తే చందమామ మీద మనకు కనిపించే చెట్టు అదొక్కటే... కానీ అలాంటివి అక్కడ ఎన్నున్నాయో? వాటి కింద ఉన్న దిక్కులేని ముసలమ్మలెంతమంది ఉన్నారో. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టివ్వడానికి అక్కడ వాళ్లకెవరూ లేరు. అలాంటి లీడర్లు పుట్టుకొచ్చేవరకూ అక్కడికి మనుషులెవర్నీ వెళ్లనివ్వకపోతేనే బెటర్ అంటూ రాశాడు వీడు. ∙గౌతముడికి తపస్సు చేశాక జ్ఞానం వచ్చిందట. బోధివృక్షం కింద జ్ఞానం వచ్చింది కాబట్టి బుద్ధుడయ్యాడట. తనకు జ్ఞానం ఇచ్చిన చెట్టు పేరునే తాను పెట్టుకున్నాట్ట. ఇక అలాగే మరి చూసుకుంటే మరి ఇంగ్లాండ్‌లో ఐజక్ న్యూటన్‌కి సైతం ఆపిల్ చెట్టు కిందే కదా జ్ఞానోదయం అయ్యింది? ఆయన ఆపిల్ చెట్టు కింద కూర్చోకపోతే అసలు మన భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లు తెలిసేదా? దాన్ని బట్టే మన గ్రహాలన్నీ అంతరిక్షంలో ఎలా నిలుచున్నాయో మనకు అర్థమయ్యేదా? కాబట్టి న్యూటన్ గారిని ఇంగ్లాండు బుద్ధుడు అనుకోవచ్చు కదా. ఇలా చూసుకుంటే జ్ఞానానికి మూలకారణాలు చెట్లే అని మా బుజ్జిగాడు సిద్ధాంతీకరించాడు. ∙అవ్విధముగా చూస్తే... రాబర్ట్ హుక్ అనే మరో సైంటిస్టు మన జీవప్రపంచంలోని ప్రతి భాగానికి కణమే మూలం అని చెప్పాడు. అదెలా చెప్పాడూ? ఒక కార్క్ అనే బెరడు ముక్కను... అంటే... నథింగ్ బట్ చెట్టులోని ఒక భాగాన్ని తీసుకొని ‘సెల్’ థియరీని లోకానికి చాటాడు. అంటే చెట్టు సాయంతోనే కదా తనకు ఆ జ్ఞానం వచ్చింది. ఇలాంటి చాలా పాయింట్లు వాడి వ్యాసరాజంలో ఉన్నాయి. వాటిని చదివే మా ఆవిడ లబోదిబోమంటూ వాడి మీద చిందులు తొక్కడం మొదలుపెట్టింది. ఆ చిత్తుప్రతిని తీసుకొని చూస్తే... చివరన మావాడు ... ‘మాతృదేవో భవ... మొక్క చెట్టో భవ... పువ్వు కాయో భవ... చెట్టో రక్షతి రక్షితః’ అంటూ ఏదో శ్లోకం స్టైలును కూడా ఇమిటేట్ చేసినట్టు కూడా కనిపించింది. ‘‘చూశావా... ఇందులో మాతృభక్తి కూడా పుష్కలంగా చూపించాడు కదా. ఇందుకైనా నువ్వు సంతోషించాలి కదా. అయినా దీనికీ వీడి నిక్నేమ్కు సంబంధం ఏమిటట’’ అని అడిగా. అసలు విషయం అప్పుడు చెప్పింది మా ఆవిడ. ఎంతో కాలం నుంచి మా ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉంది. ఇల్లు కూలే పరిస్థితి వచ్చినా... ఇలా ఎన్ని అవాంతరాలు వచ్చినా, వస్తున్నా ఇప్పటికీ దాన్ని కొట్టనివ్వడం లేదు మా నాన్న. దాని కింద కూర్చున్న తర్వాతే ఆయన మనవడుగారైన మా బుజ్జిగాడికి ఈ పాయింట్లన్నీ తోచాయట. వాటిని బయటకు చదువుతూ మా ఆవిడ పెట్టే శాపనార్థాలకు... తిట్టుకొకరం, చెట్టుకొకరంగా చెల్లాచెదురైపోతున్న సమయంలో ‘వేపుడు’ నామధేయం పాలిట అసలు గుట్టు విప్పింది. ‘‘బోధివృక్షం కింద జ్ఞానోదయమైనందుకు గౌతముడిని ‘బుద్ధుడు’ అన్నారు కదా. మరి మన వేప చెట్టు కింద ఎస్సే రాసినందుకు నా పేరు ‘వేపుడు’ ఎందుక్కాకూడదు అంటున్నాడండీ వీడూ’’ అంది మా ఆవిడ. – యాసీన్ -
లాఫింగ్గ్యాస్ ఎక్కించిన కేసులో తీర్పొచ్చింది
మదురై: ఆక్సిజన్‌కు బదులు లాఫింగ్ గ్యాస్ ఎక్కించి ఓ మహిళ ప్రాణాలుకోల్పోయేందుకు కారణమైన ప్రభుత్వ ఆస్పత్రి ఘటన విషయంలో బాధిత కుటుంబానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రూ.28.37లక్షలు నష్టపరిహారం చెల్లించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, నర్సులు నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందని చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నందున ఈ నష్టపరిహారం చెల్లించక తప్పదని చెప్పింది. రుక్మణీ అనే 34 ఏళ్ల మహిళ ట్యూబెక్టమీ చికిత్స కోసం తమిళనాడులోని ప్రభుత్వ నాగర్‌కోయిల్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో మార్చి 18, 2011న చేరింది. అయితే, ఆమెకు ఆక్సిజన్‌కు బదులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు నైట్రస్ ఆక్సైడ్ ఎక్కించారు. దీంతో ఆమెకు మరుసటి రోజు విపరీతంగా అనారోగ్యానికి గురైంది. శరీరంలో రక్తం శాతం పడిపోయింది. ఆ తర్వాత వేరే ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం లేకుండా పోయింది. ఆమెకు నైట్రస్ ఆక్సైడ్ ఎక్కించినట్లు పరీక్షల్లో తేలింది. సరిగ్గా 2012 మే 4న ఆమె చనిపోయింది. దీంతో ఆమె భర్త గణేశన్ ఆస్పత్రి తీరువల్ల తమకు తమ ఇద్దరి పిల్లలకు జరిగిన నష్టంపై ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని పరిహారంగా రూ.50లక్షలు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తూ కోర్టు మెట్లెక్కాడు. 2013లో ప్రారంభమైన ఈ కేసు విచారణపై తాజాగా తీర్పు వచ్చింది. రూ.28.37లక్షలు బాధిత కుటుంబానికి చెల్లించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
లాఫింగ్ గ్యాస్‌ను కనిపెట్టింది ఎవరు?
మనం నవ్వుతూ ఉండాలంటే ఒక ప్రత్యేకమైన వాయువును పీల్చితే చాలు కొన్ని గంటల పాటు నవ్వుతూనే ఉంటారు. నైట్రస్ ఆక్సైడ్ (N2O) అనే ఈ వాయువును కనుగొన్న వ్యక్తి హంఫ్రీ డేవి. ఇతడు 1778 డిసెంబర్లో ఇంగ్లండ్‌లోని పెన్జాన్స్లో ఆయన తండ్రి పేద వడ్రంగి. అందువల్ల ఇంటి చుట్టుపక్కల స్కూళ్లల్లో చదువు సాగించాడు. అయినా చిన్నప్పుడు సైన్సు అంటే ఏ మాత్రం శ్రద్ధ, ఇష్టం చూపించేవాడు కాదు. ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత ఒక ఫార్మసిస్ట్ దగ్గర శిష్యుడిగా చేరాడు. ఆయన ఇంటి దగ్గర లైబ్రరీలో ఉన్న పుస్తకాలను విపరీతంగా చదివే వాడు హంఫ్రీ. ఆ సందర్భంలోనే పేరొందిన శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు, వారి ఆవిష్కరణలు చదివాడు. ఆ ప్రేరణతో డేవీ రసాయనశాస్త్రంపై ఇష్టాన్ని పెంచుకుని ఆ దిశగా పనిచేయటం ప్రారంభించాడు. 1799లో లాఫింగ్ గ్యాస్‌ని కనుగొన్నాడు డేవి. ఎలక్ట్రోకెమికల్ టెక్నిక్ సహాయంతో దేవీ పొటాషియం, సోడియంని కూడా కనుగొన్నాడు. ఆ కృషికి గుర్తింపుగా నెపోలియన్ చక్రవర్తి డేవీకికి ఒక పతకాన్ని ప్రదానం చేశాడు. రెండు కర్బన కడ్డీల మధ్య విద్యుత్తును పంపి ఉజ్వలమైన వెలుగుని సృష్టించిందీ హంఫ్రీ డేవీనే. ఒక ప్రత్యేక సేఫ్టీల్యాంప్ను సైతం రూపొందించాడు. ఆ విధంగా గనుల్లో పని చేసే వారు సురక్షితంగా ఉండే వీలు కల్పించాడు. -
యువకుడి ప్రాణం తీసిన లాఫింగ్ గ్యాస్
లండన్: లాఫింగ్ గ్యాస్(నైట్రస్ ఆక్సైడ్) లండన్ లో ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఆగ్నేయ లండన్ లోని బెక్సలే లో నైట్రస్ ఆక్సైడ్ పీల్చి 18 ఏళ్ల యువకుడొకరు మృతి చెందాడని పోలీసులు తెలిపారు. అపస్మారక స్థితిలో రోడ్డుపై పడివున్న యువకుడిని శనివారం రాత్రి ఆస్పత్రికి తరలించారు. రెండు గంటల తర్వాత అతడు చనిపోయినట్టు డాక్టర్లు ప్రకటించారు. విందులో మద్యం సేవించడంతో పాటు ఎక్కువ మొత్తంలో నైట్రస్ ఆక్సైడ్ పీల్చడం వల్లే యువకుడు మృతి చెందినట్టు మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో పూర్తి వివరాలు వెల్లడవుతాయన్నారు. 2006- 2012 మధ్యకాలంలో నైట్రస్ ఆక్సైడ్ కారణంగా 17 మంది మరణించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నైట్రస్ ఆక్సైడ్ కలిగివుండడం, సేవించడం బ్రిటన్ లో చట్టవిరుద్ధం కాదు. బుడగల రూపంలో ఉన్న దీన్ని పీల్చిచేందుకు బ్రిటన్ వాసులు ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల కాలంలో మరణాలు పెరుగుతుండడంతో నైట్రస్ ఆక్సైడ్ అమ్మకాలపై నిషేధం విధించాలని ప్రభుత్వం భావిస్తోంది.