‘‘అమ్మో... ఇప్పటికి మీరు చెడిపోయింది చాల్లేదా? చందమామలంటూ ఆ దిక్కుమాలిన పాత పుస్తకాలు వీడితో కూడా చదివించి వీణ్ణి కూడా చెడగొట్టక పోతే మీకు మనశ్శాంతి ఉండదా?’’ అంటూ కళ్లతో మా బుజ్జిగాడినీ, నోటితో నన్నూ కోప్పడటం మొదలుపెట్టింది మా ఆవిడ.
‘‘ఏంటి... ఏంటి ఇప్పుడేమైంది?’’ అయోమయంగా అడిగా. ‘‘వీడట... తన పేరును ‘వేపుడు’ అని మార్చుకుంటాట్ట. అల్లరితో మనల్ని వేపుకుతింటుంటాడు కాబట్టి వాడికా పేరు సరేననుకోండి. సరే... మీరెలాగూ వేపుళ్లు తప్ప మామూలు కూరలు తినరు కాబట్టి మీకూ ఆ పేరు ఓకే. కానీ జస్ట్ పదేళ్ల చిన్న కుర్రాడు ఇలా తన పెట్ నేమ్‌ను ‘వేపుడు’ అని పెట్టుకుంటే వాడి ఫ్రెండ్సంతా ఎగతాళి చేయరా? ‘‘చిన్నప్పుడు నేనూ చదివా... ఇప్పడు వాడూ చదవాల్సిందే అంటూ మీరు తెచ్చిన తంటా ఇది. ఇదంతా మీరిచ్చిన చందమామలతో వచ్చిపడ్డ పైత్యం’’ అంటూ మళ్లీ అందుకుంది.
అసలు చందమామలు చదవడానికి వాడు చెడిపోవడానికీ... ‘వేపుడు’ అంటూ పేరు మార్చుకోవడానికి లింకేంటో నాకు అర్థం కాలేదు. అదే విషయం మా ఆవిడను అడిగా. ‘‘అటవీ సంరక్షణ... మొక్కల పెంపకం... అంటూ దిక్కుమాలిన టాపిక్కేదో స్కూల్లో ఇచ్చి చచ్చారట. దాని మీద ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ ఏదో పెట్టి వ్యాసం రాసుకురమ్మన్నారట. దాని రఫ్ డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసిన దగ్గర్నుంచి తాను పేరు మార్చుకుంటానంటూ వాడు ఒకటే గొడవట.’’ అప్పుడు చూశా వాడి చేతిలోని ఎస్సే తాలూకు ఫస్ట్ డ్రాఫ్ట్ ప్రతులను. అందులోని ముఖ్యాంశాలివి..
∙∙
చెట్లెందుకు పెంచాలి... వాటిని ఎందుకు నరకకూడదు అన్న సబ్జెక్టు మీద అంశాల వారీగా వాడు రాసుకున్న పాయింట్లివి... ∙చందమామలోని బేతాళ కథలో పట్టువదలని విక్రమార్కుడు ఎప్పటిలాగే చెట్టెక్కి బేతాళుడిని మోస్తూ మళ్లీ శ్మశానం కేసి నడుస్తూ ఉండాలా వద్దా? మరి మనం కొత్త కొత్త కథలు వినాలనుకున్నప్పుడు వాటిని చెప్పే బేతాళుడు నివసించే శవాన్ని ఎక్కణ్ణుంచి దించుకురావాలి?... చెట్టు మీది నుంచే కదా? మరి చెట్టే లేకపోతే బేతాళుడు ఉండే శవం ఎక్కడుంటుంది? విక్రమార్కుడు దాన్ని ఎక్కడ్నుంచి దించాలి? కాబట్టి మనకు మరిన్ని బేతాళ కథలు కావాలంటే ఇన్నేసి... ఇంకొన్నేసి చెట్లు కావాల్సిందే... అందుకుగాను మొక్కలు నాటాల్సిందే.
∙ఆకాశంలో ఉండే చందమామలోని పెద్ద చెట్టు కిందే ముసలమ్మ నివాసం ఉంటుందట. జాబిల్లిలోని ఆ చెట్టు కిందే ముసలమ్మ వంట చేసుకుంటూ ఉంటుందట. ఆ విషయం భూమ్మీద ఉండే చందమామ పుస్తకంలో రాశారట. బహుశా మనుషులు పెద్ద ఎత్తున చంద్రుడి మీదికి వెళ్తే తప్పక ఆ చెట్టును కొట్టేసి సదరు ముసలమ్మకు ఆశ్రయం లేకుండా చేస్తారనే ఉద్దేశంతోనేనేమో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ బృందం తర్వాత... ఎవర్నీ పెద్దగా చంద్రుడి మీదకు వెళ్లనివ్వలేదేమోనని మా బుజ్జిగాడు అభిప్రాయపడ్డాడు. భూమి మీది నుంచి చూస్తే చందమామ మీద మనకు కనిపించే చెట్టు అదొక్కటే... కానీ అలాంటివి అక్కడ ఎన్నున్నాయో? వాటి కింద ఉన్న దిక్కులేని ముసలమ్మలెంతమంది ఉన్నారో. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టివ్వడానికి అక్కడ వాళ్లకెవరూ లేరు. అలాంటి లీడర్లు పుట్టుకొచ్చేవరకూ అక్కడికి మనుషులెవర్నీ వెళ్లనివ్వకపోతేనే బెటర్ అంటూ రాశాడు వీడు.
∙గౌతముడికి తపస్సు చేశాక జ్ఞానం వచ్చిందట. బోధివృక్షం కింద జ్ఞానం వచ్చింది కాబట్టి బుద్ధుడయ్యాడట. తనకు జ్ఞానం ఇచ్చిన చెట్టు పేరునే తాను పెట్టుకున్నాట్ట. ఇక అలాగే మరి చూసుకుంటే మరి ఇంగ్లాండ్‌లో ఐజక్ న్యూటన్‌కి సైతం ఆపిల్ చెట్టు కిందే కదా జ్ఞానోదయం అయ్యింది? ఆయన ఆపిల్ చెట్టు కింద కూర్చోకపోతే అసలు మన భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లు తెలిసేదా? దాన్ని బట్టే మన గ్రహాలన్నీ అంతరిక్షంలో ఎలా నిలుచున్నాయో మనకు అర్థమయ్యేదా? కాబట్టి న్యూటన్ గారిని ఇంగ్లాండు బుద్ధుడు అనుకోవచ్చు కదా. ఇలా చూసుకుంటే జ్ఞానానికి మూలకారణాలు చెట్లే అని మా బుజ్జిగాడు సిద్ధాంతీకరించాడు.
∙అవ్విధముగా చూస్తే... రాబర్ట్ హుక్ అనే మరో సైంటిస్టు మన జీవప్రపంచంలోని ప్రతి భాగానికి కణమే మూలం అని చెప్పాడు. అదెలా చెప్పాడూ? ఒక కార్క్ అనే బెరడు ముక్కను... అంటే... నథింగ్ బట్ చెట్టులోని ఒక భాగాన్ని తీసుకొని ‘సెల్’ థియరీని లోకానికి చాటాడు. అంటే చెట్టు సాయంతోనే కదా తనకు ఆ జ్ఞానం వచ్చింది. ఇలాంటి చాలా పాయింట్లు వాడి వ్యాసరాజంలో ఉన్నాయి. వాటిని చదివే మా ఆవిడ లబోదిబోమంటూ వాడి మీద చిందులు తొక్కడం మొదలుపెట్టింది. ఆ చిత్తుప్రతిని తీసుకొని చూస్తే... చివరన మావాడు ... ‘మాతృదేవో భవ... మొక్క చెట్టో భవ... పువ్వు కాయో భవ... చెట్టో రక్షతి రక్షితః’ అంటూ ఏదో శ్లోకం స్టైలును కూడా ఇమిటేట్ చేసినట్టు కూడా కనిపించింది.
‘‘చూశావా... ఇందులో మాతృభక్తి కూడా పుష్కలంగా చూపించాడు కదా. ఇందుకైనా నువ్వు సంతోషించాలి కదా. అయినా దీనికీ వీడి నిక్‌నేమ్‌కు సంబంధం ఏమిటట’’ అని అడిగా.
అసలు విషయం అప్పుడు చెప్పింది మా ఆవిడ. ఎంతో కాలం నుంచి మా ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉంది. ఇల్లు కూలే పరిస్థితి వచ్చినా... ఇలా ఎన్ని అవాంతరాలు వచ్చినా, వస్తున్నా ఇప్పటికీ దాన్ని కొట్టనివ్వడం లేదు మా నాన్న. దాని కింద కూర్చున్న తర్వాతే ఆయన మనవడుగారైన మా బుజ్జిగాడికి ఈ పాయింట్లన్నీ తోచాయట. వాటిని బయటకు చదువుతూ మా ఆవిడ పెట్టే శాపనార్థాలకు... తిట్టుకొకరం, చెట్టుకొకరంగా చెల్లాచెదురైపోతున్న సమయంలో ‘వేపుడు’ నామధేయం పాలిట అసలు గుట్టు విప్పింది. ‘‘బోధివృక్షం కింద జ్ఞానోదయమైనందుకు గౌతముడిని ‘బుద్ధుడు’ అన్నారు కదా. మరి మన వేప చెట్టు కింద ఎస్సే రాసినందుకు నా పేరు ‘వేపుడు’ ఎందుక్కాకూడదు అంటున్నాడండీ వీడూ’’ అంది మా ఆవిడ.
– యాసీన్
Comments
Please login to add a commentAdd a comment