యువకుడి ప్రాణం తీసిన లాఫింగ్ గ్యాస్
లండన్: లాఫింగ్ గ్యాస్(నైట్రస్ ఆక్సైడ్) లండన్ లో ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఆగ్నేయ లండన్ లోని బెక్సలే లో నైట్రస్ ఆక్సైడ్ పీల్చి 18 ఏళ్ల యువకుడొకరు మృతి చెందాడని పోలీసులు తెలిపారు. అపస్మారక స్థితిలో రోడ్డుపై పడివున్న యువకుడిని శనివారం రాత్రి ఆస్పత్రికి తరలించారు. రెండు గంటల తర్వాత అతడు చనిపోయినట్టు డాక్టర్లు ప్రకటించారు.
విందులో మద్యం సేవించడంతో పాటు ఎక్కువ మొత్తంలో నైట్రస్ ఆక్సైడ్ పీల్చడం వల్లే యువకుడు మృతి చెందినట్టు మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో పూర్తి వివరాలు వెల్లడవుతాయన్నారు. 2006- 2012 మధ్యకాలంలో నైట్రస్ ఆక్సైడ్ కారణంగా 17 మంది మరణించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
నైట్రస్ ఆక్సైడ్ కలిగివుండడం, సేవించడం బ్రిటన్ లో చట్టవిరుద్ధం కాదు. బుడగల రూపంలో ఉన్న దీన్ని పీల్చిచేందుకు బ్రిటన్ వాసులు ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల కాలంలో మరణాలు పెరుగుతుండడంతో నైట్రస్ ఆక్సైడ్ అమ్మకాలపై నిషేధం విధించాలని ప్రభుత్వం భావిస్తోంది.