వాయు కాలుష్యాన్ని నివారించాలంటే..
నైట్రస్ ఆక్సైడ్
వాతావరణంలోని మేఘాల రాపిడి వల్ల ఏర్పడే ఉరుములు, మెరుపుల్లో నైట్రోజన్, ఆక్సిజన్ సంయోగం చెంది నైట్రస్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. పరిశ్రమలు, వాహనాలు, విద్యుదుత్పత్తి కేంద్రాల్లో శిలాజ ఇంధనాలను మండిస్తే ఈ వాయువు వెలువడుతుంది. నైట్రస్ ఆక్సైడ్ వల్ల హిమోగ్లోబిన్ ప్రభావితమవుతుంది. ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులు ఏర్పడతాయి. మొక్కల్లో శ్వాసక్రియ రేటు తగ్గిపోతుంది. ఆకులు రాలి మొక్కలు చనిపోతాయి. వస్త్ర పరిశ్రమల్లో ముఖ్యంగా నూలు వస్త్రాలపై వేసిన అద్దకాలు ఈ వాయువు వల్ల వివర్ణమవుతాయి (Colourless). కాంతి రసాయన స్మాగ్ ఏర్పడుతుంది. ఆమ్ల వర్షాలు కురుస్తాయి.
స్మాగ్
Dr. Antoine Des Voeux అనే శాస్త్రవేత్త పొగ మంచుకు 1905లో స్మాగ్ అని పేరు పెట్టాడు. స్మాగ్ అనే పదం స్మోక్+ఫాగ్ ( (Smoke+ Fog =Smog)) నుంచి వచ్చింది. వాతావరణంలోని నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్‌డైఆక్సైడ్, ఓజోన్ వాయువు, హైడ్రో కార్బన్లు, ఇతర పదార్థ రేణువులు (పెరాక్సీ అసైల్ నైట్రేట్-) కలిసి స్మాగ్‌ను ఏర్పరుస్తాయి. స్మాగ్ వల్ల మానవుల్లో శ్వాసకోశ సంబంధై ఆస్తమా, ఎలర్జీ కలుగుతాయి. మొక్కలకు ఎక్కువ నష్టం జరుగుతుంది. వాతావరణంలో స్మాగ్ ఏర్పడటం వల్ల దృష్టి జ్ఞానం తగ్గి రోడ్డుపై వచ్చే వాహనాలు సరిగా కనబడక ప్రమాదాలు జరుగుతాయి.
ఓజోన్
భూవాతావరణంలోని పరివర్తన మండలంలో వ్యాపించి ఉంది. దీనిలో ప్రాణవాయువు (ఆక్సిజన్) ఉంటుంది. ఓజోన్ పొర.. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను శోషించుకొని సమస్త జీవరాశులకు రక్షణ పొరలా పని చేస్తుంది.ఓజోన్ పొర పలచబడి రంధ్రాలు ఏర్పడటానికి కారణం క్లోరో ఫ్లోరోకార్బన్లు (ఫ్రియాన్ వాయువు), నైట్రిక్ ఆక్సైడ్, క్లోరిన్, ఇతర వాయువులు. రిఫ్రిజిరేటర్లు, కోల్డ్ స్టోరేజీల నుంచి వెలువడే సీఎఫ్‌సీల వల్ల, జెట్ విమానాల నుంచి వెలువడే పొగ వల్ల ఓజోన్ పొరకు రంధ్రాలు ఏర్పడి వాటి నుంచి అతి నీల లోహిత కిరణాలు భూమికి చేరి జీవులకు నష్టం కలగజేస్తున్నాయి.
ఒక క్లోరో ఫ్లోరోకార్బన్ అణువు సుమారు లక్ష ఓజోన్ అణువులను విచ్ఛిన్నం చేస్తుంది. అంటార్కిటికా ధృవం వద్ద ఓజోన్ సొండే అనే పరికరంతో ఓజోన్ గాఢతను లెక్కించి ఆ పొర మందం తగ్గినట్లు కనుగొన్నారు.ఓజోన్ ఉన్న గాలిని పీల్చితే ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి. లుకేమియా, స్త్రీలకు రొమ్ము క్యాన్సర్, కంటికి క్యాటరాక్ట్ సమస్యలు కలుగుతాయి. 1976లో ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమ విభాగం ఓజోన్ పరిరక్షణకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఏటా సెప్టెంబర్ 16న ఓజోన్ పరిరక్షణ దినం నిర్వహిస్తున్నారు.
ఎగిరే బూడిద (Fly Ash)
థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గును మండిస్తే వెలువడే బూడిదను ఫ్లైయాష్ (ఎగిరే బూడిద) అంటారు. ఇది వాతావరణంలోకి ప్రవేశించి ఆకులు, ఇళ్లు, నేలలు, నీటి ఉపరితలంపైకి చేరి వాటిని ప్రభావితం చేస్తుంది. అందువల్ల పంట దిగుబడి తగ్గుతుంది. దీంతోపాటు నీటి కాలుష్యం ఏర్పడుతుంది. సారవంతమైన నేలలు బీడు భూములుగా మారతాయి.
ఇతర విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఫ్లైయాష్ ఉన్న గాలిని పీల్చితే శ్వాస సరిగా ఆడదు. దీంతో ఊపిరితిత్తులు ప్రభావితమవుతాయి. ఫ్లైయాష్‌ను ఇటుకలు, డిటర్జెంట్ పరిశ్రమల్లో వాడటం ద్వారా దాని వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించొచ్చు.
అమోనియా(NH3)
ఇది ఘాటైన వాసన గల వాయువు. దీన్ని శీతలీకరణిగా ఉపయోగిస్తారు.ఈ వాయువును ప్లాస్టిక్, పేలుడు, రంగు పదార్థాలు, ఔషధాల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. పరిశ్రమల నుంచి వెలువడే అమోనియా వల్ల గొంతులో బొబ్బలు ఏర్పడతాయి. కంట్లో మంటలు పుడతాయి.వాతావరణంలో అమోనియా శాతం పెరిగితే మొక్కల్లో కిరణజన్యసంయోగ క్రియ మందగిస్తుంది.
హైడ్రో కార్బన్లు
హైడ్రోజన్, కార్బన్ కలయిక వల్ల ఏర్పడిన పదార్థాలను హైడ్రోకార్బన్లు అంటారు. పెట్రోలియం ఉత్పత్తులను, గ్యాసోలిన్‌ను వీటికి ఉదాహరణగా చెప్పొచ్చు. హైడ్రోకార్బన్లు వాహనాల నుంచి వెలువడే పొగ ద్వారా వాతావరణంలోకి ప్రవేశించి కాలుష్యాన్ని కలగజేస్తాయి.హైడ్రోకార్బన్లు గల గాలిని పీల్చితే శ్వాస కోశ వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తాయి. హైడ్రో కార్బన్లు కాంతి రసాయన పొగ మంచును ఏర్పరుస్తాయి. పెట్రోలియం ఉత్పత్తుల నుంచి ెలువడే సీసం వల్ల పిల్లల్లో బుద్ధిమాంధ్యం ఏర్పడుతుంది.మొక్కల్లో ఎదుగుదల మందగిస్తుంది.
ఏరో సాల్స్
అణువులను ఏరో సాల్స్ అంటారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2015లో జారీ చేసిన ప్రకటన ప్రకారం మనదేశంలో వాయు కాలుష్య పట్టణాల స్థానాలు..
1. ఢిల్లీ 2. పాట్నా
3. గ్వాలియర్, 4. రాయ్‌పూర్
వాయు కాలుష్య నియంత్రణ చట్టాలు
భారత ప్రభుత్వం వాయు కాలుష్య చట్టాన్ని 1981లో, పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని 1986లో రూపొందించింది.
వాయు కాలుష్య నివారణ చర్యలు
పరిశ్రమలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, అణువిద్యుత్ కేంద్రాలను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలి.పరిశ్రమల నుంచి వెలువడే పొగ, విష వాయువులు, బూడిద వంటి వాటిని పొగ గొట్టంలోని ఫిల్టర్ల సాయంతో వడపోసి అవి వాతావరణంలోకి చేరకుండా చూడాలి.మోటార్ వాహనాలు, రైళ్లు, పరిశ్రమలు, థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో శిలాజ ఇంధనాల
(బొగ్గు, పెట్రోల్, డీజిల్) బదులు సంప్రదాయేతర ఇంధన వనరులను అంటే జీవ ఇంధనాలను, పవన శక్తి, సముద్ర వనరుల శక్తి వంటి వాటిని ఉపయోగించాలి.పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను సాధ్యమైనంత వరకు రీసైక్లింగ్ చేసి పునర్వినియోగించాలి. అడవులను పెంచడమే కాకుండా వాటిని సంరక్షించాలి.వాయు కాలుష్య నియంత్రణ చట్టాలను తప్పనిసరిగా అమలు చేయాలి.
నీటి కాలుష్యం లేదా జల కాలుష్యం
నిర్వచనం: ఘన/ద్రవ పదార్థాలు నీటిలోకి చేరడం వల్ల ఆ నీటి నాణ్యత తగ్గి తాగడానికి/వాడుకోవడానికి వీలు లేకపోవడాన్ని నీటి కాలుష్యం అంటారు. (లేదా)
జాతీయ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం ప్రస్తుతం/భవిష్యత్‌లో మానవుడు తన అవసరాలకు వాడుకోవడానికి పనికిరాని, కనీస నాణ్యతలేని నీటిని ‘కలుషిత నీరు’ అంటారు.
(లేదా)
‘నీటికి ఉండే సహజ లక్షణాలకు భంగం వాటిల్లడమే నీటి కాలుష్యం’.
(లేదా)
నీటిలో అనవసర పదార్థాలు కలవడం వల్ల నీటి సహజ గుణం మారిపోయి నిరుపయోగంగా; మానవుడికి, ఇతర జీవులకు హానికరంగా మారడాన్ని నీటి కాలుష్యం అంటారు.
సి.హెచ్. మోహన్
సబ్జెక్టు నిపుణులు, ఆర్.సి.రెడ్డి
స్టడీ సర్కిల్, హైదరాబాద్